Internet companies
-
ఫ్లైట్‌మోడ్‌లో ఫోన్.. విమానాల్లో ఇంటర్నెట్ ఎలా?
ఏదైనా ఊరెళ్తున్నాం.. బస్సులోనో, రైల్లోనో అయితే వెంటనే స్మార్ట్‌ఫోన్ బయటికి తీయడం, ఏ సినిమాలో, వెబ్ సిరీస్‌లో చూడటం, సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం కనిపించేదే. అదే మరి విమానాల్లో అయితే..!? టవర్ సిగ్నల్స్ ఉండవు. ఉన్నా ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాల్సిందే. దీంతో ఫోన్ మెమరీలో ఉన్న వీడియోలు చూస్తూనో, పాటలు వింటూనో గడిపేయాల్సిందే. గంటా గంటన్నర జర్నీ అయితే ఓకేగానీ.. ఆరేడు గంటలకుపైన ప్రయాణించాల్సి వస్తే కష్టమే. అదే విమానాల్లో వైఫై ఉంటే కాసింత కాలక్షేపం. రెండు రకాలుగా ఇంటర్నెట్ విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ ఇచ్చేందుకు రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు మనం స్మార్ట్ఫోన్లలో వాడుతున్నట్టుగా టెలికాం టవర్ల నుంచి సిగ్నల్ అందుకోవడం. రెండోది శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్కు అనుసంధానం కావడం. ♦ శాటిలైట్‌కు అనుసంధానమై ఇంటర్నెట్ పొందే విమానాలకు పైభాగంలో యాంటెన్నాలు ఉంటాయి. ఈ ఇంటర్నెట్కు సిగ్నల్ సమస్యేదీ ఉండదు. కానీ అందుబాటు తక్కువ. ఖర్చు చాలా ఎక్కువ. ♦ టెలికం సిగ్నల్స్ నుంచి ఇంటర్నెట్ పొందే విమానాలకు దిగువ భాగంలో యాంటెన్నాలు ఉంటాయి. భూమ్మీద ఉన్న టెలికాం టవర్ల నుంచి సిగ్నల్స్ అందుకుంటూ ఇంటర్నెట్ వాడుతారు. అయితే ఇలాంటి వాటిలో అడవులు, ఎడారులు, సముద్రాల మీదుగా ప్రయాణించిన సమయంలో సిగ్నల్స్ ఉండవు. ♦ దాదాపు అన్ని దేశాలు యుద్ధ విమానాలు, ప్రత్యేక విమానాల్లో మాత్రం శాటిలైట్ కనెక్షన్‌ను వినియోగిస్తున్నాయి. చాలా విమానాల్లో ఇంటర్నెట్.. బాగా స్లో ప్రస్తుతం విమానాల్లో కొంతవరకు వైఫై సదుపాయం ఉన్నా.. దాని వేగం అత్యంత తక్కువ. ఎందుకంటే చాలా వరకు ప్రయాణికుల విమానాల్లో టెలికాం టవర్లకు అనుసంధానమయ్యే పరికరాలే ఉంటున్నాయి. వీటి నుంచి వచ్చే కాస్త ఇంటర్నెట్ స్పీడ్‌నే వైఫై ద్వారా అందిస్తున్నారు. విమానంలోని వారంతా ఆ స్పీడ్‌నే పంచుకోవాల్సి ఉంటుంది. దీనితో ఇంటర్నెట్ బాగా స్లోగా వస్తుంది. విమానాల్లో ఇంటర్నెట్ కోసం ప్రత్యేకంగా.. విమానాల్లో ఇంటర్నెట్ కోసమంటూ ఇటీవలే ప్రత్యేక సంస్థలు తెరపైకి వస్తున్నాయి. అందులో ‘గోగో కమర్షియల్ ఏవియేషన్’ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ సేవలు అందించే ఇంటెల్‌శాట్ కంపెనీకి అనుబంధ సంస్థ. అత్యంత అధునాతనమైన ‘2కేయూ వ్యవస్థ’తో విమానాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తోంది. ♦ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్ లింక్’ కూడా.. సముద్రాలు, ఎడారులు, ధ్రువ ప్రాంతాలు అనే తేడా లేకుండా భూమ్మీద అన్నిచోట్లా వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తామంటూ తెరపైకి వచ్చింది. ♦ఇలాంటి శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థలు రావడం, ఆ ఇంటర్నెట్కు అయ్యే వ్యయం కూడా తగ్గుతుండటంతో విమానయాన సంస్థలు తమ అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో వైఫైను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వారంలో కొత్త టెలికం బిల్లు: వైష్ణవ్
