
'స్నాప్‌డీల్'ని డీల్ చేశారు..
తాము ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు మరొకటి వచ్చిందంటూ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ 'స్నాప్‌డీల్'కు రూ.9 లక్షల మేర నష్టం కలిగించారు ముగ్గురు యువకులు.
గోదావరిఖని (కరీంనగర్) : ప్లిప్కార్ట్ కు ఓ వ్యక్తి రూ.20 లక్షల మేరకు టోకరా వేసిన ఘటన మరవక ముందే ...ఈసారి స్నాప్ డీల్ కు అదే తరహాలో కుచ్చుటోపి పెట్టారో ముగ్గురు యువకులు. తాము ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు మరొకటి వచ్చిందంటూ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ 'స్నాప్‌డీల్'కు రూ.9 లక్షల మేర నష్టం కలిగించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఈఘటన చోటుచేసుకుంది. నగరంలోని గాంధీనగర్, విద్యానగర్, వినోభా నగర్ ప్రాంతాలకు చెందిన రాపెల్లి మహేష్(20), బండి యాదస్వామి(28), మంథని రమాకాంత్(21) లు స్నేహితులు. వీరిలో మహేష్ బీ ఫార్మసీ, రమాకాంత్ డిగ్రీ చదువుతుండగా, యాదస్వామి ఓ దుకాణంలో సేల్స్ మెన్ పని చేస్తున్నాడు.
కాగా నాలుగు నెలల క్రితం మహేష్ స్నాప్‌డీల్‌లో ఓ వస్తువును ఆర్డర్ చేశాడు. అయితే మరో వస్తువును అతడు అందుకున్నాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆ ఆలోచనలను మిగతా ఇద్దరికీ చెప్పాడు. అంతా సరేననుకుని రంగంలోకి దిగారు. అప్పటి నుంచి వస్తువులను ఆర్డర్ చేయటం, ఆ పార్శిల్ రాకమునుపే సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి.. తనకు మరో వస్తువు వచ్చిందంటూ అబద్ధం చెప్పి చెల్లించిన డబ్బును వెనక్కి తీసుకోవటం పనిగా పెట్టుకున్నారు.
ఇప్పటి వరకు మొత్తం 63 వస్తువులు.. దుస్తులు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ వంటివి ఆర్డర్ చేసి, అవి రాలేదని డబ్బు తీసుకుంటూ రూ.9,14,407 మేర మోసం చేశారు. వీరి తీరుపై అనుమానం వచ్చిన స్నాప్‌డీల్ నిర్వాహకులు కూపీ తీయగా అసలు విషయం బయటపడింది. దీనిపై సంస్థ ప్రతినిధి శివం పటేలా కరీంనగర్ ఎస్పీ జోయెల్ డేనియల్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మల్లారెడ్డి శనివారం నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, వారి నుంచి కొంతమేర నగదును రికవరీ చేశారు.