
న్యూఢిల్లీ: వినియోగదారులను నష్టపర్చేలా పలు ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ ’డార్క్ ప్యాటర్న్’ పద్ధతులు పాటిస్తుండటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే దిశగా స్వీయ నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని సంస్థలను ఆదేశించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగీ, జొమాటో తదితర ఈ–కామర్స్ సంస్థలతో భేటీ అనంతరం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన తగు వ్యవస్థ ఏర్పాటు కాగలదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్‌లో వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా మోసం చేసే విధానాలను డార్క్ ప్యాటర్న్‌లుగా వ్యవహరిస్తారు.
ఉదాహరణకు యూజరు ఎంచుకోకపోయినా షాపింగ్ బాస్కెట్‌లో కొన్ని ఐటమ్‌లను జోడించేయడం, చెక్ అవుట్ చేసే సమయంలో ఉత్పత్తుల ధరలను మార్చేయడం, తక్షణం కొనుగోలు చేయకపోతే నష్టపోతామేమో అనే తప్పుడు భావన కలిగేలా తొందరపెట్టడంలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. మధ్యవర్తులు అమ్మకాలను పెంచుకునేందుకు లేదా అమ్ముకునేందుకు అమలు చేసే మోసపూరిత విధానాల గురించి ఈ–కామర్స్ సైట్లను వాడే వినియోగదారులకు, విక్రేతలకు పెద్దగా తెలియదని సింగ్ చెప్పారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అవగాహన కల్పించి, స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇలాంటి పద్ధతులు కొనసాగితే ఈ విషయంలో నిబంధనలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.