న్యూఢిల్లీ: నూతన టెలికం బిల్లును వారంలో ప్రకటిస్తామని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతిపాదిత డిజిటల్ ఇండియా కొత్త చట్టం తయారీ దశలో ఉన్నట్టు చెప్పారు. ఆన్లైన్ ప్రపంచాన్ని (ఇంటర్నెట్ కంపెనీలు) మరింత బాధ్యతాయుతంగా చేయనున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. తాము ప్రచురించే సమాచారానికి సోషల్ మీడియా, ఇంటర్నెట్, టెక్నాలజీ ప్రపంచాన్ని జవాబుదారీగా మార్చాలన్నది తమ ఉద్దేశ్యమని తెలిపారు. -
స్టార్టప్స్‌లో పెట్టుబడులు: ఈ షేరు రాకెట్ స్పీడ్
ముంబై, సాక్షి: ఇంటర్నెట్ ఆధారిత సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ షేరు తాజాగా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈలో తొలుత దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 3,988కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం యథాతథంగా రూ. 3,925 వద్ద ట్రేడవుతోంది. గత రెండేళ్లలో ఈ కౌంటర్ 187 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా కంపెనీ అనుబంధ సంస్థలైన జాబ్ పోర్టల్, మాట్రిమోనీ, రియల్టీ పోర్టల్ ప్రభావం చూపుతున్నాయి. దీనికితోడు కంపెనీ జొమాటో, పాలసీ బజార్‌సహా కనీసం 23 స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో జొమాటో ఇటీవల పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. కంపెనీ నౌకరీ, 99ఏకర్స్, జీవన్సాథీ, శిక్ష తదితర పోర్టళ్లను నిర్వహించే సంగతి తెలిసిందే. తొలి లిస్టెడ్ కంపెనీ డాట్‌కామ్ బూమ్ సమయంలో అంటే 1995లో ఆవిర్భవించిన ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ 2006 నవంబర్‌లో దేశీయంగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. తద్వారా దేశీయంగా లిస్టయిన తొలి ఇంటర్నెట్ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇటీవల ఇన్ఫీబీమ్, ఇండియామార్ట్ ఇంటర్మెష్, రూట్ మొబైల్స్ తదితర పలు కంపెనీలు లిస్టయ్యాయి. టెమాసెక్, టైగర్ గ్లోబల్, చైనీస్ యాంట్ గ్రూప్‌నకు సైతం వాటాలు కలిగిన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్‌కు సుమారు 20 శాతం వరకూ వాటా ఉన్నట్లు అంచనా. జొమాటోకు విదేశీ రీసెర్చ్ సంస్థ హెచ్ఎస్బీసీ ఏకంగా 5 బిలియన్ డాలర్ల విలువను అంచనా వేయడం గమనార్హం. దీంతో ఇటీవల ఇన్ఫో ఎడ్జ్ కౌంటర్ మరింత జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
జొమాటో.. పబ్లిక్ ఇష్యూ బాట
ముంబై: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. తద్వారా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తొలిసారి లిస్టయిన ఆధునిక ఇంటర్నెట్ వినియోదారు కంపెనీగా నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం 2019 జూన్‌లో బీటూబీ ఆన్లైన్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ మార్కెట్లలో లిస్టయ్యింది. ఇంటర్నెట్ ఆధారిత సేవలందించే ఇతర కంపెనీలను పరిగణిస్తే.. 2006లో ఇన్ఫో ఎడ్జ్, 2013లో జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూలను విజయవంతంగా ముగించాయి. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్ ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. కాగా.. 2010లో ఆన్ లైన్ ట్రావెల్ సేవల కంపెనీ మేక్ మై ట్రిప్.. నాస్డాక్ లో లిస్టింగ్ సాధించింది. కొటక్ మహీంద్రా.. పబ్లిక్ ఇష్యూకి మర్చంట్ బ్యాంకుగా కొటక్ మహీంద్రాను జొమాటో ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి న్యాయ సలహాదారులుగా సైరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, ఇండస్ లా సేవలందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశీయంగా దిగ్గజ కంపెనీలుగా ఆవిర్భవించిన ఫ్లిప్ కార్ట్, పేటీఎమ్, బిగ్ బాస్కెట్ సైతం భవిష్యత్ లో పబ్లిక్ ఇష్యూలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో.. ఇప్పటికే ఇన్ఫో ఎడ్జ్, టెమాసెక్, యాంట్ ఫైనాన్షియల్, టైగర్ గ్లోబల్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. దేశీ మార్కెట్ ఓకే విదేశీ లిస్టింగ్ కాకుండా దేశీయంగానే ఐపీవో చేపట్టాలని జొమాటో నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ విజయవంతమైన కంపెనీలకు తగిన ధర లభిస్తుండటమే దీనికి కారణమని వివరించారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ కంపెనీల పట్ల పలు దేశాల ఇన్వెస్టర్లు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. 2019 జులైలో రూ. 973 ధరలో ఐపీవోకు వచ్చిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ ప్రస్తుతం రూ. 4891కు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 14,240 కోట్లను తాకడం గమనార్హం. కాగా.. చివరిసారిగా నిధుల సమీకరణను పరిగణిస్తే జొమాటో విలువ 3.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే హెచ్ ఎస్బీసీ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. -
సైబర్ మోసాలపై టెకీల పోరు
బెంగళూరు: సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్ సేవల సంస్థలు మేక్మైట్రిప్ గ్రూప్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్.. మొబైల్ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ మొదలైనవి ఇందుకోసం జట్టు కట్టాయి. సైబర్ మోసాల తీరుతెన్నులు, నివారణ తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు ఈ సంస్థలు గతవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసపూరిత టోల్ ఫ్రీ నంబర్లు మొదలైన మార్గాల్లో మోసాలు జరుగుతున్న తీరును అవి వివరించినట్లు పేర్కొన్నాయి. అమాయక కస్టమర్లను మోసగించేందుకు ఉపయోగిస్తున్న 4,000 పైచిలుకు సిమ్ కార్డు నంబర్లు, 350–400 దాకా బ్యాంకు ఖాతాల వివరాలను రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం కంపెనీలకు కూడా అందించినట్లు వివరించాయి. అటు