తప్పుడు ప్రచారాలపై పాత్రికేయ అస్త్రం | Sakshi Guest Column on journalistic weapon against false propaganda | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారాలపై పాత్రికేయ అస్త్రం

Published Mon, Jan 29 2024 12:14 AM | Last Updated on Mon, Jan 29 2024 12:14 AM

Sakshi Guest Column on journalistic weapon against false propaganda

ఉద్దేశపూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడించడం ఉత్తమమైన పాత్రికేయ విలువలకు ప్రామాణికం అవుతుంది. అటువంటి ఒక ప్రామాణిక గ్రంథమే సీనియర్‌ జర్నలిస్టులు రాసిన ‘లవ్‌ జిహాద్‌ అండ్‌ అదర్‌ ఫిక్షన్స్‌: సింపుల్‌ ఫ్యాక్ట్స్‌ టు కౌంటర్‌ వైరల్‌ ఫాల్స్‌హుడ్స్‌’! పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్‌ ఫిక్షన్స్‌’ ఏమిటంటే... పాపులేషన్‌ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం లాంటి అసత్య ప్రచారాలు. వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశోధనాంశాలతో హాస్యాస్పద మైన అభియోగాలను రచయితలు బట్టబయలు చేశారు. 2014 తర్వాత ‘గో–సంబంధ దాడులు’ ఎంత పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది.

ఒకవేళ మీకు కూడా నాలాగే భారతీయ పాత్రికేయ వృత్తి వైఖరులపై నిరాశ మొదలై ఉంటే, కనుచూపు మేరలో భూమ్యాకాశాలు కలిచేచోట ఒక శుభవార్త ఉందని తెలుసుకుని మీరెంతగానో సంతోషిస్తారు. అది టీవీ న్యూస్‌ ఛానెల్‌ కోసమో లేదా వార్తాపత్రిక కోసమో జరిగిన పనైతే కాదు. నిజానికి అదొక పుస్తకం. ఆ పుస్తకం అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలను కలిగివుండి, ఖ్యాతిని కోల్పోతున్న వృత్తిపై విశ్వాసాన్ని పాదుగొల్పే ఒక గణనీయ పునరుద్ధరణ. ఈ రోజు నేను ఆ పుస్తకం వైపు మీ దృష్టిని మరల్చాలని అనుకుంటున్నాను. 

‘లవ్‌ జిహాద్‌ అండ్‌ అదర్‌ ఫిక్షన్స్‌: సింపుల్‌ ఫ్యాక్ట్స్‌ టు కౌంటర్‌ వైరల్‌ ఫాల్స్‌హుడ్స్‌’ అనే ఆ పుస్తకాన్ని ఇద్దరు మాజీ ఎన్డీ టీవీ జర్నలిస్టులు శ్రీనివాసన్‌ జైన్, మరియమ్‌ అలావీ; ‘స్క్రోల్‌’ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ సుప్రియా శర్మ కలిసి రాశారు. పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్‌ ఫిక్షన్స్‌’ ఏమిటంటే... పాపులేషన్‌ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం, ఇంకా సోకాల్డ్‌... ‘పింక్‌ రివల్యూషన్‌’.

ప్రతి కేసులోనూ మొదట ఈ పుస్తక రచయితలు ఉద్దేశ పూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడిస్తారు. ఆ తర్వాత వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశో ధనాంశాలతో హాస్యాస్పదమైన ఆ అభియోగాలను బట్టబయలు చేస్తారు. లేదా ఆ ఆరోపణల్లోని అవాస్తవాలను ధ్వంసం చేస్తారు. 

పుస్తకం గురించి నేను చెప్పవలసి ఉన్నదానిలో ఇంతకుమించి ఒక్కమాటైనా చెప్పకుండా నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. మీకై మీరు చదవవలసిన అవసరం ఉన్న పుస్తకం ఇది. తనని చదివించు కునేలా చేస్తుంది. మిమ్మల్ని ఒప్పించేలా చదివిస్తుంది. అయినా గానీ, మీ ఆకలిని నన్ను కాస్త రెచ్చగొట్టనివ్వండి. 

లవ్‌ జిహాద్‌పై ఈ పుస్తక రచయితలు విశ్వ హిందూ పరిషత్‌ అంతర్గత పత్రిక ప్రత్యేక సంచిక ప్రచురించిన జాబితాలోని కేసులను విశ్లేషించారు. ‘‘లవ్‌ జిహాద్‌పై అందుబాటులో ఉన్న ఏకైక సమగ్ర సాక్ష్యాధార సమాచారం అదొక్కటే’’. అయితే నిజానికది, ‘‘147 వార్తా కథనాల క్రమానుగత కూర్పు మాత్రమే’’. ఆ కూర్పులో మొదటి కేసు 2011 నవంబరు నాటిది, చివరి కేసు 2020 సెప్టెంబర్‌ లోనిది. 

వాటిల్లో డెబ్బై మూడు, అంటే సగానికి సగం కేసులు ‘వాస్తవాలకు నిలబడనివి’. ‘‘అవన్నీ లింకులు తెగినవి, చెప్పిందే చెప్పినవి, భారతదేశానికి సంబంధం లేనివి’’. తక్కిన డెబ్బై నాలుగు... ‘‘మోసం, అపహరణ, విడిచిపెట్టటం, అత్యా చారం, హత్య మొదలైన వాటితో సహా లింగ సంబంధ నేరాల విస్తృత సమాచారం. ‘‘అన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్నది ఒకటే. నిందితుడు ముస్లిం, బాధితురాలు హిందువు’’ అని రచయితలు పేర్కొన్నారు. లవ్‌ జిహాద్‌ లక్ష్యం హిందూ మహిళల్ని మాయచేసి, మభ్యపెట్టి మతం మార్చడమే అయితే ఈ ఉదాహరణలు కేసును బలహీన పరుస్తాయి. 

2014 తర్వాత ‘‘గో–సంబంధ దాడులు’’ ఎంతలా విపరీతంగా పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ‘‘ఇంటర్నెట్‌లోని మీడియా ఆర్కైవ్స్‌ను ఉపయోగించి మేము రెండు కాలాల వ్యవధిలో... 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 2023 మే వరకు... జరిగిన గో–సంబంధ దాడుల సంఖ్యను లెక్కించాం’’ అని పుస్తక రచయితలు వెల్లడించారు. 

నిజం ఏమిటో తెలిసిన కొద్దిమందికి ఆ లెక్కలు ఆశ్చర్యం కలిగించవు. తెలియని ఎక్కువమంది మాత్రం నమ్మలేనట్లు చూస్తారు. ‘‘2009–2014 మధ్య ఒకే ఒక గో–సంబంధ హింసాత్మక సంఘ టనను మేము కనుగొన్నాము.’’ ఆ కేసులో కూడా, ‘‘దాడి వీహెచ్‌పీ నేతృత్వంలో జరిగింది’’. అందుకు భిన్నంగా, ‘‘2014 నుంచి 2023 మే వరకు అలాంటి గో–సంబంధ దాడులు 136 వరకు జరిగినట్లు మా లెక్కల్లో తేలింది. ఆ దాడుల్లో 66 మంది మరణించారు. 284 మంది గాయపడ్డారు. హతులైన వాళ్లలో కనీసం 70 శాతం మంది ముస్లింలే’’ అని  వారు వివరాలు పొందు పరిచారు.

ద్వేషపూరిత ప్రసంగాల విస్తృతిపై ఈ రచయితలు బహిర్గతపరచిన వివరాలను కూడా మీకు చెబుతాను. ‘‘2009–2014 మధ్య కాంగ్రెస్‌ హయాంలో దాదాపుగా 25 వరకు అలాంటి ద్వేష ప్రసంగాలు మా లెక్కకు అందాయి. ఆ సంఖ్య బీజేపీ హయాంలో ప్రముఖ వ్యక్తులు చేసిన విద్వేష ప్రసంగాలతో కలిపి 460కి చేరు కుంది’’. అంటే తొమ్మిది రెట్ల దూకుడు!
మీలో చాలామంది లవ్  జిహాద్, పాపులేషన్‌ జిహాద్, బలవంతపు మతమార్పిళ్ల వంటి అపోహల్ని నమ్మకపోవచ్చు.

ముస్లింల బుజ్జగింపు జరుగుతోందంటే మాత్రం బహుశా మీలో ఎక్కువమంది నమ్మే అవకాశమైతే ఉంది. అప్పుడైతే మీరు ఆ అంశానికి సంబంధించిన అధ్యాయాన్ని ఈ పుస్తకంలో తప్పనిస రిగా చదవాలి. అందులో రచయితలు ఈ బుజ్జగింపు అభియోగాన్ని అక్షరాలా తుడిచిపెట్టేశారు. ఎంత ప్రభా వవంతంగా వారు ఆ పని చేశారన్నది కనిపెట్టే విష యాన్ని మీకే వదిలేస్తాను. కానీ వారిచ్చిన ముగింపు లలో ఒకదాని గురించి చిన్న ముక్క చెబుతాను.

‘‘హిందూ రైట్‌వింగ్‌ పొరబడింది. ముస్లింలు కాంగ్రెస్‌ బుజ్జగింపులకు దూరంగా ఎక్కడో అట్టడుగున ఉండిపోయారు. కాంగ్రెస్‌ దేనికైనా దోషిగా నిలబడిందీ అంటే... ఆ దోషం... అంత సుదీర్ఘంగా అధికారంలో ఉండి కూడా ముస్లింలను పైకి తేవటంలో విఫలం అవటమే’’ అని రచయితలు వ్యాఖ్యానించారు. 

చిన్నపాటి ధార్మిక ఉపన్యాసంతో నేనిది ముగిస్తాను. సత్యాన్ని చూడకూడదని అనుకునేవారు, అంధులుగానే ఉండిపోయేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ పుస్తకం చదవకండి. ఎందుకంటే అది వారి నిరాధారమైన భ్రమల్ని పటాపంచలు చేస్తుంది. కానీ నిజం ఏమిటో తెలుసుకోగోరే యథార్థవాదులకు ఇది చదవవలసిన పుస్తకం. వాస్తవాలను సరళంగా, పూత పూయని పదాలతో తేలిగ్గా జీర్ణమయ్యేలా మీకు ఈ పుస్తకం చెబుతుంది. అంతే తేలిగ్గా మీరు పుస్తకం లోపలి విషయాలను అంగీకరించ గలుగుతారని నేను ఆశిస్తున్నాను.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement