ఎన్నికల జాతరలో అమ్మకాల జోరు | The great election bazaar | Sakshi
Sakshi News home page

ఎన్నికల జాతరలో అమ్మకాల జోరు

Published Thu, Apr 11 2019 5:14 AM | Last Updated on Thu, Apr 11 2019 5:14 AM

The great election bazaar - Sakshi

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. సంప్రదాయ జెండాలు, ప్లెక్సీలతో పాటు బెలూన్లు, బటన్లు, టీషర్టులు, కప్పులు, కీ–చైన్లపై తమ గుర్తులను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. వీటిపై ఆయా పార్టీల మద్దతుదారులు, యువత ఆసక్తి చూపుతుండటంతో ఆఫ్‌లైన్‌తో పాటు అమెజాన్, స్నాప్‌డీల్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థల్లోనూ జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. మై భీ హూ చౌకీదార్‌(నేనూ కాపలాదారునే) అనే బీజేపీ నినాదమున్న టీ–షర్టులు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మోదీ, ప్రియాంకా గాంధీ చీరలకు డిమాండ్‌ ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రత్యేక టోపీలను తీసుకొచ్చింది.

వీటికే భారీ డిమాండ్‌..
కాంగ్రెస్, బీజేపీ సహా వేర్వేరు రాజకీయ పార్టీల గుర్తులు, నినాదాలతో వస్తున్న టీ–షర్టులు, కప్పులు, కీచైన్లకు ఆన్‌లైన్‌లో మంచి గిరాకీ ఉందని ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ స్నాప్‌డీల్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ‘అభ్యర్థులు, పార్టీల చిత్రాలు ఉన్న కాఫీ మగ్గులు, పవర్‌ బ్యాంకులు, యూఎస్‌బీ డ్రైవ్స్, టీ షర్టులు, చీరలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో కారు, బైక్‌ స్టిక్కర్లు, టీషర్టులు, టోపీలు, నీటి బాటిళ్లు, కీచైన్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి’ అని అన్నారు. మోదీ, రాహుల్, ప్రియాంక వంటి కీలక నేతల ముఖచిత్రాలతో ఉన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉందని పేరొన్నారు.

సదర్‌ బజార్‌లో దీటుగా అమ్మకాలు..
ఆన్‌లైన్‌ అమ్మకాలకు పోటీగా ఢిల్లీలోని సదర్‌ బజార్‌లో ఎన్నికల ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయి. ఇక్కడి షాపుల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లకు చెందిన జెండాలు, బ్యాండ్లు, పార్టీ ముఖ్యనేతల చిత్రాలకు మంచి డిమాండ్‌ ఉంది. విక్రమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ యజమాని హర్‌ప్రీత్‌ సింగ్‌ స్పందిస్తూ.. ప్రచార సామగ్రి అమ్మకాల్లో బీజేపీ అన్నిపార్టీల కంటే ముందంజలో ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ అమెజాన్‌ వెబ్‌సైట్‌లో మోదీ చీరలు రూ.700 నుంచి రూ.3,549 మధ్యలో దర్శనమిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ప్రచార సామగ్రిని అమ్మేందుకు ‘నమో రథాల’ను సిద్ధం చేశామనీ, ఈసీ నుంచి అనుమతి లభించిన వెంటనే వీటిని రంగంలోకి దించుతామని బీజేపీ నేత మనోజ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement