పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాల షాక్
పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాల షాక్
Published Mon, Oct 3 2016 10:49 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
న్యూఢిల్లీ : పండుగ సీజన్ను క్యాష్ చేసుకుని భారీగా ప్రకటనలు ఇచ్చేసుకునే ఉత్పత్తిదారులకు ఈ-కామర్స్ దిగ్గజాలు స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ షాకిచ్చాయి. దీపావళికి ముందు తమ ప్లాట్ఫామ్పై ప్రొడక్ట్ ప్రకటన ఇచ్చేవారికి భారీగా రేట్లను పెంచేశాయి.అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు జరుగబోయే 'అన్బాక్స్ దీపావళి సేల్స్' ప్రోగ్రామ్ కింద అన్ని రకాల ఉత్పత్తులపై కాస్ట్ ఫర్ క్లిక్(సీపీఏ)లను స్నాప్డీల్ రెట్టింపు చేసింది. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ సైతం ప్రొడక్ట్ లిస్టింగ్ యాడ్(పీఎల్ఏ) రేట్లను 50 శాతం పెంచేసింది.
'బిగ్ బిలియన్ డే సేల్' కింద లైఫ్స్టైల్, గృహోపకరణాలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి వస్తువులకు ఈ ప్రకటన ఖర్చులు భారం పడనుంది.మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మాత్రం తాను నిర్వహించబోయే 'గ్రేట్ ఇండియన్ సేల్' నేపథ్యంలో ప్రకటన రేట్లలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు.పెద్ద ఉత్పత్తుల బ్రాండులు తమ అడ్వర్టైజింగ్లను కోసం భారీ మొత్తంలో ఖర్చుచేసైనా సరే మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చేసుకుంటారని,కానీ చిన్న వర్తకులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే పండుగ సీజన్లో ఉండే రద్దీకి అనుకూలంగా ఈ రేట్లను పెంచామని, టీవీ, ఇతర మీడియాలు కూడా ఈ సమయంలో ప్రకటన రేట్లను పెంచుతాయని ఫ్లిప్కార్ట్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ రామకృష్ణ చెప్పారు. ప్రకటనదారులు దానికి సన్నద్దమయ్యే ఉంటారని పేర్కొన్నారు.
Advertisement