న్యూఢిల్లీ: పత్రికల్లో ప్రకటనల రేట్లను మధ్యంతరంగా 19 శాతం పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఈ ఏడాది అక్టోబర్ 15నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలను డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిసిటీ(డీఏవీపీ) విభాగం పత్రికలకు, ఇతర ప్రచురణ సంస్థలకు విడుదల చేస్తూ ఉం టుంది.
వీటికి కొత్త రేట్ల ప్రకారం ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. ధరల సవరణ కమిటీ (ఆర్‌ఎస్‌సీ) సిఫారసుల మేరకు మూడేళ్లకోసారి కేంద్రం ప్రకట నల రేట్లను సవరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ ఉన్న ధరల విధానానికి అక్టోబర్ 14తో గడువు తీరింది. అయితే, గడువులోపు 7వ ఆర్‌ఎస్‌సీ సిఫారసులు ప్రభుత్వానికి అందలేదు. ఈ లోపు మధ్యంతరంగా ధరలను పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆర్థిక శాఖ, ఎలక్షన్ కమిషన్‌ను సం ప్రదించిన అనంతరం సమాచార శాఖ మధ్యంతరంగా ప్రకటనల రేట్లను 19 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 7వ ఆర్‌ఎస్‌సీ సిఫారసులు త్వరలోనే ప్రభుత్వానికి అందుతాయని, అప్పటి వరకూ కొత్త రేట్లు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. డీఏవీపీ ఏటా రూ.410 కోట్ల మేర ప్రకటనలను ఇస్తుంటుంది.