ఆన్లైన్... పండగ చేస్కో! | online shopping special story | Sakshi
Sakshi News home page

ఆన్లైన్... పండగ చేస్కో!

Published Mon, Oct 24 2016 12:00 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

ఆన్లైన్... పండగ చేస్కో! - Sakshi

ఆన్లైన్... పండగ చేస్కో!

పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ చెక్ చేసుకుంటున్న భర్తతో విసిగి వేసారిన భార్య అన్న మాట... ‘మీరు ఆ వెధవ వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఎంతసేపు గడుపుతారో, అంతసేపు నేనూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శ్నాప్ డీల్ చూస్తా’. అంతే! సదరు భర్త గారు ఠక్కున స్మార్ట్‌ఫోన్ కట్టేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జోక్ ఇది.

ప్రతి వస్తువూ... పల్లె వాకిట్లో!
గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని మాచవరం గ్రామానికి చెందిన కృష్ణ ఇప్పుడు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ నుంచి పెన్‌డ్రైవ్ దాకా దేనికీ ‘పేట’కో, గుంటూరుకో వెళ్ళాల్సిన పని లేదు. అక్కడ వాళ్ళు చెప్పినంత రేటు పెట్టి, కొనాల్సిన పనీ లేదు. అక్కడ అమ్మే ధర కన్నా కనీసం 30 శాతం తక్కువకే ఆ వస్తువులన్నీ ‘ఫ్లిప్ కార్ట్’తో ఇంటి గుమ్మంలోకే వస్తున్నాయి. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పుణ్యమా అని, ఇంటికి వచ్చి వస్తువు ఇచ్చి మరీ డబ్బులు కట్టించుకొనే వెసులుబాటూ వచ్చింది. తెలుగు నేలపై కృష్ణ లాంటి కొన్ని లక్షల మంది గ్రామీణవాసులు ఇప్పుడు ఈ పనే చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ రిటైల్ విక్రేతల పుణ్యమా అని నగరవాసులు కొనుక్కునేవన్నీ... చిన్న పట్నాల్లో, పల్లెల్లో ఉన్న వీళ్ళకు కూడా ఎంచక్కా అందుబాటులోకి వచ్చేశాయి.

 తాజా పండుగ సేల్స్‌లో కూడా చిన్న పట్నాలదే పెద్ద వాటా! ఢిల్లీ, ముంబయ్ లాంటి మెట్రో నగరాలే కాదు... ఈసారి జైపూర్, పుణే, లక్నో లాంటి ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఈ ఆన్‌లైన్ అమ్మకాల్లో ముందుంటున్నాయి. దేశం మూలమూలల్లోని మిజోరమ్, మేఘాలయ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము - కాశ్మీర్‌ల నుంచి ఇంటర్‌నెట్‌లో కొనుగోళ్ళు గతంలో ఎన్నడూ లేనంత పెరిగాయని ఆ సంస్థల వాళ్ళే లెక్కలతో సహా చెబుతున్నారు. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఈసారి ఆన్‌లైన్ సేల్స్ ఏకంగా 20 రెట్లు పెరిగాయి.

పండుగకు ‘ఆఫర్’ల సంత
ఈ లాజిక్‌లకు తగ్గట్లు పండుగ సీజన్‌లు వస్తే స్టోర్స్‌లోనే కాదు... ఆన్‌లైన్ నిండా ఆఫర్ల వెల్లువే! ఓనమ్, వినాయక చవితితో మొదలుపెట్టి దసరాకు ఇది బాగా ఊపందుకుంటుంది. దీపావళి మీదుగా క్రిస్టమస్ దాకా ఈ పండుగ సేల్స్ సాగుతాయి. తాజాగా ఈ దీపావళికి ఆన్‌లైన్‌లో ధరల్లో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, అదనపు భారం లేని ‘ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్’ (ఇ.ఎం.ఐ)లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు - ఇలా బోలెడు ఆకర్షణలు. ధరల్లో డిస్కౌంటే సగటున 40 నుంచి 50 శాతం పైనే ఉంది.

అందుకే, అప్పటి దాకా కొనకుండా ఆగినవాళ్ళు కూడా ఆన్‌లైన్‌లో కావాల్సినవి బుక్ చేసేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లకైతే ఆన్‌లైన్ సైట్లే పెద్ద అమ్మకాల వేదిక. మీకు తెలుసా? జియామీ, మోటరోలా, శామ్‌సంగ్ లాంటి మంచి బ్రాండ్ మొబైల్స్ ఉన్న ‘ఫ్లిప్‌కార్ట్’ ఈ దీపావళి సేల్‌లో మొదటి రోజే 8 లక్షల ఫోన్లు అమ్మేసింది. లెక్కగా చెప్పాలంటే, ఆ అమ్మకాల విలువ దాదాపు రూ. 70 కోట్లట!

 విచిత్రం ఏమిటంటే, ఈ ఆన్‌లైన్ కొనుగోళ్ళ కోసం ఎక్కువమంది వాడుతున్నది కూడా మళ్ళీ  మొబైల్ ఫోన్లు, వాటిలోని యాప్‌లే! కంప్యూటర్‌లో నెట్ ఓపెన్ చేసే కన్నా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోనే ఆన్‌లైన్ డీల్స్ చూసుకొని, ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఆసియా - పసిఫిక్ ప్రాంతం, అందులోనూ మన లాంటి దేశాలు అందులో ముందున్నాయి. మొన్న దసరాల్లో అధిక శాతం మంది (దాదాపు 74 శాతం) ‘ఫ్లిప్‌కార్ట్’ ఇ-కామర్స్ మొబైల్ యాప్ వాడారని ఒక సర్వే తేల్చింది. ఆ తరువాతి స్థానాల్లో అమెజాన్, శ్నాప్‌డీల్ నిలిచాయి. తాజా ఫెస్టివల్ సీజన్‌లో ఏకంగా 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల మేర ఆన్‌లైన్ సేల్స్ జరుగుతాయని అంచనా. నేరుగా రిటైల్ షాపుల్లో జరిగే బిజినెస్ మాత్రం 10 నుంచి 15 వేల కోట్లే ఉంటుందట!

ఇప్పుడంతా... ‘ఇ’ షాపింగే!
హైదరాబాద్‌లో ఊరికి కాస్తంత దూరంగా విశాలమైన విల్లాలో ఉంటున్న ప్రియదర్శినికి కూడా ఇప్పుడు షాపింగ్ అంటే, ‘ఇ-షాపింగే’! లేటెస్ట్ ఐ-7 ఫోన్‌లో నెట్ చూస్తున్నప్పుడు ఆమె తరచూ చూసేది ‘మింత్రా’ వెబ్‌సైట్. దానికి కారణం లేకపోలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలనుకొనే ఈ నడి వయసు మహిళ ఎప్పుడూ రకరకాల దుస్తులు, ఫ్యాషన్ గేర్ కొంటూనే ఉంటారు. అందుకే, ఫ్యాషన్ దుస్తులు, ఆభరణాలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ‘మింత్రా’ ఆమెకు ఆత్మీయ నేస్తం. ప్రతి నెలా ఆ సైట్ ద్వారా ఆమె వేలల్లో కొనుగోలు చేస్తారన్నదానికి ఆమె విల్లాలో వార్డ్‌రోబ్‌లోని దుస్తులు, ఆభరణాలే సాక్ష్యం.

‘ఊరవతలి విల్లా నుంచి కాలు కదపాల్సిన అవసరమే లేకుండా, ట్రాఫిక్‌లో కారు ప్రయాణం బాదరబందీ లేకుండా హాయిగా ఇంట్లో కూర్చొనే షాపింగ్ చేసే వసతి ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటే తప్పేంటి? తెలివైన పనేగా’ అన్నది ప్రియదర్శిని లాజిక్. 

నెట్టు... ఆన్‌లైన్ కిరాణా కొట్టు!
ఛలోక్తిగా చెప్పినా ఇందులో ఓ నిజం ఉంది. ఇప్పుడు జనం దృష్టి అంతా ఇంటర్‌నెట్టులోని ఆన్‌లైన్ సేల్స్ మీదే! ఆషాఢం, దసరా, దీపావళి లాంటి పండుగ సీజన్‌లు వస్తే ఒకప్పుడు దుకాణాల్లో డిస్కౌంట్ సేల్స్ పాపులర్. కానీ, ఇప్పుడు వాటన్నిటినీ పక్కకు నెట్టేస్తున్న ఆన్‌లైన్ ‘ఫెస్టివ్ ఆఫర్’లదే హవా! మొబైల్ ఫోన్‌ల నుంచి మంచి ఎల్.ఇ.డి. టీవీల దాకా అన్నిటికీ కేరాఫ్ అడ్రస్ - ఆన్‌లైనే! నెట్‌లో ‘ఫ్లిప్‌కార్ట్’ లాంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా వస్తువులు కొనేవాళ్ళ సంఖ్య ఇప్పుడు రోజు రోజుకీ ఎక్కువవుతోంది. బయట దుకాణంలో కన్నా తక్కువ రేటుకే కొనుక్కొని లాభపడుతున్నవాళ్ళూ ఉన్నారు. ఈ రకం వెబ్‌సైట్స్‌తో వీర కొనుగోళ్ళ వ్యసనానికి లోనై, సాలెగూటిలో చిక్కుకుంటున్నవాళ్ళూ ఉన్నారు. వెరసి, ఏ టైమ్‌లోనైనా, ఎక్కడ నుంచైనా కావాల్సినవి కొనుక్కొనేందుకు వీలు కల్పిస్తున్న ‘ఇ- కామర్స్’ వెబ్‌సైట్లు మాత్రం ఇప్పుడు ఊరూవాడా పెద్ద హిట్!

చిన్న పట్నాలు... పెద్ద గిడ్డంగులు
మొత్తం మీద, ఆన్‌లైన్‌లో రిటైల్ అమ్మకాలు జరిపే ఈ ‘ఇ-కామర్స్’ వెబ్‌సైట్లకు ఇప్పుడు మన దేశం ఒక అతి పెద్ద మార్కెట్. ఇక్కడి అతి పెద్ద ‘ఇ-కామర్స్’ కంపెనీ ‘ఫ్లిప్‌కార్ట్’కి దేశం మొత్తం మీద 18 భారీ గిడ్డంగులున్నాయి. సింగపూర్ కేంద్రంగా నడిచే ఆ సంస్థ ఈ దసరా, దీపావళి పండుగల్లో జనం కొనుగోళ్ళ రద్దీని తట్టుకొనేందుకు గత నెలలోనే ఉత్తర ప్రదేశ్‌లో రెండో వేర్‌హౌస్ తెరిచింది. ఇక, అమెరికా వాళ్ళదైన ‘అమెజాన్ ఇండియా’ మన దేశంలో రెండో అతి పెద్ద సంస్థ.

సుమారు 25 లక్షల చదరపుటడుగుల జాగాలో కేంద్రాలైతేనేం, గిడ్డంగులైతేనేం మొత్తం 27 నడుపుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న గిరాకీకి తగ్గట్లుగా ఈ ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు తమ గిడ్డంగుల సామర్థ్యం పెంచుకుంటున్నాయి. చిన్న చిన్న పట్నాల్లో కొత్త గిడ్డంగుల కోసం జాగా తీసుకుంటున్నాయి. హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణేల్లో మరింత జాగా కోసం చూస్తున్నాయి. ఢిల్లీ నుంచి నడిచే ‘శ్నాప్‌డీల్’ సంస్థ కూడా రెక్కలు చాస్తోంది. వెరసి, మరో నాలుగేళ్ళలో 2020 నాటి కల్లా ఈ ఆన్‌లైన్ రిటైల్ సంస్థల గిడ్డంగుల వైశాల్యం ఇప్పుడున్న దానికి రెట్టింపు (దాదాపు 2 కోట్ల 9 లక్షల చదరపుటడుగులు) అవుతుందని పరిశ్రమ వర్గాల అంచనా.

ఇది వేల కోట్ల పండుగ!
కొద్ది రోజులుగా పేరున్న ఇంగ్లీషు, తెలుగు పేపర్లలో రోజూ వస్తున్న ఫుల్ పేజ్ అడ్వర్‌టైజ్‌మెంట్లు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శ్నాప్‌డీల్... ఇలా రకరకాల ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారసంస్థల దీపావళి ధమాకా ఆఫర్లు ముంచెత్తుతున్నాయి. ఇప్పుడు ‘ఇ-కామర్స్’, ఈ పండగ సేల్ ఎంత పెద్దవంటే...

 మన దేశంలో జరిగే మొత్తం రిటైల్ వ్యాపారంలో ప్రతి 100 రూపాయల్లో 5 రూపాయలు ఆన్‌లైన్ ‘ఇ-కామర్స్’దే!  చైనాలో ‘ఇ-కామర్స్’ మార్కెట్ దాదాపు 40 వేల నుంచి 50 వేల కోట్ల డాలర్లు.  మనదేశంలో ‘ఇ-కామర్స్’ మార్కెట్ (ట్రావెల్ మినహా) దాదాపు 1000 కోట్ల డాలర్లు. అంటే సుమారు రూ. 70 వేల కోట్లు.  2014 నుంచి ఏటా మన దేశంలో ఇలా పండుగలకి ఆన్‌లైన్ ఫెస్టివ్ సేల్స్ ఆఫర్లు ఊపందుకున్నాయి. మొదట ‘ఫ్లిప్‌కార్ట్’ శ్రీకారం చుట్టింది. ఆ వెంటనే ‘అమెజాన్’ కూడా వరుస కట్టింది. ఈసారి కనీసం అయిదు అగ్రశ్రేణి ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు పండగ చేస్తున్నాయి.  ఈ సంస్థలు 80కి పైగా విభాగాల్లో ఉత్పత్తులు అమ్ముతున్నాయి.

ధరల్లో భారీ డిస్కౌంట్లు, వడ్డీ లేని ఇ.ఎం.ఐ.లు, క్యాష్‌బ్యాక్ వసతుల లాంటివి కొనుగోలుదార్లను రా... రమ్మని ఆకర్షిస్తున్నాయి.  ఈ ఆన్‌లైన్ సంస్థల వార్షిక అమ్మకాల్లో దాదాపు 30 నుంచి 35 శాతం ఈ అక్టోబర్ సీజన్‌లో, భారీ డిస్కౌంట్ ఇచ్చే రోజుల్లోనే జరుగుతాయని ఓ లెక్క.  ఆన్‌లైన్‌లో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మొబైల్ ఫోన్లకు గిరాకీ ఎక్కువ. ఈసారి దుస్తులు, షూస్‌కి కూడా డిమాండ్ బాగుంది. ఫర్నిచర్ లాంటి హోమ్ ప్రొడక్ట్స్‌కి సరే సరి!  గత రెండేళ్ళుగా బయట షాపుల్లో జరిగే రిటైల్ బిజినెస్ మార్కెట్ వాటాను ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్లు తినేస్తున్నాయి.
  
అవసరం కాదు... ‘ఆఫర్’ ఉందంతే!

కానీ, ఈ ‘ఇ-కామర్స్’ వెబ్‌సైట్స్ వల్ల కొన్ని లాభాలతో పాటూ కొన్ని నష్టాలూ తప్పడం లేదు. మూడు పదుల వయసున్న ఎస్. ఈశ్వరరావు మంచి పనిమంతుడు. పాతికేళ్ళకే హైదరాబాద్‌లో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు, అమ్మానాన్న... అంతే! ఆఫీసులో పని వల్ల ఎప్పుడూ కంప్యూటర్‌లో ఇంటర్‌నెట్ అందుబాటులో ఉండే ఈ యువకుడికి మూడేళ్ళ క్రితం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పరిచయమయ్యాయి. కావాల్సినవి నెట్‌లో ఆర్డర్ చేయడానికి సుఖం, సులభంగా అనిపించాయి. ఈ సైట్స్ పరిచయం ఆ తరువాత అలవాటుగా మారింది. ఇప్పుడు ఓ వ్యసనంగా తయారైంది. ఆఫీసుకు వస్తూనే ఈ ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారసైట్స్ ఓపెన్ చేయడం, ఎంత ఆఫీసు పనిలో ఉన్నా సరే, మధ్యలో ఆ సైట్స్‌లో కొత్త ఆఫర్లు చూసుకోవడం అతనికి పెద్ద బలహీనతగా మారింది.

జేబుకు చిల్లు... క్యాష్‌లెస్ కొనుగోలు!
చేతితో డబ్బు లెక్కపెట్టి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లోనే డెబిట్, క్రెడిట్‌కార్డ్‌లతో కొనుగోళ్ళ వల్ల, కొనేవాడికి నొప్పి తెలియడం లేదు. దాంతో, కొనుగోళ్ళు పెరుగుతున్నాయి. ఈ క్యాష్‌లెస్ ఆన్‌లైన్ పేమెంట్ల పుణ్యమా అని వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా జనం 10 లక్షల కోట్ల డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ. 70 లక్షల కోట్ల) మేర మొత్తాన్ని అదనంగా ఖర్చు చేస్తారని ‘నీల్సెన్’ తదితర సంస్థల అంచనా.

అతిగా కొనకండి!
ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ల లెక్కల ప్రకారం ఈ అక్టోబర్ మొదటి వారంలోనే మన భారతీయులు దాదాపు రూ. 10 వేల కోట్ల విలువైన వస్తువులు కొన్నారు. అతిగా షాపింగ్ చేయడం ఇప్పుడు దేశమంతటా మనల్ని పట్టిపీడిస్తున్న జాడ్యం. దీన్ని వదిలించుకోవాలంటే...

అవసరం ఉన్న వస్తువులే కొనాలి. భారీ డిస్కౌంట్ ఉంది కదా అని, అవసరం ఉన్నా లేకపోయినా కనిపించిన ప్రతీదీ కొనేయకండి. 

నవ తరం యువతీ యువకులు ఇవాళ తాము చేసే ప్రతి అనవసర షాపింగ్‌తో, రేపు ఇల్లు, వాహనం లాంటి అవసరమయ్యే దీర్ఘకాలిక లక్ష్యాలకు దూరమవుతామని గ్రహించాలి.

{Mెడిట్ కార్డుల లాంటివి ఎక్కువగా వాడకండి. వీలైనంత వరకు డబ్బులు పెట్టి, షాపింగ్ చేయండి. అప్పుడు ప్రతీదీ కొనాలనే వెంపర్లాటకు కళ్ళెం పడుతుంది.

{పతి నెలా జీతం రాగానే రికరింగ్ డిపాజిట్‌లు, మ్యూచువల్ ఫండ్లలో ముందే మదుపు చేసేయండి. మదుపు చేయగా, మిగిలిన సొమ్ముతోనే ఇల్లు నడిపించండి. అప్పుడిక అతి షాపింగ్‌కు అవకాశమే ఉండదు.

ఏదైనా కొనాలనిపించగానే ఓ నెల రోజుల పాటు వాయిదా వేయండి. ఆ టైమ్‌లో ఆ వస్తువు నిజంగా అవసరమా అని ఆలోచించండి. తప్పనిసరి అనుకుంటే అప్పుడు కొనండి. గ్యాడ్జెట్లు, దుస్తులు, షూస్, ఆభరణాల లాంటి వాటి విషయంలో ఆకర్షణను ఆపుకోవడానికి ఇది అద్భుత మంత్రం.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి షాపింగ్‌ను మార్గంగా పెట్టుకోకండి. దాని కన్నా తోటి మనుషులతో మాట్లాడడమే బెటర్.

అప్పటికప్పుడు జేబులో నుంచి డబ్బులు తీసి కట్టాల్సిన అవసరం లేకపోవడం, కాలు కదపకుండా ఏ వస్తువైనా ఇంటికే వచ్చే సౌకర్యం ఉండడంతో ఈశ్వర్ లాంటి చాలామంది ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి సైట్స్‌కు తెలియకుండానే బానిసలు అవుతున్నారు. అవసరంతో సంబంధం లేకుండా తగ్గింపు ‘ఆఫర్’ ఉంది కదా అని, ఎడాపెడా నెట్‌లో రకరకాల వస్తువులు కొనేస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల్ని అవసరానికి మించి అతిగా వాడుతున్నారు. అందుకే, ఈ వీక్‌నెస్ నుంచి బయటపడకపోతే, ఆన్‌లైన్ సైట్లు బాగుపడ్డా, ఆర్థికంగా దెబ్బతినడం మన వంతు అవుతుంది. పెపైచ్చు, రానున్న అయిదేళ్ళలో దేశంలో ఇంటర్నెట్ యూజర్లు మరింత పెరగనున్నారు. వాళ్ళలో ఆడవాళ్ళు 29 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి ఎగబాకనున్నారు. అంటే, ఆన్‌లైన్ షాపింగ్ ఇంకా ఇంకా పెరగడం తథ్యం. మరి, జాగ్రత్తగా ఉండాలంటున్నది అందుకే!  - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement