advertising rates
-
2022లో ప్రకటనల వ్యయాలు...
ముంబై: ప్రకటనల వ్యయాల విషయంలో 2022 భారత్ ఒక కీలక మైలురాయిని అధిగమించనుందని గ్రూప్ఎమ్ ఇండియా ప్రెసిడెంట్ (ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రైసింగ్) సిద్ధార్థ్ పరాశర్ పేర్కొన్నారు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2022లో భారత్ మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లకు చేరుతుందని పేర్కొంటూ అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ఎమ్ తన ‘ దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్’ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల నివేదికను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. టెలివిజన్‌ను అధిగమించి డిజిటల్ విభాగం అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని కూడా నివేదిక పేర్కొంది. ఆయా అంశాలపై సిద్ధార్థ్ పరాశర్ వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ రంగం పురోగమిస్తున్నప్పటికీ, కరోనా కష్టకాలం తర్వాత ఓఓహెచ్ (అవుట్ ఆఫ్ హోమ్) అడ్వర్టైజింగ్, సినిమా విభాగాలు కూడా పురోగమిస్తాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇ–కామర్స్‌పై ప్రకటనలు, ఓటీటీ, షార్ట్ ఫార్మేట్ వీడియోల రంగాల్లో 2021లో చోటుచేసుకున్న వృద్ధి 2022లో కూడా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బ్రాండ్స్ విషయంలో వినియోగదారు దృష్టి సారించే విధానాలపై మహమ్మారి పాఠాలు నేర్పిందని పేర్కొన్నారు. బ్రాండ్స్ తమ మార్కెట్ నమూనాలను ఆధునికీరించుకోడానికి ఆయా అంశాలు దోహదపడుతున్నట్లు తెలిపారు. దీనితోపాటు వివిధ మాధ్యమాలు పలు ఉత్పత్తులకు విస్తృత వినియోగ మార్కెట్‌ను సృష్టిస్తున్నట్లు విశ్లేషించారు. -
పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాల షాక్
న్యూఢిల్లీ : పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకుని భారీగా ప్రకటనలు ఇచ్చేసుకునే ఉత్పత్తిదారులకు ఈ-కామర్స్ దిగ్గజాలు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ షాకిచ్చాయి. దీపావళికి ముందు తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రొడక్ట్ ప్రకటన ఇచ్చేవారికి భారీగా రేట్లను పెంచేశాయి.అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు జరుగబోయే 'అన్‌బాక్స్ దీపావళి సేల్స్' ప్రోగ్రామ్ కింద అన్ని రకాల ఉత్పత్తులపై కాస్ట్ ఫర్ క్లిక్(సీపీఏ)లను స్నాప్‌డీల్ రెట్టింపు చేసింది. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ సైతం ప్రొడక్ట్ లిస్టింగ్ యాడ్(పీఎల్ఏ) రేట్లను 50 శాతం పెంచేసింది. 'బిగ్ బిలియన్ డే సేల్' కింద లైఫ్‌స్టైల్, గృహోపకరణాలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి వస్తువులకు ఈ ప్రకటన ఖర్చులు భారం పడనుంది.మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మాత్రం తాను నిర్వహించబోయే 'గ్రేట్ ఇండియన్ సేల్' నేపథ్యంలో ప్రకటన రేట్లలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు.పెద్ద ఉత్పత్తుల బ్రాండులు తమ అడ్వర్టైజింగ్లను కోసం భారీ మొత్తంలో ఖర్చుచేసైనా సరే మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చేసుకుంటారని,కానీ చిన్న వర్తకులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పండుగ సీజన్లో ఉండే రద్దీకి అనుకూలంగా ఈ రేట్లను పెంచామని, టీవీ, ఇతర మీడియాలు కూడా ఈ సమయంలో ప్రకటన రేట్లను పెంచుతాయని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ రామకృష్ణ చెప్పారు. ప్రకటనదారులు దానికి సన్నద్దమయ్యే ఉంటారని పేర్కొన్నారు. -
పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనల రేట్లు పెంపు
న్యూఢిల్లీ: పత్రికల్లో ప్రకటనల రేట్లను మధ్యంతరంగా 19 శాతం పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఈ ఏడాది అక్టోబర్ 15నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలను డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిసిటీ(డీఏవీపీ) విభాగం పత్రికలకు, ఇతర ప్రచురణ సంస్థలకు విడుదల చేస్తూ ఉం టుంది. వీటికి కొత్త రేట్ల ప్రకారం ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. ధరల సవరణ కమిటీ (ఆర్ఎస్సీ) సిఫారసుల మేరకు మూడేళ్లకోసారి కేంద్రం ప్రకట నల రేట్లను సవరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ ఉన్న ధరల విధానానికి అక్టోబర్ 14తో గడువు తీరింది. అయితే, గడువులోపు 7వ ఆర్ఎస్సీ సిఫారసులు ప్రభుత్వానికి అందలేదు. ఈ లోపు మధ్యంతరంగా ధరలను పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆర్థిక శాఖ, ఎలక్షన్ కమిషన్‌ను సం ప్రదించిన అనంతరం సమాచార శాఖ మధ్యంతరంగా ప్రకటనల రేట్లను 19 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 7వ ఆర్ఎస్సీ సిఫారసులు త్వరలోనే ప్రభుత్వానికి అందుతాయని, అప్పటి వరకూ కొత్త రేట్లు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. డీఏవీపీ ఏటా రూ.410 కోట్ల మేర ప్రకటనలను ఇస్తుంటుంది.