Sandeep Agarwal
-
దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!
రెండు విజయవంతమైన యునికార్న్ స్టార్టప్‌లను సృష్టించిన ఏకైక టెక్ వ్యవస్థాపకుడు, సందీప్ అగర్వాల్. వ్యాపారవేత్తగా పాపులర్ అవుతున్న తరుణంలో ఎఫ్‌బీఐ అరెస్టు బాగా దెబ్బతీసింది. రూ. 8వేల కోట్ల సంస్థ పోయింది. చేయని నేరానికి జైలు శిక్ష, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు అయినా ఫీనిక్స్ పక్షిలా తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. రోలర్ కోస్టర్ లాంటి జీవితాన్నిఎదురీది ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా, ప్రస్తుతం రూ. 16400 కోట్ల కంపెనీ యజమానిగా తానేంటో నిరూపించుకున్న సందీప్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ.. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని జీవితంలో అనుకోని కుదుపు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. కుటుంబంతో కలిసి అమెరికాలో వెకేషన్లో ఉండగా, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సందీప్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసింది. అరెస్టు తర్వాత 8 వేల కోట్ల రూపాయల కంపెనీని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే తరుణంలో 17 ఏళ్ల వైవాహ జీవితానికి స్వస్తి పలుకుతూ 2018లో భార్య విడాకులు తీసుకుంది. అయినా ఎక్కడా ఆశను కోల్పోలేదు. కుటుంబానికి దూరంగా యూఎస్‌లో ఉండి, కేసుపై పోరాడవలసి వచ్చింది. కంపుకొట్టే టాయిలెట్ మధ్య జైలు జీవితాన్ని గడిపాడు. మరోవైపు రిమోట్‌గా కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ వాటాదారుల అభ్యంతరాలతో కంపెనీ సీఈవో పదవి నుంచి వైదొలిగి, తాను నిర్మించిన సంస్థ పగ్గాలను తన స్నేహితుడికి అప్పగించారు. 2019లో, షాప్‌క్లూస్‌ను మరో కంపెనీ సుమారు 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విచారణ, తీర్పు ఆలస్యం కారణంగా 2014లో ఇండియాకు రావడానికి అనుమతి లభించింది. చివరికి 2020లో యూఎస్ కోర్టు ద్వారా ఆర్థిక నేరాల కేసులో నిర్దోషిగా తేల్చింది. డ్రూమ్ టెక్నాలజీస్ ఏప్రిల్ 2014లో డ్రూమ్ టెక్నాలజీస్ అనే మరొక యునికార్న్ ఏర్పాటుచేశారు.అనేక ఇబ్బందుల మధ్య అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ ప్లాట్‌ఫారమ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 16 మిలియన్ డాలర్లు ,తరువాతి మూడు సంవత్సరాలలో, పలు దఫాలుగా 90 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చారు. ఏప్రిల్ 2021న భారతదేశంలో 55వ యునికార్న్‌గా అవతరించింది. కంపెనీ వాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు లేదా రూ.16400 కోట్లు. డ్రూమ్ తన జీవితంలో లేకుంటే తాను ఈ సంక్లిష్ట పరిస్థతులనుంచి తాను బయటపడేవాడిని కాదని ఒక సందర్భలో సందీప్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. కుటుంబానికి దూరంగా, జైలు శిక్షను ఎదుర్కొంటున్న తరుణంలో కంపెనీ తనకు ఊరటనిచ్చిందని చెప్పారు. తరువాత ఉపాసనను రెండో పెళ్లి చేసుకున్నారు. షాప్‌క్లూస్ ముందు సందీప్ అగర్వాల్ ఎంబీఏ పట్టా పొందిన తరువాత అమెరిలో రెండు వేర్వేరు కంపెనీలలో పనిచేశారు. ఆ తరువాత వాల్ స్ట్రీట్‌లో 14 ఏళ్లు ఎనలిస్టుగా పనిచేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ! మొదలైన కంపెనీలను కవర్ చేస్తూ ఎనిమిదేళ్లపాటు విశ్లేషకుడిగా పనిచేశాడు.టాప్ ర్యాంక్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పేరు సంపాదించారు.TiE సిలికాన్ వ్యాలీలో చార్టర్ సభ్యుడు కూడా. ఇంటర్నెట్ విశ్లేషకుడిగా 2010లో ఇండియాను సందర్శించిన సమయంలోఆన్లైన్ మార్కెట్ ప్రారంభించాలనే ఆలోచనకు పునాది పడింది. షాప్‌క్లూస్ ప్రారంభం డెలావేర్లో రాధికా ఘై అగర్వాల్ (సందీప్ అగర్వాల్ మాజీ భార్య),మృణాల్ ఛటర్జీ , సంజయ్ సేథితో కలిసి ఇ-మార్కెట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబరు 2011లో ఈ టీం దేశానికి వచ్చి శాశ్వతంగా గుర్గావ్లో స్థిరపడింది. షాప్‌క్లూస్ ప్రారంభంలో తన సోషల్ సర్కిల్స్ ద్వారా 1.95 మిలియన్ డాలర్లను సేకరించడం విశేషం. షాప్‌క్లూస్ పబ్లిక్ బీటా వెర్షన్ 26 జనవరి 2012న విడుదలచేయగా, ముగ్గురు లేదా నలుగురుగా ఉన్న టీంసంఖ్య 25 మంది సభ్యులకు పెరిగింది. నెలవారీ 20 లక్షలకు పైగా యూజర్లతో భారీ లాభాల్ని సాధించింది. ఈ దెబ్బకు అలెక్సా ర్యాంకింగ్ అదే సంవత్సరం ఆగస్టులో 14వేల నుండి 200కి పడిపోయింది. జనవరి 2013 నాటికి, షాప్‌క్లూస్ దేశంలో ఐదో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్‌గా మారింది. అలెక్సా ర్యాంకింగ్ ఏకంగా 90కి పడిపోయింది. 2013 జూలైలో అమెరికాలో ఎప్బీఐ ఈరెస్టు చేసింది. వాల్ స్ట్రీట్‌లో సీనియర్ ఇంటర్నెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు అతనిపై 'ఇన్సైడర్ ట్రేడింగ్' ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో చట్టపరమైన ఆరోపణలను నమోదు చేసేదాకా అదే జోరు కొనసాగింది. అప్పటికీ కంపెనీ నెలవారీగా 200-300శాతం వృద్ధిని సాధిస్తోంది. కరియర్లో సందీప్ అగర్వాల్ తొలి అడుగులు 1995లోముంబైలోని కోటక్ మహీంద్రాలో ఇంటర్న్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు సందీప్ అగర్వాల్. ఈ ఇంటర్న్‌షిప్ తన వ్యాపార కమ్యూనికేషన్‌తో పాటు తన విశ్లేషణాత్మక నైపుణ్యాలు,వ్యూహాత్మక ఆలోచనలఅభివృద్ధికి తోడ్పడిందని స్వయంగా సందీప్ అగర్వాల్ చెప్పారు. సందీప్ అగర్వాల్ చదువు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. వాషింగ్టన్ యూనివర్శిటీ సెయింట్ లూయిస్ ఓలిన్ బిజినెస్ స్కూల్ నుచి ఎంబీఏ చేసారు. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సందీప్‌కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం , గురుగ్రామ్‌లోని తన పెంట్‌హౌస్‌లో దాదాపు 1000 మొక్కలు ఉన్నాయి. తన కుమారులతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం. గోల్ఫ్ , స్క్వాష్ ఆడుతారు. తోటపని, ప్రయాణాలు, చదవడం, రాయడం లాంటి ఇష్టాలు తనకు మంచి ఊరట అంటారు సందీప్. ‘ఫాల్ ఎగైన్, రైజ్ ఎగైన్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. -
అద్దెకు విమానం.. ఆన్లైన్లో!
సైకిల్ నుంచి విమానం వరకూ కొనొచ్చు, అమ్మొచ్చు - పాత వాహనాలకూ కొనేటపుడే ఉచిత బీమా - ఈ ఏడాది 25 కోట్ల టర్నోవర్‌ను ఆశిస్తున్న డ్రూమ్ - సింగపూర్, మలేిసియా, థాయ్లకూ విస్తరణ - రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టిన లైట్‌బాక్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వేలం పాట’లో భూమో.. బంగారమో లేకపోతే నగదో గెలుస్తామని మనందరికీ తెలిసిందే! కానీ, సైకిళ్లు, బైకులు, కార్లను కూడా సొంతం చేసేసుకోవచ్చు.! మన లక్కు మరీ మనల్ని వెంటాడిందంటే ఉచితంగా విమానంలో చక్కర్లు కూడా కొట్టేయొచ్చు. ఇవన్నీ డ్రూమ్ ప్రత్యేకతలంటున్నారు సంస్థ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్. ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలకో... ఫ్యాషన్ ఉత్పత్తులకో పరిమితమనుకున్న ఆన్లైన్ షాపింగ్ జాబితాలో ఇప్పుడు ఆటో మొబైల్ పరిశ్రమనూ చేర్చాడు సందీప్. దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన షాప్‌క్లూస్ వ్యవస్థాపకుడే ఈ సందీప్. డ్రూమ్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ 125 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పరిశ్రమ కూడా ఇదే. ఉప్పు.. పప్పుల వంటి నిత్యావసరాలనే ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్న ఈ రోజుల్లో ఆటోమొబైల్స్నూ ఎందుకు కొనకూడదనే ఆలోచన వచ్చిం ది. అప్పటికే దేశంలోని ప్రధానమైన ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన షాప్‌క్లూస్‌ను నిర్వహిస్తుండటంతో ఆటోమొబైల్ వేదికగా మరో సంస్థను ప్రారంభించేందుకు సాఫ్ట్వేర్ అభివృద్ధి, మా ర్కెట్ విశ్లేషణ పెద్దగా కష్టం కాలేదు. దీంతో 2014 నవంబర్‌లో డ్రూమ్ కంపెనీ ప్రారంభమైంది. డ్రూమ్ సేవలు డెస్క్‌టాప్‌తో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లలోనూ లభిస్తున్నాయి. పోటీ సంస్థలకు- డ్రూమ్కు మధ్య తేడా.. ఆన్లైన్ వేదికగా సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయించే సంస్థలు దేశంలో బోలెడన్ని ఉన్నాయి. మరి డ్రూమ్కు, ఇతర సంస్థలకున్న ప్రధాన తేడా ఏంటంటే... డ్రూమ్‌లో పాతవే కాదు.. కొత్త వాహనాలనూ కొనుగోలు చేయవచ్చు. అది కూడా తయారీ యూనిట్ ధరకే. అంతేకాదు ఏఎక్స్ఏ అసిస్టెంట్స్ ఇండియా అనే బీమా కంపెనీతోనూ మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. దీంతో డ్రూమ్‌లో వాహనాలు కొనుగోలు చేసినవాటికి కంపెనీనే బీమా చేసి ఇస్తుంది. లగ్జరీ కార్ల కొనుగోలుదారుల కోసం దేశంలో ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్లను విక్రయించే అతిపెద్ద కంపెనీ బిగ్‌బాయ్ టాయ్ అనే సంస్థతో డ్రూమ్ డీల్ కుదుర్చుకుంది. దీంతో తక్కువ ధరకే లగ్జరీ, సూపర్ లగ్జరీ కార్లను సొంతం చేసుకోవచ్చు. రెండేళ్లలో 50 వేల మంది కస్టమర్ల లక్ష్యం...: ప్రస్తుతం డ్రూమ్‌లో సైకిళ్లు, బైకులు, కార్లు, జీపులు, వింటేజ్ కార్ల వంటి 14 రకాలైన 6,000కు పైగా రెండు, మూడు చక్రాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 15 వేల మంది డ్రూమ్ ద్వారా వాహనాలను కొనుగోలు చేశారు. రెండేళ్లలో 20 రకాల్లో 20 వేల వాహనాలు... 50 వేల మంది కస్టమర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ఆన్లైన్ ద్వారా ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లను అద్దెకిచ్చేందుకు, కొనుగోలు చేసేందుకు జెట్‌సెట్‌గో విమానయాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అత్యవసర ప్రయాణాల కోసం భారీ మొత్తాలు వెచ్చించేందుకు సిద్ధపడే వారికి మా సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇక ధరల పట్టికను చూస్తే.. అద్దె రూ.1.2 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఉంటుంది. సమయం, దూరం, విమానాన్ని బట్టి ధరల్లో మార్పు ఉంటుంది. విమానం కొనుగోలుకైతే రూ.46.2 కోట్ల నుంచి 79.26 కోట్ల వరకు ధరలున్నాయి. రూ.100 కోట్ల నిధుల సమీకరణ.. డ్రూమ్‌లో సీడ్ రౌండ్లో బీనోస్ సంస్థ పెట్టుబడులు పెట్టింది. ఇటీవలే సిరీస్- ఏ కింద లైట్‌బాక్స్ అనే సంస్థ రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాది చివరికి రూ.25 కోట్ల అమ్మకాలకు చేరుకుంటాం. ప్రస్తుతం దేశంలో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి 38 నగరాల్లో డ్రూమ్ సేవలు అందుబాటు లో ఉన్నాయి. 2016 ముగిసేసరికల్లా 50 నగరాలకు విస్తరిస్తాం. సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పిన్స్ దేశాల్లోనూ విస్తరణ ప్రణాళికలు వేస్తున్నాం.