Terms of governments
-
చిన్న సంస్థలూ పోటీ పడగలగుతాయి
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీల నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడం.. చిన్న సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటిదాకా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న పెద్ద కంపెనీలకు అడ్డదారులన్నీ మూసుకుపోతాయని షాప్‌క్లూస్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. ‘బడా విదేశీ కంపెనీలు ముందు నుంచీ ఈ పాలసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించిందనేది తాజా నిబంధనల ద్వారా వెల్లడైంది‘ అని షాప్‌క్లూస్ సీఈవో సంజయ్ సేథి చెప్పారు. విక్రేతలందరూ ఈ–కామర్స్ ప్రయోజనాలు పొందేందుకు తాజా మార్పులు దోహదపడగలవని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ పేర్కొన్నారు. ‘పెద్ద సంస్థలతో సమానంగా చిన్న సంస్థలు కూడా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తాజా నిబంధనలు ఉపయోగపడతాయి. లఘు వ్యాపార సంస్థలు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలు అందుకోవచ్చు‘ అని ఇన్‌స్టామోజో సీఈవో సంపద్ స్వైన్ తెలిపారు. ఇకపై ఈ–కామర్స్ సంస్థలు భారత్‌లో తమ వ్యాపార వ్యూహాలను సవరించుకోవాల్సి వస్తుందని ఈవై ఇండియా నేషనల్ లీడర్ (పాలసీ అడ్వైజరీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్) రాజీవ్ చుగ్ అభిప్రాయపడ్డారు. చర్చించి ఉండాల్సింది: ఫ్లిప్‌కార్ట్ మరోవైపు, పరిశ్రమ వృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపే నిబంధనలను రూపొందించేటప్పుడు.. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో సమాలోచనలు జరపడం ముఖ్యమని ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ–కామర్స్ వ్యవస్థతో చిన్న సంస్థలకు తోడ్పాటు లభిస్తుండటంతో పాటు వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతోందని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, దేశ ఎకానమీకి ఈ పరిశ్రమ వృద్ధి చోదకంగా మారగలదని పేర్కొంది. ఇక, నిబంధనల సర్క్యులర్‌ను అధ్యయనం చేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. నిబంధనలు కచ్చితంగా అమలవ్వాలి.. ఈ–కామర్స్ సైట్లలో అమ్మకాలకు సంబంధించిన కొత్త నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ ప్రభుత్వాన్ని కోరింది. ‘మేం లేవనెత్తిన ప్రధాన అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై క్యాష్‌బ్యాక్ అమ్మకాలు, డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్ విక్రయాల్లాంటివి ఉండబోవు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే వీటిని కఠినంగా అమలు కూడా చేస్తుందని ఆశిస్తున్నాం‘ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. దిగ్గజాలకు సమస్యలు.. కొత్త నిబంధనలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలపైనే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ప్రకటించిన నిబంధనల ప్రకారం.. తమకు వాటాలు ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై విక్రయించడానికి లేదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ అమ్మకాల కోసం ఏ సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. పోటీని దెబ్బతీసేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి లేదు. దాదాపు 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాలు కొన్న అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ లాంటి వాటికి ఈ నిబంధనలు సమస్యాత్మకమే. అవి సొంత ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయించుకోవడానికి ఉండదు. అలాగే, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలపై ఆంక్షల ప్రభావం అసూస్, వన్‌ప్లస్, బీపీఎల్ వంటి బ్రాండ్స్‌పై పడనుంది. -
ఆధార్ నమోదులో చేతివాటం
జ్యోతినగర్(రామగుండం): నేడు ఆధార్ అంటే అందరికీ అవసరమైన కార్డు ..ఏ అవసరానికైనా మొదటగా ఉపయోగపడేది ఆధార్ కార్డు అంటే అతిశయోక్తి కాదు. దీనిని పొందడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు. సేవలు చేయడానికే అంటూ బోర్డులు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లలకు పాల్పడుతున్నారు. చదువు రాని వారు వస్తే చాలు ఇక ఎంత వీలుంటే అంతా లాగేసుకోవడమే..ఇలా అమాయకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఎవరికి చెప్పాలన్నా ఆధారాలుండవు. దీంతో పోనీలే అనుకుంటున్నారు వినియోగదారులు. కానీ సిబ్బంది మాత్రం రోజుల తరబడి ఇదే పనిలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గోదావరిఖని ప్రాంతంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనులకు వచ్చిన ఇతర రాష్ట్రాల వారి వద్ద నుంచి అందినకాడికి దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినియోగదారులు కోరుతున్నారు. గుర్తింపును ధ్రువీకరించే పత్రాలు రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డు, జాబ్ కార్డు, గుర్తింపు పొందిన విద్యా సంస్థచే జారీ చేయబడిన కార్డు, ఆయుధాల లైసెన్సు, ఫొటో ఉన్న బ్యాంకు ఏటీఎం, పింఛన్‌దారు కార్డు, స్వాతంత్య్ర సమరయోధుల కార్డు, కిసాన్ ఫొటో పాస్‌బుక్, ఇసీహెచ్ఎస్ ఫొటో కార్డు, తపాల శాఖ జారీ చేసిన పేరు, ఫొటో కలిగిన కార్డు, గ్రూఫ్–ఏ గెజిటెడ్ అధికారి తన లెటర్ హెడ్‌పై జారీ చేసిన ఫొటో ఉన్న గుర్తింపు పత్రం. చిరునామా ధ్రువీకరించే పత్రాలు.. గ్రామపంచాయతీ అధికారి లేదా హోదా కలిగిన అధికారి లెటర్ హడ్పై జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం, వాహన రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలు. పుట్టిన తేదీ ధ్రువీకరించే పత్రాలు.. పేరు, పుట్టిన తేదీ ఉన్న వివరాలు కలిగిన ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, ఎస్ఎస్ఎల్సీ, పదో తరగతి పత్రం, పాస్‌పొర్టు, గ్రూఫ్(ఏ) అధికారి లెటర్ హెడ్ మీద జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం. -
టెండర్లలో కిరికిరి
సాక్షి ప్రతినిధి, కడప: దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే తలంపుతో అధికారపార్టీ నేతలున్నారు. అందుకు తగ్గట్టుగా సహకారం అందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అప్పనంగా కాంట్రాక్టు పనులు అప్పగించేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు. పారదర్శకత కోసం నిర్దేశించిన ఆన్లైన్ టెండర్లకు మైనర్ ఇరిగేషన్‌శాఖ తిలోదకాలిచ్చింది. తద్వారా పాలకపక్ష పార్టీ నాయకులకు కల్పతరువుగా మారింది. రూ.3.5 కోట్లు పనులను గుట్టు చప్పుడు కాకుండా కట్టబెట్టేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఉదయం నోటీసు బోర్డులో టెండరు ప్రకటన పొందుపర్చి, సాయంత్రమే షెడ్యూల్‌కు తుది గడువును విధించి స్వామిభక్తి ప్రదర్శించారు. అధికార పార్టీ నేతలకు పోటీదారులు లేకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లో చెరువులు, పికప్ ఆనకట్టలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. లక్ష రుపాయాలు పైబడి చేపట్టేపనులకు ఆన్లైన్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ మేరకు ఇతర జిల్లాల్లో టెండర్లను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం కోరుకున్న వారికి, కోరుకున్న పనులు అప్పగించడంలో నిమగ్నమైంది. అందులో భాగంగా నిబంధలను కాలరాస్తూ, అధికార పక్షం మెప్పుకోసం పరితపిస్తోంది. పాత నిబంధనల ప్రకారం రూ.10 లక్షల లోపు పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పరిధిలో టెండర్లు ఖరారు చేయవచ్చు. మారిన నిబంధనల ప్రకారం అయితే రూ.1లక్ష పైబడిన పనులన్నింటికీ ఆన్లైన్ టెండర్లు నిర్వహించాలని ఉత్తర్వులున్నాయి. ఆన్లైన్ టెండర్ల ద్వారా పారదర్శకతకు అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లు రింగ్ అయ్యే అవకాశమే ఉండదు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఏర్పడదు. అయితే ఇక్కడి యంత్రాంగం ఆ నిబంధనలు అమలు చేయడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదు. గుట్టు చప్పుడు కాకుండా టెండర్ల ప్రక్రియ టెండర్ల నిర్వహణలో పారదర్శకతకు పాతర వేయడమే కాకుండా గుట్టుచప్పుడు కాకుండా టెండర్ల తంతుకు శ్రీకారం చుట్టారు. మైనర్ ఇరిగేషన్ శాఖ (ఎంఐ డివిజన్) పరిధిలో వీరబల్లె మండలంలో 27 పనులకు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లె, గాలివీడు మండలాల్లో 10 పనులకు టెండర్లు నిర్వహించేందుకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3.5కోట్ల పనులకు ఒక్కొక్కటి రూ. 9లక్షల పైబడి అంచనా వ్యయంతో నిర్వహించారు. ఉదయం 11.30 గంటల తర్వాత మైనర్ ఇరిగేషన్ శాఖ నోటీసు బోర్డులో టెండరు ప్రకటనను పాత తేదీతో జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు షెడ్యూల్ తీసుకోవడానికి తుది గడువు విధించారు. శనివారం టెండర్లు దాఖలు చేయాల్సిందిగా నిర్ణయించారు. వాస్తవానికి శుక్రవారం ఉదయమే టెండర్ల వివరాలను నోటీసు బోర్డులో ఉంచారని ఆ శాఖ వర్గాలే బహిరంగంగా పేర్కొంటున్నాయి. ఓ ఉన్నతాధికారి పదవీ విరమణ నేపథ్యంలో ముందస్తు అనుమతులు పాత తేదీల్లో జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు గుట్టు చప్పుడు కాకుండా టెండర్ల తంతు ముగింపు పలికేందుకు, అనుకున్న వారికే కట్టబెట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. మరింత పారదర్శకంగా ఉండాలంటే ప్రస్తుతం టెండర్లు వాయిదా వేసి ఆతర్వాత టెండరు ప్రకటన జారీ చేస్తే యోగ్యకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఈఈ సాయిరాంప్రసాద్ ఏమన్నారంటే... సమైక్యాంధ్ర సమ్మె కంటే మునుపు ప్రతిపాదనలు పంపిన పనులకు ఇప్పుడు టెండర్లు నిర్వహిస్తున్నాం. అప్పుడు పంపిన ప్రతిపాదనల మేరకే టెండర్లను కొనసాగిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా టెండర్లు నిర్వహించడం సరైన చర్యే. అయితే అప్పటి ప్రతిపాదనల కారణంగానే ఓపెన్ టెండర్లను కొనసాగిస్తున్నాం. 37 పనులకు టెండర్ల షెడ్యూల్‌కు మూడు రోజులు గడువు విధించాం. ఒక్కో టెండరు అంచనా వ్యయం రూ.8లక్షల నుంచి రూ.9లక్షలకు కొంత అటు ఇటుగా ఉంది. ఈ ప్రతిపాదనలన్నీ గతంలోవి కావడంతోనే అలా చేపట్టామని వివరించారు.