‘క్లిక్’ అవుతున్న పోస్ట్.. | In 2008, the dot com boom tongue | Sakshi
Sakshi News home page

‘క్లిక్’ అవుతున్న పోస్ట్..

Published Mon, Oct 19 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

‘క్లిక్’ అవుతున్న పోస్ట్..

‘క్లిక్’ అవుతున్న పోస్ట్..

2008లో డాట్ కామ్ బూమ్ బద్దలయింది. బోలెడన్ని ఇంటర్నెట్ కంపెనీలు మూతపడ్డాయి. కాకపోతే... ఆ బూమ్‌లో వేసిన కేబుళ్లు, బ్రాడ్ బ్యాండ్ లైన్లు... దేశంలో కొత్త ఇంటర్నెట్ విప్లవానికి ఊపిరినిచ్చాయి. ఉత్తరాలు, పోస్టు కార్డులను ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు మరిపించేశాయి. మనీ ఆర్డర్లను డిజిటల్ బ్యాంకింగ్ మింగేసింది. ఇక తపాలా శాఖ ప్రాభవం తగ్గిందనే అనుకున్నారంతా!! కానీ దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగానికున్న అద్వితీయ నెట్‌వర్క్... దాన్నిపుడు ఈ-కామర్స్‌లో హీరోను చేస్తోంది. కాలం మారుతున్నా అవకాశాలు ఎక్కడికీ పోవని చెప్పేవే ఈ రెండు ఉదాహరణలూ!!.
 
టెక్నాలజీ పరంగా భారీ మార్పులు
ఈ-కామర్స్ డెలివరీల్లో మూడంకెల అభివృద్ధి
అమెజాన్, స్నాప్‌డీల్ వంటి దిగ్గజాలతో ఇప్పటికే జట్టు
గ్రామాల్లో ఎవ్వరికీ లేనంత విసృ్తత నెట్‌వర్క్ దీని బలం
అక్కడ డెలివరీలు పెరిగితే ఆదాయం భారీగా పెరిగే చాన్స్
సీఓడీ కోసం కార్డ్ ఆధారిత, మొబైల్ ఆధారిత పేమెంట్లు?
ఏపీ, తెలంగాణల్లో పెరగనున్న ప్రత్యేక ప్రాసెసింగ్ కేంద్రాలు
దసరా డెలివరీలకు సెలవులు సైతం రద్దు చేసుకుని విధులు

ఇపుడెవరి నోట చూసినా ఈ-కామర్సే. డీల్స్, డిస్కౌంట్స్‌తో ఊదరగొట్టేస్తున్న ఈ-కామర్స్‌లో అన్నిటికన్నా ముఖ్యమైనది డెలివరీ యంత్రాంగమే. ఎందుకంటే అమ్మేవారు, కొనేవారు దేశమంతా ఉన్నారు. వారిని కలిపే టెక్నాలజీ ఈ-కామర్స్ కంపెనీలన్నిటి దగ్గరా ఉంది. మరి అమ్మేవారి నుంచి వస్తువుల్ని కొనుగోలుదారుకు చేర్చాలి కదా! అందుకే కొన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సొంత లాజిస్టిక్స్ కంపెనీల్ని ఏర్పాటు చేసుకున్నాయి.

మిగిలిన దిగ్గజాలు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. కాకపోతే ఎందరెన్ని చేసినా వారికున్నది పరిమిత యంత్రాంగమే. మారుమూల గ్రామాలతో సహా దేశవ్యాప్త నెట్‌వర్క్ ఉన్న పోస్టల్‌కు ఏ కొరియర్ కంపెనీ కూడా సాటిరాదు. ఒకవేళ ఎవరైనా విస్తరించినా అది లాభదాయకం కాదు. అందుకే అమెజాన్, స్నాప్‌డీల్‌లు గతేడాది పోస్టల్ శాఖతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. ఇపుడు అమెజాన్‌లో కొన్న వస్తువులు కొన్ని నేరుగా పోస్ట్‌మ్యాన్ అందిస్తున్నాడంటే కారణం అదే మరి.
 
ఈ-కామర్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ-కామర్స్‌ను ప్రాధాన్యాంశంగా పరిగణిస్తున్న పోస్టల్ విభాగం దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు, టెక్నాలజీ ఆధునికీకరణ వంటివి చేపట్టింది. అందుకే... ఈ-కామర్స్ పార్శిళ్ల ద్వారా గతేడాది ఏప్రిల్ - డిసెంబరు మధ్య రూ.1,968 కోట్ల ఆదాయం ఆర్జించిన ఈ శాఖ... ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఏకంగా 115% వృద్ధిని సాధించింది. ఇక ఏపీ, తెలంగాణల్లో అయితే ఈ వృద్ధి 150%. ఇక్కడ సెప్టెంబరు వరకూ ఆర్జించిన ఆదాయం రూ.158 కోట్లు దాటింది. ఇది ఒకరకంగా రికార్డేనని చెప్పాలి.

ఇక క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల (సీఓడీ) బట్వాడాకు నాప్‌టోల్ వంటివి పూర్తిగా పోస్టల్ విభాగంపైనే ఆధారపడుతున్నాయి. స్టాంపుల విక్రయానికి స్నాప్‌డీల్, దేశవ్యాప్త డెలివరీ కోసం అమెజాన్ ప్రత్యేక ఒప్పందాలూ చేసుకున్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ-కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీలకు తగినంత నెట్‌వర్క్ లేకపోవటంతో అవన్నీ పోస్టల్‌నే ఆశ్రయిస్తున్నాయి.
 
ఉచిత పికప్; టెక్నాలజీ మార్పులు
టెక్నాలజీని కూడా పోస్టల్ శాఖ వేగంగా అందిపుచ్చుకుంటోందని చెప్పాలి. తమతో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు పోస్ట్‌మ్యాన్‌ను పంపి ఉచిత పికప్ సదుపాయం ఇవ్వటం... డెలివరీ రోజున కస్టమర్‌కు ఫోన్ లేదా ఎస్‌ఎంఎస్ చేయటం... కస్టమర్‌కు ఫోన్‌చేసి షెడ్యూలు మార్చుకునే అవకాశమివ్వటం వంటివన్నీ దీన్లో భాగమే. ఇక సీఓడీ రిటర్న్స్ విషయంలో ఒకవైపు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తుండటం దీనికి కలిసొస్తోంది. ఇక హబ్‌ల ఏర్పాటును కూడా సంస్థ వేగవంతం చేసింది. ఇటీవలే ముంబయిలో 12వేల చదరపుటడుగుల్లో ప్రత్యేక ఈ-కామర్స్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని కూడా ఆరంభించింది.
 
గ్రామాలకు ఈ-కామర్స్ వెళితే...!
ఇపుడు ఈ-కామర్స్ కొనుగోలుదారులు ప్రధానంగా ప్రధాన నగరాల నుంచే  చేస్తున్నారు. అందుకని వాటి సొంత లాజిస్టిక్స్ వ్యవస్థ కొంతవరకూ పనికొస్తోంది. దీన్లో గ్రామాల వాటా పెరిగితే మాత్రం పోస్టల్‌కు తిరుగులేని ఆధిక్యం వస్తుందనేది వాస్తవం. ‘‘ప్రస్తుతం విలువ పరంగా ఈ-కామర్స్‌లో 60 శాతం వాటా దేశంలోని టాప్-20 నగరాలదే. ఇది మారి గ్రామాల వాటా పెరిగితే పోస్టల్‌కున్న నెట్‌వర్క్‌తో అది చాలా బలోపేతమవుతుంది’’ అని రిటైల్ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇది మారుతుందని, ఇప్పటికే స్నాప్‌డీల్ వంటి సైట్లలో ఆ సంకేతాలొస్తున్నాయని చెప్పారాయన.
 
ఈ సమస్యల్ని అధిగమిస్తేనే...
నెట్‌వర్క్‌లో పోస్టల్ విభాగం నెంబర్-1 అనటంలో ఎవరికీ సందేహం లేదు. అయితే టెక్నాలజీ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. రిటర్న్ ఆర్డర్లు చాలా ఆలస్యంగా హబ్‌లకు చేరుతుండటం, సీఓడీ రూపంలో తీసుకున్న నగదును కంపెనీలకు రెమిట్ చేయటంలో మిగతా కొరియర్లతో పోలిస్తే ఆలస్యమవుతుండటం వంటి సమస్యలున్నాయి. ఇక అన్ని సంస్థలకూ సాఫ్ట్‌వేర్ పరంగా మద్దతివ్వటం కూడా సాధ్యం కావాల్సి ఉంది.
- సాక్షి, బిజినెస్ విభాగం
 
ఇది మా ప్రాధాన్యాంశం...
పోస్టల్ విభాగానికి ఈ-కామర్స్‌ను ప్రాధాన్యాంశంగా కేంద్రం నిర్దేశించిందని, ప్రతి నెలా కేంద్ర మంత్రి సారథ్యంలో సమీక్షలు జరుగుతున్నాయని హైదరాబాద్‌లోని  పోస్ట్ మాస్టర్ జనరల్ పి.వి.ఎస్.రెడ్డి చెప్పారు. తాము కూడా దానికి తగ్గట్టే మార్పులు చేస్తున్నామని ‘సాక్షి’ ప్రతినిధితో చెబుతూ... ‘‘దసరాకు అన్ని కంపెనీలూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డెలివరీకి మమ్మల్ని ఆశ్రయించిన సంస్థల కోసం మేం 22, 24, 25 వంటి సెలవు రోజుల్లో కూడా సిబ్బందిని ప్రత్యేకంగా పిలిపిస్తున్నాం.

ఈ-కామర్స్ పార్శిళ్లు డెలివరీ చేసిన సిబ్బందికి అదనపు ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం కనక వాళ్లూ ఉత్సాహంతో చేస్తున్నారు. కంపెనీలకు సీఓడీ రెమిటెన్స్‌లు ఆలస్యం కాకుండా కార్డు ఆధారిత పేమెంట్, మొబైల్ మనీ వంటి అంశాల్ని పరిశీలిస్తున్నాం. ఈ-కామర్స్ కోసం హైదారాబాద్ హుమయూన్ నగర్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. హైదరాబాద్‌లో మరొకటి, గుంటూరు, తిరుపతిలో తలా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం’’ అని వివరించారు. తమ విభాగం ముందడుగు వేస్తోందంటూ... మెరుగుపడాల్సింది ఇంకా చాలానే ఉందని కూడా అంగీకరించారాయన.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement