Snapdeal
-
నేపాల్ విమానానికి రంద్రాలు..టిష్యూతో కవర్ చేసిన ఎయిర్‌హోస్ట్
నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో 70 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం నాటికి ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. This is really really sad. Few yrs ago on my flight to Pokhara, when I told the stewardess that airflow was coming from the corner of a window while airborne, she brought a tissue paper & stuffed the crevice. Decided to never fly to Pokhara again expecting the worst one day 😔 https://t.co/Mf8kBHqIWV — Kunal Bahl (@1kunalbahl) January 15, 2023 ఇక ఈ విమాన ప్రమాదంపై స్నాప్ డీల్ కో-ఫౌండర్ కునాల్ బహ్ల్ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ విమాన ప్రమాద వార్తని ట్వీట్ చేశారు. గతంలో బిజినెస్ పనిమీద పొఖారాకు వెళ్లిన బహ్ల్‌కు విమానంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఇది నిజంగా విచారకరం. కొన్ని సంవత్సరాల క్రితం నేను పోఖారాకు వెళ్లాను. నేను ప్రయాణిస్తున్న విమానం కిటికీలకు ఏర్పడిన పగుళ్ల కారణంగా ఆకాశ మార్గంలో ఉండగా.. బయట నుంచి గాలి విమాన కిటికీల పగుళ్ల గుండా లోపలికి వస్తుంది. ఇదే విషయాన్ని గుర్తించిన నేను వెంటనే పక్కనే ఉన్న ఎయిర్ హోస్ట్‌కి సమాచారం అందించా. ఆమె ఓ టిష్యూ పేపర్‌ను అడ్డం పెట్టి గాలి లోపలికి రాకుండా ప్రయత్నించింది. నా దృష్టిలో అదే అంత్యత వరస్ట్ డే. నాటి నుంచి మళ్లీ పోఖారాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్లో తెలిపారు. -
ఈ కామర్స్ దిగ్గజాలకు మరోసారి బిగ్ షాక్, కేంద్రం నోటీసులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలకు భారీ షాక్ తగిలింది. నాణ్యతా ప్రమాణాలు విస్మరించి, బొమ్మల విక్రయాలపై రెగ్యులేటరీ కొరడా ఝళిపించింది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) క్వాలిటీ మార్క్ లేని బొమ్మలను విక్రయించి నందుకు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లకు నోటీసులు జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని బొమ్మలను అక్రమంగా విక్రయిస్తున్న మూడు ఇ-కామర్స్ సంస్థలకు ఈ మేరకు నోటీసులిచ్చామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ నిధి ఖరే ఒక ప్రకటన జారీ చేశారు. బీఐఎస్ ప్రమాణానికి అనుగుణంగా లేని బొమ్మల విక్రయాలపై ఫిర్యాదులు నేపథ్యంలో దేశంలో పలు దుకాణాల్లో దాడులు నిర్వహించామని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. 44 చోట్ల గత నెలలో నిర్వహించిన దాడుల్లో ప్రధాన రిటైల్ దుకాణాల నుండి 18,600 బొమ్మలను స్వాధీనం చేసు కున్నామని వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్‌లో ఉన్న హామ్లీస్, ఆర్చీస్, డబ్ల్యూహెచ్ స్మిత్, కిడ్స్ జోన్ , కోకోకార్ట్‌తో సహా రిటైల్ దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బీఐఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తివారీ తెలిపారు. కాగా 2021, జనవరి నుంచి బీఐఎస్ నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టాయ్‌మేకర్స్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. నాసిరకం వస్తువులు విక్రయించినందుకుగానూ గతంలో ఈకామర్స్ సంస్థలకు సీసీపీఏ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. -
వ్యాపార విస్తరణలో స్నాప్‌డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తమ కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం, టెక్నాలజీపరంగా మరిన్ని ఆవిష్కరణలు చేయడం, లాజిస్టింక్స్ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. దీనికోసం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ తెలిపింది. కొత్తగా ఈక్విటీల జారీ, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో పబ్లిక్ ఇష్యూ ఉంటుందని పేర్కొంది. సాఫ్ట్‌బ్యాంక్, బ్లాక్‌రాక్, టెమాసెక్, ఈబే తదితర సంస్థలు స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్ చేశాయి. మొత్తం 71 షేర్హోల్డర్లలో 8 మంది మాత్రమే స్వల్ప వాటాలను విక్రయించనున్నట్లు సంస్థ వివరించింది. సంయుక్తంగా 20.28 శాతం వాటా ఉన్న కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బెహల్, రోహిత్ కుమార్ బన్సల్ తమ వాటాలను ఐపీవోలో విక్రయించడం లేదని స్నాప్‌డీల్ తెలిపింది. -
ఐపీవో బాటలో స్నాప్‌డీల్
న్యూఢిల్లీ: ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ స్నాప్‌డీల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత బిజినెస్‌లు నిర్వహించే పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో స్నాప్‌డీల్ నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు మరో 3.07 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. లిస్టింగ్ ద్వారా కంపెనీ విలువ 1.5–1.7 బిలియన్ డాలర్ల(రూ. 12,750 కోట్లు)కు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా ఈక్విటీ జారీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, లాజిస్టిక్స్ విస్తరణ, సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో స్నాప్‌డీల్ పేర్కొంది. ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత దిగ్గజాలు జొమాటో, నైకా, పాలసీబజార్, పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను పొందిన విషయం విదితమే . మ్యాప్‌మైఇండియా లాభాల లిస్టింగ్ ఢిల్లీ: డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ మ్యాప్‌మైఇండియా షేరు తొలిరోజు ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర 1,033తో పోలిస్తే 53 శాతం ప్రీమియంతో రూ.1,581 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.1,587 వద్ద గరిష్టాన్ని.., రూ.1,395 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరి గంట లాభాల స్వీకరణతో 35% లాభంతో రూ.1,394 వద్ద నిలిచింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.7,425 కోట్లుగా నమోదైంది. -
కోవిడ్ బాధితుల కోసం స్నాప్‌డీల్ సంజీవని
ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ తాజాగా సంజీవని పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కోవిడ్-19 రోగులను ప్లాస్మా దాతలతో అనుసంధానిస్తారు. రోగులు, దాతలు తమ పేర్లను మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఆధారంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూప్, ప్రాంతం, కోవిడ్-19 ఎప్పుడు సోకింది, ఎప్పుడు నెగెటివ్ వచ్చింది వంటి వివరాలను పొందుపర్చాలి. ఈ వివరాల ఆధారంగా స్నాప్‌డీల్ సర్చ్ ఇంజన్ రోగులను, దాతలను కలుపుతుంది. ప్లాస్మా దానంపై అవగాహన పెంచేందుకు సంజీవని నడుం బిగించింది. మహ మ్మారి విస్తృతి నేపథ్యంలో ఫేస్బుక్, గూగుల్, పేటీఎం వంటి సంస్థలు సైతం తమ వంతుగా సాయపడేందుకు డిజిటల్ వేదికగా టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా పేషెంట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్ -
కరోనా సంక్షోభం: స్నాప్‌డీల్ డెలివరీ హామీ
సాక్షి, ముంబై: కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా ఇ-కామర్స్ మార్కెట్లు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి చాలా కష్టపడుతున్నాయి. ప్రారంభ రోజుల్లో నిత్యావసరాల సరఫరాపై స్పష్టత లేకపోవడంతో, ఎక్కువ మంది గిడ్డంగులను మూసివేయవలసి వచ్చింది. అలాగే డెలివరీల సమయంలో ఉద్యోగులకు కూడా పెద్ద కొరత ఏర్పడింది. చాలా ఆర్డర్లను నిరాకరించాయి. వస్తువులను రవాణా చేయలేకపోయిన ఫలితంగా చాలా ఇ-కామర్స్ కంపెనీ గిడ్డంగుల్లో నిల్వలు పేరుకు పోయాయి. అయితే తాజాగా ఇ-కామర్స్ మార్కెట్, స్నాప్‌డీల్ 6-10 రోజులలోపు అవసరమైనవాటిని పంపిణీ చేస్తామని వినియోగదారులకు హామీ ఇస్తోంది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి, అత్యవసరాలను స్థానికంగా (నగరంలో మాత్రమే) పంపిణీ చేయడం ప్రారంభించినట్లు స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు కమ్యూనికేషన్స్) రజనీష్ వాహి చెప్పారు. ప్రారంభంలో మూసివేయాల్సి వచ్చిందని, కాని వేగంగా తిరిగి సేవల్లోకి ప్రవేశించామన్నారు. అయితే వివిధ నగరాల మధ్య పంపిణీ కాకుండా, ఇంట్రా-సిటీ మాత్రమే తమ సేవల అందిస్తున్నామని అందుకే వేగంగా బట్వాడా చేయగలుగుతున్నామని ఆయన చెప్పారు. గత 10 రోజులలో స్నాప్‌డీల్ స్థానిక ధాన్యం మార్కెట్లలోని డీలర్లతో, ఎఫ్ఎంసిజి హోల్‌సేల్ వ్యాపారులతో (వారిలో చాలా మందికి స్టాక్ ఉంది, కాని వాటిని మూసివేయవలసి వచ్చింది) ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులలో వైద్య పరికరాలు కూడా చాలా అవసరం కాబట్టి సంబంధిత డీలర్లతో కూడా ఒప్పందం చేసుకున్నామన్నారు. నిత్యావసరాల సేకరణపై మాత్రమే దృష్టి పెట్టామని తమ వ్యాపార బృందాన్ని కోరామని వాహి వివరించారు. కేవలం పది రోజుల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకున్నామని, సాధారణ పరిస్థితులలో ఇందుకు ఐదు-ఆరు నెలలు పట్టేదని ఆయన చెప్పారు. అలాగే ఈ సంక్షోభ సమయం దేశవ్యాప్తంగా అనేక చిన్న అమ్మకందారులు, చిన్న చిన్న గిడ్డంగులున్న దుకాణాదారులు ప్రయోజనాలకు ఉపయోగపడిందని ఆయన చెప్పారు. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కరోనా వైరస్ ను అడ్డుకునే క్రమంలో అమలవుతున్న లాక్ డౌన్ ఇంటికే పరిమితమైన తమ వినియోగదారులకు ఇ-కామర్స్ సేవలు అందించే క్రమంలో మరో అడుగు ముందు కేశామని. అన్ని వనరులను సమీకిస్తూ అవసరమైన అత్యవసర సామాగ్రిని పంపిణీ చేయడానికి, డెలివరీ సామర్థ్యాన్ని పెంచుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని సీనియర్ ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం. చదవండి : కరోనా కాటు : 36 వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్ -
వాచ్.. తూచ్..
సాక్షి, సిటీబ్యూరో: ఈ కామర్స్ యాప్ స్నాప్‌డీల్‌లో వాచీ కొన్నాడు...కొన్నాళ్ళకే లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నారంటూ సందేశం రావడంతో పొంగిపోయాడు... సైబర్ నేరగాళ్ళ మాటల వల్లోపడి రూ.50 వేలు పోగొట్టుకున్నాడు... చివరకు మోసపోయానని గుర్తించి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బేగంబజార్ ప్రాంతానికి చెందిన ఓ కార్పెంటర్ ఇటీవల స్నాప్‌డీల్ నుంచి వాచీ ఖరీదు చేశారు. ఇది కొరియర్లో అతడికి చేరిన కొన్ని రోజుల తర్వాత స్నాప్‌డీల్ నుంచి అంటూ ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో తమ సంస్థ నిర్వహించిన లక్కీడ్రాలో కారు గెల్చుకున్నారని, ఇతర వివరాలు తమ ప్రతినిధి అందిస్తారని ఉంది. ఇది జరిగిన మరుసటి రోజు స్నాప్‌డీల్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. లక్కీడ్రాలో రూ.12.6 లక్షల విలువైన హైఎండ్ కారు గెల్చుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కారును సొంతం చేసుకోవడానికి సదరు కార్పెంటర్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో సైబర్ నేరగాళ్ళు అసలు కథ ప్రారంభించారు. కారును డెలివరీ పొందడానికి కొన్ని చార్జీలు, పన్నులు చెల్లించాలని ఎర వేశారు. అలా రకరాలైన పేర్లతో రూ.8,500 నుంచి ప్రారంభించి విడదల వారీగా రూ.50,700 తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ళు మరికొంత మొత్తం చెల్లించాలని అడుగుతుండటంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకటరామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. మూడు చోట్ల నుంచి లీక్‌కు అవకాశం ఈ తరహా మోసాల్లో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేయడానికి ఆయా ఈ–కామర్స్ సంస్థల డేటానే ఆధారం. ఈ కేసును తీసుకుంటే బేగంబజార్‌కు చెందిన బాధితుడు స్నాప్‌డీల్ నుంచి వాచీ ఖరీదు చేశాడనే విషయం ఆ సంస్థతో పాటు మరో రెండు సంస్థలకు తెలిసే అవకాశం ఉంది. ఈ తరహాకు చెందిన ఈ–కామర్స్ సైట్స్/యాప్స్ తమకు వచ్చిన ఆర్డర్స్‌ను థర్డ్ పార్టీ సంస్థలకు పంపిస్తాయి. ఆయా వస్తువుల్ని తయారు చేసే, సరఫరా చేసే సంస్థలే థర్డ్‌పార్టీలుగా ఉంటాయి. వీళ్ళు వినియోగదారుడు ఆర్డర్ చేసిన వస్తువుల్ని అతడి చిరునామాకు కొరియర్ ద్వారా పంపిస్తారు. కస్టమర్ చెల్లించిన సొమ్ముకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు స్నాప్‌డీల్‌కు ఈ థర్డ్ పార్టీ సంస్థకు మధ్య జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఫలానా సైట్/యాప్ నుంచి ఫలానా వస్తువు ఖరీదు చేశాడనే సమాచారం ఆ సంస్థతో పాటు, థర్డ్ పార్టీ సంస్థకు, కోరియర్ సంస్థకు తెలిసే ఆస్కారం ఉంది. ఈ మూడు చోట్ల పని చేసే ఉద్యోగుల్లో ఎవరైనా ఈ డేటా లీక్ చేస్తున్నారని అనుమానిస్తున్నాం. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. లక్కీ డ్రాల పేరుతో వచ్చే సందేశాలు, ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దు.– జి.వెంకట రామిరెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ -
నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్ ఫౌండర్స్
కోటా : ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్‌డీల్ చిక్కుల్లో పడింది. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందన్నఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఫౌండర్స్ అడ్డంగా బుక్కయ్యారు. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త ఇందర్‌మోహన్ సింగ్ హనీ ఫిర్యాదు మేరకు స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బాల్, సీవోవో రోహిత్ బన్సల్ చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారవేత్త ఇంద్రమోహన్ సింగ్ హనీ జూలై 17న ఉడ్ ల్యాండ్ బెల్ట్, వాలెట్ లను స్నాప్‌డీల్‌లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ బ్రాండెడ్ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు చేరడంతో, వాటిని ఉడ్‌ల్యాండ్ షోరూంకి వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అవి నకిలీవని ఉడ్‌ల్యాండ్ సిబ్బంది కూడా ధృవీకరించారు. దీంతో స్థానిక గుమన్‌పురా స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని ఆయన ఆరోపిస్తున్నారు. చేతి గడియారాన్ని ఆర్డర్ చేశా...డెలివరీ చేశామని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది కానీ వాచ్ ఇంటికి చేరలేదని తెలిపారు. అయితే కంపెనీకి ఫిర్యాదు చేయడంతో తన డబ్బులను రిఫండ్ చేసిందంటూ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇంద్రమోహన్ ఫిర్యాదు ఆదారంగా సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మనోజ్ సింగ్ సికార్వాల్ తెలిపారు. చదవండి : స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం -
స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌కు జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం భారీ షాక్ ఇచ్చింది. తన బ్రాండ్ పేరుతో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ స్నాప్‌డీల్‌పై కేసు నమోదు చేసింది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు కాసియో ఈ మేరకు ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ వస్తువుల ప్రకటనలు, ప్రదర్శన, అమ్మకాలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఎక్స్-పార్ట్ నిషేధ ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది. కాసియో బ్రాండ్ వాచెస్, కాలిక్యులేటర్ల నకిలీ అమ్మకాలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్నాప్‌డీల్ చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ సతోషి యమజాకి వెల్లడించారు. అయితే కోర్టు ఆదేశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిందిగా కోరతామని స్నాప్‌డీల్ తెలిపింది. ప్లాట్‌ఫాంలు, విక్రేతల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. కొద్దిమంది చర్యల వల్ల నిజమైన అమ్మకందారులపై ప్రతికూల ప్రభావితం చూపుతోందని స్నాప్‌డీల్ ప్రతినిధి చెప్పారు. ఈ క్రమంలో నిజమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా సెల్లర్స్ జాగ్రత్త వహించాలన్నారు. లేనిపక్షంలో ఆయా సంస్థలు తమ మార్కెట్‌ను కోల్పోవడంతోపాటు, కాంట్రాక్టు నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ప్లాట్ఫామ్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తామని హెచ్చరించారు. అలాగే బ్రాండ్లు తమ మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనను నివేదించడానికి వీలుగా, ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల నిరోధక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్టు కంపెనీ తెలిపింది. -
స్నాప్‌డీల్ సమ్మర్ మెగా డీల్స్
స్నాప్‌డీల్ మెగా డీల్స్ పేరుతో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకించింది.. మే 17నుంచి 19వ తేదీవరకు పరిమితి కాలానికి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కేటగిరీల ప్రొడక్ట్స్‌పై దాదాపు 80శాతం తగ్గింపును అందిస్తోంది. ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై అదనంగా 15శాతం డిస్కౌంట్. డీల్350 కూపన్ల ద్వారా రూ.350 దాకా ఆదా చేసుకునే అవకాశం. సరసమైన ధరల్లో అందుబాటుల్లో ఉన్న ఫీచర్ ఫోన్లను మరింత తక్కువ ధరకే కొనుగోలు దారులకు అందుబాటులో ఉంచింది. నోకియా 8110 బనానా ఫోన్, ఐవూమి ఐ2 లైట్, కూల్‌ప్యాడ్ మెగా 5 సిరీస్‌లపై డిస్కౌంట్ అందిస్తోంది. వీటితో పాటు కోల్డ్ కాఫీ మేకర్స్, షర్బత్ మేకర్స్, ట్రావెల్ బాగ్స్, ఎయిర్ కూలర్లు, కూలర్ ప్యాడ్లపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకా వివిధ సాంప్రదాయ వస్తువులు, డోలక్, తాళాలు లాంటి సంగీత సాధనాలు కూడా ఈ తగ్గింపు ధరల్లో లభిస్తాయి. మరిన్నివివరాలు స్నాప్‌డీల్ వెబ్సైట్ లో లభ్యం. -
ఎన్నికల జాతరలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. సంప్రదాయ జెండాలు, ప్లెక్సీలతో పాటు బెలూన్లు, బటన్లు, టీషర్టులు, కప్పులు, కీ–చైన్లపై తమ గుర్తులను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. వీటిపై ఆయా పార్టీల మద్దతుదారులు, యువత ఆసక్తి చూపుతుండటంతో ఆఫ్‌లైన్‌తో పాటు అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఆన్లైన్ సంస్థల్లోనూ జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. మై భీ హూ చౌకీదార్(నేనూ కాపలాదారునే) అనే బీజేపీ నినాదమున్న టీ–షర్టులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మోదీ, ప్రియాంకా గాంధీ చీరలకు డిమాండ్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రత్యేక టోపీలను తీసుకొచ్చింది. వీటికే భారీ డిమాండ్.. కాంగ్రెస్, బీజేపీ సహా వేర్వేరు రాజకీయ పార్టీల గుర్తులు, నినాదాలతో వస్తున్న టీ–షర్టులు, కప్పులు, కీచైన్లకు ఆన్లైన్లో మంచి గిరాకీ ఉందని ఆన్లైన్ రిటైల్ సంస్థ స్నాప్‌డీల్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘అభ్యర్థులు, పార్టీల చిత్రాలు ఉన్న కాఫీ మగ్గులు, పవర్ బ్యాంకులు, యూఎస్బీ డ్రైవ్స్, టీ షర్టులు, చీరలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో కారు, బైక్ స్టిక్కర్లు, టీషర్టులు, టోపీలు, నీటి బాటిళ్లు, కీచైన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి’ అని అన్నారు. మోదీ, రాహుల్, ప్రియాంక వంటి కీలక నేతల ముఖచిత్రాలతో ఉన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని పేరొన్నారు. సదర్ బజార్లో దీటుగా అమ్మకాలు.. ఆన్లైన్ అమ్మకాలకు పోటీగా ఢిల్లీలోని సదర్ బజార్లో ఎన్నికల ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయి. ఇక్కడి షాపుల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లకు చెందిన జెండాలు, బ్యాండ్లు, పార్టీ ముఖ్యనేతల చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. విక్రమ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ యజమాని హర్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ప్రచార సామగ్రి అమ్మకాల్లో బీజేపీ అన్నిపార్టీల కంటే ముందంజలో ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ వెబ్సైట్లో మోదీ చీరలు రూ.700 నుంచి రూ.3,549 మధ్యలో దర్శనమిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ప్రచార సామగ్రిని అమ్మేందుకు ‘నమో రథాల’ను సిద్ధం చేశామనీ, ఈసీ నుంచి అనుమతి లభించిన వెంటనే వీటిని రంగంలోకి దించుతామని బీజేపీ నేత మనోజ్ తెలిపారు. -
ఈ కామర్స్ సంస్థలకు గడువు పొడిగింపు లేదు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో ఈ కామర్స్ సంస్థలకు సవరించిన నిబంధనల అమలుకు ఫిబ్రవరి 1గా ఇచ్చిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువును కనీసం మూడు నెలల వరకైనా పొడిగించాలని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. ‘‘ఈ కామర్స్ రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐల పాలసీ నిబంధనల అమలుకు ఇచ్చిన గడువు పొడిగించాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత గడువును పొగించకూడదని నిర్ణయించాం’’ అని పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (డీపీఐటీ) పేర్కొంది. కొత్త నిబంధనల కార్యాచరణను పూర్తిగా అర్థం చేసుకునేందుకు గాను గడువు పొడిగించాలని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కేంద్రాన్ని కోరాయి. జూన్ 1వరకు పొడిగింపు ఇవ్వాలని అమెజాన్ కోరగా, ఆరు నెలల సమయాన్ని ఫ్లిప్‌కార్ట్ కోరింది. ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేశాయి. నూతన నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులకు వివరించాయి. భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తాము నిర్ణయించుకున్నామని, ఈ పెట్టుబడులకు రిస్క్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, దేశీయ వర్తకుల సమాఖ్య సీఏఐటీ మాత్రం గడువు పొడిగించొద్దని డిమాండ్ చేసింది. అమెరికా కంపెనీల ఒత్తిడికి తలగొద్దని దేశీయ ఈ కామర్స్ సంస్థలు స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ సైతం కోరాయి. కాగా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తరహా ఈ రిటైలింగ్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై తమకు వాటాలున్న కంపెనీల ఉత్పాదనలను 25 శాతానికి మించి విక్రయించకుండా నిషేధిస్తూ గత డిసెంబర్ 26న కేంద్రం నూతన నిబంధనలను ప్రకటించింది. కొన్ని కంపెనీల ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ ప్లాట్‌ఫామ్‌పైనే విక్రయించే ఒప్పందాలను సైతం నిషేధించింది. మరోవైపు ప్రభుత్వం గడువు పొడిగించకపోతే నిబంధనల అమలుకు గాను ప్లాన్–బిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సిద్ధం చేసుకున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం: అమెజాన్ నూతన నిబంధనల విషయంలో మరింత స్పష్టత కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, తమ కస్టమర్లు, విక్రయదారులపై ప్రభావాన్ని పరిమితం చేసేందుకు కృషి చేస్తామని అమెజాన్ ప్రకటించింది. ‘‘అన్ని చట్టాలు, నిబంధనలను పాటించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకుని మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటాం. ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం: స్నాప్‌డీల్ చిన్న ఈ కామర్స్ సంస్థలు స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సచ్ఛీలమైన, బలమైన ఈ కామర్స్ రంగానికి ప్రభుత్వ నిర్ణయం దారితీస్తుందని స్నాప్‌డీల్ పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇది విజయం వంటిదని షాప్‌క్లూస్ సీఈవో విజయ్సేతి అభివర్ణించారు. -
ఆరోపణలపై స్పందించిన స్నాప్‌డీల్
ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్‌డీల్‌పై వచ్చిన ఆరోపణలపై సంస్థ స్పందించింది. చట్టం, నిబంధనల ప్రకారం విక్రయాదారులు వ్యవహరించాల్సి ఉందని పేర్కొంది. కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. నకిలి ఉత్పత్తుల బెడద ప్రపంచవ్యాప్తంగా ఉందని అందుకే బ్రాండ్ షీల్డ్ ద్వారా వీటి నిరోధానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. థర్డ్ పార్టీ బ్రాండ్ల విషయంలో పూర్తి పరిశీలన అనంతరం ఆయా బ్రాండ్లు నకిలీవని తేలితే వెంటనే కేవలం ఒక రోజులోనే వాటిని తొలగిస్తున్నామని తెలిపింది. మార్కెట్ ప్లేస్ ఆధారిత అమ్మకాల్లో ఆయా ఉత్పత్తిదారులు, విక్రయదారులు వీటికి బాధ్యత వహిస్తారని తెలిపింది. ఈ మేరకు స్నాప్‌డీల్ ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. 2018 జనవరినుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ప్యాకేజీలపై ధర, ఉత్పత్తిదారుడు పేరు, తేదీ, ఎక్స్పైరీ తేదీ వివరాలను అందించాల్సిన బాధ్యత సెల్లర్స్‌కు ఉందని పేర్కొన్నారు. కాగా భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్‌డీల్ పెంచేస్తూ, అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్‌తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్‌డీల్ ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలంటూ అహ్మదాబాద్‌కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ)డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని ఆశ్రయించింది. స్నాప్‌డీల్‌లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
కస్టమర్లకు స్నాప్‌డీల్ టోకరా
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్‌డీల్ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్‌డీల్ పెంచేస్తోందని, కాస్మెటిక్ ఉత్పత్తులపై గడువు తేదీని చూపడం లేదని అహ్మదాబాద్‌కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) పేర్కొంది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్‌తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్‌డీల్ ఉపసంహరించేలాచర్యలు చేపట్టాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని సీఈఆర్సీ కోరింది. ఇప్పటికే విక్రయించిన హానికారక ఉత్పత్తులను వెనక్కి తీసుకుని వినియోగదారులకు పరిహారం చెల్లించాలని సీఈఆర్సీ పిలుపు ఇచ్చింది. వెండార్లు, ఉత్పత్తుల ఎంపికలో కంపెనీ పారదర్శక విధానం పాటించాలని, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడిన వెండార్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. స్నాప్‌డీల్‌లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేశారు. -
ఔషధాలను విక్రయిస్తున్నందుకు స్నాప్‌డీల్‌పై విచారణ
బెంగళూరు: ఆన్లైన్లో నియంత్రిత ఔషధాలను చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన విచారణ చర్యలు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.‘‘షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్ ‘సుహాగ్రా 100’ ప్రదర్శన, విక్రయం, పంపిణీ చేస్తున్నందుకు గాను స్నాప్‌డీల్, ఆ సంస్థ సీఈవో కౌర్‌బాహల్, సీవోవో రోహిత్‌కుమార్ బన్సాల్‌కు వ్యతిరేకంగా విచారణ చర్యలు తీసుకునేందుకు బెళగావికి చెందిన అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్‌ను అనుమతిస్తూ డిసెంబర్ 21న ఆదేశాఉలు ఇవ్వడం జరిగింది. ఈ ఔషధాన్ని ఓవర్ ద కౌంటర్ విక్రయించకూడదు. ఇది ఔషధ, సౌందర్య ఉత్పత్తుల నిబంధనలకు వ్యతిరేకం’’అని కర్ణాటక డ్రగ్ కంట్రోలర్ అమరేష్ తుంబగి బుధవారం మీడియాకు తెలిపారు. లుథినాయాకు చెందిన హెర్బల్ హెల్త్‌కేర్ కంపెనీ యజమాని, ఉద్యోగులకు వ్యతిరేకంగా కూడా విచారణ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. లైంగిక ఉద్దీపనానికి వినియోగించే సుహాగ్ర ఔషధాన్ని వైద్యుల సిఫారసు లెటర్ లేకుండా విక్రయించకూడదని స్పష్టం చేశారు. చట్టానికి సహకరిస్తాం: స్నాప్‌డీల్ ఈ విషయానికి సంబంధించి తమకు ఎటువంటి సమచారం లేదని, విచారణ అధికారులకు సహకారం అందిస్తామని స్నాప్‌డీల్ ప్రకటన జారీ చేసింది. ‘‘స్నాప్‌డీల్ అనేది మధ్యవర్తి. విక్రేతలను, కొనుగోలుదారులతో అనుసంధానిస్తుంది. షెడ్యూల్డ్ హెచ్ విభాగంలోని ఔషధాలను విక్రయించకుండా నిషేధం ఉంది. నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. అటువంటి విక్రేతలు ఇకపై అమ్మకాలు జరపకుండా నిషేధం విధిస్తాం’’ అని స్నాప్‌డీల్ అధికార ప్రతినిధి ప్రకటనలో వివరించారు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసేందుకు తమ వైపు నుంచి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
చిన్న సంస్థలూ పోటీ పడగలగుతాయి
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. ‘బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించిందనేది తాజా నిబంధనల ద్వారా వెల్లడైంది‘ అని షాప్‌క్లూస్ సీఈవో సంజయ్ సేథి చెప్పారు. విక్రేతలందరూ ఈ–కామర్స్ ప్రయోజనాలు పొందేందుకు తాజా మార్పులు దోహదపడగలవని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ‘పెద్ద సంస్థలతో సమానంగా చిన్న సంస్థలు కూడా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తాజా నిబంధనలు ఉపయోగపడతాయి. లఘు వ్యాపార సంస్థలు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలు అందుకోవచ్చు‘ అని ఇన్‌స్టామోజో సీఈవో సంపద్ స్వైన్ తెలిపారు. ఇకపై ఈ–కామర్స్ సంస్థలు భారత్‌లో తమ వ్యాపార వ్యూహాలను సవరించుకోవాల్సి వస్తుందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ (పాలసీ అడ్వైజరీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్) రాజీవ్ చుగ్ అభిప్రాయపడ్డారు. చర్చించి ఉండాల్సింది: ఫ్లిప్‌కార్ట్ మరోవైపు, పరిశ్రమ వృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే నిబంధనలను రూపొందించేటప్పుడు.. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సమాలోచనలు జరపడం ముఖ్యమని ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ–కామర్స్ వ్యవస్థతో చిన్న సంస్థలకు తోడ్పాటు లభిస్తుండటంతో పాటు వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, దేశ ఎకానమీకి ఈ పరిశ్రమ వృద్ధి చోదకంగా మారగలదని పేర్కొంది. ఇక, నిబంధనల సర్క్యులర్‌ను అధ్యయనం చేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. నిబంధనలు కచ్చితంగా అమలవ్వాలి.. ఈ–కామర్స్ సైట్లలో అమ్మకాలకు సంబంధించిన కొత్త నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘మేం లేవనెత్తిన ప్రధాన అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై క్యాష్‌బ్యాక్ అమ్మకాలు, డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్ విక్రయాల్లాంటివి ఉండబోవు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే వీటిని కఠినంగా అమలు కూడా చేస్తుందని ఆశిస్తున్నాం‘ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దిగ్గజాలకు సమస్యలు.. కొత్త నిబంధనలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలపైనే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. దాదాపు 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాలు కొన్న అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ లాంటి వాటికి ఈ నిబంధనలు సమస్యాత్మకమే. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్, వన్‌ప్లస్, బీపీఎల్ వంటి బ్రాండ్స్‌పై పడనుంది. -
నకిలీ ఉత్పత్తులకు స్నాప్‌డీల్ చెక్..
న్యూఢిల్లీ: నకిలీ ఉత్పత్తుల విషయంలో ప్రముఖ బ్రాండ్స్ అప్రమత్తంగా వ్యవహరించేలా తోడ్పడేందుకు ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా ‘బ్రాండ్ షీల్డ్’ పేరిట ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. వివిధ బ్రాండ్స్ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నాప్‌డీల్‌లో అమ్ముడయ్యే నకిలీ ఉత్పత్తులపై ఆయా బ్రాండ్స్ ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ట్రేడ్‌మార్క్, కాపీరైట్, పేటెంట్, డిజైన్పరంగా జరిగే మేథోహక్కుల ఉల్లంఘనలను బ్రాండ్ షీల్డ్ విధానం కింద సదరు సంస్థలు ఫిర్యాదు చేయొచ్చని స్నాప్‌డీల్ తెలిపింది. -
అమెజాన్ డెలివరీలు ఆలస్యం
న్యూఢిల్లీ : రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన లారీలు దేశవ్యాప్తంగా బంద్ చేపడుతున్నాయి. జూలై 20 నుంచి ప్రారంభమైన ఈ బంద్ ఇంకా కొనసాగుతూనే ఉంది. డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని.. దేశవ్యాప్తంగా ఒకే ధరను నిర్ణయించి, ప్రతి 3 నెలలకోసారి ధరలను సవరించాలన్న డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు ఈ బంద్ చేపడుతున్నాయి. ఈ బంద్‌తో దేశీయ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, స్నాప్‌డీల్‌కు భారీగా దెబ్బకొడుతోంది. కొన్ని నగరాల్లో సరుకుల డెలివరీ చేయడం కష్టతరంగా మారింది. దీంతో అమెజాన్, స్నాప్‌డీల్ డెలివరీలు కస్టమర్లకు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. లారీలు బంద్ చేపట్టినప్పటి రోజే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ తమ తమ వార్షిక విక్రయాలను ముగించాయి. ఈ విక్రయాల్లో ఆర్డర్లు ఇచ్చిన వారికి డెలివరీ ఆలస్యమవుతుందని అమెజాన్ అధికార ప్రతినిధి చెప్పారు. ఎలాగైనా కస్టమర్లకు ఉత్పత్తులు చేరుకునేలా పనిచేస్తున్నామని తెలిపారు. దేశీయ అతిపెద్ద రవాణా వ్యవస్థ స్తంభించడంతో, ఉత్తర, పశ్చిమ భారత్‌లో డెలివరీలపై ప్రభావం చూపుతుందని స్నాప్‌డీల్ కూడా తెలిపింది. ఈ విషయాలపై ఇప్పటికే కొనుగోలుదారులకు, విక్రయదారులకు సమాచారం అందించామని చెప్పింది. దేశీయ కమోడిటీ ట్రేడ్ కూడా దెబ్బతిన్నది. పత్తి సరుకు రవాణా ఆగిపోయింది. ముడి పదార్థం లేనందున పత్తి గైనింగ్ కర్మాగారాలు మూసివేత అంచున ఉన్నాయని భారతదేశ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ గణట్రా చెప్పారు. పత్తి రవాణా ఆగిపోవడంతో, ఎగుమతిదారులు తమ తమ బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నారని, దీంతో షిప్మెంట్లను రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, పాకిస్తాన్‌లు దేశీయ పత్తి కొనుగోలు చేయడంలో ప్రధానదారులు. ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు వంటి కూరగాయలను పెద్ద పెద్ద నగరాలకు సరఫరా చేయడం కూడా పడిపోయింది. కొన్ని చోట్ల బంగాళదుంపలు ఖరీదైనవిగా మారాయి. ఈ వారంలోనే బంగాళదుంపల ధరలు 29 శాతం మేర పైకి ఎగిశాయి. -
ఇన్ఫీబీమ్ చేతికి స్నాప్‌డీల్ ’యూనికామర్స్’
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ అనుబంధ కంపెనీ యూనికామర్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫీ బీమ్ వెల్లడించింది. ఈ–కామర్స్ సాఫ్ట్వేర్ సేవలందించే యూని కామర్స్ కొనుగోలుకు రూ. 120 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. స్నాప్‌డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్‌కు ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ను జారీ చేయటం ద్వారా ఈ డీల్‌ను పూర్తి చేస్తామని, నగదు చెల్లింపులు ఉండబోవని వివరించింది. మూడు నుంచి అయిదు నెలల్లోగా డీల్ పూర్తి కాగలదని అంచనా. సమగ్రమైన ఈ–కామర్స్ సర్వీసులు అందించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని ఇన్ఫీ బీమ్ ఎండీ విశాల్ మెహతా ధీమా వ్యక్తంచేశారు. యూనికామర్స్ డీల్‌కు ఆమోదముద్ర వేసిన ఇన్ఫీబీమ్ కార్పొరేషన్ బోర్డు.. తమ సంస్థ పేరును కూడా ఇన్ఫీబీమ్ అవెన్యూస్‌గా మార్చే ప్రతిపాదనను ఓకే చేసింది. 2012లో ఏర్పాటైన యూనికామర్స్ సంస్థకు 10,000 పైగా విక్రేతలు క్లయింట్స్‌గా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవరు రూ.20 కోట్లుగాను, నికర విలువ రూ.25 కోట్లుగాను ఉంది. ఇతరత్రా వ్యాపార విభాగాలను విక్రయించి, ప్రధాన వ్యాపారంపై మరింతగా దృష్టి పెట్టేందుకు ఉద్దేశించిన వ్యూహంలో భాగంగానే యూనికామర్స్‌ను విక్రయిస్తున్నట్లు స్నాప్‌డీల్ చీఫ్ స్ట్రాటెజీ, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జేసన్ కొఠారి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల నుంచి తీవ్రమైన పోటీతో కుదేలయిన స్నాప్‌డీల్.. మళ్లీ పుంజుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పేమెంట్ సేవల విభాగం ఫ్రీచార్జ్‌ను యాక్సిస్ బ్యాంక్‌కి రూ. 385 కోట్లకు, లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్‌కి రూ.35 కోట్లకు అమ్మేసింది. -
ఆ ఆయుధాల విక్రయం నిలిపేశాం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఆరోపణలపై హైదరాబాద్‌లో కేసులు నమోదు కావడంతో స్నాప్‌డీల్ సంస్థ దిగివచ్చింది. తమ వెబ్సైట్లో ఉన్న ఆయా ఆయుధాల మెనూను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని నగర పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలసి స్నాప్‌డీల్ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. స్నాప్‌డీల్ చేస్తున్న ఆయుధ వ్యాపారాన్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత వారం గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాల కంటే ఎక్కువ వెడల్పుతో కూడిన ఆయుధాలు సరైన అనుమతులు లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరం. ఖరీదు చేసినందుకు సిటీకి చెందిన పలువురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు విక్రయించిన ఆరోపణలపై స్నాప్‌డీల్‌కు నోటీసులు జారీ చేశారు. పునరావృతం కాకుండా చూస్తాం.. దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను కలసి ఆ సంస్థ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. తాము నేరుగా ఎలాంటి ఉత్పత్తుల విక్రయాలు చేయమని, అటు విక్రేతలు.. ఇటు కొనుగోలుదారులకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే పని చేస్తామని వివరణ ఇచ్చింది. ఈ ఆయుధాలను గుజరాత్‌కు చెందిన సంస్థ తమ సైట్ ద్వారా విక్రయిస్తోందని పేర్కొంది. అయితే క్రయవిక్రయాలకు ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరించిన నేపథ్యంలో స్నాప్‌డీల్‌కు విక్రేత కొంత మేరకు కమీషన్ చెల్లిస్తాడు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం బాధ్యులవుతారని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తమ వెబ్సైట్ నుంచి పరిమితికి మించిన పొడవు, వెడల్పులతో ఉన్న ఆయుధాల మెనూను తొలగించామని, విక్రయాలు ఆపేశామని స్పష్టం చేశారు. దీంతో గుజరాత్ సంస్థకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీసులు.. స్నాప్‌డీల్‌పై చర్యలకు సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. ఇతర వెబ్సైట్లలోనూ... స్నాప్డీల్లోనే కాదు.. ఏ ఈ–కామర్స్ సైట్లలో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయని పోలీసులు గుర్తించారు. రూ.వెయ్యి నుంచి రూ.8 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయించేస్తున్నారని ఆధారాలు సేకరించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయా వెబ్సైట్లకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్లో కత్తులు అందుబాటులోకి రావడంతో అనేక మంది అవసరం ఉన్నా లేకున్నా, చట్ట విరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. -
ఫ్యూచర్ చేతికి ‘వల్కన్ ఎక్స్‌ప్రెస్’!
న్యూఢిల్లీ: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ కంపెనీ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు చెల్లించి వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేశామని, ఈ డీల్ విలువ రూ.35 కోట్లని ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియానీ తెలిపారు. వల్కన్ చేరికతో ఈ కామర్స్, రిటైల్ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించగలమని చెప్పారాయన. కాగా పూర్తిగా ఈ–కామర్స్ వ్యాపారంపైననే దృష్టి సారించే వ్యూహంలో భాగంగా స్నాప్‌డీల్ కంపెనీ వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను విక్రయించిందని స్నాప్‌డీల్ చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జేసన్ కొఠారి పేర్కొన్నారు. ఫ్యూచర్ సప్లై చెయిన్‌కు దేశవ్యాప్తంగా 44 గిడ్డంగులు, 14 లాజిస్టిక్స్ కేంద్రాలు, 106 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఫ్యూచర్ జోరు..: ఇటీవల కాలంలో ఫ్యూచర్ కంపెనీ జోరుగా కంపెనీలను కొనుగోలు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కంపెనీ షాపర్స్ స్టాప్‌కు చెందిన హైపర్ సిటీ రిటైల్‌ను రూ.655 కోట్లకు కొనుగోలు చేసింది. గత వారమే ట్రావెల్ న్యూస్ సర్వీసెస్ ఇండియాను (టీఎన్ఎస్ఐ) రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. -
‘ఫ్యూచర్’ చేతికి స్నాప్‌డీల్ ‘వల్కన్’!
ముంబై: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్ విభాగం, వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ రూ.50 కోట్లు ఉండొచ్చు. తన సరఫరా చెయిన్ వ్యాపారాన్ని మరింత పటిష్టవంతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఫ్యూచర్‌గ్రూప్ వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గా లు వెల్లడించాయి. ఈ డీల్‌కు సంబంధించి చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో ఖరా రు కావచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్‌లో భాగంగా వల్కన్ సిబ్బంది ఫ్యూచర్ గ్రూప్‌కు బదిలీ అవుతారు. వల్కన్ ఎక్స్‌ప్రెస్ చేరికతో ఫ్యూచర్ గ్రూప్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కార్యకలాపాలు మరింత శక్తివంతమవుతాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి స్నాప్‌డీల్, ఫ్యూచర్గ్రూప్లు నిరాకరించాయి. వంద నగరాల్లో వల్కన్ కార్యకలాపాలు... వల్కన్ ఎక్స్‌ప్రెస్ రిటైల్ కంపెనీలకు ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలకు సరఫరా సేవలందిస్తోంది. మొత్తం వంద నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్ గ్రూప్‌కు సొంత లాజిస్టిక్స్ సంస్థ ఉంది. ఇటీవలే ఈ సంస్థ, ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.650 కోట్లు సమీకరించింది. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్, ఫుడ్, బేవరేజేస్, ఎఫ్ఎమ్సీజీ, ఈ కామర్స్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల సంస్థలకు లాజిస్టిక్స్ సేవలందిస్తోంది. కీలకం కాని ఆస్తుల విక్రయంలో భాగంగా స్నాప్‌డీల్ సంస్థ వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను విక్రయిస్తోంది. అత్యంత తీవ్రమైన పోటీ ఉన్న ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల నుంచి నిలదొక్కుకోవడానికి కావలసిన నిధులను ఇలాంటి కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా సమకూర్చుకుంటోంది. గత ఏడాది జూలైలో తన పేమెంట్ వాలెట్ ఫ్రీచార్జ్‌ను స్నాప్‌డీల్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్‌కు రూ.385 కోట్లకు విక్రయించింది. -
ఆన్లైన్లో విజృంభిస్తున్న నకిలీ దందా!
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్లు, 4జీ వినియోగం పెరగడంతో ఆన్లైన్ అమ్మకాలు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్లో అమ్మేవాటిలో చాలా వరకు నకిలీ ఉత్పత్తులు ఉన్నట్టు వెల్లడయింది. సాధారణంగా పండుగ సమయంలో ఈ–కామర్స్ వెబ్సైట్లు డిస్కౌంట్లతో హోరెత్తిస్తుంటాయి. రాయితీలు ఇచ్చి అమ్మే వస్తువుల్లో ఎన్ని మంచివి? ఎన్ని నకిలీవి? అనే విషయమై ఓ ఆంగ్ల ఛానల్ జరిపిన పరిశోధనలో విస్తపోయే వాస్తవాలు తెలిశాయి. చాలామంది తయారీదారులు, విక్రేతలు ఆన్లైన్లో నకిలీ సరుకులను అంటగడుతున్నట్టు తేలింది. ఐటీ చట్టంలోని లోపాలను వాడుకుంటూ ఇలా చేస్తున్నారు. ఆన్లైన్లో ఉన్న దాదాపు 60 శాతం క్రీడా ఉత్పత్తులు నకిలీవేనట. అంతేకాక 40 శాతం దుస్తులు నకిలీ కంపెనీలవేనని గుర్తించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మీరట్‌లోని బ్రహ్మపురి ఏరియాలో పోలీసులు జరిపిన తనిఖీలో పెద్ద మొత్తంలో పట్టుబడిన నకిలీ ఉత్పత్తులను సీజ్ చేశారు. వీటిని ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ వంటి ప్రముఖసైట్లలో విక్రయిస్తున్నారు. రూ.170–200 వరకు ధర ఉన్న నకిలీ ఉత్పత్తులను రూ.450–500కు అమ్ముతున్నారు. ఏకంగా 50–60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. మనీలాండరింగ్‌కు, కొన్ని రకాల మోసాలకు కూడా కంపెనీలు ఆన్‌లైన్‌ను వాడుకుంటున్నట్టు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. -
స్నాప్‌డీల్ అన్‌బాక్స్ దివాలి సేల్ ప్రారంభం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల కంటే ముందస్తుగానే స్నాప్‌డీల్ తన సేల్‌ను ప్రారంభించేసింది. ఈ పండుగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు అన్‌బాక్స్ దివాలి సేల్‌ను నేటి నుంచి నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్స్‌పై బంపర్ ఆఫర్లను అందిస్తోంది. పలు బ్యాంకు కార్డులపై కూడా ఫ్లాట్ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను స్నాప్‌డీల్ ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఈ సేల్‌లో భాగంగా ధమాకా డీల్స్‌ను కూడా స్నాప్‌డీల్ ఆఫర్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఇతర ఫెస్టివల్ సేల్స్ మాదిరిగా కాకుండా.. స్నాప్‌డీల్ పలు బ్యాంకులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. సిటీ క్రెడిట్ కార్డును వాడి కనీసం రూ.2000 మేర కొనుగోలు చేస్తే, 15 శాతం క్యాష్‌బ్యాక్ నుంచి రూ.2000 వరకు అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్‌కు 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. తొలిరోజు సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు దారులకు అదనంగా 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రెండో రోజు(శనివారం) స్టాండర్డ్ ఛార్టడ్ కార్డు యూజర్లకు ఆఫర్లను స్నాప్‌డీల్ ప్రకటించింది. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డీల్స్... వివో వీ5 ప్లస్ 64జీబీ గోల్డ్ కలర్ వేరియంట్‌పై 28 శాతం డిస్కౌంట్, ఒకవేళ ఏదైనా బ్యాంకు కార్డు ఆఫర్ ఉంటే మరో రూ.2000 క్యాష్‌బ్యాక్(మొత్తంగా రూ.17,549కు అందుబాటు) వివో వీ5ఎస్ స్మార్ట్‌ఫోన్ రూ.15,799కు, జియోని ఏ1 రూ.15,348కి, మోటో ఎం రూ.14,999కు, మోటో జీ5ఎస్ రూ.14,295కు అందుబాటు సోనీ ఎండీఆర్-జెడ్ఎక్స్110ఏ హెడ్ఫోన్లపై 53 శాతం డిస్కౌంట్ లెనోవో ఐడియాప్యాడ్ 80ఎక్స్‌హెచ్01జీఈఐఎన్ నోట్‌బుక్‌పై 21 శాతం డిస్కౌంట్, రూ.24,999కే విక్రయం హెచ్‌పీ 15-బీయూ003టీయూ ల్యాప్‌టాప్‌పై 18 శాతం డిస్కౌంట్, రూ.26,499కే అందుబాటు పలు పీసీ, ల్యాప్‌టాప్ మోడల్స్ ఈ సేల్‌లో డిస్కౌంట్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. -
స్నాప్‌డీల్ సేల్: డిస్కౌంట్లో కొత్త ఐఫోన్లు
ఈ-కామర్స్ కంపెనీల్లో ఫెస్టివల్ సీజన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తర్వాత స్నాప్‌డీల్ తన 'అన్‌బాక్స్ దివాలి సేల్''ను కొనసాగిస్తోంది. రెండో రౌండ్ నిర్వహిస్తున్న ఈ సేల్ నేటితో ముగియనుంది. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఐఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులతో కొత్త ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లను కొనుగోలు చేస్తే, తక్షణ డిస్కౌంట్ కింద రూ.13వేల వరకు స్నాప్‌డీల్ అందిస్తోంది. పరిమిత యూనిట్లపై ఈ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్టు స్నాప్‌డీల్ చెప్పింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్‌లో డిస్కౌంట్‌ను అందుబాటులో ఉంచింది. అదనంగా స్టాండర్డ్ ఛార్టడ్, యస్ బ్యాంకు కార్డులపై రూ.2500 కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేపడితే, ఫ్లాట్ 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ప్రతికార్డుపైనా రూ.1500 వరకు డిస్కౌంట్‌ను స్నాప్‌డీల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాక గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను 58వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.22వేల వరకు ఆదాచేసుకోవచ్చు. సేల్ డేస్‌లో ఆఫర్లకు అదనంగా ఇండస్ఇండ్ బ్యాంకు హోల్డర్స్‌కు అక్టోబర్ 3 నుంచి ప్రతి మంగళవారం ఫ్లాట్ 10 శాతం తగ్గింపును ఇవ్వనుంది. అయితే రూ.1500 కంటే మించి కొనుగోలు చేపడితేనే ఈ తగ్గింపును స్నాప్‌డీల్ ఆఫర్ చేస్తుంది.