భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకికరాజ్యంగా నిర్వచించింది. అందులోని లౌకిక భావానికి తీవ్రమైన సవాలుగా పరిణమిస్తున్న ఘటనలు నేడు దేశంలో అనేకచోట్ల సంభవిస్తున్నాయి. అధిక సంఖ్యాకుల ప్రాధాన్యాలకు కట్టుబడి అల్పసంఖ్యాకులు, ముఖ్యంగా ముస్లింలు జీవించక తప్పదనే వాస్తవాన్ని పాలనాపరమైన నిర్ణయాలు బలపరుస్తున్నాయి. దీనివల్ల ‘అధిక సంఖ్యాకుల దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉండటం అనేది ఎలాంటిది?’ అనే ప్రశ్న రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆ ప్రశ్న అడిగే భారతీయుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతుండటం గురించే మనం ఆందోళన చెందాలి. ఆఖరికి, ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరాకరణకు కూడా ఒక వర్గాన్ని గురి చేయడం సమ్మతం అవుతుందా?
వాదనలకిది తావులేని ప్రశ్న కాకున్నా, ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అని మనం ఎక్కువగా అడుగుతుండటాన్ని అత్యంత దురదృష్టకరమైన అభియోగాలలో ఒకటిగా నేడు మనదేశం ఎదుర్కొంటూ ఉంది. ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటమన్నది ఎలాంటిది?’’ అనే ఈ ప్రశ్నకు జవాబు – ఒక హిందువు, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ లేదా నాస్తికుడిగా ఉండటం ఎలాంటిది అనే ప్రశ్నకు వచ్చే సమాధానానికి భిన్నంగా ఏమీ ఉండనవసరం లేదు. కానీ ఉంటోంది! అలా ఎందుకు ఉంటున్నదో... జియా ఉస్ సలామ్ తాజా పుస్తకం ‘బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా: ఎ క్రిటికల్ వ్యూ’... కలవర పాటును కలిగించే వివరాలతో విశదీకరిస్తోంది.
కాస్త వెనక్కెళ్లి ముందుకొస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. గత దశాబ్ద కాలంలో పరిస్థితి ఇంతని అంతని చెప్పలేనంతగా దిగజారిపోయింది. దేశంలో ముస్లింల జనాభా 15 శాతం. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో వారి వాటా కేవలం 4.9 శాతం. పారా మిలిటరీ సైనిక దళాల్లో 4.6 శాతం. ఐయ్యేఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లు, ఐపీఎస్‌లలో 3.2 శాతం. సైన్యంలో బహుశా తక్కువలో తక్కువగా 1 శాతం. 2006 సచార్ కమిటీ నివేదిక ప్రకారం... ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా షెడ్యూల్డు కులాలు, తెగల కంటే కూడా మరీ అధ్వా న్నమైన జీవన స్థితిగతులలో ఉన్నారన్నది మనకు తెలిసిన విషయమే.
రాజకీయాలలో సైతం, ఒకప్పుడు వారి స్వరం వినిపించిన చోట ఇప్పుడది క్షీణిస్తూ ఉండటం మాత్రమే కాదు, కొన్ని చోట్ల వెనక్కు మళ్లుతూ కూడా ఉంది. దామాషా ప్రకారం ముస్లింలకు లోక్‌సభలో 74 సీట్లు ఉండాలి. కానీ ఉన్నది 27 మంది. మన 28 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. 15 రాష్ట్రాలలో ముస్లిం ఎంపీలే లేరు. 10 రాష్ట్రాలలో మాత్రమే మైనారిటీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఒక ముస్లిం ఉన్నారు. అదేమీ విశేషం కాదు కదా!
నిజానికి ఏ పార్టీ కూడా భారతీయ జనతాపార్టీ అంత కరాఖండిగా ముస్లింలకు ముఖం చాటేయలేదు. 2014లో గానీ, 2019లో గానీ బీజేపీ ఒక్క ముస్లింను కూడా లోక్‌సభ ఎంపీగా ఎన్నికలకు ఎంపిక చేసుకోలేదు. నేటికీ ఆ పార్టీ కనీసం రాజ్యసభకు ఎంచుకున్న ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా లేరు. కర్ణాటకలో 14 శాతం మంది, ఉత్తర ప్రదేశ్‌లో 19 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ బీజేపీకి ఆ రాష్ట్రా లలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. గుజరాత్‌లో 1998 నుండి ఏ లోక్‌సభకు, లేదా ఏ విధాన సభకు కూడా ముస్లిం అభ్యర్థిని నిల బెట్టలేదు. అంతెందుకు, గత ఏప్రిల్‌లో కర్ణాటక మాజీ ఉప ముఖ్య మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప బీజేపీకి ముస్లింల ఓట్లే అవసరం లేదన్నారు.
పాలకపక్ష నాయకులు, వారి సన్నిహిత మద్దతుదారులు ముస్లింల గురించి ఏదైతే మాట్లాడుతుంటారో ఆ ప్రకారం ముస్లింల పరిస్థితి మన దేశంలో దిగజారిపోతూ ఉంటుంది. వారిని ‘బాబర్ కీ ఔలాద్’ (బాబర్ సంతానం) అంటుంటారు. ‘అబ్బా జాన్’లు అంటూ అవహేళన చేస్తుంటారు. ‘పాకిస్తాన్‌కు వెళ్లిపొండి’ అని పదే పదే చెబుతుంటారు. వారి ఊచకోతకు íపిలుపు అందినప్పుడు – అయితే గియితే, కొన్ని బీజేపీ గొంతులు ఆ పిలుపును ఖండిస్తూ మాట్లాడతాయి. వారు అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే నేర నిర్ధారణ కాకముందే వారి ఇళ్లు నేలమట్టం అవుతాయి. తరచూ వారు లవ్ జిహాద్, పశువుల అక్రమ రవాణా ఆరోపణలతో హత్యకు గురవుతుంటారు.
2019 జూన్‌లో జార్ఖండ్‌లో ఒక ముస్లిం వ్యక్తికి ఏం జరిగిందనే దాని గురించి జియా ఉస్ సలామ్ పుస్తకం నుంచి నేనొక ఉదాహరణ ఇస్తాను. ఏదో ఒక ఉదంతాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం ముస్లింలపై కనబరుస్తున్న అసహనాన్ని వేలెత్తి చూపడం కోసమేనని అనిపించవచ్చు కానీ, అటువంటి అనేక ఘటనలకు ఇదొక దృష్టాంతం. ‘‘విధ్వంసకరమైన ఆ హింసాత్మక సమూహం... అతడిని దీపస్తంభానికి కట్టివేసి ఇనుప కడ్డీలు మొదలు... కర్రలు, టైర్లు, బెల్టుల వరకు... చేతిలో ఏది ఉంటే అది తీసుకుని చావబాదింది. ఆ వ్యక్తి తల, చేతులు, ముఖం రక్తం ఓడుతున్నాయి. అతని కాళ్లు వాచిపోయాయి. చాలాచోట్ల ఎముకలు విరిగి పోయాయి. ఆ దెబ్బలకు నిలబడలేక మనిషి కూలి పోయాడు. అతడు చేసిన నేరం ఏమిటి? నేటి కొత్త భారతదేశంలో అతడొక ముస్లిం అవడమేనా?’’
ఇదేమీ నూటికో కోటికో ఒకటిగా జరిగిన ఘటన కాదని పుస్తకంలో జియా పొందుపరిచిన వాస్తవాలు సూచిస్తున్నాయి. ‘‘ముస్లింలపై ఇటు వంటి ద్వేషపూరితమైన నేరాలు 2014–2017 మధ్య కాలంలో 30 శాతం పెరిగాయి. అనంతరం, 2019లో మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. మతవిద్వేష నేరాలు రెట్టింపు అయ్యాయి.
ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరా కరణకు కూడా ముస్లింలు గురయ్యారు. ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్... ‘‘ప్రతి భారతీయుడూ హిందువే’’ అని అన్నారు. ఈ మాటను ముస్లింలు మాత్రమే కాదు, సిక్కులు కూడా సమ్మతించరు. అయినప్పటికీ ఆయన మరికాస్త ముందుకు వెళ్లి... ‘‘ఈ రోజున భారత దేశంలో ఉన్నవారంతా హైందవ సంస్కృతికి,హిందూ పూర్వీకులకు, హిందూ భూభాగానికి చెందినవారు. ఇందులో రెండో మాటే లేదు’’ అన్నారు.
‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అనే ప్రశ్నకు వచ్చే సమాధానం ఎందుకని మన దేశ సమగ్రతకూ, భవిష్యత్తుకూ ముప్పు కలిగించేలా ఉంటుందో వివరించేందుకు చాలినంతగా చెప్పాననే నేను భావిస్తున్నాను. ఇది చాలా స్పష్టమైన సమాధానమని నేను చెప్పగలను. కానీ ఈ సమాధానం మన ముస్లిం సోదరులకు, సోదరీ మణులకు ఎలా అనిపిస్తుందో ఒక్కక్షణం ఆలోచించండి. తక్కిన మనందరికీ ఇది మనదికాని సమస్యపై ఒక విశ్లేషణ. వారికి మాత్రం వారి జీవన్మరణ సమస్య. సమస్య గురించి మనం ఆశాజనకమైన రీతిలో లోతుగా ఆలోచిస్తాం. కానీ వారు ఆ పరిస్థితిలో జీవిస్తారు. అది మరింత దారుణంగా తయారవదు కదా అని బిక్కుబిక్కుమంటుంటారు.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment