సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఆరోపణలపై హైదరాబాద్‌లో కేసులు నమోదు కావడంతో స్నాప్‌డీల్ సంస్థ దిగివచ్చింది. తమ వెబ్‌సైట్‌లో ఉన్న ఆయా ఆయుధాల మెనూను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని నగర పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలసి స్నాప్‌డీల్ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. స్నాప్‌డీల్ చేస్తున్న ఆయుధ వ్యాపారాన్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత వారం గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాల కంటే ఎక్కువ వెడల్పుతో కూడిన ఆయుధాలు సరైన అనుమతులు లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరం. ఖరీదు చేసినందుకు సిటీకి చెందిన పలువురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు విక్రయించిన ఆరోపణలపై స్నాప్‌డీల్‌కు నోటీసులు జారీ చేశారు.
పునరావృతం కాకుండా చూస్తాం..
దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను కలసి ఆ సంస్థ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. తాము నేరుగా ఎలాంటి ఉత్పత్తుల విక్రయాలు చేయమని, అటు విక్రేతలు.. ఇటు కొనుగోలుదారులకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే పని చేస్తామని వివరణ ఇచ్చింది. ఈ ఆయుధాలను గుజరాత్‌కు చెందిన సంస్థ తమ సైట్ ద్వారా విక్రయిస్తోందని పేర్కొంది. అయితే క్రయవిక్రయాలకు ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరించిన నేపథ్యంలో స్నాప్‌డీల్‌కు విక్రేత కొంత మేరకు కమీషన్ చెల్లిస్తాడు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం బాధ్యులవుతారని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తమ వెబ్‌సైట్ నుంచి పరిమితికి మించిన పొడవు, వెడల్పులతో ఉన్న ఆయుధాల మెనూను తొలగించామని, విక్రయాలు ఆపేశామని స్పష్టం చేశారు. దీంతో గుజరాత్ సంస్థకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీసులు.. స్నాప్‌డీల్‌పై చర్యలకు సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు.
ఇతర వెబ్‌సైట్లలోనూ...
స్నాప్‌డీల్‌లోనే కాదు.. ఏ ఈ–కామర్స్ సైట్లలో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయని పోలీసులు గుర్తించారు. రూ.వెయ్యి నుంచి రూ.8 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయించేస్తున్నారని ఆధారాలు సేకరించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయా వెబ్‌సైట్లకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కత్తులు అందుబాటులోకి రావడంతో అనేక మంది అవసరం ఉన్నా లేకున్నా, చట్ట విరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment