మొదటి ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. హోమ్ వర్క్ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల ముస్లిం బాలుడిని మిగతా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి చెంప దెబ్బ కొట్టాలని తృప్తి త్యాగి అనే ఉపాధ్యాయురాలు ఆదేశించారు. రెండో ఘటన జమ్మూ–కశ్మీర్‌లో చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు బ్లాక్ బోర్డు పైన ‘జై శ్రీరామ్’ అని రాసినందుకు, ఫరూఖ్ అహ్మద్ అనే టీచర్ పిల్లలంతా చూస్తుండగా ఆ బాలుడిని క్లాసు బయటికి ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టాడు. ఇక్కడ బాధితులు పసివాళ్లు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వారికి లోతైన గాయాలయ్యాయి. దారుణాతి దారుణం ఏంటంటే... వారు ముస్లిములో, హిందువులో అయిన కారణంగా అలా జరగడం! అది ఏకంగా భారతదేశం పైనే జరిగిన దాడి!
మాట వినని పిల్లలు చెంపదెబ్బ తింటారని తెలియని తరం నుండేమీ నేను రాలేదు. కానీ నాన్న ఎప్పుడూ నాపై చెయ్యి ఎత్తలేదు. ఆయన ఆర్మీ ఆఫీసర్ అయినప్పటికీ నన్ను గారం చేసేవారు. సున్నితమైన మనసు గల తండ్రిగా ఆయన నా పట్ల వ్యవహరించేవారు. అమ్మ మాత్రం నన్ను క్రమశిక్షణలో ఉంచేవారు. అమ్మ చేతి దెబ్బలు ఒకటీ రెండు తిన్నట్లు కూడా నాకు గుర్తు. నిస్సందేహంగా నేను ఆ దెబ్బలకు యోగ్యమైనవాడినే! నిజానికి, ఆ విధమైన దండన ఆ కాలంలో సమర్థనీయతను కలిగి ఉందన్న సంగతి కూడా నాకు తెలియందేమీ కాదు.
అయితే గత వారం రెండు వేర్వేరు పాఠశాలల్లో, ఇద్దరు వేర్వేరు వర్గాలకు చెందిన పిల్లలపై ‘ఇతర’ వర్గం నుంచి జరిగింది ఇందుకు భిన్నమైనది. వారు చెంపదెబ్బలు తినలేదు. దెబ్బలు తిన్నారు.
ఇది మొదటిది. ఇక రెండవది... వారిని మందలించడానికి గానీ, సరిదిద్దడానికి గానీ కొట్టలేదు. అవి వారిని అవమానించడానికీ, ఆత్మా భిమానాన్ని దెబ్బతీయడానికీ కొట్టినవి. మూడవది, వారు వేరే మతానికి చెందిన వారైనందువల్ల జరిగినవి. వెల్లువెత్తిన మత విద్వేషం అది. ఇదేమీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసం జరిగినది కాదు. నిజం చెప్పాలంటే... ఆ ధోరణి గర్హనీయమైనది, నీచమైనది, అసహ్యకరమైనది.
మొదటి ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఖుబ్బాపుర్‌లో జరిగింది. హోమ్ వర్క్ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల ముస్లిం బాలుడిని మిగతా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి చెంపదెబ్బ కొట్టాలని తృప్తి త్యాగి అనే ఉపాధ్యాయురాలు ఆదేశించారు. ఆమె ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కూడా! ఆ బాలుడిని అలా కొట్టిస్తున్న సమయంలో ఆ టీచరు... ‘మహమ్మదీయ పిల్లలు’ అంటూ అవహేళనగా, అవమానకరంగా మాట్లాడుతూ, ‘‘ఇంకా గట్టిగా కొట్టండి’’ అని సాటి పిల్లల్ని ప్రోత్స హించడం మరో మాటకు తావులేకుండా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
రెండో ఘటన, జమ్మూ–కశ్మీర్‌లోని బనీలో చోటు చేసుకుంది. అక్కడ పదేళ్ల బాలుడు బ్లాక్ బోర్డు పైన ‘జై శ్రీరామ్’ అని రాశాడు. అది చూసిన ఫరూఖ్ అహ్మద్ అనే టీచర్ ‘‘పిల్లలంతా చూస్తుండగా ఆ బాలుడిని క్లాసు బయటికి ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టాడు. అక్కడి నుంచి ఆ బాలుడిని ప్రిన్సిపాల్ గది లోకి లాక్కెళ్లి అక్కడ మళ్లీ ఆ టీచరు, ప్రిన్సిపాల్ కలిసి, గదికి తాళం వేసి మరీ ఆ చిన్నారిని కొట్టారు. ఇంకోసారి అలా రాస్తే చంపేస్తామని హెచ్చరించారు’’ అని ఎఫ్.ఐ.ఆర్.లోని వివరాలను బట్టి తెలుస్తోంది.
ఈ రెండు ఘటనలు కూడా అత్యంత భయానకమైనవి. రెండో ఘటన గురించి కొద్దిగా మాత్రమే మనకు తెలుసు. మొదటి ఘటన తాలూకు వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియోను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించే లోపే సోషల్ మీడియాలో లక్షల మంది వీక్షించారు. ఏడేళ్ల ముస్లిం బాలుడిని కొట్టినందుకు వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. ఇక్కడే మరొక ఆందోళన కూడా కలుగుతోంది నాకు.
బాలుడి తండ్రి న్యాయం కోసం డిమాండ్ చేసే స్థితిలో లేక పోగా... రాజీపడమని, ఇంకా చెప్పాలంటే ఆ టీచర్‌ను క్షమించి, జరిగిన దానిని మరచిపొమ్మని ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. అలా ఒత్తిడి తెస్తున్నవారిలో రైతుల పోరాట యోధుడు నరేశ్ టికైత్ కూడా ఉన్నారు. బాలుడి తండ్రిని రాజీ పడమని చెబుతూ, ఎందుకంటే, ‘‘ఆ టీచర్ చెడు ఉద్దేశంతో అలా చేయలేదు’’ అంటున్నారు. ‘‘కనీసం ఆమె క్షమాపణైనా చెప్పాలి కదా’’ అని అడిగినప్పుడు, ‘‘క్షమాపణ అనేది పెద్ద మాట. కానీ ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు’’ అని రాకేశ్ టికైత్ అన్నారు.
ఖుబ్బాపుర్ పరిసర ప్రాంతాల గ్రామ పెద్దల ప్రతిస్పందన అయితే మరింత నిరుత్సాహకరంగా ఉంది. పూరా గ్రామానికి చెందిన నరేంద్ర త్యాగి ఆ ఏడేళ్ల పిల్లవాడి తండ్రితో, ‘‘ఇక ఈ నాటకాన్ని ఆపండి. గ్రామంలోకి మీడియా అడుగు పెట్టడం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్.ఐ.ఆర్. వద్దని చెప్పండి. వెనక్కు తీసుకోండి. లేకుంటే మీరే దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అన్నారు.
చివరికి పోలీసులు కూడా కనీసంలో కనీసమైనా చేయలేదు. వారెంటు లేకుండా అరెస్టు చేయడానికీ, కోర్టు అనుమతి లేకుండా విచారణ చేపట్టడానికీ వీల్లేని సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ‘‘తృప్తి త్యాగికి ద్వేషపూరిత ఉద్దేశాలు లేవు’’ అని ముజఫర్‌నగర్ పోలీసులు పేర్కొన్నారు. ఇక స్థానిక బీజేపీ ఎంపీ సంజీవ్ బాల్‌యాన్ ‘‘ఇదొక చిన్న విషయం’’ అనేశారంటే ప్రభుత్వ స్పందన ఎలా ఉందో మీరు ఊహించవచ్చు. ఎన్నికలు మరో ఏడు నెలల్లో ఉన్నాయి కనుక క్షమించి, ఇక ఆ విషయాన్ని మర్చిపోవాలని అది కోరుతోంది.
కానీ మీరు, నేను అలా క్షమించి, మర్చిపోకూడదని నేను అంటాను. లేదా మొత్తంగా మనం. ఇక్కడ బాధితులు పసివాళ్లు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వారికి లోతైన గాయాలు అయ్యాయి. అవి నయం అవడానికి ఎంతో సమయం, ఎంతగానో ప్రేమ అవసరం అవుతాయి. వారికి జరిగిన దారుణాతి దారుణం... వారు ముస్లిములో, హిందువులో అయిన కారణంగా జరిగింది. అది ఏకంగా భారతదేశం పైనే జరిగిన దాడి!
చివరిగా ఒక మాట. ఇవి ‘అచ్ఛే దిన్’(మంచి రోజులు) కాదు. ఇది ‘అమృత్ కాల్’కు పిలుపు కాదు. ఇది నరకానికి ప్రవేశ ద్వారం కావచ్చు. అందుకనే ఈ టీచర్లకు గుణపాఠం నేర్పాలి. ప్రభుత్వం దగ్గర నుంచి కనీసంగా మనం ఆశించగలిగింది ఇదే!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment