విలీన బాటలో స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్
ముంబై: ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్ సంస్థ విలీనంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా స్టాక్స్ డీల్‌గా ఉండొచ్చునని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే ఈ అంశంపై చర్చలు జరిగినట్లు, ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైతే సంప్రతింపులు మళ్లీ ప్రారంభం కావొచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. చెల్లింపుల బ్యాంక్ లైసెన్స్ పొందిన పేటీఎం సంస్థ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మార్చి 31లోగా తమ మార్కెట్‌ప్లేస్ వ్యాపార విభాగాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్నాప్‌డీల్‌తో ఈ–కామర్స్ వ్యాపార విభాగం విలీనంపై వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు సంస్థల్లోనూ వాటాలు ఉన్న చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఈ డీల్‌కు సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆలీబాబాకు పేటీఎంలో 40%, స్నాప్‌డీల్‌లో 3% వాటాలు ఉన్నాయి. పేటీఎం ఈ–కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ఆలీబాబా, ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్ నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. ఒకవేళ స్నాప్‌డీల్, పేటీఎం ఈ–కామర్స్ విలీనం జరిగిందంటే కొత్తగా ఏర్పడే సంస్థలో ఆలీబాబా అతి పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ఈ మొత్తం డీల్‌లో జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కూడా ప్రయోజనం పొందనుంది. స్నాప్‌డీల్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌కి అటు ఆలీబాబాలో కూడా గణనీయమైన వాటాలు ఉన్నాయి. ఆలీబాబా ఇటీవలే పేటీఎం ఈ–కామర్స్‌లో రూ. 1,350–1,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసింది. తద్వారా భారత మార్కెట్లో ఆన్‌లైన్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లతో పోటీపడుతోంది. పేటీఎం వేల్యుయేషన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
పేటీఎంలో రిలయన్స్ క్యాప్ వాటా సేల్..!
పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో తమకున్న 1 శాతం వాటాను విక్రయించాలని రిలయన్స్ క్యాపిటల్ యోచిస్తోంది. తద్వారా 50–60 మిలియన్ డాలర్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే రిలయన్స్ క్యాపిటల్ వర్గాలు ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించాయి.