
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. ‘బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించిందనేది తాజా నిబంధనల ద్వారా వెల్లడైంది‘ అని షాప్‌క్లూస్ సీఈవో సంజయ్ సేథి చెప్పారు.
విక్రేతలందరూ ఈ–కామర్స్ ప్రయోజనాలు పొందేందుకు తాజా మార్పులు దోహదపడగలవని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ‘పెద్ద సంస్థలతో సమానంగా చిన్న సంస్థలు కూడా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తాజా నిబంధనలు ఉపయోగపడతాయి. లఘు వ్యాపార సంస్థలు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలు అందుకోవచ్చు‘ అని ఇన్‌స్టామోజో సీఈవో సంపద్ స్వైన్ తెలిపారు. ఇకపై ఈ–కామర్స్ సంస్థలు భారత్‌లో తమ వ్యాపార వ్యూహాలను సవరించుకోవాల్సి వస్తుందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ (పాలసీ అడ్వైజరీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్) రాజీవ్ చుగ్ అభిప్రాయపడ్డారు.
చర్చించి ఉండాల్సింది: ఫ్లిప్‌కార్ట్
మరోవైపు, పరిశ్రమ వృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే నిబంధనలను రూపొందించేటప్పుడు.. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సమాలోచనలు జరపడం ముఖ్యమని ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ–కామర్స్ వ్యవస్థతో చిన్న సంస్థలకు తోడ్పాటు లభిస్తుండటంతో పాటు వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, దేశ ఎకానమీకి ఈ పరిశ్రమ వృద్ధి చోదకంగా మారగలదని పేర్కొంది. ఇక, నిబంధనల సర్క్యులర్‌ను అధ్యయనం చేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.
నిబంధనలు కచ్చితంగా అమలవ్వాలి..
ఈ–కామర్స్ సైట్లలో అమ్మకాలకు సంబంధించిన కొత్త నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘మేం లేవనెత్తిన ప్రధాన అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై క్యాష్‌బ్యాక్ అమ్మకాలు, డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్ విక్రయాల్లాంటివి ఉండబోవు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే వీటిని కఠినంగా అమలు కూడా చేస్తుందని ఆశిస్తున్నాం‘ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు.
దిగ్గజాలకు సమస్యలు..
కొత్త నిబంధనలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలపైనే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. దాదాపు 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాలు కొన్న అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ లాంటి వాటికి ఈ నిబంధనలు సమస్యాత్మకమే. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్, వన్‌ప్లస్, బీపీఎల్ వంటి బ్రాండ్స్‌పై పడనుంది.