► అధికారులు, కాంట్రాక్టర్లు, డీలర్ల కుమ్మక్కు
► ప్రతినెలా 200 మెట్రిక్ టన్నులు
► బ్లాక్‌మార్కెట్టుకు.. ఓ సీఎస్‌డీటీ కీలకపాత్ర!
► నష్టపోతున్న కార్డుదారులు
అనంతపురం అర్బన్ : కార్డుదారుల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న చక్కెరను అవినీతి చీమలు పక్కదారి పట్టిస్తున్నాయి. కొంతమంది పౌరసరఫరాల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రేషన్ డీలర్లు కుమ్మక్కై.. బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తున్నారన్న విమర్శలున్నాయి. మరీ ముఖ్యంగా ఓ సీఎస్‌డీటీ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో దాదాపు 2,800 చౌక దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 11,53,713 రేషన్ కార్డులున్నాయి.
ప్రతి కార్డుపై అర కిలో చొప్పున చక్కెరను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ లెక్కన జిల్లాకు ప్రతినెలా దాదాపు 512 మెట్రిక్ టన్నులు కేటాయిస్తోంది. ఇందులో దాదాపు 200 మెట్రిక్ టన్నుల చక్కెర బ్లాక్‌మార్కెట్టుకు తరలిపోతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో చక్కెరను రూ.30 నుంచి రూ.33 వరకు విక్రయిస్తున్నారు. అదే ప్రభుత్వం సబ్సిడీపై కిలో రూ.13.50లకే కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. ఈ చక్కెరను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు బ్లాక్‌మార్కెట్‌లో రూ. 22లకు విక్రయిస్తున్నారు. తద్వారా వారికి కిలోపై రూ.8.50లు మిగులుతోంది.
కొట్టేస్తోందిలా.. : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్ చవక చక్కెరకు అవినీతి చీమలు డీలర్లు కార్డుదారులకు చక్కెరను విక్రయించాలి. అయితే.. జిల్లాలోని సుమారు 800 చౌక దుకాణాల్లో ఈ నిబంధనను పాటించడం లేదు. 5వ తేదీకే విక్రయాలు బంద్ చేస్తున్నారు. కొలతల్లో కూడా కొట్టేస్తున్నారు. ఇలా మిగిలిన చక్కెరను పక్కదారి పట్టిస్తున్నారు. అలాగే జిల్లా నుంచి దాదాపు 1,50,000 మంది కార్డుదారులు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లారు. ఇది కూడా అక్రమార్కులకు కలిసొస్తోంది.
ఆ ఐదు రోజులూ బిజీ..
చక్కెరను బ్లాక్‌మార్కెట్టుకు తరలించడంలో ఓ సీఎస్‌డీటీ ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా వలస వెళ్లిన కార్డుదారుల వివరాలను నేరుగా సేకరించుకుని... వారికి సంబంధించిన చక్కెరను గోదాముల నుంచే బ్లాక్‌మార్కెట్టుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. చక్కెర గోదాములకు చేరిన ఐదు రోజులూ ఆ సీఎస్‌డీటీ బిజీ అయిపోతారనే అపవాదు ఆ శాఖ సిబ్బంది నుంచే వినిపిస్తోంది.
చవక చక్కెరకు అవినీతి చీమలు
Published Wed, May 20 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement