నవకల్పనా శక్తి.. | inspiring women entrepreneurs | Sakshi
Sakshi News home page

నవకల్పనా శక్తి..

Published Mon, Feb 12 2018 1:02 AM | Last Updated on Tue, Feb 13 2018 2:22 PM

inspiring women entrepreneurs  - Sakshi

 స్త్రీ  ఇంటిని, పిల్లల్ని చక్కదిద్దుతుంది... బంధాలు నిలబెడుతుంది..  గృహిణిగా బాధ్యతలన్నీ నిర్వర్తిస్తుంది.. వీటన్నిటితో పాటు కార్యక్షేత్రంలో నిరంతరం ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొని ఏ పనినైనా విజయవంతంగా పూర్తిచేయగలదని నిరూపించిన మహిళా వ్యాపారవేత్తలు ఎందరో.. వీరిలో కొందరికి వ్యాపారం వారసత్వంగా లభిస్తే... మరికొందరు తమకున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని యువ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇందూ జైన్‌
భారత్‌లో అతిపెద్ద మీడియా గ్రూప్‌ బెన్నెట్, కోలెమన్‌– కో లిమిటెడ్‌(టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) చైర్‌పర్సన్‌. సాహు జైన్‌ కుటుంబానికి చెందినవారు.  ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, సంస్కృతి, సంప్రదాయాల మద్దతుదారు, విద్యావేత్త ఇలా భిన్న పార్శ్వాలు కలవారు. 2016లో పద్మ భూషణ్‌ అవార్డు పొందారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు, సంక్షేమ కార్యక్రమాల్లో యువతను భాగస్వాములు చేసేందుకు ఏర్పాటైన ‘ద వన్‌నెస్‌ ఫోరమ్‌’ కు మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఈ సంస్థకు ప్రఖ్యాత మహాత్మా– మహవీర అవార్డు లభించింది. 

ఇంద్ర నూయి
భారత మహిళా వ్యాపారవేత్తల్లో ప్రముఖ స్థానం కలవారు. ప్రఖ్యాత శీతలపానీయం పెప్సీకో చీఫ్‌ ఫినాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత రెండేళ్లలో కంపెనీకి 30 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందం అభించిందంటే అది ఆమె వ్యాపార చతురతకు నిదర్శనం. చెన్నైలో జన్మించిన ఇంద్ర యేల్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ మేనేజ్‌మెంట్, ఐఐఎమ్‌ కోల్‌కత్తా నుంచి ఫినాన్స్, మార్కెటింగ్‌ విద్యనభ్యసించారు. మోటరోలా, ఆసియా బ్రౌన్‌ బోవెరి, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. వ్యాపార రంగంలో ఆమె  సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. 

వందనా లూత్రా
నేడు యువతరానికి ఆరోగ్య స్పృహతో పాటు, సౌందర్య స్పృహ కూడా పెరిగింది.  ఈ రెండింటినీ ఒకే గొడుగు కింద అందించే ఉద్దేశంతో వందన..  వీఎల్‌సీసీ బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌ కంపెనీని ప్రారంభించారు. కోల్‌కత్తాకు చెందిన వందన ఢిల్లీలో పాలిటెక్నిక్‌ పూర్తిచేసి, జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌లలో ఉన్నత విద్యనభ్యసించారు. గృహిణిగా ఇంటికే పరిమితమైన వందన, ఇద్దరు కూతుళ్ల ఆలనాపాలనా చూసుకుంటూనే 1989లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి,  నేడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్‌ సహకార సమాఖ్యలలోని సుమారు 11 దేశాలకు విస్తరించారు. 2013లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. 2015 ఫార్చూన్‌ ఇండియా ప్రచురించిన శక్తిమంతమైన భారతీయ మహిళా వ్యాపారవేత్తల్లో 33వ స్థానం దక్కించుకున్నారు.  

నైనాలాల్‌ కిద్వాయ్‌
హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో విద్యనభ్యసించిన మొదటి భార తీయ మహిళగా, భారత్‌లో అత్యంత విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌ఎస్ హెచ్‌బీసీ ఇండియా గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌గా,   హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ గ్లోబల్‌ అడ్వైజర్‌గా, నెస్లే సౌత్‌ఏషియా నాన్‌ ఎక్స్‌క్యూటివ్‌ డైరెక్టర్‌గా, ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌సీఏఈఆర్‌ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఫిక్కీ అధ్యక్షురాలిగా పనిచేశారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో ఆమె కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

రిచా కర్‌
‘జివామీ’ ఆన్‌లైన్‌ స్టోర్‌ రూపకర్త.  భారతదేశంలో లోదుస్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న మొదటి స్టోర్‌ ఇది. స్టోర్‌ ద్వారా లోదుస్తుల వాడకం ఆవశ్యకత గురించి మహిళలకు అవగాహన కూడా కల్పిస్తోంది. జంషెడ్‌పూర్‌లో పెరిగిన రిచా బిట్స్‌ పిలానీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి, ప్రఖ్యాత నార్సిమోంజీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. 

అదితి గుప్త
‘ఆ ఐదు రోజుల్లో’ ఆమె వంటగదిలోకి , గుడిలోకి , చివరికి ఇంట్లో అడుగుపెట్టడానికి వీలులేదు. తమ శరీరంలోని ఈ మార్పులకు కారణాలేమిటో, రుతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనలేని బాలికలు నేటికీ ఉన్నారు. ఒక ఆడపిల్లగా తాను కూడా ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంది అదితి. రుతుస్రావం గురించి ఉన్న భయాలను, అపోహలను తొలగించేందుకు, ఆ విషయం పట్ల అవగాహన కల్పించేందుకు భర్త తుహిన్‌ పటే ల్‌లతో కలిసి హిందీలో కామిక్‌ పుస్తకం తీసుకువచ్చింది. దీని ద్వారా బాలికల్లో అవగాహన కల్పిస్తోంది. మెనుస్ట్రుపిడేషన్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ కూడా నడుపుతోంది. రుతుస్రావ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య విధానాల గురించి సమాచారం పొందుపరుస్తోంది.

శుభ్రా చద్దా

భర్త వివేక్‌ ప్రభాకర్‌తో కలిసి ఆన్‌లైన్‌ దుస్తుల విక్రయ కంపెనీ ‘చుంబక్‌’ స్థాపించారు. హిందీలో చుంబక్‌ అంటే ఫ్రిజ్‌కు అతికి ఉండే అయస్కాంతం అని అర్థం. రెండేళ్ల కూతురికి తల్లిగా, కంపెనీ బాధ్యతలు నిర్వహించడంలో విజయవంతమయ్యారు. దేశవ్యాప్తంగా  చుంబక్‌ 120కి పైగా స్టోర్లు కలిగి ఉంది. 

స్నేహా రైసోనీ
ఐదేళ్లు చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేసిన స్నేహకు ఆ వత్తి తృప్తినివ్వలేదు. ఆ ఉద్యోగాన్ని వదిలి ‘టప్పూ దుకాణ్‌’ ప్రారంభించారు. ఇది ఒక గిఫ్ట్‌ షాప్‌. సీఏగా మంచి వేతనాన్ని వదులుకొని స్టోర్‌ ప్రారంభించినపుడు అందరూ ఆమె తప్పటడుగు వేస్తున్నారనుకున్నారు. కానీ టప్పూ దుకాణ్‌ సంవత్సరంలోపే లాభాల బాటపట్టడంతో ఆమె నిర్ణయం సరైందని రుజువైంది.

సుచి ముఖర్జీ
సోషల్‌ కామర్స్‌ సైట్‌ లైమ్‌రోడ్‌.​కామ్‌(పట్టణ మహిళల కోసం ఉద్దేశించిన ) సీఈఓ. లేమన్‌ బ్రదర్స్‌ బ్యాంకులో ఐదేళ్లు, వర్జిన్‌ మీడియాలో రెండేళ్లపాటు డైరెక్టర్‌గా పనిచేశారు. ఈబే, స్కైప్‌, గమ్‌ట్రీలలో పనిచేసిన అనుభవం లైమ్‌రోడ్‌ ఆరంభానికి పునాది వేసింది.

సురభీ దేవ్రా
భారత్‌లో అతిపెద్ద ఆన్‌లైన్‌ కెరీర్‌ గైడ్‌గా పేరుపొందిన మేరాకెరీర్‌గైడ్‌.కామ్‌ రూపకర్త.  ఈ వెబ్‌సైట్‌లో వివిధ విద్య, ఉద్యోగావకాశాలకు  సంబంధించిన సమాచారం లభిస్తుంది. ప్రారంభమైన రెండు నెలల్లోనే 50వేల మంది యూజర్లతో దూసుకుపోతోంది. ఈ సైట్‌ ఎంతో మంది విద్యార్థులు తమకిష్టమైన  కెరీర్‌ని ఎన్నుకునేలా బాటలు వేస్తోంది. 

ఉపాసనా టాకూ
జాక్‌పే, మొబిక్విక్‌ కంపెనీలకు సహ వ్యవస్థాపకురాలు. ఈ- కామర్స్‌ బిజినెస్‌లో చెల్లింపుల విధానంలో ఎదురవుతున్న అవాంతరాలను తొలగించేందుకు జాక్‌పే రూపొందించారు. మొబిక్విక్‌ అనేది మొబైల్‌ వాలెట్‌లాంటిది. ఈ యాప్‌ రీచార్జ్‌, బిల్‌ పేమెంట్లు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 


వలరీ వాగ్నర్‌
మార్కెటింగ్‌, అడ్వర్టైజ్‌ టెక్నిక్స్‌ను తెలిపే  మొబైల్ ప్లాట్‌ఫాం ‘జిప్‌డయల్‌’ను స్థాపించారు. దీనిలో ఎన్‌రోల్‌ చేసుకున్నట్లయితే అడ్వర్టైజ్‌ కంపెనీలకు డైరెక్ట్‌గా ఫోన్‌ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఇది పూర్తి ఉచితం. జిప్‌డయల్‌ ద్వారా జిల్లెట్‌, నివియా, డిస్నీ వంటి 500 బ్రాండ్లకు సంబంధించిన యాడ్‌లు పోస్ట్‌చేయవచ్చు.

రాధికా ఘయ్‌ అగర్వాల్‌ 
ప్రఖ్యాత షాప్‌క్లూస్‌. కామ్‌ సహ వ్యవస్థాపకురాలు. 2011లో సిలికాన్‌ వ్యాలీలో ఈ వెబ్‌సైట్‌ రూపొందించారు. ప్రస్తుతం భారత్‌లో అతిపెద్దదైన మార్కెట్‌ప్లేస్‌గా నిలిచింది. నెలకు దాదాపు 7 మిలియన్ల మంది ఈ సైట్‌ను వీక్షిస్తున్నారు.

సబీనా చోప్రా
ప్రఖ్యాత ట్రావెల్‌ పోర్టల్‌ యాత్రా.కామ్‌ వ్యవస్థాపకురాలు. ఇంతకుముందు యూరప్‌ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్‌ ఈ-బుకర్స్‌ ఇండియా ఆపరేషన్స్‌ హెడ్‌గా, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ కంపెనీలో పనిచేశారు. దేశీయ రుచులను అందించే హోటల్‌ వ్యాపారంలో అడుగుపెట్టారు. దాదాపు పదిహేనేళ్ల అనుభవంతో యాత్రా.కామ్‌ రూపకల్పనకు శ్రీకారం చుట్టి ట్రావెల్‌, టూరిజమ్‌ గ్రూప్‌ రంగంలో విజేతగా నిలిచారు. 2010 భారత మహిళా నాయకురాలు అవార్డు కూడా పొందారు.

నీరూ శర్మ
ప్రముఖ ఈ- కామర్స్‌ పోర్టల్‌ ఇన్ఫీబీమ్‌.కామ్‌ సహ వ్యవస్థాపకురాలు. ఈ ఏడాది ప్రఖ్యాత డిజిటల్‌ మార్కెట్‌ కంపెనీ ఒడిగామాను 5 మిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. గతంలో నీరూ శర్మ అమెజాన్‌ యూఎస్‌ఏ మీడియా రీటైల్‌ రంగంలో పనిచేశారు. జాపోస్‌ వంటి వివిధ కంపెనీల విలీన ఒప్పందాల్లో(850 మిలియన్‌ డాలర్లు) వ్యూహాత్మక పాత్ర పోషించారు. 

హర్‌ప్రీత్‌ కౌర్‌
ఈ- కామర్స్‌ వెబ్‌సైట్‌ ‘లవ్‌ ఫర్‌ ఆపిల్‌’ సహ వ్యవస్థాపకురాలు. ఈ వెబ్‌సైట్‌ ప్రత్యేకంగా ఆపిల్‌ వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఆపిల్‌ కంపెనీకి సంబంధించిన అసలైన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో 2013లో ఏర్పాటు చేశారు. ఐఫోన్‌, ఐపాడ్‌ కవర్ల తయారీ కోసం ప్రత్యేకంగా తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ యూనిట్‌ ద్వారా ఔత్సాహిక కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. 

గుర్లిన్‌ కౌర్‌
పెట్టుబడిదారులకు ఆర్థిక సలహాలు అందించేందుకు ఉద్దేశించబడిన ‘హరీపత్తి’ కంపెనీ సీఈఓ. ఆంగ్ల భాషలో ఆమెకు గల ప్రావీణ్యం ఆర్థిక అంశాలను చక్కగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడింది. ఘజియాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీలో ఆర్థిక విద్యనభ్యసించారు. గతేడాది సర్టిఫైడ్‌ ఫినాన్షియల్‌ ప్లానర్‌గా మారారు.

చిత్రా గుర్ననీ దాగా
భర్త అభిషేక్‌ దాగాతో కలిసి భారత సాహస యాత్రా కంపెనీ ‘థ్రిలోఫిలా’ ను స్థాపించారు. యాత్రకు వెళ్లిన వారికోసం అనుభవమున్న, స్థానిక గైడ్లను అందుబాటులో ఉంచుతారు. ఉన్నత విద్యా కుటుంబాలకు చెందిన చిత్ర, అభిషేక్‌ కలలను సాకారం చేసుకునేందుకు ​తమకు అనుభవంలేని రంగంలో ప్రవేశించి విజయవంతంగా దూసుకుపోతున్నారు.

అశ్వినీ అశోకన్‌
కృత్రిమ మేథను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్లలోని కెమెరాల ద్వారా మనుషుల ముఖాలను, కవళికలను, హావభావాలను పసిగట్టే మెకానిజమ్‌ ఉపయోగించుకునేందుకు వీలుగా‘మ్యాడ్‌ స్ట్రీట్‌ దెన్‌’స్థాపించారు. ఆమె భర్త ఆనంద్‌ చంద్రశేఖరన్‌ సహవ్యవస్థాపకులుగా ఉన్నారు.
గతంలో ఇంటెల్‌ కంపెనీ ఇంటరాక్షన్‌ , ఎక్స్‌పీరియన్స్‌ రీసర్చ్‌ ల్యాబ్‌లో పనిచేశారు.

అంకిత గాబా 
సోషల్‌ మీడియా వ్యూహకర్తగా, వ్యాపారవేత్తగా, లెక్చరర్‌, కన్సల్టెంట్‌గా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. సోషల్‌సమోసా.కామ్‌ సహవ్యవస్థాపకురాలు. 
ఈ వెబ్‌సైట్‌ సోషల్‌ మీడియాకు సంబంధించిన ఆలోచనలు, పోకడలు, వార్తలు ఇలా అన్ని విషయాలకు చర్చా వేదికగా నిలుస్తోంది. గ్లోబల్‌ ‘టాప్‌ 100 సోషల్‌ మీడియా ఏజెన్సీస్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌ 2012-13’జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. 

షహనాజ్‌ హుసేన్‌
‘క్వీన్‌ ఆఫ్‌ హెర్బల్‌ బ్యూటీ కేర్‌’గా ప్రసిద్ధి పొందారు. 16వ ఏటనే వివాహం చేసుకున్నారు. సౌందర్యం, సౌందర్య సాధనాల పట్ల ఉన్న మక్కువ ఆమెను సాధారణ గృహిణి స్థాయి నుంచి ‘షహనాజ్‌ హెర్బల్‌ ఇన్‌కార్పోరేషన్‌’ కంపెనీని స్థాపించే స్థాయికి చేర్చింది.  ఈ కంపెనీ జంతువులపై ఎటువంటి ప్రయోగాలు(విత్‌ అవుట్‌ ఎనిమల్‌ టెస్టింగ్‌) చేయకుండానే చర్మ సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో 400  ఫ్రాంఛైజీలను కలిగి ఉంది.  2006లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. సక్సెస్‌ మాగజీన్‌ 1996లో ‘వరల్డ్‌ గ్రేటెస్ట్‌ వుమన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డు’ అందజేసింది.

రవీనా రాజ్‌ కొహ్లి
మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టీవీ రంగంలో మొదటి మహిళా సీఈఓగా గుర్తింపు పొందారు. సోనీ ఎంటర్టేన్మెంట్‌ టీవీ కంటెంట్‌, కమ్యూనికేషన్‌ హెడ్‌గా, స్టార్‌ న్యూస్‌ ముఖ్య కార‍్యనిర్వహణాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మీడియా టైకూన్‌ కెర్రీ పాకర్‌కు చెందిన ‘చానెల్‌ 9 (ఇండియా)’ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో డిప్లొమా చేశారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌, సాహిత‍్యం, సైకాలజీలలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. మహిళా సాధికారత కోసం పాటుపడేందుకు ‘జాబ్‌కార్‌‍్ప కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను స్థాపించారు. 

రష్మీ సిన్హా
లక్నోలో జన్మించిన రష్మీ న్యూరో సైకాలజీలో పీహెచ్‌డీ చేశారు. భర్తతో కలిసి‘స్లైడ్‌షేర్‌’ అనే ఆన్‌లైన్‌ కంపెనీ ప్రారంభించారు. దీని ద్వారా  ఆన్‌లైన్‌ ప్రజంటేషన్స్‌ ఇవ్వవచ్చు. అనతికాలంలోనే నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో సోషల్‌ మీడియా సైట్‌ లింక్డిన్‌ 100 మిలియన్‌ డాలర్లు వెచ్చించి 2012లో స్లైడ్‌షేర్‌ను కొనుగోలు చేసింది. ఫార్చూన్‌ అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో 8వ స్థానంలో నిలిచారు. ఫాస్ట్‌ కంపెనీ - 2వెబ్‌ ప్రపంచంలో అత్యంత ప్రభావంతమైన మహిళ’ల జాబితాలో టాప్‌-10లో స్థానం పొందారు. 

శ్రద్ధా శర్మ
యువ వ్యాపారవేత్తలు, వారి స్టార్టప్‌ సంస్థల గురించి, వారి అనుభవాలు పొందుపరిచేందుకు ప్రత్యేకంగా ‘యువర్‌స్టోరీ’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి చీఫ్‌ ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, సీఎన్‌బీసీ టీవీ18లో పనిచేశారు.

స్వాతి భార్గవ
 ‘క్యాష్‌కరో సైట్‌’ సహ వ్యవస్థాపకురాలు. ఈ సైట్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవడం ద్వారా క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి ఆనర్స్‌ పట్టా పొందారు. లండన్‌లోని ప్రఖ్యాత గోల్డ్‌మన్‌ సాచ్స్‌ కంపెనీలో నాలుగేళ్లు పనిచేశారు. ప్రస్తుతం క్యాష్‌కరో సీఈఓగా ఉన్నారు.

సాక్షి తుల్సియన్‌
రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాం ‘పోసిస్ట్‌’ సహ వ్యవస్థాపకురాలు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వివిధ రెస్టారెంట్లకు సంబంధించి టేబుల్స్‌, డెలివరీ, మెనూ కార్డు, ఖర్చు వివరాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలోని భారతి విద్యాపీఠ్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన సాక్షి పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.  

మెవిష్‌ ముస్తాక్‌, శ్రీనగర్‌
ప్రతిభకు కుల, మత, ప్రాంత భేదాలు అడ్డురావని ముస్తాక్‌ నిరూపించారు. ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ తయారుచేసిన మొదటి కాశ్మీరీ మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ అప్లికేషన్‌లో యూజర్‌కు కావాల్సిన చిరునామా, ఫోన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ ఐడీల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వానికి చెందిన విద్య, వైద్య, రవాణా , పోలీసు వ్యవస్థతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉంటుంది. కశ్మీరీ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగ‍పడుతోంది.

హేమలత అన్నమలై, కోయంబత్తూరు
కేవలం పురుషులకే పరిమితమనుకున్న ఆటోమొబైల్‌ రంగంలోకి అడుగుపెట్టి, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీ(ఆంపియర్‌ ఎలక్ట్రిక్‌) స్థాపించి విజయం సాధించారు. ఈ- సైకిల్లు, ఈ- స్కూటర్లు, ఈ- ట్రాలీస్‌తో పాటు వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం, వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు రూపొందిస్తున్నారు. 

సోబితా తమూలీ, తెలానా
అస్సాంలోని తెలానా గ్రామానికి చెందిన సోబిత స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. అస్సాం సాంప్రదాయ టోపీ ‘జాపీస్‌’ మొదలుకొని సేంద్రీయ ఎరువు వరకు  మధ్యవర్తులు లేకుండా తమ ఉత్పత్తులు నేరుగా మార్కెట్‌లో అమ్ముకునే విధానాన్ని రూపొందించారు. దీని ద్వారా అక్కడి మహిళలకు ఉపాధి ఉపాధి లభిస్తోంది. 

లక్ష్మీ మీనన్‌, ఎర్నాకులం
పర్యావరణ హిత వస్తువులు తయారుచేసేందుకు 2012లో ‘ప్యూర్‌ లివింగ్‌’ కంపెనీ స్థాపించారు. ప్రింటింగ్‌ ప్రెస్‌లో కార్డుల తయారీ సమయంలో విడుదలయ్యే ఉప ఉ‍త్పత్తుల ద్వారా పెన్నులు తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా వికలాంగ మహిళలు ఉపాధి పొందుతున్నారు. 

ఛాయా నంజప్ప, మైసూరు
 ఫుడ్ ప్రాసెసింగ్‌ విభాగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత మహిళా వ్యాపారవేత్త సమాఖ్య  అందజేసే ‘జాతీయ ఉత్తమ వ్యాపారవేత్త -2014 ’ అవార్డు పొందారు. గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘నెక్టార్‌ ఫ్రెష్‌ ’ కంపెనీ స్థాపించారు. దీని ద్వారా స్వచ్ఛమైన తేనెను యూరప్‌, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తూ మైసూర్‌, మాండ్యా జిల్లాల్లోని నిరక్షరాస్య ప్రజలకు, గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నారు.  

సుమితా ఘోష్‌, బికనీర్‌
హస్తకళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘రంగసూత్ర’ అనే కంపెనీ స్థాపించారు. దీని ద్వారా 3000 మంది కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. 10 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన కంపెనీ నేడు ఫాబ్‌ ఇండియా, ఇకియా వంటి ప్రఖ్యాత సంస్థలకు ఉత్పత్తులను అమ్మే స్థాయికి ఎదిగింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, మణిపూర్‌కు చెందిన 35 బృందాలు రంగసూత్ర కోసం పనిచేస్తున్నాయి. సుమిత ప్రోత్సాహంతో మధ్యప్రదేశ్‌లోని ఎందరో పారిశుద్ధ్య కార్మికులు హస్తకళల తయారీదారులుగా మారారు. 

నేహా అరోరా, ఢిల్లీ
అంధుడైన తండ్రి, వీల్‌చెయిర్‌కే పరిమితమైన తల్లి. అందరు పిల్లల్లాగే సెలవుల్లో టూర్లకు వెళ్లాలని భావించిన నేహ కోరిక తీరలేదు. అందుకే తన తల్లిదండ్రుల్లాంటి దివ్యాంగులు కూడా వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు 2016లో ‘ప్లానెట్‌ ఏబుల్డ్‌ ’ అనే ట్రావెల్‌ కంపెనీ స్థాపించారు. దివ్యాంగుల సౌకర్యార్థం పోర్టబుల్‌ ర్యాంప్స్‌ అందుబాటులో ఉంటాయి. వివిధ ప్రదేశాలకు వెళ్లాలనే దివ్యాంగుల కలను నిజం చేస్తూ 17 రోజుల్లో 2 దేశాలు, 5 రాష్ట్రాలు, 13 నగరాల్లో పర్యటించింది ప్లానెట్‌ ఏబుల్డ్‌ బృందం.

థోనాల్స్‌ చరోల్‌, లడఖ్‌
లడఖ్‌ ఎకోటూరిజమ్‌ను ప్రోత్సహిస్తూనే, మహిళలకు పర్వాతారోహణలో శిక్షణనిచ్చేందుకు 2009లో ‘లడఖీ వుమెన్స్‌ ట్రావెల్‌ కంపెనీ’ స్థాపించారు. లడఖ్‌లో మహిళా యజమాని, గైడ్లు, పోర్టర్లుగా మొత్తమంతా మహిళా సిబ్బంది(30 మంది) గల ఒకే ఒక ట్రావెల్‌ కంపెనీ ఇది.

తమన్నా శర్మ, ఢిల్లీ
ఈవెంట్‌, వ్యర్థ పదార్థాల నిర్వహణ కంపెనీ ‘ఎర్త్‌లింగ్‌ ఫస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను స్థాపించారు. ఈ కంపెనీ వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి మార్గదర్శకంగా నిలిచింది. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సంస్థలో పురుషుల సంఖ్యకు సమానంగా మహిళలను నియమిస్తున్నారు.

పబీబెన్‌ రబరీ, కుకాద్సర్‌
గిరిజన జాతి ‘రబరీ’ వారసత్వాన్ని, హస్తకళల ఉనికిని కాపాడే బాధ్యత చేపట్టి కచ్‌ జిల్లా అంబాసిడర్‌గా పేరుపొందారు. రబరీ జాతికే పరిమితమైన ‘హరి జరీ-పబీ జరీ’ వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ రకాలను ‘పబీబెన్‌.కామ్‌’ వెబ్‌సైట్‌ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు. మహిళలు రూపొందించే హస్తకళలను అమ్మే వేదిక ఏర్పరచిన మొదటి మహిళగా పబీబెన్‌ నిలిచారు. సుమారు 60 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. పబీబెన్‌.కామ్‌ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. 

రాశి చౌదరి
ముంబైలో మొదటి ఆన్‌లైన్‌ గ్రోసరీ స్టోర్‌ ‘లోకల్‌బన్యా’ సహ వ్యవస్థాపకురాలు. ముంబై, థానె, నవీ ముంబైల నుంచి రోజుకి సగటున 600 ఆర్డర్లు అందుకుంటోంది.  రేమండ్‌ లిమిటెడ్‌, రాశి పెరిఫెరల్స్‌లలో పనిచేసిన రాశి లోకల్‌బన్యా కోసం స్వయంగా క్షేత్ర స్థాయిలో కూడా పనిచేస్తున్నారు.

- సుష్మారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement