Warehouse
-
టార్గెట్ ఫినిష్ చేస్తేనే వాష్‌రూమ్, వాటర్ బ్రేక్.. ప్రతిజ్ఞ చేయించారు
హర్యానాలోని మనేసర్‌లో ఉన్న అమెజాన్ ఇండియా ఐదు గిడ్డంగులలో వారానికి ఐదు రోజులు, రోజుకు 10 గంటలు పని చేసి నెలకు రూ.10088 సంపాదిస్తున్నట్లు ఓ యువకుడు వెల్లడించారు. షిఫ్ట్ సమయంలో సమయం వృధా చేయకూడదని, సీనియర్లు వాష్‌రూమ్‌లను కూడా చెక్ చేస్తుంటారని పేర్కొన్నారు.లంచ్ లేదా టీ బ్రేక్ సమయంలో కూడా కనీసం 30 నిముషాలు విరామం లేకుండా పనిచేయాలని. రోజుకు నాలుగు ట్రక్కులకంటే ఎక్కువ దించలేము. అయినా పనిని మరింత పెంచాలని సీనియర్లు ఒత్తిడి తీసుకువస్తుంటారు. అనుకున్న టార్గెట్ (పని) పూర్తి చేసేవరకు నీరు తాగడానికి లేదా వాష్‌రూమ్ వంటి వాటికి కూడా వెళ్ళమని మా చేత ప్రతిజ్ఞ చేయించారని చెప్పారు.పనిచేసే మహిళలు అనారోగ్యంతో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ప్రత్యేకమైన రూమ్ లేదని, ఒకవేలా వాష్‌రూమ్ లేదా లాకర్ రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. ప్రతి రోజు తొమ్మిది గంటలు నిలబడే ఉండాలి. పనిచేసే కార్మికులకు కనీస సదుపాయాలు లేవని వాపోయారు.దీనిపైన అమెజాన్ ఇండియా అధికారులు స్పందిస్తూ.. ఈ రకమైన రూల్స్ ఎప్పుడూ పెట్టలేదని, ఒకవేలా మాకు తెలియకుండా ఇలాంటివి జరుగుతున్నాయా అని ఆరాతీస్తామని చెప్పారు. కార్మికులు చెప్పింది నిజమైతే అలాంటి రూల్స్ పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. మా సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. -
హైదరాబాద్‌లో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. 2023 ఆర్ధిక సంవత్సరంలో నగరంలో 51 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. అయితే 2022 ఆర్ధిక సంవత్సరంలోని 54 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3 పీఎల్), ఈ–కామర్స్ సంస్థల లావాదేవీలలో తాత్కాలిక మందగమనమే ఈ క్షీణతకు ప్రధాన కారణమని పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్‌మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని తెలిపింది. వేర్‌హౌస్ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతుంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన గిడ్డంగుల లీజుల మాన్యుఫాక్చరింగ్ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్ 21 శాతం, ఈ–కామర్స్ 17 శాతం, రిటైల్ రంగం 14 శాతం, ఎఫ్ఎంసీజీ 5 శాతం, ఎఫ్ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మేడ్చల్ క్లస్టర్లో వేర్‌హౌస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2022 ఆర్ధిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60 శాతం ఉండగా.. 2023 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్ క్లస్టర్లో క్షీణత, పటాన్చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్చెరు క్లస్టర్ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. హైదరాబాద్ అనేక రంగాలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ ఏర్పడిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు. నగరంలోని ప్రధాన గిడ్డంగుల క్లస్టర్లు ఇవే మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, షామీర్పేట్, పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్. ఆయా ప్రాంతాలలో గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్–బీ అయితే రూ.16–19గా ఉంది. -
గోదాం వసతుల్లో 13–15 శాతం వృద్ధి
ముంబై: పారిశ్రామిక, వేర్ హౌస్ లాజిస్టిక్స్ పార్క్ సరఫరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం మేర పెరుగుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ఎనిమిది ప్రధాన మార్కెట్లలో గోదాముల వసతి విస్తీర్ణం 435 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 50 శాతం గోదాం వసతి గ్రేడ్ ఏ రూపంలోనే వస్తుందని తెలిపింది. అయితే, కొత్తగా వచ్చే వసతిలో వినియోగం 39 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంటుందని పేర్కొంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (రవాణా), ఆటోమొబైల్ రంగాల నుంచి గోదాముల పరిశ్రమ స్థిరమైన డిమాండ్‌ను చూస్తోందని, 2023 మార్చి నాటికి మొత్తం వేర్‌హౌసింగ్ లీజు విస్తీర్ణంలో ఈ రంగాల వాటా 53 శాతంగా ఉందని వివరించింది. దీనికి అదనంగా ఈ కామర్స్, అనుబంధ సేవల రంగాలు వేగంగా విస్తరిస్తుండడం కూడా గోదాములకు డిమాండ్‌ను పెంచుతోందని తెలిపింది. ప్రభుత్వం తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తుండడం కూడా డిమాండ్ వృద్ధికి ఊతంగా నిలుస్తున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో గ్రేడ్ ఏ వేర్‌హౌస్ వసతి 17 శాతం వృద్ధి చెంది 195 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది 167 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కొత్తగా గ్రేడ్ ఏ విభాగంలో వచ్చే మార్చి నాటికి 28 మిలియన్ చదరపు అడుగుల వసతి అందుబాటులోకి వస్తుందని తన నివేదికలో ఇక్రా రేటింగ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ గోదాముల వసతిలో 30 శాతాన్ని అంతర్జాతీయ ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు అయిన సీపీపీఐబీ, జీఎల్పీ, బ్లాక్‌స్టోన్, ఈఎస్ఆర్, అలియాంజ్, జీఐసీ, సీడీపీ గ్రూప్ ఆక్రమించినట్టు తెలిపింది. దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి అవకాశాలు దీర్ఘకాలంలో గ్రేడ్–ఏ గోదాముల వసతి వృద్ధికి మెరుగైన అవకాశాలున్నట్టు ఇక్రా రేటింగ్స్ నివేదిక తెలిపింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఆటోమొబైల్ రంగాలే అందుబాటులోని గోదాముల విస్తీర్ణంలో సగం వాటా ఆక్రమిస్తున్నాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ నుంచి 8–9 శాతం, ఆటోమొబైల్ రంగం 6–9 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, కోల్‌కతా మార్కెట్లు వేర్‌హౌసింగ్‌కు టాప్ మార్కెట్లుగా ఉన్నాయని, ఈ పట్టణాలే మొత్తం వసతుల్లో 75–78 శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించింది. ముంబై, ఢీల్లీ ఎన్సీఆర్ మార్కెట్లే 50% వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది. -
రేషన్ షాపునకు ముక్కిన బియ్యం సరఫరా
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండలం చిల్వెర గ్రామంలోని రేషన్ షాపునకు రెండు నెలల క్రితం ముక్కిన బియ్యం సరఫరా చేశారు. వాటిని తీసుకొని ఏం చేసుకోవాలని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్ నర్సింహులు విషయాన్ని అధికారులకు తెలపడంతో బియ్యాన్ని గోదాంకు తిరిగి పంపించాలని సూచించారు. ఎఫ్‌సీఐ గోదాం ఇన్చార్జిని సంప్రదిస్తే రేపు మాపు అంటూ రెండు నెలలు కాలయాపన చేశాడు. మంగళవారం డీలర్ స్వయంగా 10 క్వింటాళ్ల ముక్కిన బియ్యం బస్తాలు పెద్దశంకరంపేట ఎఫ్‌సీఐ గోదాంకు తీసుకెళ్లాడు. ఈ బియ్యానికి తనకు సంబంధం లేదని, మీరే ఏమైనా చేసుకోవాలని గోదాం ఇన్చార్జి తేల్చి చెప్పాడు. దీంతో ముక్కిన బియ్యాన్ని డీలర్ అక్కడే పడేసి వచ్చాడు. అధ్వాన్న బియ్యం సరఫరా చేస్తూ గోదాం ఇన్చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
మహీంద్రా లాజిస్టిక్స్ వేర్‌హౌస్ షురూ
హైదరాబాద్: దేశీయంగా సమీకృత లాజిస్టిక్స్ సర్వీసులందించే మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్(ఎంఎల్ఎల్) స్థానికంగా నెట్ జీరో సౌకర్యానికి తెరతీసింది. బహుళ ఖాతాదారుల సామర్థ్యాలు, పునరుత్పాదక ఇంధనం, వనరుల పరిరక్షణసహా పర్యావరణ అనుకూల(గ్రీన్ కవర్) వేర్‌హౌసింగ్ ఆర్కిటెక్చర్‌తో దీనిని ఏర్పాటు చేసింది. ఈ అత్యాధునిక వేర్‌హౌస్ సిద్దిపేట జిల్లా ములుగు మండలం, బండమైలారం గ్రామంలోని అరుణ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద నెలకొంది. కంపెనీకిగల దేశవ్యాప్త మల్టీ యూజర్ సోలార్ విద్యుత్ సౌకర్యాలలో భాగమైన ఈ కేంద్రం కస్టమర్ల తయారీ, ఫుల్ఫిల్మెంట్ ఇన్‌బౌండ్ కార్యక్రమాలకు వీలు కల్పించనుంది. ఈ-కామర్స్ కస్టమర్లకు మద్దతివ్వనుంది. (లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!) ఈ నూతన కేంద్రం 100శాతం సౌర, బ్యాటరీ స్టోర్డ్ శక్తితో పనిచేస్తుంది. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందజేస్తుంది. ఎలక్ట్రిక్ కార్గో వాహనాలకు చార్జింగ్ సౌకర్యాలనూ కల్పించనుంది. ఎంఎల్ఎల్ 350 మందికి పైగా ఇక్కడ ఉపాధి అవకాశాలను కల్పించింది. అధిక డిమాండ్ సమయంలో థర్డ్ పార్టీ అసోసియేట్లు ఈ సంఖ్యకు మూడింతలు అధికంగా ఉపాధి కల్పించే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది.(పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే! ) -
ఈ–కామర్స్ రంగంలో డిమాండ్.. వేర్‌హౌసింగ్‌లోకి విదేశీ దిగ్గజాలు
దేశీయంగా ఈ–కామర్స్ గణనీయంగా పెరుగుతుండటంతో డిమాండ్‌కి అనుగుణంగా ఎఫ్ఎంసీజీ, దుస్తులు, ఫార్మా, ఆహారోత్పత్తులు మొదలైన వాటిని నిల్వ చేసేందుకు గిడ్డంగుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వేర్‌హౌసింగ్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పలు విదేశీ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. గత అయిదారు నెలల్లో ఇలాంటి మూడు సంస్థలు భారత్‌లో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. ఫ్రాన్స్‌కి చెందిన థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) సంస్థ ఎఫ్ఎం లాజిస్టిక్, జర్మనీ సంస్థ రీనస్ గ్రూప్, అమెరికాకు చెందిన పానటోనీ ఈ జాబితాలో ఉన్నాయి. 1.4 బిలియన్ యూరోల ఎఫ్ఎం లాజిస్టిక్ భారత్‌లో తమ తొలి మలీ్ట–క్లయింట్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్)ను హరియాణాలోని ఫరూఖ్‌నగర్‌లో ప్రారంభించింది. 31 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో దేశవిదేశాల్లోని కస్టమర్లకు అవసరమయ్యే వేర్‌హౌసింగ్, హ్యాండ్లింగ్, పంపిణీ, ఈ–కామర్స్ తదితర సరీ్వసులు అందిస్తోంది. ప్రస్తుతం 70 లక్షల చ.అ. స్థలం ఉండగా, 3పీఎల్ తరహా సేవలకు డిమాండ్ పెరుగుతున్నందున.. దీన్ని 2026 నాటికి 1.2 కోట్ల చ.అ.కు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తాము సరైన సమయంలో భారత మార్కెట్లో ప్రవేశించామని భావిస్తున్నట్లు వివరించాయి. మరోవైపు, రీనస్ గ్రూప్ పారిశ్రామిక రంగ సంస్థల అవసరాలకు ఉపయోగపడేలా గురుగ్రామ్, ముంబైలో రెండు కెమికల్ వేర్‌హౌస్‌లను ప్రారంభించింది. దేశీయంగా పారిశ్రామిక రంగం వృద్ధి చెందే కొద్దీ వచ్చే మూడేళ్లలో 24 లక్షల చ.అ. స్థలాన్ని 50 లక్షల చ.అ.లకు పెంచుకోనున్నట్లు రీనస్ లాజిస్టిక్స్ ఇండియా ఎండీ వివేక్ ఆర్యా తెలిపారు. కొత్తగా అమెరికాకు చెందిన పానటోనీ కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రధాన నగరాల్లో నాలుగు పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్‌లను అభివృద్ధి చేయనుంది. కోవిడ్‌తో ఊతం.. కోవిడ్ పరిణామాలతో వినియోగదారులు కాంటాక్ట్‌రహిత లావాదేవీలు, క్విక్ డోర్ స్టెప్ డెలివరీల వైపు మొగ్గు చూపుతుండటం దేశీయంగా ఈ–కామర్స్‌కి దన్నుగా ఉంటోందని పానటోనీ ఎండీ (ఇండియా) సందీప్ చందా తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో వేర్‌హౌసింగ్ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బహుళ జాతి కంపెనీలు చైనా+1 వ్యూహాన్ని పాటిస్తుండటంతో ప్రత్యామ్నాయ తయారీ హబ్‌గా ఎదిగేందుకు భారత్ చేస్తున్న కృషి కారణంగా దేశీయంగా వేర్‌హౌసింగ్ విభాగం మరింతగా వృద్ధి చెందనుంది. దీంతో చాలామటుకు రిటైలర్లు, ఈ–కామర్స్ సంస్థలు వేర్‌హౌసింగ్ స్పేస్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇక, సానుకూల మార్కెట్ పరిస్థితులు, మేకిన్ ఇండియా నినాదంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టడం, జీఎస్టీ అమలు మొదలైన అంశాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లలో ఆసక్తి కలిగిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రీసెర్చ్ అండ్ మార్కెట్స్ అనే కన్సల్టెన్సీ అంచనాల ప్రకారం దేశీ వేర్‌హౌసింగ్ మార్కెట్ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,05,000 కోట్లుగా ఉంది. 26.5 కోట్ల చ.అ. స్పేస్ అందుబాటులో ఉంది. 2026 నాటికి ఈ విభాగం ఆదాయం దాదాపు 11% వార్షిక వృద్ధితో రూ. 2,24,379 కోట్లకు చేరనుంది. స్పేస్ అవసరాలు సుమారు 13% వార్షిక వృద్ధితో 48.3 కోట్ల చ.అ. స్థాయికి చేరనుంది. -
Srungavarapu Kota: పీడీఎస్ బియ్యం మాయం..!
శృంగవరపుకోట (విజయనగరం జిల్లా): రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా వేల క్వింటాళ్ల బియ్యం, కందిపప్పును సరఫరా చేస్తుంది.. మూడు నాలుగు నెలలకు సరిపడా సరుకును గొడౌన్లలో నిల్వ ఉంచి... డిపోల వారీగా నెలనెలా పంపిణీ చేస్తుంది. వేలబస్తాల బియ్యం, కందిపప్పు కళ్లముందు కనిపించే సరికి గౌడౌన్ సిబ్బందిలోని అక్రమబుద్ధి బయటకొచ్చింది. ఏకంగా 1500 బియ్యం బస్తాలు, 50 బస్తాల కందిపప్పును మాయం చేశారు. బయట మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకున్నారు. మూడు నెలలుగా సాగుతున్న ఈ తంతు బహిరంగం కావడంతో సరుకును సర్దుబాటుచేసే పనిలో ఎల్.కోటలోని ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది నిమగ్నమయ్యారు. కొందరు అధికారుల సలహా మేరకు పొరుగు మండలాల్లో డీలర్లను పట్టుకుని బియ్యం కొనుగోలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట 750 బస్తాలు, ఆదివారం రాత్రి 190 బస్తాల బియ్యం గొడౌన్‌కు చేర్చారు. ఈ సరుకు అంతా డీలర్ల నుంచి పాత గోనెలు తెచ్చి సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. వేల క్వింటాళ్ల సరుకు నిల్వచేసే గొడౌన్లో సరుకు కనిపిస్తే చాలని సిబ్బంది ఆలోచిస్తున్నారు. ప్రతి బస్తాకు ఉన్న ట్యాగ్, లాట్ నంబర్, అలాట్మెంట్ వంటి వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప నిజం తేలదు. బస్తాలను లెక్కించి ‘అంతా బాగుంది’ అని సర్టిఫై చేస్తే దొంగలు జారిపోయినట్టేనన్న వాదన వినిపిస్తోంది. గతంలోనూ ఇదే తీరుగా పెద్ద ఎత్తున్న ఎం.ఎల్.ఎస్ పాయింట్ నుంచి సరుకు మాయం అయిన సంగతి తెలిసిందే. బియ్యం సర్దుబాటు చేస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులకు కందిపప్పు సర్దుబాటు చేయడం తలకుమించిన భారంగా మారినట్టు తెలిసింది. ప్రభుత్వం సరఫరా చేసే సరుకును అమ్మేసి.. డబ్బులు పంచుకున్నంత సులభం కాదంటూ ఉద్యోగుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ఇక్కడి ఉద్యోగుల అక్రమాల బాగోతం బయటపడుతుందన్నది రేషన్ లబ్ధిదారుల వాదన. గతంలోనూ ఎస్.కోట ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన ఘటనలను గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం పేదల కడుపునింపేందుకు నాణ్యమైన రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంటే.. కొందరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడడం తగదని బహిరంగంగా విమర్శిస్తున్నారు. డీఈఓ రాజేష్, అటెండర్ జోగుల వద్ద ప్రస్తావిస్తే నీళ్లు నములుతూ తప్పు జరగడం నిజమేనన్నారు. అధికారులు ఏమన్నారంటే.. ఎస్.కోట ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన గోల్మాల్ వ్యవహారంపై తహసీల్దార్ శ్రీనివాసరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా నాకు తెలియదు.. సీఎస్‌డీని సంప్రదించాలని సెలవిచ్చారు. సీఎస్‌డీటీ ఎన్వీవీఎస్ మూర్తిని ఫోన్లో వివరణ కోరగా ఎంఎల్ఎస్ పాయింట్లు తనిఖీ చేయడం జిల్లా అధికారుల పని అంటూ సమాధానం దాటవేశారు. (క్లిక్: రామకోనేరుకు మహర్దశ) గొడౌన్ సీజ్ ఎస్.కోట ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం, కందిపప్పు నిల్వల్లో తేడాలున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్ మీనా కుమారి గొడౌన్‌ను సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులు పరిశీలించారు. గొడౌన్లో నిల్వలను మూడు గంటల పాటు తనిఖీ చేశారు. స్టాక్‌లో తేడాలు ఉన్నట్టు నిర్ధారించారు. గొడౌన్ రికార్డులను స్వాధీనం చేసుకుని, గంట్యాడ సీఎస్‌డీటీ కె.ఇందిర, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి టి.నరసింహమూర్తి తదితరుల సమక్షంలో గొడౌన్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. మరింత లోతుగా విచారణ జరిపి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మీనాకుమారి చెప్పారు. -
ఏపీ, తెలంగాణల్లో అడుగు పెడుతున్న ఎస్ఎల్సీఎం
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్ రంగాల్లో ఉత్తర భారత దేశంలోనే సేవలు అందిస్తోన్న సోహాన్‌లాల్ కమోడిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిలెడ్ (ఎస్ఎల్సీఎం) సంస్థ దక్షిణ భారత దేశంలో తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించనుంది. అందులో భాగంగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున వ్యవసాయ ఉత్పత్తుల గోదాములు ప్రారంభించబోతున్నట్టు ఆ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సాల్మాన్ ఉల్లా ఖాన్ తెలిపారు. ఉత్తర భారత దేశంలో ఎస్ఎల్సీఎం కంపెనీ ఆధ్వర్యంలో 7,500 గోదాములు ఉన్నాయని సాల్మాన్ ఉల్లాఖాన్ తెలిపారు. మన దేశంలో రైతులు మంచి ధర రాకపోయినా పంట ఉత్పత్తులను తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారని.. అలా కాకుండా మంచి ధర వచ్చే వరకు మా గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చారు. తమ గోదాముల్లో శాస్త్రీయ పద్దతుల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేస్తామన్నారు. దీని వల్ల క్వాలిటీ చెడిపోదన్నారు. అంతేకాకుండా మంచి ధర వచ్చే వరకు రైతులకు బ్యాంకుల నుంచి రుణులు పొందేందుకు సహకారం అందిస్తామన్నారు. దీంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న బయ్యర్లకు రైతులకు మధ్య సంధానకర్తలుగా కూడా వ్యవహరిస్తామని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణలో భాగంగా నిజామాబాద్, గుంటూరులో తొలి గోదాములు ఏర్పాటు చేస్తామని ఎస్ఎల్సీఎం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తామన్నారు. తమ సంస్థ అభివృద్ధి చేసిన అగ్రిరీచ్ మొబైల్ యాప్ రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు. -
50 వేల గృహాలు.. 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో పోలిస్తే మూడో త్రైమాసికం (క్యూ3)లో రియల్టీ లావాదేవీలు పెరిగాయి. గృహ, ఆఫీస్, రిటైల్, వేర్‌హౌస్ అన్ని విభాగాలలో వృద్ధి రేటు నమోదయింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గృహ విక్రయాలు పెరగగా.. ప్రయాణ పరిమితులు తొలగడం, ఆఫీసులు పునఃప్రారంభాలతో కార్యాలయాల స్థలాలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో రిటైల్ స్పేస్, ఓమ్నీ చానల్ విధానంతో వేర్‌హౌస్ స్పేస్ వృద్ధికి కారణాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా వెల్లడించింది. మిడ్, అఫర్డబుల్ యూనిట్లదే హవా.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశంలో 50 వేల గృహాలు విక్రయమయ్యాయి. క్యూ2తో పోలిస్తే 46 శాతం వృద్ధి. అదే ఏడాది క్రితం క్యూ3తో పోలిస్తే 86 శాతం పెరుగుదల. నగరాల వారీగా చూస్తే.. 33 శాతం అమ్మకాల వాటాతో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. ముంబైలో 23 శాతం, బెంగళూరులో 17 శాతం, హైదరాబాద్‌లో 13 శాతం వాటాలున్నాయి. మొత్తం విక్రయాలలో 47 శాతం మధ్యస్థాయి గృహాలు కాగా 31 శాతం అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఈ ఏడాది క్యూ3లో కొత్తగా 48,950 యూనిట్లు ప్రారంభమయ్యాయి, గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్ట్గేజ్ వంటి కారణంగా మధ్యస్థాయి, అందుబాటు గృహాల విక్రయాలు, లాంచింగ్స్కు ప్రధాన కారణాలు. అద్దె గృహాల చట్టం అమలుతో డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. మిలీనియల్స్, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడంతో పెద్ద విస్తీర్ణ గృహాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. నగదు నిర్వహణ, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాలు పెరగడం వంటివి కూడా రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్లకే డిమాండ్.. ఈ ఏడాది క్యూ3లో దేశంలో అదనంగా 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. క్యూ2తో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్ లావాదేవీలదే హవా కొనసాగింది. 50 వేల చ.అ.ల కంటే తక్కువ స్థలం లావాదేవీల వాటా 84 శాతం వాటా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలోనే 80 శాతం లావాదేవీలు కేంద్రీకృతమయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేయడం సంస్కృతి పునఃప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. 90 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్.. పారిశ్రామిక గిడ్డంగుల విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే క్యూ3లో 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగి స్థలాల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 2.3 కోట్ల చ.అ. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) ఈ–కామర్స్ మంచి డిమాండ్ ఉంది. క్యూ3లోని లీజులలో 55 శాతం లావాదేవీలు మధ్యస్థాయి, పెద్ద పరిమాణ ఒప్పందాలు ఉన్నాయి. 32 శాతం లావాదేవీల వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. ఢిల్లీలో 22 శాతం, ముంబైలో 12 శాతం వాటాలున్నాయి. ► ఈ ఏడాది ముగింపు నాటికి ఇండస్ట్రియల్ వేర్‌హౌస్ స్పేస్ సపయ్ 2.5 కోట్ల చ.అ. చేరుతుందని, అలాగే 3.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. వినియోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న అధిక నాణ్యత గిడ్డంగులపై దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమేషన్ లాజిస్టిక్స్, త్వరితగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో రిటైల్ హవా.. ప్రయాణ పరిమితులు తొలగిపోవటం, లాక్డౌన్ లేకపోవటం, విద్యా సంస్థలు, పని ప్రదేశాలు పునఃప్రారంభం కావటంతో రిటైల్ కార్యకలాపాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది క్యూ3లో గ్రేడ్–ఏ, హైస్ట్రీట్ మాల్స్‌లలో 6 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీల్లో జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని రిటైల్ స్పేస్ లావాదేవీలో హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం రిటైల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో నగరం వాటా 38 శాతం కాగా.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 శాతం, బెంగళూరులో 12 శాతం లావాదేవీలు జరిగాయి. విభాగాల వారీగా చూస్తే ఫ్యాషన్ అండ్ అపెరల్స్ రిటైల్ స్పేస్ లావాదేవీలు 26 శాతం జరగగా.. 16 శాతం సూపర్ మార్కెట్ల స్థల లావాదేవీలు జరిగాయి. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. వేగవంతమైన వ్యాక్సినేషన్, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలతో దేశీయ రియల్టీ మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య, రిటైల్, పారిశ్రామిక గిడ్డంగుల విభాగాలలో కూడా ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – అన్షుమన్ మేగజైన్, సీఈఓ అండ్ చైర్మన్, సీబీఆర్ఈ ఇండియా -
‘ఏ కలర్స్ అద్దమంటారు’ .. ఓ డిజైనర్ ప్రయాణం
‘‘మేడమ్! మీ వీడియోలు చూశాం. పోయిన వారం హైదరాబాద్‌కి వచ్చాం, మిమ్మల్ని చూసిపోదామని...’’ అని ఏలూరు దగ్గర వేల్పుచర్ల అనే గ్రామం నుంచి ముగ్గురు మహిళలు వచ్చారు. ‘‘మేడమ్! మా అమ్మ ఇలా ఉంటారు’’ అని ఫోన్లో ఫొటో చూపిస్తూ ‘‘అమ్మకు ఏ కలర్ కాంబినేషన్లో చీరలు తీసుకోమంటారు’’ అని ఓ యువతి అడుగుతోంది. ఇంతలో ఆమె భర్త వచ్చి ‘‘గాయత్రీ! వేర్‌హౌస్‌కి వెళ్తున్నాను’’ అని చెప్పి బయలుదేరారు. షోరూమ్ వెనుకగా ఉన్న ప్రింటింగ్ యూనిట్లో ఒక వ్యక్తి ఒక చీరను తెచ్చి బోర్డరు చూపిస్తూ... ‘‘ఏ కలర్స్ అద్దమంటారు’’ అని అడిగి ఆమె ‘పింక్’ అని చెప్పగానే తలూపుతూ వెళ్లిపోయాడు. ‘‘మీ వీడియోలు రోజూ చూస్తుంటాం. అలవాటైపోయింది. మీరు మా ఇంట్లో ఒకరిలా అయిపోయారు’’ అంటూ ఆ మహిళలు గాయత్రితో మాటల్లో పడిపోయారు. ‘‘మమ్మీ! వీడియో అప్ లోడ్ చేశాను. అమ్మమ్మ క్యారియర్ పంపించింది. ఆఫీస్ రూమ్‌లో పెట్టాను’’ అని క్లుప్తంగా చెప్పి మరో ఫ్లోర్‌లోకి వెళ్లి పోయాడు ఓ కుర్రాడు. ఇది... హైదరాబాద్, సైనిక్‌పురిలో ‘గాయత్రీరెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో’ నిర్వహిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ గాయత్రి డైలీ రొటీన్. ఇది ఆమె తనకు తానుగా నిర్మించుకున్న సామ్రాజ్యం. 2008లో ఇంట్లో ఒక మూలగా ఒక టేబుల్‌తో మొదలైన తొలి అడుగు ఇప్పుడు పర్వత శిఖరానికి చేరువలో ఉంది. అన్నీ అమరిన దశ నుంచి జీవితం ఒక్కసారిగా పరీక్ష పెట్టింది. అంతా అగమ్యం. జీవితం తనను ఎటు తీసుకువెళ్తుందో తెలియని అస్పష్టమైన అయోమయమైన స్థితిలో వేసిన మొదటి అడుగు అది. గమ్యం కనిపించకపోయినా సరే... నీ ప్రయాణం ఆపవద్దు అనే ‘సంకల్పం’ మాత్రమే ఆమెకు తోడు. నేను కూడా నీకు తోడుగా వస్తానని భర్త నైతిక మద్దతునిచ్చాడు. ‘కుటుంబాన్ని నడిపించాల్సిన నేను వ్యాపారంలో నష్టపోయాను. నా బాధ్యతను నీ భుజాలకెత్తుకున్నావు. ఈ టైమ్‌లో నేను చేయగలిగింది ఇంతవరకే’ అని మాత్రం చెప్పాడాయన. పదమూడేళ్ల కిందట అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు నెలకు వందమందికి పైగా ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి చేరింది. బంధువులను మొహమాట పెట్టి కస్టమర్లుగా మార్చుకోలేదామె. కస్టమర్లను ఆత్మీయ బంధువులుగా మార్చుకున్నారు. మధ్యవర్తులెవరూ లేరు! ‘‘నా కస్టమర్‌కు నేను మంచి క్వాలిటీ ఇవ్వాలి. ధర అందుబాటులో ఉండాలి. అందుకోసం చేనేతకారులున్న ప్రతి గ్రామానికీ వెళ్లాను. ఐదేళ్ల పాటు నిరంతర ప్రయత్నం తర్వాత నేను వారి విశ్వాసం చూరగొనగలిగాను. అప్పటి వరకు చేనేతకారులు వాళ్ల వాళ్ల గ్రామాల్లో షావుకారు చేతిలో ఉండేవారు. షావుకారు నూలు కొనుగోలు కోసం డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటాడు. కాబట్టి చేనేతకారులు నేసిన దుస్తులను షావుకారుకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేదనే విరచిత రాజ్యాంగం ఒకటి అమలులో ఉండేది. బయటి వాళ్లు ఎవరైనా సరే ఆ షావుకారు దగ్గర కొనాల్సిందే. ఏ వ్యాపారమైనా సరే... ఉత్పత్తిదారుడికీ– వినియోగదారుడికి మధ్య వారధిగా ఉండే వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ధర కూడా పెరిగిపోతుంది. నేను ఐదేళ్లు కష్టపడి షావుకారు అనే ఒక మధ్య వ్యక్తిని తొలగించగలిగాను. అలాగే నాకు ఏ కౌంట్ నేత కావాలో, ఏయే కాంబినేషన్లలో కావాలో చేనేతకారులకు ముందుగానే చెప్తాను. ఇంత పోటీలో కూడా నన్ను మార్కెట్లో నిలబెట్టింది. సౌకర్యం విషయంలో ఫ్యాబ్రిక్ ధరించినప్పుడు ఒంటికి హాయిగా అనిపించాలి. మన్నిక విషయంలో పెట్టిన డబ్బు వృథా కాలేదని సంతృప్తి కలగాలి. ఇవే నేను నమ్మిన సూత్రాలు. అనుసరిస్తున్న నియమాలు.’’ అని చెప్పారు గాయత్రి. పిల్లలకు కొంతే ఇవ్వాలి! ‘‘మరో రెండేళ్లకు యాభై ఏళ్లు నిండుతాయి. అప్పటికి షోరూమ్, వేర్ హౌస్, నగరంలో ఉన్న మూడు ప్రింటింగ్ యూనిట్లను ఒక చోటకు చేర్చాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని రకాల వస్త్రకారులను అనుసంధానం చేస్తూ నేను ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ను నా ఉద్యోగులతో నడిపించాలని, ఇక నా పరుగులు ఆపేయాలనేది కోరిక. భగవంతుడి దయ వల్ల పోగొట్టుకున్న ఆస్తులకంటే ఎక్కువే సంపాదించుకున్నాం. పిల్లలను చదివించాం, జీవితాన్ని మొదలుపెట్టడానికి భరోసాగా కొన్ని ఆస్తులను మాత్రమే వాళ్లకు ఇస్తాం. వాళ్ల జీవితాన్ని వాళ్లే మొదలు పెట్టాలి. అలా చేయకపోతే డబ్బు మీద గౌరవం ఉండదు, జీవితం విలువ తెలియదు. ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలు కావాల్సిన సమయం వచ్చింది. అది నా ఉద్యోగులతోనే మొదలవుతుంది’’ అని చెప్పేటప్పుడు గాయత్రీరెడ్డిలో జీవితం నేర్పిన పరిణతితోపాటు స్థితప్రజ్ఞత కనిపించింది. అక్షరం నేర్పిన విలువలు ఇల్లు దిద్దుకోవడం, చక్కగా వండి పెట్టుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం... ఇదే నా లోకంగా ఉండేది. ఆర్థిక సమస్యలే రాకపోయి ఉంటే నాలో ఇంత శక్తి ఉందని నాకు కూడా ఎప్పటికీ తెలిసేది కాదేమో. అయితే కంచి పరమాచార్య చెప్పినట్లు మనం దేనిని పైకి విసురుతామో అది మనకు అంతకంటే వేగంగా వచ్చి చేరుతుందని నమ్ముతాను. మా వారు మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు తప్పని సరై నేర్చుకున్న హిందీ ఇప్పుడు నార్త్ ఇండియా పర్చేజ్కి, అక్కడి నుంచి వచ్చిన పనివాళ్లతో మాట్లాడడానికి పనికొస్తోంది. బెంగళూరులో ఉన్నప్పుడు రోజంతా ఏమీ తోచడం లేదని నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఈ రోజు నన్ను విజేతగా నిలబెట్టింది. అంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. పదో తరగతి వరకే చదివిన నేను మా ఇంటి దగ్గరున్న లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో చందమామ నుంచి ఆధ్యాత్మికం వరకు దాదాపుగా చదివేశాను. ఆ అక్షరజ్ఞానం నేర్పిన విలువలే నాకు యూనిట్ నిర్వహణలో ఉపయోగపడుతున్నాయి. – గాయత్రీరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి -
బాలానగర్ : ఫ్లై వుడ్ గోదాములో చెలరేగిన మంటలు
-
గిడ్డంగులు,కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
-
గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు మ్యాపింగ్
సాక్షి, అమరావతి: గ్రామాల వారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్ స్టోరేజీలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై మ్యాపింగ్ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల వారీగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, వైఎస్సార్ జిల్లా పులివెందుల ప్రాంత అభివృద్ధి పనులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ ఒకే నమూనాలో ఉండాలని సూచించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ పనుల పురోగతి గురించి ఆరా తీయగా, పనులకు సన్నద్ధమవుతున్నామని అధికారులు వెల్లడించారు. క్యాన్సర్ ఆసుపత్రి, ఇటీవల శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. పనుల ప్రగతి, నిధుల ఖర్చు, ఇతరత్రా అంశాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి వరద వచ్చినప్పుడు గండికోట, చిత్రావతి రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టాలి ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు మధ్య రోడ్డు విస్తరణ పనులపై దృష్టి పెట్టాలని, ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఖర్జూరం పంటపై కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. వాతావరణం, ఖర్చులు ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు. చిరుధాన్యాలను బాగా ప్రోత్సహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (ఏపీ కార్ల్‌లో)లో ఉన్న మౌలిక వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. వెటర్నరీ, హార్టికల్చర్ రంగాల్లో గొప్ప సంస్థ ఏర్పాటుకు తగిన ఆలోచనలు చేయాలని, వారంలో దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పులివెందులలో ప్రపంచ స్థాయి నాణ్యతతో బోధన అందించే స్కూల్ ఏర్పాటుపై, టౌన్ హాలు నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు. -
హేమామాలినికి షాకిచ్చిన దొంగలు
ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమె వస్తువులను దాచుకునే ప్రత్యేక ఇంటికిలో దాదాపు రూ.90 వేల విలువైన సామాను దోచుకెళ్లారు. ఆ ఇంటికి కాపలా కాస్తున్న వ్యక్తే ఈ పనిచేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. షూటింగ్‌లకు ఉపయోగించే వస్తువులు, షోస్ అన్నీ ఎత్తుకెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటన ఆరు రోజుల కిందటే జరిగినప్పటికీ ఆలస్యంగా నేడు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం ముంబయిలోని పశ్చిమ అంధేరి ప్రాంతంలోని డీఎన్ నగర్లో హేమమాలిని వస్తువులను భద్రపరుచుకునే గోదాము ఉంది. అందులో కాస్ట్యూమ్స్, షూటింగ్‌లకు ఉపయోగించే జ్యువెలరీ, ప్రాప్స్, ఇతర వస్తువులు అన్నింటిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ గోదాముకు కాపాలకాసే వ్యక్తి కనిపించకుండా పోవడంతో ప్రస్తుతం అతడికోసం లుకౌట్ నోటీసులు అంటించి గాలిస్తున్నారు. -
గోదాముల్లో ధాన్యం నిల్వ చేస్తున్నారా?
అయితే ఎలుకలతో జాగ్రత్త.. నివారణ తప్పనిసరి గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ గజ్వేల్: ధాన్యం నిలువ చేసుకునే గోదాముల్లో ఎలుకల వల్ల రైతుల తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఎలుకల వల్ల నష్టపోయి కుంగిపోతున్నారు. వీటి నివారణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ (సెల్ నెం : 7288894469) సూచించారు. ఈ అంశంపై ఆయన అందించిన సలహాలు... సూచనలివి. గోదాముల్లో ఎలుకలు చొరబడకుండా ఉండాలంటే మురుగు కాలువలు, గోడల కింది భాగంలో ఉండే రంధ్రాలు, చెత్త కుప్పలు లేకుండా జాగ్రత్త పడాలి. చెట్టు కొమ్మలు, కరెంటు, టెలిఫోన్, కేబుల్ వైర్లు గోదాముల సముదాయంపై వెళ్లకుండా చూసుకోవాలి. కిటికీలు, వెంటిలెటర్లు, మురుగు వెళ్లే పైపులకు జాలి బిగించినట్లయితే ఎలుకల ప్రవేశాన్ని అరికట్టవచ్చు. తలుపుల కింది భాగం నుంచి 25సెంటీమీటర్ల ఎత్తు వరకు ఇనుప షీట్ ఏర్పాటు చేయాలి. ఎలుక కన్నాలు, మలవిసర్జన, మూత్ర విసర్జన, ఎలుక వెంట్రుకల ద్వారా వచ్చే వాసనను బట్టి ఎలుక ఉన్నట్లుగా గుర్తించాలి. ఎలుక కన్నాలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని సిమెంటు లేదా కాంక్రీటుతో మూసివేయాలి. గోదాముల చుట్టుపక్కల చెత్తా చెదారం, చెక్క ముక్కలు, ఇటుకల సముదాయం లేకుండా చూసుకోవాలి. మిగిలిపోయిన ఆహారం, ఆహారపు పొట్లాలు గోదాముల చుట్టు పడేయరాదు. రసాయనక విషపు ఎరలు మాత్రమే ఎలుకల నివారణకు అందుబాటులో ఉన్నాయి. ఈ రసాయనిక ఎలుక మందులను ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలకు ఎక్కువగా ఆకర్షించబడి నష్టపరుస్తాయి. విషపు ఎరలను సాధ్యమైనంత వరకు సాయంత్రం వేళల్లో ఉంచినట్లయితే రాత్రిళ్లలో ఎలుకలు తిని చనిపోవడానికి వీలుంటుంది. విషపు ఎరను బయట ప్రదేశాల్లో ఉంచకుండా ఎరకు ఉపయోగించే బోన్లు వాడినట్లయితే ఇతర జీవరాశులు ఈ విషపు ఎరను తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఎలుకలు తిరిగే ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో ఎరను ఉంచినట్లయితే మంచి ఫలితముంటుంది. జింక్ పాస్ఫైడ్ ఎర: జింక్ పాస్ఫైడ్ బూడిద నలుపురంగులో ఉండి వెల్లుల్లి వాసన కలిగి ఉంటుంది. ఇది వేగంగా పనిచేసే ఎలుకల మందు. మందు తిన్న 24గంటల్లో ఎలుకలు చనిపోతాయి. ఈ జింక్ పాస్ఫైడ్ గోదాములు, ఇళ్లు, షాపులు, పొలాలు, ఇతర ప్రదేశాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఈ మందు వాడేముందు ఎలుకలను మచ్చిక చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం ముందుగా నూకలు, నూనె కలిపి ఎలుకలకు ఎరగా వేయాలి. ఈ విధంగా రెండు నుంచి మూడు రోజులు ఎలుకలను మచ్చిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వంద గ్రాముల నూకలకు 2.5గ్రాముల జింక్ పాస్ఫైడ్, తగినంత వంటనూనె చేర్చి విషపు ఎరను తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10గ్రాముల చొప్పున ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి. -
ఇక చకచకా... స్నాప్‌డీల్ డెలివరీ
♦ కొత్తగా ఆరు లాజిస్టిక్స్ హబ్‌ల ఏర్పాటు ♦ హైదరాబాద్‌లో ఒకటి న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల కన్నా వేగంగా వస్తువులను డెలివరీ చేయడానికి ‘స్నాప్‌డీల్’ సిద్ధమయ్యింది. ఇది తన వేర్‌హౌస్, డెలివరీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఆరు మెగా హబ్‌లను ఏర్పాటు చేసింది. సంస్థ ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాం తంలో మూడు, లక్నో, హైదరాబాద్, కోల్‌కతాలలో ఒకటి చొప్పున హబ్‌లను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ల ఏర్పాటు కోసం ఎంత మొత్తాన్ని వెచ్చించిం దనేది మాత్రం వెల్లడించలేదు. ఈ ఆరు హబ్‌లను స్నాప్‌డీల్‌కు చెందిన పూర్తి అనుబంధ కంపెనీ ‘వెల్కన్ ఎక్స్‌ప్రెస్’ ఏర్పాటు చేసింది. ఉత్పత్తుల స్వీకరణ, వాటి నాణ్యతా పరీక్ష, డెలివరీకి సిద్ధం చేయడం, రిటర్న్ వస్తువుల పరిశీలన వంటి పనులన్నీ వీటిల్లో జరుగుతాయని కంపెనీ తెలియజేసింది. దీంతో విక్రయదారుడు అన్ని సేవలను ఒకే చోట పొందొచ్చని పేర్కొంది. డిమాండ్ వేగంగా పెరుగుతున్న ప్రాంతాల్లోనే తాజా హబ్‌లను ఏర్పాటు చేసినట్లు స్నాప్‌డీల్ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ జయంత్ సూద్ తెలిపారు. -
వ్యవసాయ గోదాములో అగ్నిప్రమాదం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్ గోదాములో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవ శాత్తు మంటలు చెలరేగటంతో గోదాములో నిల్వ ఉంచిన రెండు వేల టన్నుల మొక్కజొన్నలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో మంటలు అదుపు చేశారు. నష్టం విలువను అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.