నకిలీ టోల్ ఫ్రీ నంబర్లు పేజీలో ప్రముఖంగా పైన కనిపించే విధంగా నేరగాళ్లు ఏ విధంగా సెర్చి ఇంజిన్‌ను దుర్వినియోగం చేస్తున్నదీ టెక్ దిగ్గజం గూగుల్‌కు కూడా ఆయా టెక్ దిగ్గజాలు తెలియజేశాయి. సాధారణంగా ఇలా సెర్చి ఇంజిన్ పేజీలో పైన ప్రముఖంగా కనిపించే నకిలీ టోల్ ఫ్రీ నంబర్లను వినియోగదారులు అసలైనవిగా భావించి.. మోసాల బారిన పడుతున్న ఉదంతాలు అనేకం నమోదవుతున్నాయి. ఎస్బీఐకు లేఖ.. గత కొద్ది వారాలుగా ఈ ఇంటర్నెట్ కంపెనీలు.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం రంగానికి చెందిన ఎయిర్టెల్ తదితర సంస్థలతో కూడా సమావేశాలు జరుపుతున్నాయి. ప్రభుత్వ రంగంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఆన్లైన్ కంపెనీలు లేఖ రాశాయి. ఎస్బీఐ ఖాతాలను ఉపయోగించి భారీ స్థాయిలో జరుగుతున్న సైబర్ మోసాల గురించి తెలియజేశాయి. అమాయక ఖాతాదారులను మోసగించేందుకు.. కీలకమైన వారి అకౌంట్ల వివరాలను తెలుసుకునే నేరగాళ్లు చాలామటుకు ఎస్బీఐ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు వివరిం చాయి. ఎస్బీఐ భారీ బ్యాంకు కావడంతో ఇలాంటి వారిని పట్టుకోవడం కష్టతరం కావొచ్చని టెక్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ మోసాలను అరికట్టడానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ సంస్థలతో జట్టు కట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసాలు ఇలా.. ఎక్కువగా పట్టణేతర ప్రాంతాల వారు, సీనియర్ సిటిజన్లు ఇలాంటి సైబర్ నేరాల బారిన పడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఖాతాగా భ్రమింపచేసే అకౌంటు నుంచి ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. సిసలైన కంపెనీగా కనిపించినప్పటికీ.. ఇలాంటి పోర్టల్ పేర్లలో ఎక్కడో ఒకటో అరా తేడాలుంటున్నాయి. ఉదాహరణకు.. మేక్‌మై ట్రిప్ పోర్టల్ వంటి పోర్టల్స్ పేర్లలో నకిలీ సైట్లు అదనంగా మరో అక్షరం చేరుస్తున్నాయి. ఆకర్షణీయ బహుమతుల ఆఫర్లతో తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇలాంటి మెసేజ్‌లను వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆయా లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా మోసాల బారిన పడుతున్నారు. -
‘క్లిక్’ అవుతున్న పోస్ట్..
2008లో డాట్ కామ్ బూమ్ బద్దలయింది. బోలెడన్ని ఇంటర్నెట్ కంపెనీలు మూతపడ్డాయి. కాకపోతే... ఆ బూమ్‌లో వేసిన కేబుళ్లు, బ్రాడ్ బ్యాండ్ లైన్లు... దేశంలో కొత్త ఇంటర్నెట్ విప్లవానికి ఊపిరినిచ్చాయి. ఉత్తరాలు, పోస్టు కార్డులను ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు మరిపించేశాయి. మనీ ఆర్డర్లను డిజిటల్ బ్యాంకింగ్ మింగేసింది. ఇక తపాలా శాఖ ప్రాభవం తగ్గిందనే అనుకున్నారంతా!! కానీ దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగానికున్న అద్వితీయ నెట్వర్క్... దాన్నిపుడు ఈ-కామర్స్‌లో హీరోను చేస్తోంది. కాలం మారుతున్నా అవకాశాలు ఎక్కడికీ పోవని చెప్పేవే ఈ రెండు ఉదాహరణలూ!!. టెక్నాలజీ పరంగా భారీ మార్పులు ♦ ఈ-కామర్స్ డెలివరీల్లో మూడంకెల అభివృద్ధి ♦ అమెజాన్, స్నాప్‌డీల్ వంటి దిగ్గజాలతో ఇప్పటికే జట్టు ♦ గ్రామాల్లో ఎవ్వరికీ లేనంత విసృ్తత నెట్వర్క్ దీని బలం ♦ అక్కడ డెలివరీలు పెరిగితే ఆదాయం భారీగా పెరిగే చాన్స్ ♦ సీఓడీ కోసం కార్డ్ ఆధారిత, మొబైల్ ఆధారిత పేమెంట్లు? ♦ ఏపీ, తెలంగాణల్లో పెరగనున్న ప్రత్యేక ప్రాసెసింగ్ కేంద్రాలు ♦ దసరా డెలివరీలకు సెలవులు సైతం రద్దు చేసుకుని విధులు ఇపుడెవరి నోట చూసినా ఈ-కామర్సే. డీల్స్, డిస్కౌంట్స్‌తో ఊదరగొట్టేస్తున్న ఈ-కామర్స్‌లో అన్నిటికన్నా ముఖ్యమైనది డెలివరీ యంత్రాంగమే. ఎందుకంటే అమ్మేవారు, కొనేవారు దేశమంతా ఉన్నారు. వారిని కలిపే టెక్నాలజీ ఈ-కామర్స్ కంపెనీలన్నిటి దగ్గరా ఉంది. మరి అమ్మేవారి నుంచి వస్తువుల్ని కొనుగోలుదారుకు చేర్చాలి కదా! అందుకే కొన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సొంత లాజిస్టిక్స్ కంపెనీల్ని ఏర్పాటు చేసుకున్నాయి. మిగిలిన దిగ్గజాలు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. కాకపోతే ఎందరెన్ని చేసినా వారికున్నది పరిమిత యంత్రాంగమే. మారుమూల గ్రామాలతో సహా దేశవ్యాప్త నెట్వర్క్ ఉన్న పోస్టల్‌కు ఏ కొరియర్ కంపెనీ కూడా సాటిరాదు. ఒకవేళ ఎవరైనా విస్తరించినా అది లాభదాయకం కాదు. అందుకే అమెజాన్, స్నాప్‌డీల్‌లు గతేడాది పోస్టల్ శాఖతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి. ఇపుడు అమెజాన్‌లో కొన్న వస్తువులు కొన్ని నేరుగా పోస్ట్‌మ్యాన్ అందిస్తున్నాడంటే కారణం అదే మరి. ఈ-కామర్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు ఈ-కామర్స్‌ను ప్రాధాన్యాంశంగా పరిగణిస్తున్న పోస్టల్ విభాగం దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు, టెక్నాలజీ ఆధునికీకరణ వంటివి చేపట్టింది. అందుకే... ఈ-కామర్స్ పార్శిళ్ల ద్వారా గతేడాది ఏప్రిల్ - డిసెంబరు మధ్య రూ.1,968 కోట్ల ఆదాయం ఆర్జించిన ఈ శాఖ... ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఏకంగా 115% వృద్ధిని సాధించింది. ఇక ఏపీ, తెలంగాణల్లో అయితే ఈ వృద్ధి 150%. ఇక్కడ సెప్టెంబరు వరకూ ఆర్జించిన ఆదాయం రూ.158 కోట్లు దాటింది. ఇది ఒకరకంగా రికార్డేనని చెప్పాలి. ఇక క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల (సీఓడీ) బట్వాడాకు నాప్టోల్ వంటివి పూర్తిగా పోస్టల్ విభాగంపైనే ఆధారపడుతున్నాయి. స్టాంపుల విక్రయానికి స్నాప్‌డీల్, దేశవ్యాప్త డెలివరీ కోసం అమెజాన్ ప్రత్యేక ఒప్పందాలూ చేసుకున్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ-కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీలకు తగినంత నెట్వర్క్ లేకపోవటంతో అవన్నీ పోస్టల్నే ఆశ్రయిస్తున్నాయి. ఉచిత పికప్; టెక్నాలజీ మార్పులు టెక్నాలజీని కూడా పోస్టల్ శాఖ వేగంగా అందిపుచ్చుకుంటోందని చెప్పాలి. తమతో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు పోస్ట్‌మ్యాన్‌ను పంపి ఉచిత పికప్ సదుపాయం ఇవ్వటం... డెలివరీ రోజున కస్టమర్‌కు ఫోన్ లేదా ఎస్ఎంఎస్ చేయటం... కస్టమర్‌కు ఫోన్‌చేసి షెడ్యూలు మార్చుకునే అవకాశమివ్వటం వంటివన్నీ దీన్లో భాగమే. ఇక సీఓడీ రిటర్న్స్ విషయంలో ఒకవైపు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తుండటం దీనికి కలిసొస్తోంది. ఇక హబ్‌ల ఏర్పాటును కూడా సంస్థ వేగవంతం చేసింది. ఇటీవలే ముంబయిలో 12వేల చదరపుటడుగుల్లో ప్రత్యేక ఈ-కామర్స్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని కూడా ఆరంభించింది. గ్రామాలకు ఈ-కామర్స్ వెళితే...! ఇపుడు ఈ-కామర్స్ కొనుగోలుదారులు ప్రధానంగా ప్రధాన నగరాల నుంచే చేస్తున్నారు. అందుకని వాటి సొంత లాజిస్టిక్స్ వ్యవస్థ కొంతవరకూ పనికొస్తోంది. దీన్లో గ్రామాల వాటా పెరిగితే మాత్రం పోస్టల్‌కు తిరుగులేని ఆధిక్యం వస్తుందనేది వాస్తవం. ‘‘ప్రస్తుతం విలువ పరంగా ఈ-కామర్స్‌లో 60 శాతం వాటా దేశంలోని టాప్-20 నగరాలదే. ఇది మారి గ్రామాల వాటా పెరిగితే పోస్టల్కున్న నెట్‌వర్క్‌తో అది చాలా బలోపేతమవుతుంది’’ అని రిటైల్ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇది మారుతుందని, ఇప్పటికే స్నాప్‌డీల్ వంటి సైట్లలో ఆ సంకేతాలొస్తున్నాయని చెప్పారాయన. ఈ సమస్యల్ని అధిగమిస్తేనే... నెట్‌వర్క్‌లో పోస్టల్ విభాగం నెంబర్-1 అనటంలో ఎవరికీ సందేహం లేదు. అయితే టెక్నాలజీ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. రిటర్న్ ఆర్డర్లు చాలా ఆలస్యంగా హబ్‌లకు చేరుతుండటం, సీఓడీ రూపంలో తీసుకున్న నగదును కంపెనీలకు రెమిట్ చేయటంలో మిగతా కొరియర్లతో పోలిస్తే ఆలస్యమవుతుండటం వంటి సమస్యలున్నాయి. ఇక అన్ని సంస్థలకూ సాఫ్ట్వేర్ పరంగా మద్దతివ్వటం కూడా సాధ్యం కావాల్సి ఉంది. - సాక్షి, బిజినెస్ విభాగం ఇది మా ప్రాధాన్యాంశం... పోస్టల్ విభాగానికి ఈ-కామర్స్‌ను ప్రాధాన్యాంశంగా కేంద్రం నిర్దేశించిందని, ప్రతి నెలా కేంద్ర మంత్రి సారథ్యంలో సమీక్షలు జరుగుతున్నాయని హైదరాబాద్‌లోని పోస్ట్ మాస్టర్ జనరల్ పి.వి.ఎస్.రెడ్డి చెప్పారు. తాము కూడా దానికి తగ్గట్టే మార్పులు చేస్తున్నామని ‘సాక్షి’ ప్రతినిధితో చెబుతూ... ‘‘దసరాకు అన్ని కంపెనీలూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. డెలివరీకి మమ్మల్ని ఆశ్రయించిన సంస్థల కోసం మేం 22, 24, 25 వంటి సెలవు రోజుల్లో కూడా సిబ్బందిని ప్రత్యేకంగా పిలిపిస్తున్నాం. ఈ-కామర్స్ పార్శిళ్లు డెలివరీ చేసిన సిబ్బందికి అదనపు ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం కనక వాళ్లూ ఉత్సాహంతో చేస్తున్నారు. కంపెనీలకు సీఓడీ రెమిటెన్స్‌లు ఆలస్యం కాకుండా కార్డు ఆధారిత పేమెంట్, మొబైల్ మనీ వంటి అంశాల్ని పరిశీలిస్తున్నాం. ఈ-కామర్స్ కోసం హైదారాబాద్ హుమయూన్ నగర్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. హైదరాబాద్‌లో మరొకటి, గుంటూరు, తిరుపతిలో తలా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం’’ అని వివరించారు. తమ విభాగం ముందడుగు వేస్తోందంటూ... మెరుగుపడాల్సింది ఇంకా చాలానే ఉందని కూడా అంగీకరించారాయన.