ఈ-పాస్ మిషన్ల సమస్యలను పరిష్కరిస్తాం
డీఎస్‌ఓ తిప్పేనాయక్ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్) : ప్రజాపంపిణీలో కీలకంగా మారిన ఈ-పాస్ మిషన్లలో ఏర్పడే సాంకేతిక సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తిప్పేనాయక్ తెలిపారు. ఇందుకోసం మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రైనర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు గురువారం సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో మొదలయ్యాయి. డీఎస్‌ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి 5 మంది రెవెన్యూ సిబ్బందిని ఎంపిక చేసి వారికి ఈ-పాస్ మిషన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 8 మంది డీలర్లకు ఒక మాస్టర్ ట్రైనన్‌ను నియమిస్తున్నామన్నారు. ఈ-పాస్ మిషన్లలో ప్రధానంగా వేలిముద్రలు పడకపోవడం అనే సమస్య ఉందని, దీనికి తగిన పరిష్కారాన్ని చూపుతున్నట్లు తెలిపారు. అనంతరం అర్బన్ ఏఎస్‌ఓ వెంకటేష్ నాయక్ ఈ-పాస్ మిషన్లలో వచ్చే సమస్యలు, వాటి నివారణ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ రాజారఘువీర్ తదితరులు పాల్గొన్నారు.