సాక్షి ప్రతినిధి, కడప: దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే తలంపుతో అధికారపార్టీ నేతలున్నారు. అందుకు తగ్గట్టుగా సహకారం అందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
పభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అప్పనంగా కాంట్రాక్టు పనులు అప్పగించేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు. పారదర్శకత కోసం నిర్దేశించిన ఆన్‌లైన్ టెండర్లకు మైనర్ ఇరిగేషన్‌శాఖ తిలోదకాలిచ్చింది. తద్వారా పాలకపక్ష పార్టీ నాయకులకు కల్పతరువుగా మారింది. రూ.3.5 కోట్లు పనులను గుట్టు చప్పుడు కాకుండా కట్టబెట్టేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఉదయం నోటీసు బోర్డులో టెండరు ప్రకటన పొందుపర్చి, సాయంత్రమే షెడ్యూల్‌కు తుది గడువును విధించి స్వామిభక్తి ప్రదర్శించారు. అధికార పార్టీ నేతలకు పోటీదారులు లేకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
మైనర్ ఇరిగేషన్ శాఖ రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లో చెరువులు, పికప్ ఆనకట్టలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. లక్ష రుపాయాలు పైబడి చేపట్టేపనులకు ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ మేరకు ఇతర జిల్లాల్లో టెండర్లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం కోరుకున్న వారికి, కోరుకున్న పనులు అప్పగించడంలో నిమగ్నమైంది. అందులో భాగంగా నిబంధలను కాలరాస్తూ, అధికార పక్షం మెప్పుకోసం పరితపిస్తోంది.
పాత నిబంధనల ప్రకారం రూ.10 లక్షల లోపు పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పరిధిలో టెండర్లు ఖరారు చేయవచ్చు. మారిన నిబంధనల ప్రకారం అయితే రూ.1లక్ష పైబడిన పనులన్నింటికీ ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించాలని ఉత్తర్వులున్నాయి. ఆన్‌లైన్ టెండర్ల ద్వారా పారదర్శకతకు అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లు రింగ్ అయ్యే అవకాశమే ఉండదు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఏర్పడదు. అయితే ఇక్కడి యంత్రాంగం ఆ నిబంధనలు అమలు చేయడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదు.
గుట్టు చప్పుడు కాకుండా టెండర్ల ప్రక్రియ
టెండర్ల నిర్వహణలో పారదర్శకతకు పాతర వేయడమే కాకుండా గుట్టుచప్పుడు కాకుండా టెండర్ల తంతుకు శ్రీకారం చుట్టారు. మైనర్ ఇరిగేషన్ శాఖ (ఎంఐ డివిజన్) పరిధిలో వీరబల్లె మండలంలో 27 పనులకు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లె, గాలివీడు మండలాల్లో 10 పనులకు టెండర్లు నిర్వహించేందుకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3.5కోట్ల పనులకు ఒక్కొక్కటి రూ. 9లక్షల పైబడి అంచనా వ్యయంతో నిర్వహించారు. ఉదయం 11.30 గంటల తర్వాత మైనర్ ఇరిగేషన్ శాఖ నోటీసు బోర్డులో టెండరు ప్రకటనను పాత తేదీతో జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు షెడ్యూల్ తీసుకోవడానికి తుది గడువు విధించారు. శనివారం టెండర్లు దాఖలు చేయాల్సిందిగా నిర్ణయించారు. వాస్తవానికి శుక్రవారం ఉదయమే టెండర్ల వివరాలను నోటీసు బోర్డులో ఉంచారని ఆ శాఖ వర్గాలే బహిరంగంగా పేర్కొంటున్నాయి.
ఓ ఉన్నతాధికారి పదవీ విరమణ నేపథ్యంలో ముందస్తు అనుమతులు పాత తేదీల్లో జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు గుట్టు చప్పుడు కాకుండా టెండర్ల తంతు ముగింపు పలికేందుకు, అనుకున్న వారికే కట్టబెట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. మరింత పారదర్శకంగా ఉండాలంటే ప్రస్తుతం టెండర్లు వాయిదా వేసి ఆతర్వాత టెండరు ప్రకటన జారీ చేస్తే యోగ్యకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ఈఈ సాయిరాంప్రసాద్ ఏమన్నారంటే...
సమైక్యాంధ్ర సమ్మె కంటే మునుపు ప్రతిపాదనలు పంపిన పనులకు ఇప్పుడు టెండర్లు నిర్వహిస్తున్నాం. అప్పుడు పంపిన ప్రతిపాదనల మేరకే టెండర్లను కొనసాగిస్తున్నాం. ఆన్‌లైన్ ద్వారా టెండర్లు నిర్వహించడం సరైన చర్యే. అయితే అప్పటి ప్రతిపాదనల కారణంగానే ఓపెన్ టెండర్లను కొనసాగిస్తున్నాం. 37 పనులకు టెండర్ల షెడ్యూల్‌కు మూడు రోజులు గడువు విధించాం. ఒక్కో టెండరు అంచనా వ్యయం రూ.8లక్షల నుంచి రూ.9లక్షలకు కొంత అటు ఇటుగా ఉంది. ఈ ప్రతిపాదనలన్నీ గతంలోవి కావడంతోనే అలా చేపట్టామని వివరించారు.
టెండర్లలో కిరికిరి
Published Sun, Feb 2 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement