హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తమ కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం, టెక్నాలజీపరంగా మరిన్ని ఆవిష్కరణలు చేయడం, లాజిస్టింక్స్ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. దీనికోసం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ తెలిపింది. కొత్తగా ఈక్విటీల జారీ, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో పబ్లిక్ ఇష్యూ ఉంటుందని పేర్కొంది. సాఫ్ట్‌బ్యాంక్, బ్లాక్‌రాక్, టెమాసెక్, ఈబే తదితర సంస్థలు స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్ చేశాయి. మొత్తం 71 షేర్‌హోల్డర్లలో 8 మంది మాత్రమే స్వల్ప వాటాలను విక్రయించనున్నట్లు సంస్థ వివరించింది. సంయుక్తంగా 20.28 శాతం వాటా ఉన్న కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బెహల్, రోహిత్ కుమార్ బన్సల్ తమ వాటాలను ఐపీవోలో విక్రయించడం లేదని స్నాప్‌డీల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment