సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలకు భారీ షాక్ తగిలింది. నాణ్యతా ప్రమాణాలు విస్మరించి, బొమ్మల విక్రయాలపై రెగ్యులేటరీ కొరడా ఝళిపించింది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) క్వాలిటీ మార్క్ లేని బొమ్మలను విక్రయించి నందుకు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లకు నోటీసులు జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని బొమ్మలను అక్రమంగా విక్రయిస్తున్న మూడు ఇ-కామర్స్ సంస్థలకు ఈ మేరకు నోటీసులిచ్చామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ నిధి ఖరే ఒక ప్రకటన జారీ చేశారు.
బీఐఎస్ ప్రమాణానికి అనుగుణంగా లేని బొమ్మల విక్రయాలపై ఫిర్యాదులు నేపథ్యంలో దేశంలో పలు దుకాణాల్లో దాడులు నిర్వహించామని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. 44 చోట్ల గత నెలలో నిర్వహించిన దాడుల్లో ప్రధాన రిటైల్ దుకాణాల నుండి 18,600 బొమ్మలను స్వాధీనం చేసు కున్నామని వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్‌లో ఉన్న హామ్లీస్, ఆర్చీస్, డబ్ల్యూహెచ్ స్మిత్, కిడ్స్ జోన్ , కోకోకార్ట్‌తో సహా రిటైల్ దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బీఐఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తివారీ తెలిపారు.
కాగా 2021, జనవరి నుంచి బీఐఎస్ నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టాయ్‌మేకర్స్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. నాసిరకం వస్తువులు విక్రయించినందుకుగానూ గతంలో ఈకామర్స్ సంస్థలకు సీసీపీఏ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment