కామెంట్
‘‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’’ అని ఒక లౌకికవాద దేశానికి ప్రధానమంత్రి తోటి పౌరుల గురించి మాట్లాడడం తగినదేనా? ‘వారు’ కూడా సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, గ్రహాంతరవాసులూనా? అలా మాట్లాడటాన్ని ఆయన్ని అభిమానించేవారు సమర్థిస్తున్నట్లు్ల అనిపిస్తోంది. లేకుంటే ఆయన అలా అనటాన్ని ఆపి ఉండేవారా? తనను సరిదిద్దుకునేవారా?
ప్రధానమంత్రులు ఎల్లవేళలా సరైన, గౌరవ ప్రదమైన పనే చేస్తారన్న భావన ఉన్న యుగంలో నేను పెరిగాను. అంతేకాదు, ప్రధాని చెప్పారంటే ఇక అది సరైనది అయినట్లే! మాటల్లో పొల్లుపోవటం అత్యంత సహజం అయి నప్పటికీ, జవహర్‌లాల్ నెహ్రూకు కూడా అలా జరిగేదంటే నా తల్లి తండ్రులు అస్సలు నమ్మేవారు కారు. ఆ పాతకాలపు ప్రామాణికతకు ఆయనొక శ్రేష్ఠమైన నమూనాగా పరిగణన పొందారు.
‘యాభైలు’, ‘అరవైల’ నుంచి మనం చాలా దూరం ప్రయాణించి వచ్చాం. ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఊహించరానిదేమీ ఉండదు. ఏ ఉత్కృష్టులైన వారినో పక్కన పెడితే ప్రధానమంత్రులూ ఇక ఏమాత్రం భిన్నమైన వ్యక్తులుగా మిగిలి లేరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి దశాబ్దంలో వారి పట్ల కనిపించిన సహజమైన గౌరవభావన, వారంటే ఉండే కొద్దో గొప్పో ఆరాధన పూర్తిగా కనుమరుగయ్యాయి. ‘సబ్ చోర్ హై’ (అందరూ దొంగలే) అన్నదే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న నమ్మకం అయింది.
ఇప్పటికి కూడా, నా అత్యంత నిరాశావాద, చీకటిమయ మనః స్థితుల్లో సైతం– తన సొంత, తోటి పౌరులలో ఒక గణనీయమైన వర్గం మీద ఒక ప్రధాని దాడి చేస్తూ, వారిని పిశాచాలుగా చూపటం వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. అదేపనిగా అందుకోసం మార్గా లను కనుగొంటారని కూడా! ఆయనను అభిమానించేవారు తెలివిగా దీనిని... అదేపనిగా అని కాక, అనేకసార్లు అని అనవచ్చు.
ఆయన అలా చేయటాన్ని వారు ఆనందిస్తున్నట్లు, సమర్థిస్తున్నట్లు, సహేతుక మేనని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే కచ్చితంగా ఆయన అలా చేయటాన్ని ఆపి ఉండేవారా? తనను తను సరిదిద్దుకునేవారా? బహుశా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసేవారా? కానీ అలా జరగక పోగా, అవి పునరుద్ఘాటనలు అవుతున్నాయి. బహిరంగంగా, శక్తిమంతంగా, స్థానాలను మార్చుకుంటూ కొనసాగుతున్నాయి.
మొదట చెప్పినదానినే ఉన్నది ఉన్నట్లుగా మళ్లొకసారి చెబుతాను. నా ప్రతిస్పందన అర్థంచేసుకోదగినదా లేక అతిశయోక్తితో కూడినదా అని మీకై మీరు ఆలోచించండి. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో వచ్చిన దానిని బట్టి హిందీలో ఆయన మాట్లాడిన మాటలు సరిగ్గా ఇవే: ‘‘పెహ్లే జబ్ ఉన్‌కీ సర్కార్ థీ, ఉన్హోనే కహా థా కీ దేశ్ కీ సంపతీ పర్ పెహ్లా అధికార్ ముసల్మానోం కా హై.
ఇస్కా మత్లబ్, యే సంపతీ ఇకఠ్ఠీ కర్‌కే కిస్కో బాటేంగే? జిన్‌కే జ్యాదా బచ్చే హై, ఉన్‌కో బాటేంగే, ఘుస్‌పైఠియోన్ కో బాటేంగే. క్యా ఆప్కీ మెహనత్ కీ కమాయి కా పైసా ఘుస్‌పైఠియోన్ కో దియా జాయేగా? ఆప్‌కో మంజూర్ హై యే?’’ (‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’)
మరి, ‘ఎక్కువమంది పిల్లలను’ కలిగివున్న ఆ వ్యక్తులు ఎవరు? ‘చొరబాటుదారులు’ అని పిలవబడుతున్న ఈ వ్యక్తులు ఎవరు? స్పష్టంగానే ఉంది కదా, మొదటి వాక్యాన్ని బట్టి ఇంకా స్పష్టంగా లేదా? ఇంకా ఏమైనా సందేహమా? అలాగే పైన పేర్కొన్న ‘ముసల్మా నులు’ ఎవరు? వారు భారతదేశ ముస్లింలు కారా? మన తోటి పౌరులు కారా? సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ కలిగి ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, బయటి వ్యక్తులు, గ్రహాంతరవాసులూనా?
ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి? దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే నేను అమాయకుడిని అవుతానా? ఇంకా చెప్పాలంటే కదిలిపోవటానికి ? లేదా ఆ విధమైన ఆరోపణలను మీరు మన ప్రధా నులు ఎవరినుంచైనా విని ఉన్నారా?
డోనాల్డ్ ట్రంప్ తరచూ ఇలా మాట్లాడ్డం నాకు తెలుసు. ఆయన అలా మాట్లాడినప్పుడు మనకు వికారం పుడుతుంది. 1960లలో బ్రిటన్‌లో ఇనాక్ పావెల్ ఇలాగే మాట్లాడితే అక్కడి ఆధిపత్య సమాజ సమూహం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. కానీ మన తరంలోని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌లు, సాధ్వీ రుతంభరలు ఇటువంటి వాక్చాతు ర్యాన్ని ఆస్వాదిస్తారనడంలో సందేహమే లేదు. అయితే అందుకు వారు తిరిగి పొందేది ధిక్కారాన్ని, ఎగతాళిని మాత్రమే!
నా బోళాతనం బహుశా మీ దృష్టిలో తీవ్రంగా దెబ్బతిని ఉంటుందని నేను అంగీకరిస్తున్నప్పటికీ, ఇప్పటికైతే నన్ను ఆశ్చర్యపరిచే విషయం వేరొకటి ఉంది. అది మన మీడియా స్పందన. ఒకవేళ అలాంటిదేమైనా ఉండివుంటే, నాకైతే ఆందోళన కనబడలేదు, ఏహ్యభావం కనబడలేదన్నదైతే నిశ్చయం. బహుశా నేను చదవాల్సిన పత్రికల్ని చదవలేదేమో! చూడాల్సిన టీవీ చానెళ్లను చూడలేదేమో! కానీ నాకు అనిపించింది ఏమిటంటే, చెప్పినదాన్ని మౌనంగా అంగీ కరించారని! అంగీకరించకపోయినా, కనీసం దానిమీద వ్యాఖ్యానించ నైనా లేదు. విమర్శ అయితే అసలు చేయలేదు. అది ఖండనార్హమైనది కాదని నేను అనుకుంటే తప్ప నాకది దాదాపుగా నమ్మకశ్యంగా లేదు. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారా?
క్షమించండి. నేను ఈరోజు చాలా ప్రశ్నలు సంధించి మీకు అతి కొద్ది సమాధానాలు మాత్రమే ఇచ్చాను. కానీ నా అభిప్రాయాలను మీపై రుద్దడం నాకు ఇష్టం లేదు. బదులుగా, మీరేం అనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక మరొక చివరి ప్రశ్నకు నన్ను మన్నించండి: ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయిన వారు భిన్న మత విశ్వాసాన్ని కలిగిన తోటి పౌరుల గురించి ఇలా మాట్లాడడం తగినదేనా? మరింత కచ్చితంగా అడగాలంటే, నైతికంగా సరైనదేనా?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment