Droom Technology Founder Sandeep Aggarwal Life Struggles And Success Story In Telugu - Sakshi
Sakshi News home page

దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!

Published Sun, Apr 30 2023 4:57 PM | Last Updated on Tue, May 2 2023 1:01 PM

Droom Technology Founder Sandeep Aggarwal struggles and successstory - Sakshi

రెండు విజయవంతమైన యునికార్న్ స్టార్టప్‌లను సృష్టించిన ఏకైక టెక్ వ్యవస్థాపకుడు, సందీప్ అగర్వాల్. వ్యాపారవేత్తగా పాపులర్‌ అవుతున్న తరుణంలో ఎఫ్‌బీఐ అరెస్టు బాగా దెబ్బతీసింది. రూ. 8వేల కోట్ల సంస్థ పోయింది. చేయని నేరానికి జైలు శిక్ష, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు అయినా  ఫీనిక్స్‌ పక్షిలా తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. రోలర్ కోస్టర్ లాంటి జీవితాన్నిఎదురీది ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా, ప్రస్తుతం రూ. 16400 కోట్ల కంపెనీ యజమానిగా తానేంటో నిరూపించుకున్న సందీప్‌ అగర్వాల్‌ సక్సెస్‌ స్టోరీ..

జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని జీవితంలో అనుకోని కుదుపు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. కుటుంబంతో కలిసి అమెరికాలో వెకేషన్‌లో ఉండగా, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సందీప్‌ అగర్వాల్‌ను అరెస్ట్‌ చేసింది. అరెస్టు తర్వాత 8 వేల కోట్ల రూపాయల కంపెనీని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే తరుణంలో 17 ఏళ్ల వైవాహ జీవితానికి స్వస్తి పలుకుతూ 2018లో భార్య విడాకులు తీసుకుంది. అయినా ఎక్కడా ఆశను కోల్పోలేదు.  

కుటుంబానికి దూరంగా యూఎస్‌లో ఉండి, కేసుపై పోరాడవలసి వచ్చింది. కంపుకొట్టే టాయిలెట్‌ మధ్య  జైలు జీవితాన్ని గడిపాడు. మరోవైపు రిమోట్‌గా కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ వాటాదారుల అభ్యంతరాలతో కంపెనీ సీఈవో పదవి నుంచి వైదొలిగి, తాను నిర్మించిన సంస్థ పగ్గాలను తన స్నేహితుడికి అప్పగించారు. 2019లో, షాప్‌క్లూస్‌ను మరో కంపెనీ సుమారు 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విచారణ, తీర్పు ఆలస్యం కారణంగా 2014లో ఇండియాకు రావడానికి అనుమతి లభించింది. చివరికి 2020లో యూఎస్‌ కోర్టు ద్వారా ఆర్థిక నేరాల కేసులో నిర్దోషిగా తేల్చింది.

డ్రూమ్ టెక్నాలజీస్‌
ఏప్రిల్ 2014లో డ్రూమ్‌ టెక్నాలజీస్‌ అనే మరొక యునికార్న్‌ ఏర్పాటుచేశారు.అనేక ఇబ్బందుల మధ్య అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ ప్లాట్‌ఫారమ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 16 మిలియన్ డాలర్లు ,తరువాతి మూడు సంవత్సరాలలో, పలు దఫాలుగా 90 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చారు. ఏప్రిల్ 2021న భారతదేశంలో 55వ యునికార్న్‌గా అవతరించింది.  కంపెనీ వాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు లేదా రూ.16400 కోట్లు.

డ్రూమ్ తన జీవితంలో లేకుంటే తాను ఈ సంక్లిష్ట పరిస్థతులనుంచి తాను బయటపడేవాడిని కాదని ఒక సందర్భలో సందీప్‌ అగర్వాల్‌ చెప్పుకొచ్చారు. కుటుంబానికి దూరంగా, జైలు శిక్షను ఎదుర్కొంటున్న తరుణంలో కంపెనీ తనకు ఊరటనిచ్చిందని చెప్పారు. తరువాత ఉపాసనను రెండో పెళ్లి చేసుకున్నారు. 

షాప్‌క్లూస్ ముందు
సందీప్ అగర్వాల్ ఎంబీఏ పట్టా పొందిన తరువాత అమెరిలో రెండు వేర్వేరు కంపెనీలలో పనిచేశారు. ఆ తరువాత వాల్ స్ట్రీట్‌లో 14 ఏళ్లు ఎనలిస్టుగా పనిచేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ! మొదలైన కంపెనీలను కవర్ చేస్తూ ఎనిమిదేళ్లపాటు విశ్లేషకుడిగా పనిచేశాడు.టాప్ ర్యాంక్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పేరు సంపాదించారు.TiE సిలికాన్ వ్యాలీలో చార్టర్ సభ్యుడు కూడా. ఇంటర్నెట్ విశ్లేషకుడిగా 2010లో ఇండియాను సందర్శించిన సమయంలోఆన్‌లైన్ మార్కెట్‌ ప్రారంభించాలనే ఆలోచనకు పునాది పడింది. 

షాప్‌క్లూస్ ప్రారంభం
డెలావేర్‌లో రాధికా ఘై అగర్వాల్  (సందీప్ అగర్వాల్ మాజీ భార్య),మృణాల్ ఛటర్జీ , సంజయ్ సేథితో కలిసి ఇ-మార్కెట్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబరు 2011లో ఈ టీం దేశానికి వచ్చి శాశ్వతంగా గుర్గావ్‌లో స్థిరపడింది. షాప్‌క్లూస్ ప్రారంభంలో తన  సోషల్ సర్కిల్స్‌ ద్వారా  1.95 మిలియన్‌ డాలర్లను సేకరించడం విశేషం. 

షాప్‌క్లూస్‌ పబ్లిక్ బీటా వెర్షన్ 26 జనవరి 2012న విడుదలచేయగా, ముగ్గురు లేదా నలుగురుగా ఉన్న టీంసంఖ్య 25 మంది సభ్యులకు పెరిగింది. నెలవారీ 20 లక్షలకు పైగా యూజర్లతో భారీ లాభాల్ని సాధించింది. ఈ దెబ్బకు అలెక్సా ర్యాంకింగ్ అదే సంవత్సరం ఆగస్టులో  14వేల నుండి 200కి పడిపోయింది. జనవరి 2013 నాటికి, షాప్‌క్లూస్‌ దేశంలో ఐదో అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్‌గా మారింది. అలెక్సా ర్యాంకింగ్  ఏకంగా 90కి పడిపోయింది. 2013 జూలైలో అమెరికాలో ఎప్‌బీఐ ఈరెస్టు చేసింది. వాల్ స్ట్రీట్‌లో సీనియర్ ఇంటర్నెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు అతనిపై 'ఇన్‌సైడర్ ట్రేడింగ్' ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో చట్టపరమైన ఆరోపణలను నమోదు చేసేదాకా అదే జోరు కొనసాగింది.  అప్పటికీ కంపెనీ నెలవారీగా 200-300శాతం వృద్ధిని సాధిస్తోంది. 

కరియర్‌లో సందీప్ అగర్వాల్‌  తొలి అడుగులు
1995లోముంబైలోని కోటక్ మహీంద్రాలో ఇంటర్న్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు సందీప్‌ అగర్వాల్‌. ఈ ఇంటర్న్‌షిప్ తన వ్యాపార కమ్యూనికేషన్‌తో పాటు తన విశ్లేషణాత్మక నైపుణ్యాలు,వ్యూహాత్మక ఆలోచనలఅభివృద్ధికి తోడ్పడిందని  స్వయంగా సందీప్‌ అగర్వాల్‌ చెప్పారు.  

సందీప్‌ అగర్వాల్‌ చదువు 
కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌, దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు.  వాషింగ్టన్ యూనివర్శిటీ  సెయింట్ లూయిస్ ఓలిన్ బిజినెస్ స్కూల్ నుచి ఎంబీఏ చేసారు.

గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం
సందీప్‌కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం , గురుగ్రామ్‌లోని తన పెంట్‌హౌస్‌లో దాదాపు 1000 మొక్కలు ఉన్నాయి. తన కుమారులతో  క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం. గోల్ఫ్ , స్క్వాష్ ఆడుతారు. తోటపని, ప్రయాణాలు, చదవడం, రాయడం లాంటి ఇష్టాలు తనకు మంచి ఊరట అంటారు సందీప్‌. ‘ఫాల్ ఎగైన్, రైజ్ ఎగైన్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement