వైఫై రూటర్లు బుక్‌చేస్తే ఖాళీ డబ్బా వచ్చింది!
మహబూబాబాద్ : ఓ కంపెనీకి చెందిన వైఫై రూటర్లు ఆఫర్‌లో ఇస్తున్నామని ప్రచారం చేయడంతో ఓ వ్యాపారీ ఆన్‌లైన్‌లో బుక్ చేయగా రూటరుకు బదులుగా ఖాళీ డబ్బా మాత్రమే వచ్చింది. మహబూబాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారి ప్రభాకర్ సెల్ వరల్డ్ షాపును నిర్వహిస్తున్నాడు. స్నాప్‌డీల్ కంపెనీ వైఫై రూటర్లను ఆఫర్‌లో ఇస్తున్నట్లుగా ప్రచారం చేసింది. ప్రభాకర్ మూడు వైఫై రూటర్ల కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. వాస్తవానికి ఆ వైఫై రూటర్ ధర రూ.1000 ఉండగా ఆఫర్‌లో రూ. 769కి మాత్రమే అని ప్రచారం చేయడంతో మూడు రూటర్లకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాడు.
ఆ రూటర్లకు సంబంధించిన మూడు బాక్సులు తపాల శాఖ ద్వారా సిబ్బంది సోమవారం రాత్రి వ్యాపారికి అందజేశారు. ప్రభాకర్ మంగళవారం ఉదయం ఒక బాక్సును తీసి చూడగా ఖాళీగానే ఉంది. మిగిలిన రెండు బాక్సులు కూడా అలాగే ఉంటాయని భావించి వాటిని తెరిచి చూడలేదు. తిరిగి ఆ బాక్సులను సంబంధిత కంపెనీకి పంపిస్తామని ఆ వ్యాపారి తెలిపారు. కంపెనీ చేసిన ప్రచారాన్ని నమ్మి డబ్బులు చెల్లిస్తే ఈ విధంగా మోసం జరిగిందని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.