600మంది స్నాప్డీల్ ఉద్యోగులపై వేటు?
ప్రముఖ ఆన్‌లైన్ విక్రయ సంస్థ స్నాప్‌డీల్ మరో వివాదంలో ఇరుక్కుంది. దాదాపు 600మంది ఉద్యోగులపై వేటు వేసిందనే వార్త.. సోషల్ మీడియాలో భగ్గుమంది. మరో 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు గుప్పుమన్నాయి. పూర్ పెర్ ఫార్మెన్స్ కారణంగా స్నాప్‌డీల్ మరికొంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులను జారీ చేసిందన్న వార్తలు హల్చల్ చేశాయి.
మరోవైపు కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు గుర్గావ్ లోని సంస్థ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది. ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే దానిపై స్పష్టత రానప్పటికీ ...ఇటీవలి కంపెనీ నష్టాల ప్రభావం సిబ్బందిపై భారీగా పడనుందనే ఆందోళన చెలరేగింది.
అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై స్నాప్ డీల్ స్పందించింది. పనితనంలో మెరుగుదల కోసం శిక్షణా కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించింది. మరి కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారని పేర్కొంది. కాగా అప్పట్లో అమీర్ ఖాన్ వ్యాఖ్యల అనంతరం నెటిజన్లు ఆయన ప్రచారం చేస్తున్న స్నాప్ డీల్ బహిష్కరించాలనే ప్రచారం లేవనెత్తింది. దీంతో సంస్థ భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కొనసాగితే మరింత నష్టం తప్పదనే భావనతో అమీర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించిన సంగతి తెలిసిందే.