
ముంబై: ప్రకటనల వ్యయాల విషయంలో 2022 భారత్ ఒక కీలక మైలురాయిని అధిగమించనుందని గ్రూప్‌ఎమ్ ఇండియా ప్రెసిడెంట్ (ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ప్రైసింగ్) సిద్ధార్థ్ పరాశర్ పేర్కొన్నారు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2022లో భారత్ మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లకు చేరుతుందని పేర్కొంటూ అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ గ్రూప్‌ఎమ్ తన ‘ దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్’ 2022 (టీవైఎన్‌వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల నివేదికను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. టెలివిజన్‌ను అధిగమించి డిజిటల్ విభాగం అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని కూడా నివేదిక పేర్కొంది.
ఆయా అంశాలపై సిద్ధార్థ్ పరాశర్ వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ రంగం పురోగమిస్తున్నప్పటికీ, కరోనా కష్టకాలం తర్వాత ఓఓహెచ్ (అవుట్ ఆఫ్ హోమ్) అడ్వర్టైజింగ్, సినిమా విభాగాలు కూడా పురోగమిస్తాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇ–కామర్స్‌పై ప్రకటనలు, ఓటీటీ, షార్ట్ ఫార్మేట్ వీడియోల రంగాల్లో 2021లో చోటుచేసుకున్న వృద్ధి 2022లో కూడా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బ్రాండ్స్ విషయంలో వినియోగదారు దృష్టి సారించే విధానాలపై మహమ్మారి పాఠాలు నేర్పిందని పేర్కొన్నారు. బ్రాండ్స్ తమ మార్కెట్ నమూనాలను ఆధునికీరించుకోడానికి ఆయా అంశాలు దోహదపడుతున్నట్లు తెలిపారు. దీనితోపాటు వివిధ మాధ్యమాలు పలు ఉత్పత్తులకు విస్తృత వినియోగ మార్కెట్‌ను సృష్టిస్తున్నట్లు విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment