ShopClues
-
దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!
రెండు విజయవంతమైన యునికార్న్ స్టార్టప్‌లను సృష్టించిన ఏకైక టెక్ వ్యవస్థాపకుడు, సందీప్ అగర్వాల్. వ్యాపారవేత్తగా పాపులర్ అవుతున్న తరుణంలో ఎఫ్‌బీఐ అరెస్టు బాగా దెబ్బతీసింది. రూ. 8వేల కోట్ల సంస్థ పోయింది. చేయని నేరానికి జైలు శిక్ష, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు అయినా ఫీనిక్స్ పక్షిలా తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. రోలర్ కోస్టర్ లాంటి జీవితాన్నిఎదురీది ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా, ప్రస్తుతం రూ. 16400 కోట్ల కంపెనీ యజమానిగా తానేంటో నిరూపించుకున్న సందీప్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ.. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని జీవితంలో అనుకోని కుదుపు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. కుటుంబంతో కలిసి అమెరికాలో వెకేషన్లో ఉండగా, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సందీప్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసింది. అరెస్టు తర్వాత 8 వేల కోట్ల రూపాయల కంపెనీని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే తరుణంలో 17 ఏళ్ల వైవాహ జీవితానికి స్వస్తి పలుకుతూ 2018లో భార్య విడాకులు తీసుకుంది. అయినా ఎక్కడా ఆశను కోల్పోలేదు. కుటుంబానికి దూరంగా యూఎస్‌లో ఉండి, కేసుపై పోరాడవలసి వచ్చింది. కంపుకొట్టే టాయిలెట్ మధ్య జైలు జీవితాన్ని గడిపాడు. మరోవైపు రిమోట్‌గా కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ వాటాదారుల అభ్యంతరాలతో కంపెనీ సీఈవో పదవి నుంచి వైదొలిగి, తాను నిర్మించిన సంస్థ పగ్గాలను తన స్నేహితుడికి అప్పగించారు. 2019లో, షాప్‌క్లూస్‌ను మరో కంపెనీ సుమారు 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విచారణ, తీర్పు ఆలస్యం కారణంగా 2014లో ఇండియాకు రావడానికి అనుమతి లభించింది. చివరికి 2020లో యూఎస్ కోర్టు ద్వారా ఆర్థిక నేరాల కేసులో నిర్దోషిగా తేల్చింది. డ్రూమ్ టెక్నాలజీస్ ఏప్రిల్ 2014లో డ్రూమ్ టెక్నాలజీస్ అనే మరొక యునికార్న్ ఏర్పాటుచేశారు.అనేక ఇబ్బందుల మధ్య అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ ప్లాట్‌ఫారమ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 16 మిలియన్ డాలర్లు ,తరువాతి మూడు సంవత్సరాలలో, పలు దఫాలుగా 90 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చారు. ఏప్రిల్ 2021న భారతదేశంలో 55వ యునికార్న్‌గా అవతరించింది. కంపెనీ వాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు లేదా రూ.16400 కోట్లు. డ్రూమ్ తన జీవితంలో లేకుంటే తాను ఈ సంక్లిష్ట పరిస్థతులనుంచి తాను బయటపడేవాడిని కాదని ఒక సందర్భలో సందీప్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. కుటుంబానికి దూరంగా, జైలు శిక్షను ఎదుర్కొంటున్న తరుణంలో కంపెనీ తనకు ఊరటనిచ్చిందని చెప్పారు. తరువాత ఉపాసనను రెండో పెళ్లి చేసుకున్నారు. షాప్‌క్లూస్ ముందు సందీప్ అగర్వాల్ ఎంబీఏ పట్టా పొందిన తరువాత అమెరిలో రెండు వేర్వేరు కంపెనీలలో పనిచేశారు. ఆ తరువాత వాల్ స్ట్రీట్‌లో 14 ఏళ్లు ఎనలిస్టుగా పనిచేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ! మొదలైన కంపెనీలను కవర్ చేస్తూ ఎనిమిదేళ్లపాటు విశ్లేషకుడిగా పనిచేశాడు.టాప్ ర్యాంక్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పేరు సంపాదించారు.TiE సిలికాన్ వ్యాలీలో చార్టర్ సభ్యుడు కూడా. ఇంటర్నెట్ విశ్లేషకుడిగా 2010లో ఇండియాను సందర్శించిన సమయంలోఆన్లైన్ మార్కెట్ ప్రారంభించాలనే ఆలోచనకు పునాది పడింది. షాప్‌క్లూస్ ప్రారంభం డెలావేర్లో రాధికా ఘై అగర్వాల్ (సందీప్ అగర్వాల్ మాజీ భార్య),మృణాల్ ఛటర్జీ , సంజయ్ సేథితో కలిసి ఇ-మార్కెట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబరు 2011లో ఈ టీం దేశానికి వచ్చి శాశ్వతంగా గుర్గావ్లో స్థిరపడింది. షాప్‌క్లూస్ ప్రారంభంలో తన సోషల్ సర్కిల్స్ ద్వారా 1.95 మిలియన్ డాలర్లను సేకరించడం విశేషం. షాప్‌క్లూస్ పబ్లిక్ బీటా వెర్షన్ 26 జనవరి 2012న విడుదలచేయగా, ముగ్గురు లేదా నలుగురుగా ఉన్న టీంసంఖ్య 25 మంది సభ్యులకు పెరిగింది. నెలవారీ 20 లక్షలకు పైగా యూజర్లతో భారీ లాభాల్ని సాధించింది. ఈ దెబ్బకు అలెక్సా ర్యాంకింగ్ అదే సంవత్సరం ఆగస్టులో 14వేల నుండి 200కి పడిపోయింది. జనవరి 2013 నాటికి, షాప్‌క్లూస్ దేశంలో ఐదో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్‌గా మారింది. అలెక్సా ర్యాంకింగ్ ఏకంగా 90కి పడిపోయింది. 2013 జూలైలో అమెరికాలో ఎప్బీఐ ఈరెస్టు చేసింది. వాల్ స్ట్రీట్‌లో సీనియర్ ఇంటర్నెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు అతనిపై 'ఇన్సైడర్ ట్రేడింగ్' ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో చట్టపరమైన ఆరోపణలను నమోదు చేసేదాకా అదే జోరు కొనసాగింది. అప్పటికీ కంపెనీ నెలవారీగా 200-300శాతం వృద్ధిని సాధిస్తోంది. కరియర్లో సందీప్ అగర్వాల్ తొలి అడుగులు 1995లోముంబైలోని కోటక్ మహీంద్రాలో ఇంటర్న్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు సందీప్ అగర్వాల్. ఈ ఇంటర్న్‌షిప్ తన వ్యాపార కమ్యూనికేషన్‌తో పాటు తన విశ్లేషణాత్మక నైపుణ్యాలు,వ్యూహాత్మక ఆలోచనలఅభివృద్ధికి తోడ్పడిందని స్వయంగా సందీప్ అగర్వాల్ చెప్పారు. సందీప్ అగర్వాల్ చదువు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. వాషింగ్టన్ యూనివర్శిటీ సెయింట్ లూయిస్ ఓలిన్ బిజినెస్ స్కూల్ నుచి ఎంబీఏ చేసారు. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సందీప్‌కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం , గురుగ్రామ్‌లోని తన పెంట్‌హౌస్‌లో దాదాపు 1000 మొక్కలు ఉన్నాయి. తన కుమారులతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం. గోల్ఫ్ , స్క్వాష్ ఆడుతారు. తోటపని, ప్రయాణాలు, చదవడం, రాయడం లాంటి ఇష్టాలు తనకు మంచి ఊరట అంటారు సందీప్. ‘ఫాల్ ఎగైన్, రైజ్ ఎగైన్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. -
చిన్న సంస్థలూ పోటీ పడగలగుతాయి
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. ‘బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించిందనేది తాజా నిబంధనల ద్వారా వెల్లడైంది‘ అని షాప్‌క్లూస్ సీఈవో సంజయ్ సేథి చెప్పారు. విక్రేతలందరూ ఈ–కామర్స్ ప్రయోజనాలు పొందేందుకు తాజా మార్పులు దోహదపడగలవని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ‘పెద్ద సంస్థలతో సమానంగా చిన్న సంస్థలు కూడా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తాజా నిబంధనలు ఉపయోగపడతాయి. లఘు వ్యాపార సంస్థలు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలు అందుకోవచ్చు‘ అని ఇన్‌స్టామోజో సీఈవో సంపద్ స్వైన్ తెలిపారు. ఇకపై ఈ–కామర్స్ సంస్థలు భారత్‌లో తమ వ్యాపార వ్యూహాలను సవరించుకోవాల్సి వస్తుందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ (పాలసీ అడ్వైజరీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్) రాజీవ్ చుగ్ అభిప్రాయపడ్డారు. చర్చించి ఉండాల్సింది: ఫ్లిప్‌కార్ట్ మరోవైపు, పరిశ్రమ వృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే నిబంధనలను రూపొందించేటప్పుడు.. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సమాలోచనలు జరపడం ముఖ్యమని ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ–కామర్స్ వ్యవస్థతో చిన్న సంస్థలకు తోడ్పాటు లభిస్తుండటంతో పాటు వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, దేశ ఎకానమీకి ఈ పరిశ్రమ వృద్ధి చోదకంగా మారగలదని పేర్కొంది. ఇక, నిబంధనల సర్క్యులర్‌ను అధ్యయనం చేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. నిబంధనలు కచ్చితంగా అమలవ్వాలి.. ఈ–కామర్స్ సైట్లలో అమ్మకాలకు సంబంధించిన కొత్త నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘మేం లేవనెత్తిన ప్రధాన అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై క్యాష్‌బ్యాక్ అమ్మకాలు, డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్ విక్రయాల్లాంటివి ఉండబోవు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే వీటిని కఠినంగా అమలు కూడా చేస్తుందని ఆశిస్తున్నాం‘ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దిగ్గజాలకు సమస్యలు.. కొత్త నిబంధనలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలపైనే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. దాదాపు 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాలు కొన్న అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ లాంటి వాటికి ఈ నిబంధనలు సమస్యాత్మకమే. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్, వన్‌ప్లస్, బీపీఎల్ వంటి బ్రాండ్స్‌పై పడనుంది. -
నవకల్పనా శక్తి..
స్త్రీ ఇంటిని, పిల్లల్ని చక్కదిద్దుతుంది... బంధాలు నిలబెడుతుంది.. గృహిణిగా బాధ్యతలన్నీ నిర్వర్తిస్తుంది.. వీటన్నిటితో పాటు కార్యక్షేత్రంలో నిరంతరం ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొని ఏ పనినైనా విజయవంతంగా పూర్తిచేయగలదని నిరూపించిన మహిళా వ్యాపారవేత్తలు ఎందరో.. వీరిలో కొందరికి వ్యాపారం వారసత్వంగా లభిస్తే... మరికొందరు తమకున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని యువ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందూ జైన్ భారత్‌లో అతిపెద్ద మీడియా గ్రూప్ బెన్నెట్, కోలెమన్– కో లిమిటెడ్(టైమ్స్ ఆఫ్ ఇండియా) చైర్పర్సన్. సాహు జైన్ కుటుంబానికి చెందినవారు. ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, సంస్కృతి, సంప్రదాయాల మద్దతుదారు, విద్యావేత్త ఇలా భిన్న పార్శ్వాలు కలవారు. 2016లో పద్మ భూషణ్ అవార్డు పొందారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు, సంక్షేమ కార్యక్రమాల్లో యువతను భాగస్వాములు చేసేందుకు ఏర్పాటైన ‘ద వన్నెస్ ఫోరమ్’ కు మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఈ సంస్థకు ప్రఖ్యాత మహాత్మా– మహవీర అవార్డు లభించింది. ఇంద్ర నూయి భారత మహిళా వ్యాపారవేత్తల్లో ప్రముఖ స్థానం కలవారు. ప్రఖ్యాత శీతలపానీయం పెప్సీకో చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత రెండేళ్లలో కంపెనీకి 30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం అభించిందంటే అది ఆమె వ్యాపార చతురతకు నిదర్శనం. చెన్నైలో జన్మించిన ఇంద్ర యేల్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ మేనేజ్మెంట్, ఐఐఎమ్ కోల్కత్తా నుంచి ఫినాన్స్, మార్కెటింగ్ విద్యనభ్యసించారు. మోటరోలా, ఆసియా బ్రౌన్ బోవెరి, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. వ్యాపార రంగంలో ఆమె సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. వందనా లూత్రా నేడు యువతరానికి ఆరోగ్య స్పృహతో పాటు, సౌందర్య స్పృహ కూడా పెరిగింది. ఈ రెండింటినీ ఒకే గొడుగు కింద అందించే ఉద్దేశంతో వందన.. వీఎల్సీసీ బ్యూటీ అండ్ వెల్నెస్ కంపెనీని ప్రారంభించారు. కోల్‌కత్తాకు చెందిన వందన ఢిల్లీలో పాలిటెక్నిక్ పూర్తిచేసి, జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌లలో ఉన్నత విద్యనభ్యసించారు. గృహిణిగా ఇంటికే పరిమితమైన వందన, ఇద్దరు కూతుళ్ల ఆలనాపాలనా చూసుకుంటూనే 1989లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, నేడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్ సహకార సమాఖ్యలలోని సుమారు 11 దేశాలకు విస్తరించారు. 2013లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. 2015 ఫార్చూన్ ఇండియా ప్రచురించిన శక్తిమంతమైన భారతీయ మహిళా వ్యాపారవేత్తల్లో 33వ స్థానం దక్కించుకున్నారు. నైనాలాల్ కిద్వాయ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించిన మొదటి భార తీయ మహిళగా, భారత్‌లో అత్యంత విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్ హెచ్‌బీసీ ఇండియా గ్రూప్ జనరల్ మేనేజర్‌గా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్లోబల్ అడ్వైజర్‌గా, నెస్లే సౌత్ఏషియా నాన్ ఎక్స్క్యూటివ్ డైరెక్టర్‌గా, ప్రభుత్వరంగ సంస్థ ఎన్సీఏఈఆర్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఫిక్కీ అధ్యక్షురాలిగా పనిచేశారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో ఆమె కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రిచా కర్ ‘జివామీ’ ఆన్లైన్ స్టోర్ రూపకర్త. భారతదేశంలో లోదుస్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్న మొదటి స్టోర్ ఇది. స్టోర్ ద్వారా లోదుస్తుల వాడకం ఆవశ్యకత గురించి మహిళలకు అవగాహన కూడా కల్పిస్తోంది. జంషెడ్‌పూర్‌లో పెరిగిన రిచా బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి, ప్రఖ్యాత నార్సిమోంజీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అదితి గుప్త ‘ఆ ఐదు రోజుల్లో’ ఆమె వంటగదిలోకి , గుడిలోకి , చివరికి ఇంట్లో అడుగుపెట్టడానికి వీలులేదు. తమ శరీరంలోని ఈ మార్పులకు కారణాలేమిటో, రుతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనలేని బాలికలు నేటికీ ఉన్నారు. ఒక ఆడపిల్లగా తాను కూడా ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంది అదితి. రుతుస్రావం గురించి ఉన్న భయాలను, అపోహలను తొలగించేందుకు, ఆ విషయం పట్ల అవగాహన కల్పించేందుకు భర్త తుహిన్ పటే ల్లతో కలిసి హిందీలో కామిక్ పుస్తకం తీసుకువచ్చింది. దీని ద్వారా బాలికల్లో అవగాహన కల్పిస్తోంది. మెనుస్ట్రుపిడేషన్.కామ్ అనే వెబ్సైట్ కూడా నడుపుతోంది. రుతుస్రావ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య విధానాల గురించి సమాచారం పొందుపరుస్తోంది. శుభ్రా చద్దా భర్త వివేక్ ప్రభాకర్‌తో కలిసి ఆన్లైన్ దుస్తుల విక్రయ కంపెనీ ‘చుంబక్’ స్థాపించారు. హిందీలో చుంబక్ అంటే ఫ్రిజ్‌కు అతికి ఉండే అయస్కాంతం అని అర్థం. రెండేళ్ల కూతురికి తల్లిగా, కంపెనీ బాధ్యతలు నిర్వహించడంలో విజయవంతమయ్యారు. దేశవ్యాప్తంగా చుంబక్ 120కి పైగా స్టోర్లు కలిగి ఉంది. స్నేహా రైసోనీ ఐదేళ్లు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసిన స్నేహకు ఆ వత్తి తృప్తినివ్వలేదు. ఆ ఉద్యోగాన్ని వదిలి ‘టప్పూ దుకాణ్’ ప్రారంభించారు. ఇది ఒక గిఫ్ట్ షాప్. సీఏగా మంచి వేతనాన్ని వదులుకొని స్టోర్ ప్రారంభించినపుడు అందరూ ఆమె తప్పటడుగు వేస్తున్నారనుకున్నారు. కానీ టప్పూ దుకాణ్ సంవత్సరంలోపే లాభాల బాటపట్టడంతో ఆమె నిర్ణయం సరైందని రుజువైంది. సుచి ముఖర్జీ సోషల్ కామర్స్ సైట్ లైమ్‌రోడ్.కామ్(పట్టణ మహిళల కోసం ఉద్దేశించిన ) సీఈఓ. లేమన్ బ్రదర్స్ బ్యాంకులో ఐదేళ్లు, వర్జిన్ మీడియాలో రెండేళ్లపాటు డైరెక్టర్‌గా పనిచేశారు. ఈబే, స్కైప్, గమ్ట్రీలలో పనిచేసిన అనుభవం లైమ్‌రోడ్ ఆరంభానికి పునాది వేసింది. సురభీ దేవ్రా భారత్‌లో అతిపెద్ద ఆన్లైన్ కెరీర్ గైడ్‌గా పేరుపొందిన మేరాకెరీర్గైడ్.కామ్ రూపకర్త. ఈ వెబ్సైట్లో వివిధ విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ప్రారంభమైన రెండు నెలల్లోనే 50వేల మంది యూజర్లతో దూసుకుపోతోంది. ఈ సైట్ ఎంతో మంది విద్యార్థులు తమకిష్టమైన కెరీర్‌ని ఎన్నుకునేలా బాటలు వేస్తోంది. ఉపాసనా టాకూ జాక్‌పే, మొబిక్విక్ కంపెనీలకు సహ వ్యవస్థాపకురాలు. ఈ- కామర్స్ బిజినెస్‌లో చెల్లింపుల విధానంలో ఎదురవుతున్న అవాంతరాలను తొలగించేందుకు జాక్‌పే రూపొందించారు. మొబిక్విక్ అనేది మొబైల్ వాలెట్లాంటిది. ఈ యాప్ రీచార్జ్, బిల్ పేమెంట్లు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వలరీ వాగ్నర్ మార్కెటింగ్, అడ్వర్టైజ్ టెక్నిక్స్‌ను తెలిపే మొబైల్ ప్లాట్‌ఫాం ‘జిప్‌డయల్’ను స్థాపించారు. దీనిలో ఎన్రోల్ చేసుకున్నట్లయితే అడ్వర్టైజ్ కంపెనీలకు డైరెక్ట్‌గా ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఇది పూర్తి ఉచితం. జిప్‌డయల్ ద్వారా జిల్లెట్, నివియా, డిస్నీ వంటి 500 బ్రాండ్లకు సంబంధించిన యాడ్లు పోస్ట్‌చేయవచ్చు. రాధికా ఘయ్ అగర్వాల్ ప్రఖ్యాత షాప్‌క్లూస్. కామ్ సహ వ్యవస్థాపకురాలు. 2011లో సిలికాన్ వ్యాలీలో ఈ వెబ్సైట్ రూపొందించారు. ప్రస్తుతం భారత్‌లో అతిపెద్దదైన మార్కెట్‌ప్లేస్‌గా నిలిచింది. నెలకు దాదాపు 7 మిలియన్ల మంది ఈ సైట్‌ను వీక్షిస్తున్నారు. సబీనా చోప్రా ప్రఖ్యాత ట్రావెల్ పోర్టల్ యాత్రా.కామ్ వ్యవస్థాపకురాలు. ఇంతకుముందు యూరప్ ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ఈ-బుకర్స్ ఇండియా ఆపరేషన్స్ హెడ్‌గా, జపాన్ ఎయిర్‌లైన్స్ కంపెనీలో పనిచేశారు. దేశీయ రుచులను అందించే హోటల్ వ్యాపారంలో అడుగుపెట్టారు. దాదాపు పదిహేనేళ్ల అనుభవంతో యాత్రా.కామ్ రూపకల్పనకు శ్రీకారం చుట్టి ట్రావెల్, టూరిజమ్ గ్రూప్ రంగంలో విజేతగా నిలిచారు. 2010 భారత మహిళా నాయకురాలు అవార్డు కూడా పొందారు. నీరూ శర్మ ప్రముఖ ఈ- కామర్స్ పోర్టల్ ఇన్ఫీబీమ్.కామ్ సహ వ్యవస్థాపకురాలు. ఈ ఏడాది ప్రఖ్యాత డిజిటల్ మార్కెట్ కంపెనీ ఒడిగామాను 5 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. గతంలో నీరూ శర్మ అమెజాన్ యూఎస్ఏ మీడియా రీటైల్ రంగంలో పనిచేశారు. జాపోస్ వంటి వివిధ కంపెనీల విలీన ఒప్పందాల్లో(850 మిలియన్ డాలర్లు) వ్యూహాత్మక పాత్ర పోషించారు. హర్‌ప్రీత్ కౌర్ ఈ- కామర్స్ వెబ్సైట్ ‘లవ్ ఫర్ ఆపిల్’ సహ వ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ ప్రత్యేకంగా ఆపిల్ వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఆపిల్ కంపెనీకి సంబంధించిన అసలైన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో 2013లో ఏర్పాటు చేశారు. ఐఫోన్, ఐపాడ్ కవర్ల తయారీ కోసం ప్రత్యేకంగా తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ఔత్సాహిక కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. గుర్లిన్ కౌర్ పెట్టుబడిదారులకు ఆర్థిక సలహాలు అందించేందుకు ఉద్దేశించబడిన ‘హరీపత్తి’ కంపెనీ సీఈఓ. ఆంగ్ల భాషలో ఆమెకు గల ప్రావీణ్యం ఆర్థిక అంశాలను చక్కగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడింది. ఘజియాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీలో ఆర్థిక విద్యనభ్యసించారు. గతేడాది సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్‌గా మారారు. చిత్రా గుర్ననీ దాగా భర్త అభిషేక్ దాగాతో కలిసి భారత సాహస యాత్రా కంపెనీ ‘థ్రిలోఫిలా’ ను స్థాపించారు. యాత్రకు వెళ్లిన వారికోసం అనుభవమున్న, స్థానిక గైడ్లను అందుబాటులో ఉంచుతారు. ఉన్నత విద్యా కుటుంబాలకు చెందిన చిత్ర, అభిషేక్ కలలను సాకారం చేసుకునేందుకు తమకు అనుభవంలేని రంగంలో ప్రవేశించి విజయవంతంగా దూసుకుపోతున్నారు. అశ్వినీ అశోకన్ కృత్రిమ మేథను ఉపయోగించి స్మార్ట్ఫోన్లలోని కెమెరాల ద్వారా మనుషుల ముఖాలను, కవళికలను, హావభావాలను పసిగట్టే మెకానిజమ్ ఉపయోగించుకునేందుకు వీలుగా‘మ్యాడ్ స్ట్రీట్ దెన్’స్థాపించారు. ఆమె భర్త ఆనంద్ చంద్రశేఖరన్ సహవ్యవస్థాపకులుగా ఉన్నారు. గతంలో ఇంటెల్ కంపెనీ ఇంటరాక్షన్ , ఎక్స్పీరియన్స్ రీసర్చ్ ల్యాబ్‌లో పనిచేశారు. అంకిత గాబా సోషల్ మీడియా వ్యూహకర్తగా, వ్యాపారవేత్తగా, లెక్చరర్, కన్సల్టెంట్‌గా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. సోషల్సమోసా.కామ్ సహవ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ సోషల్ మీడియాకు సంబంధించిన ఆలోచనలు, పోకడలు, వార్తలు ఇలా అన్ని విషయాలకు చర్చా వేదికగా నిలుస్తోంది. గ్లోబల్ ‘టాప్ 100 సోషల్ మీడియా ఏజెన్సీస్ అండ్ కన్సల్టెంట్స్ 2012-13’జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. షహనాజ్ హుసేన్ ‘క్వీన్ ఆఫ్ హెర్బల్ బ్యూటీ కేర్’గా ప్రసిద్ధి పొందారు. 16వ ఏటనే వివాహం చేసుకున్నారు. సౌందర్యం, సౌందర్య సాధనాల పట్ల ఉన్న మక్కువ ఆమెను సాధారణ గృహిణి స్థాయి నుంచి ‘షహనాజ్ హెర్బల్ ఇన్కార్పోరేషన్’ కంపెనీని స్థాపించే స్థాయికి చేర్చింది. ఈ కంపెనీ జంతువులపై ఎటువంటి ప్రయోగాలు(విత్ అవుట్ ఎనిమల్ టెస్టింగ్) చేయకుండానే చర్మ సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో 400 ఫ్రాంఛైజీలను కలిగి ఉంది. 2006లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. సక్సెస్ మాగజీన్ 1996లో ‘వరల్డ్ గ్రేటెస్ట్ వుమన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు’ అందజేసింది. రవీనా రాజ్ కొహ్లి మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టీవీ రంగంలో మొదటి మహిళా సీఈఓగా గుర్తింపు పొందారు. సోనీ ఎంటర్టేన్మెంట్ టీవీ కంటెంట్, కమ్యూనికేషన్ హెడ్‌గా, స్టార్ న్యూస్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మీడియా టైకూన్ కెర్రీ పాకర్‌కు చెందిన ‘చానెల్ 9 (ఇండియా)’ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో డిప్లొమా చేశారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్, సాహిత్యం, సైకాలజీలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. మహిళా సాధికారత కోసం పాటుపడేందుకు ‘జాబ్కార్్ప కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. రష్మీ సిన్హా లక్నోలో జన్మించిన రష్మీ న్యూరో సైకాలజీలో పీహెచ్డీ చేశారు. భర్తతో కలిసి‘స్లైడ్‌షేర్’ అనే ఆన్లైన్ కంపెనీ ప్రారంభించారు. దీని ద్వారా ఆన్లైన్ ప్రజంటేషన్స్ ఇవ్వవచ్చు. అనతికాలంలోనే నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో సోషల్ మీడియా సైట్ లింక్డిన్ 100 మిలియన్ డాలర్లు వెచ్చించి 2012లో స్లైడ్షేర్ను కొనుగోలు చేసింది. ఫార్చూన్ అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో 8వ స్థానంలో నిలిచారు. ఫాస్ట్ కంపెనీ - 2వెబ్ ప్రపంచంలో అత్యంత ప్రభావంతమైన మహిళ’ల జాబితాలో టాప్-10లో స్థానం పొందారు. శ్రద్ధా శర్మ యువ వ్యాపారవేత్తలు, వారి స్టార్టప్ సంస్థల గురించి, వారి అనుభవాలు పొందుపరిచేందుకు ప్రత్యేకంగా ‘యువర్‌స్టోరీ’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి చీఫ్ ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, సీఎన్‌బీసీ టీవీ18లో పనిచేశారు. స్వాతి భార్గవ ‘క్యాష్‌కరో సైట్’ సహ వ్యవస్థాపకురాలు. ఈ సైట్లో ఎన్రోల్ చేసుకోవడం ద్వారా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఆనర్స్ పట్టా పొందారు. లండన్‌లోని ప్రఖ్యాత గోల్డ్‌మన్ సాచ్స్ కంపెనీలో నాలుగేళ్లు పనిచేశారు. ప్రస్తుతం క్యాష్‌కరో సీఈఓగా ఉన్నారు. సాక్షి తుల్సియన్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం ‘పోసిస్ట్’ సహ వ్యవస్థాపకురాలు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వివిధ రెస్టారెంట్లకు సంబంధించి టేబుల్స్, డెలివరీ, మెనూ కార్డు, ఖర్చు వివరాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలోని భారతి విద్యాపీఠ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సాక్షి పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. మెవిష్ ముస్తాక్, శ్రీనగర్ ప్రతిభకు కుల, మత, ప్రాంత భేదాలు అడ్డురావని ముస్తాక్ నిరూపించారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ తయారుచేసిన మొదటి కాశ్మీరీ మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ అప్లికేషన్లో యూజర్‌కు కావాల్సిన చిరునామా, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వానికి చెందిన విద్య, వైద్య, రవాణా , పోలీసు వ్యవస్థతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉంటుంది. కశ్మీరీ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. హేమలత అన్నమలై, కోయంబత్తూరు కేవలం పురుషులకే పరిమితమనుకున్న ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ(ఆంపియర్ ఎలక్ట్రిక్) స్థాపించి విజయం సాధించారు. ఈ- సైకిల్లు, ఈ- స్కూటర్లు, ఈ- ట్రాలీస్తో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ కోసం, వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు రూపొందిస్తున్నారు. సోబితా తమూలీ, తెలానా అస్సాంలోని తెలానా గ్రామానికి చెందిన సోబిత స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. అస్సాం సాంప్రదాయ టోపీ ‘జాపీస్’ మొదలుకొని సేంద్రీయ ఎరువు వరకు మధ్యవర్తులు లేకుండా తమ ఉత్పత్తులు నేరుగా మార్కెట్లో అమ్ముకునే విధానాన్ని రూపొందించారు. దీని ద్వారా అక్కడి మహిళలకు ఉపాధి ఉపాధి లభిస్తోంది. లక్ష్మీ మీనన్, ఎర్నాకులం పర్యావరణ హిత వస్తువులు తయారుచేసేందుకు 2012లో ‘ప్యూర్ లివింగ్’ కంపెనీ స్థాపించారు. ప్రింటింగ్ ప్రెస్‌లో కార్డుల తయారీ సమయంలో విడుదలయ్యే ఉప ఉత్పత్తుల ద్వారా పెన్నులు తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా వికలాంగ మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఛాయా నంజప్ప, మైసూరు ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత మహిళా వ్యాపారవేత్త సమాఖ్య అందజేసే ‘జాతీయ ఉత్తమ వ్యాపారవేత్త -2014 ’ అవార్డు పొందారు. గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘నెక్టార్ ఫ్రెష్ ’ కంపెనీ స్థాపించారు. దీని ద్వారా స్వచ్ఛమైన తేనెను యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తూ మైసూర్, మాండ్యా జిల్లాల్లోని నిరక్షరాస్య ప్రజలకు, గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నారు. సుమితా ఘోష్, బికనీర్ హస్తకళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘రంగసూత్ర’ అనే కంపెనీ స్థాపించారు. దీని ద్వారా 3000 మంది కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. 10 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన కంపెనీ నేడు ఫాబ్ ఇండియా, ఇకియా వంటి ప్రఖ్యాత సంస్థలకు ఉత్పత్తులను అమ్మే స్థాయికి ఎదిగింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌కు చెందిన 35 బృందాలు రంగసూత్ర కోసం పనిచేస్తున్నాయి. సుమిత ప్రోత్సాహంతో మధ్యప్రదేశ్‌లోని ఎందరో పారిశుద్ధ్య కార్మికులు హస్తకళల తయారీదారులుగా మారారు. నేహా అరోరా, ఢిల్లీ అంధుడైన తండ్రి, వీల్‌చెయిర్‌కే పరిమితమైన తల్లి. అందరు పిల్లల్లాగే సెలవుల్లో టూర్లకు వెళ్లాలని భావించిన నేహ కోరిక తీరలేదు. అందుకే తన తల్లిదండ్రుల్లాంటి దివ్యాంగులు కూడా వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు 2016లో ‘ప్లానెట్ ఏబుల్డ్ ’ అనే ట్రావెల్ కంపెనీ స్థాపించారు. దివ్యాంగుల సౌకర్యార్థం పోర్టబుల్ ర్యాంప్స్ అందుబాటులో ఉంటాయి. వివిధ ప్రదేశాలకు వెళ్లాలనే దివ్యాంగుల కలను నిజం చేస్తూ 17 రోజుల్లో 2 దేశాలు, 5 రాష్ట్రాలు, 13 నగరాల్లో పర్యటించింది ప్లానెట్ ఏబుల్డ్ బృందం. థోనాల్స్ చరోల్, లడఖ్ లడఖ్ ఎకోటూరిజమ్ను ప్రోత్సహిస్తూనే, మహిళలకు పర్వాతారోహణలో శిక్షణనిచ్చేందుకు 2009లో ‘లడఖీ వుమెన్స్ ట్రావెల్ కంపెనీ’ స్థాపించారు. లడఖ్‌లో మహిళా యజమాని, గైడ్లు, పోర్టర్లుగా మొత్తమంతా మహిళా సిబ్బంది(30 మంది) గల ఒకే ఒక ట్రావెల్ కంపెనీ ఇది. తమన్నా శర్మ, ఢిల్లీ ఈవెంట్, వ్యర్థ పదార్థాల నిర్వహణ కంపెనీ ‘ఎర్త్లింగ్ ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. ఈ కంపెనీ వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి మార్గదర్శకంగా నిలిచింది. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సంస్థలో పురుషుల సంఖ్యకు సమానంగా మహిళలను నియమిస్తున్నారు. పబీబెన్ రబరీ, కుకాద్సర్ గిరిజన జాతి ‘రబరీ’ వారసత్వాన్ని, హస్తకళల ఉనికిని కాపాడే బాధ్యత చేపట్టి కచ్ జిల్లా అంబాసిడర్‌గా పేరుపొందారు. రబరీ జాతికే పరిమితమైన ‘హరి జరీ-పబీ జరీ’ వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ రకాలను ‘పబీబెన్.కామ్’ వెబ్సైట్ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు. మహిళలు రూపొందించే హస్తకళలను అమ్మే వేదిక ఏర్పరచిన మొదటి మహిళగా పబీబెన్ నిలిచారు. సుమారు 60 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. పబీబెన్.కామ్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. రాశి చౌదరి ముంబైలో మొదటి ఆన్లైన్ గ్రోసరీ స్టోర్ ‘లోకల్‌బన్యా’ సహ వ్యవస్థాపకురాలు. ముంబై, థానె, నవీ ముంబైల నుంచి రోజుకి సగటున 600 ఆర్డర్లు అందుకుంటోంది. రేమండ్ లిమిటెడ్, రాశి పెరిఫెరల్స్లలో పనిచేసిన రాశి లోకల్‌బన్యా కోసం స్వయంగా క్షేత్ర స్థాయిలో కూడా పనిచేస్తున్నారు. - సుష్మారెడ్డి -
ఆన్లైన్ ‘పండుగ’..!
►ఈ–కామర్స్ కంపెనీల పోటాపోటీ ► 90 శాతం దాకా డిస్కౌంట్ సేల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్లైన్ ఫెస్టివల్ మొదలైంది. పండుగల సీజన్ కోసం ఈ–కామర్స్ కంపెనీలు డిస్కౌంట్లతో సవాల్ విసురుతున్నాయి. డేటా చార్జీలు దిగిరావడం, 4జీ స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. దీంతో కొత్త యూజర్లు తోడుకావడంతో ఆన్లైన్ షాపింగ్ ఈసారి జోరుమీద ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇంకేముంది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్‌తోపాటు పేటీఎం మాల్ సైతం ‘క్లిక్’ అయ్యే ఆఫర్లతో సిద్ధమయ్యాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ డెకోర్.. ఇలా వందలాది విభాగాల్లో కస్టమర్ల ముందుకు లక్షలాది ఉత్పత్తులను తీసుకొచ్చాయి. సులభ వాయిదాల్లో మొత్తాలను స్వీకరించేందుకు సై అంటున్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో ఆన్లైన్ వేదికగా సుమారు రూ.11,000 కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 2016లో దేశవ్యాప్తంగా పండుగల సీజన్‌కు ఈ–కామర్స్ కంపెనీలు రూ.6,500 కోట్ల వ్యాపారం చేశాయి. డీల్స్‌లో దేనికదే సాటి.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ నేటి నుంచే రంగంలోకి దిగుతోంది. 24వరకు ఉండే ఈ ఫెస్టివల్లో బిగ్ డీల్స్ ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఆసక్తికర అంశం ఏమంటే డబ్బులు వచ్చే ఏడాది చెల్లించొచ్చు అంటూ ఈ కంపెనీ కొత్త డీల్‌కు తెరలేపింది. దీని కింద హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు వాయిదా మొత్తాన్ని 2018 జనవరి నుంచి చెల్లించొచ్చు. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 24 వరకు విక్రయాలను జరుపనుంది. 90 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అలాగే సేల్‌లో భాగంగా కార్లు, హాలిడే ప్యాకేజెస్, టెలివిజన్ల వంటి బహుమతులతో విక్రేతలను ప్రోత్సహిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గోటేటి వెల్లడించారు. విక్రేతలు రెండు రెట్ల అమ్మకాల వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగామన్నారు. బై నౌ, పే లేటర్ అంటూ ఫ్లిప్‌కార్ట్ సైతం కస్టమర్లను ఊరిస్తోంది. ఇక వేలాది ఉత్పత్తులపై 15 నుంచి 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లతో గట్టిపోటీ ఇచ్చేందుకు పేటీఎం మాల్ ఇప్పటికే రంగంలోకి దిగింది. సెప్టెంబరు 23 వరకు ఉండే మేరా క్యాష్‌బ్యాక్ సేల్ కోసం రూ.501 కోట్లను కేటాయించింది. ప్రతి ఆర్డరుపై ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుందని పేటీఎం మాల్ సీవోవో అమిత్ సిన్హా వెల్లడించారు. ఈ నెల 25 వరకు అన్‌బాక్స్ దివాలీ సేల్కు స్నాప్‌డీల్ సమాయత్తమైంది. సెప్టెంబర్ 28 వరకు మహాభారత్ దివాలీ సేల్కు షాప్‌క్లూస్.కామ్ సిద్ధమైంది. స్మార్ట్ఫోన్లదే హవా.. ఆన్లైన్ కంపెనీలు ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులతో ప్రధానంగా స్మార్ట్ఫోన్లతో పోటీకి సై అంటున్నాయి. విలువ పరంగా ఈ–కామర్స్ వ్యాపారం లో స్మార్ట్ఫోన్ల వాటాయే అత్యధికంగా 55% దాకా ఉంది. 160 స్మార్ట్‌ఫోన్ మోడళ్లు, 100 ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నట్టు అమెజాన్ వెల్లడించింది. మొత్తంగా ఈ ఏడాది సీజన్లో ఈ–కామర్స్ వ్యాపారంలో 60 శాతం వృద్ధి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొబైల్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, కిచెన్, హోంకేర్ తదితర విభాగాల్లో అమ్మకాలు గణనీయంగా ఉండనున్నాయి. బిగ్ బిలియన్ డేస్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల్లో రెండుమూడు రెట్ల వృద్ధి ఆశిస్తోంది. సేల్‌లో 80% దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు షాప్‌క్లూస్ సహ వ్యవస్థాపకులు రాధిక అగర్వాల్ తెలిపారు. -
భారీ డిస్కౌంట్లతో మరోసారి ఫ్లిప్ కార్ట్ సేల్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. నేటి నుంచి(జూన్ 10) డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు షాప్ క్లూస్ కూడా సేల్ ఆఫర్స్ ను ప్రారంభించింది. ఫ్యాషన్ ఉత్పత్తులపై 9-డే ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ ప్రారంభిస్తుండగా... షాప్ క్లూస్, హోమ్ కిచెన్, ఎలక్ట్రిక్ యాక్ససరీస్, ఫ్యాషన్, సంబంధిత యాక్ససరీస్ పై వారం పాటు సేల్ ఆఫర్లు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల కొద్ది ఫ్యాషన్ లవర్స్ కోసం ఈ ఎక్స్ క్లూజివ్ సేల్ ను నిర్వహిస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ హెడ్ రిషి వాసుదేవ్ తెలిపారు. జూన్ 10 నుంచి మొదలై, తొమ్మిది రోజుల పాటు అంటే జూన్ 18 వరకు ఈ సేల్ నిర్వహిస్తామని చెప్పారు. దీనిలో 50 బ్రాండ్స్ పై 50-80 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ను కంపెనీ అందించనుంది. ఈ తొమ్మిది రోజుల విక్రయంలో భాగంగా ''ఏ 'బిడ్ అండ్ విన్' కంటెక్ట్స్ ను కూడా కస్టమర్లకు ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ఈ కంటెక్ట్స్ లో 13,995 రూపాయల విలువైన ఎంపోరియో అర్మానీ వాచ్ ను, 15,960 రూపాయల విలువైన విక్టోరినాక్స్ బ్యాగ్ ను అందించనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అదేవిధంగా షాప్ క్లూస్ నిర్వహిస్తున్న సేల్ పై కూడా ఆ కంపెనీ భారీ ఆశలే పెట్టుకుంది. గత నెలలో నిర్వహించిన సేల్ కంటే రెండింతలు లావాదేవీలను పెంచుకోవాలని షాప్ క్లూస్ చూస్తోంది. -
ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం లేదు: షాప్‌క్లూస్
బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్‌తో విలీన వార్తలను ఈ కామర్స్ సంస్థ షాప్‌క్లూస్ తోసిపుచ్చింది. విలీనం కోసం ఫ్లిప్‌కార్ట్‌తో చర్చలు జరుపుతున్నామన్న వార్తల్లో నిజం లేదని షాప్‌క్లూస్ సీఈఓ సంజయ్ సేథి చెప్పారు. విలీనం వల్ల మేలు జరగే అవకాశాలున్నాయని, అయితే వ్యాపారం వృద్ధిచెందుతుందనే గ్యారంటీ లేదని పేర్కొన్నారు. డబ్బే ప్రధానమని, వ్యాపారం నడవడమే ముఖ్యమని అనుకుంటే, టాటాలు బిర్లాలు ఎప్పుడో తమ తమ కంపెనీలను విలీనం చేసేవాళ్లని వ్యాఖ్యానించారు. టాటాలు, బిర్లాలు ఒకరితో ఒకరు పోటీపడుతూ వ్యాపారాన్ని సాగిస్తున్నారని వివరించారు. ఫ్లిప్కార్ట్లోనూ, తమ సంస్థలోనూ టైగర్ గ్లోబల్ సంస్థ పెట్టుబడులు పెట్టిందన్న ఒకే కారణంతో ఈ రెండు సంస్థల విలీనం జరగవచ్చంటూ వార్తలు రావడం సరికాదని పేర్కొన్నారు. -
సఖ్యతకు నోచుకోని ఈ-టైలర్స్..!
భారత్ లో రిటైలర్ సంస్థలకున్న సఖ్యత ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఉండట్లేదట. ఇష్టారీతిలో డిస్కౌంట్ ఆఫర్లు గుప్పిస్తూ భారీగా వ్యాపారాన్ని పెంచుకుంటున్న ఈ-టైలర్స్ కు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం ఏప్రిల్ లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ పోర్టల్ లో ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండొద్దని ఆదేశాలు జారీచేసింది. వివిధ రాష్ట్రాల పన్నులనూ ఈ-టైలర్స్ భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే వీటిపై పోరాటానికి ఈ-కామర్స్ దిగ్గజాలు ఐకమత్యం లేదని తెలుస్తోంది. ఆఫ్ లైన్ రిటైలర్లకు, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమైన పోరుకు మాత్రం ఈ-కామర్స్ దిగ్గజాలు ఒకే స్వరంలో ఉండటం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం ఈ-కామర్స్ వ్యాపారాలపై పడనుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-కామర్స్ పరిశ్రమ విశ్లేషకులే దీనిపై పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు మాత్రం దీనిపై స్పందించడం లేదు. ముఖ్యమైన అంశాలపై కంపెనీ, స్టాక్ హోల్డర్స్ అందరితో కలిసే పనిచేస్తుందని స్నాప్ డీల్ ఏదో నామమాత్రంగా సమాధానమిచ్చిందని తెలుస్తోంది. ఆఫ్ లైన్ స్టోర్లు, వారు నిర్ణయించుకున్న ధర కంటే ఇసుమంతైనా తక్కువ చేసి మంచినీళ్ల బాటిళ్లను సైతం విక్రయించవని, ఇదే ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లకున్న ప్రధాన తేడా అని ఈ-టైలర్ ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మార్కెట్ ప్లేస్ ప్రమోషన్ ను అనుమతివ్వాలని కోరుతూ ఈ కంపెనీలు అసలు కలిసికట్టుగా ప్రభుత్వంతో సంప్రదింపులే జరపడం లేదని తేలింది. ఇటీవలే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అమెరికా ఈ-టైలర్ దిగ్గజం అమెజాన్ స్పాన్సర్ చేసిన లేఖపై కూడా భారత ఈ-టైలర్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు సంతకం చేయలేదట. దీంతో లాబీ గ్రూప్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ డ్రాప్ట్ లెటర్ ను ప్రభుత్వానికి పంపలేదట. గుజరాత్ ప్రభుత్వ పన్నులకు కూడా వ్యతిరేకంగా ఈ సంస్థలన్ని వేరువేరుగానే కేసులు ఫైల్ చేశాయి. అయితే ఈ-టైలర్స్ కు పోటీగా సమైక్యంగా పోరాడుతూ.. మార్కెట్లో తమ స్థానాలను మెరుగుపర్చుకునేందుకు రిటైల్ సంస్థలు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ)ను ఏర్పరుచుకున్నాయి. ఈ అసోసియేషన్ బేస్ చేసుకుని ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లపై వ్యతిరేకంగా రెండు కేసులు కూడా నమోదుచేశాయట. ఈ మొత్తం ఈ-టైలర్ల వ్యవహారాన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ గా షాప్ క్లూస్.కామ్ సంస్థ సహా వ్యవస్థాపకుడు రాధిక అగర్వాల్ అభివర్ణించారు. -
వారికి పే టీఎం, షాప్ క్లూస్ మద్దతు
న్యూఢిల్లీ: క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆఫర్ లెటర్లు అందుకుని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు రెండు ఈ కామర్స్ సంస్థలు ముందుకు వచ్చాయి. గుజరాత్ బాధిత విద్యార్థులకు ఐఐఎం పేటీఎమ్, షాప్ క్లూస్ మద్దతు లభించింది. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ లెటర్స్ అందుకుని భంగపడి, ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఐఐఎం గ్రాడ్యుయేట్లకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు యోచిస్తున్నట్టు పేటిఎం ప్రకటించింది. వారికి ఉద్యోగాలిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అమిత్ సిన్హా తెలిపారు. ఈ మేరకు అహ్మదాబాద్ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. విద్యార్థుల ప్రొఫైల్స్ పంపమని అడిగామనీ, వాటిని పరిశీలించిన మీదట నైపుణ్యానికి తగ్గట్టుగా పోస్టింగ్స్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ప్లేస్మెంట్లలో పలు ఐఐఎంల నుంచి 50 మందిని విధుల్లోకి తీసుకున్నామని పేర్కొంది. అలాగే అహ్మదాబాద్ విద్యార్థులకూ తమ సంస్థలో అవకాశం ఇస్తామని ప్రకటించింది. ప్లేస్మెంట్ సెల్ నుంచి తమకు ఈమెయిల్స్ అందాయనీ, ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక చేస్తామన్నారు. రాబోయే రెండు వారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మరోవైపు బాధిత గ్రాడ్యుయేట్లు తమను వ్యక్తిగతంగా కలిశారని మరో ఈకామర్స్ సంస్థ షాప్ క్లూస్ తెలిపింది. తమకు ఇప్పటివరకు రెండు ఇమెయిల్స్ అందాయని షాప్ క్లూస్ సహ స్థాపకులు రాధిక అగర్వాల్ తెలిపారు. కాగా, తమ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై అహ్మదాబాద్ ఐఐఎం మేనేజ్ మెంట్ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ లను ఉద్దేశించి ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
‘ధారవి’ ఆన్‌లైన్‌కు షాప్‌క్లూస్ తోడు
హైదరాబాద్: ధారవి.. ప్రపంచంలోనే అతి పెద్ద మురికి వాడల్లో ఇదొకటి. ఇప్పుడు ముంబైలోని ఈ మురికివాడలోని కార్మికులను స్లమ్‌డాగ్ మిలియనీర్స్‌గా మార్చడానికి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ షాప్‌క్లూస్ డాట్‌కామ్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ధారవిమార్కెట్ డాట్‌కామ్‌తో ఈ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇక్కడి కార్మికులు తయారు చేసే లెదర్ బ్యాగ్‌లు, పాదరక్షలను ఆన్లైన్ ద్వారా మార్కెట్ చేస్తున్నామని షాప్‌క్లూస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాధిక అగర్వాల్ చెప్పారు. ఇతర ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌ల మాదిరిగా హై ఎండ్ ఎలక్ట్రిక్ వస్తువులు, హైఫై ఫ్యాషన్ వస్తువులు కాకుండా తమ సంస్థ సామాన్యులకు అవసరమయ్యే సాధారణ వస్తువులను ఆఫర్ చేస్తుందని తెలియజేశారు. కాగా 2014 మధ్యలో ఏర్పాటైన ధారవిమార్కెట్ డాట్‌కామ్ ఈ మురికివాడలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్లకు తోడ్పాటునందిస్తోంది. షాప్‌క్లూస్ ఒప్పందంతో ఇక్కడి కార్మికుల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా యాక్సెస్ లభిస్తుందని ధారవిమార్కెట్ డాట్‌కామ్ వ్యవస్థాపకురాలు మేఘ గుప్తా చెప్పారు.