ఇక చకచకా... స్నాప్‌డీల్ డెలివరీ
♦ కొత్తగా ఆరు లాజిస్టిక్స్ హబ్‌ల ఏర్పాటు
♦ హైదరాబాద్‌లో ఒకటి
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల కన్నా వేగంగా వస్తువులను డెలివరీ చేయడానికి ‘స్నాప్‌డీల్’ సిద్ధమయ్యింది. ఇది తన వేర్‌హౌస్, డెలివరీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఆరు మెగా హబ్‌లను ఏర్పాటు చేసింది. సంస్థ ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాం తంలో మూడు, లక్నో, హైదరాబాద్, కోల్‌కతాలలో ఒకటి చొప్పున హబ్‌లను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ల ఏర్పాటు కోసం ఎంత మొత్తాన్ని వెచ్చించిం దనేది మాత్రం వెల్లడించలేదు.
ఈ ఆరు హబ్‌లను స్నాప్‌డీల్‌కు చెందిన పూర్తి అనుబంధ కంపెనీ ‘వెల్‌కన్ ఎక్స్‌ప్రెస్’ ఏర్పాటు చేసింది. ఉత్పత్తుల స్వీకరణ, వాటి నాణ్యతా పరీక్ష, డెలివరీకి సిద్ధం చేయడం, రిటర్న్ వస్తువుల పరిశీలన వంటి పనులన్నీ వీటిల్లో జరుగుతాయని కంపెనీ తెలియజేసింది. దీంతో విక్రయదారుడు అన్ని సేవలను ఒకే చోట పొందొచ్చని పేర్కొంది. డిమాండ్ వేగంగా పెరుగుతున్న ప్రాంతాల్లోనే తాజా హబ్‌లను ఏర్పాటు చేసినట్లు స్నాప్‌డీల్ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ జయంత్ సూద్ తెలిపారు.