సొంతంగా షేర్ల బదిలీ
బ్రోకర్ దగ్గర షేర్లు విక్రయిస్తే, ఆటోమేటిగ్గా అవి డీమ్యాట్ ఖాతా నుంచి డెబిట్ అవుతాయి. ఇందుకు ఖాతాను ప్రారంభించే సమయంలోనే అనుమతి (పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకునే విధానం అమల్లో ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో బ్రోకర్ దగ్గర ఖాతా ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌లో షేర్లను విక్రయించుకోవడం లేదంటే కుటుంబ సభ్యులకు బహుమతిగా షేర్లను బదిలీ చేయాల్సి రావచ్చు. మరి అటువంటప్పుడు స్వయంగా ఎవరికి వారు ఆ బదిలీ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. దీని గురించి ఎక్కువ మందికి దాదాపుగా తెలియదు. ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడానికి ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్గాలున్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయో అవగాహన కల్పించే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం ఇది...
ఇదంతా డిజిటల్ యుగం. దాదాపు బ్యాంకు సేవలు, బ్రోకింగ్ సేవలను ఆన్లైన్లోనే చేసుకుంటున్నాం. అయినా కానీ, రెండు డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను బదిలీ చేసేందుకు ఇప్పటికీ ఆఫ్‌లైన్ విధానాన్నే ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. నూతనతరం బ్రోకర్లు (డిపాజిటరీ పార్టిసిపెంట్) అయిన జెరోదా, ఏంజెల్ వన్ తదితర కొన్ని సంస్థలు ఆన్లైన్లోనే షేర్లను సులభంగా బదిలీ చేసుకునే సేవలను అందిస్తున్నాయి. ఆన్లైన్లో షేర్ల బదిలీని రెండు విధాలుగా చేపట్టొచ్చు.
డీమ్యాట్ ఖాతా ద్వారా లేదంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) ఈజీఎస్ట్ కోసం నమోదు చేసుకుని ఆన్లైన్లో షేర్లను బదిలీ చేసుకోవచ్చు. ఈజీఎస్ట్అనేది సెక్యూరిటీల సమాచారం తెలుసుకునేందుకు, లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఉద్దేశించినది. అలాగని అన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్లో బదిలీ సేవలను అందించడం లేదు. చాలా డీపీలు, బ్యాంకులకు సంబంధించిన బ్రోకింగ్ విభాగాల్లో ఖాతా ఉన్న వారు ఆఫ్‌లైన్ (భౌతిక రూపంలో) విధానంలో చేసుకోవాల్సి వస్తుంది.
ఆఫ్‌లైన్ మార్గం..
ఆఫ్‌లైన్‌లో అయితే ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్) బుక్లెట్ ఉండాలి. షేర్లను బదిలీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బుక్‌లెట్‌లోని ఓ స్లిప్పై బదిలీ చేయాలనుకుంటున్న కంపెనీ, ఐఎస్ఐఎన్ నంబర్, ఎన్ని షేర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. ఏ డీపీ పరిధిలోని క్లయింట్‌కు బదిలీ చేయాలనుకుంటున్నారో, ఆ వివరాలు కూడా ఇవ్వాలి. అంటే క్లయింట్ ఐడీ, డీపీ ఐడీ వివరాలు నమోదు చేయాలి. ఐఎస్ఐఎన్ అన్నది ప్రతీ కంపెనీకి కేటాయించే ఓ యూనిక్ నంబర్. గూగుల్‌లో సెర్చ్ చేసినా ఈ నంబర్ తెలుస్తుంది. షేర్లను స్వీకరించే క్లయింట్ సీఎంఆర్ కాపీ జత చేయాలి. డీఐఎస్ అన్నది బ్యాంక్ చెక్ మాదిరిగా పనిచేస్తుంది. ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు నగదు బదిలీకి చెక్ ఉపయోగపడినట్టే.. డీఐఎస్ అన్నది ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేసే సాధనం.
ఆఫ్‌లైన్‌లో ఇలా షేర్ల బదిలీకి కొన్ని రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో, కొందరు బ్రోకర్ల వద్ద ఇందుకు నెల వరకు సమయం తీసుకోవచ్చు. బ్రోకర్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి లేదంటే బ్రోకర్‌కు ఈ మెయిల్ రూపంలో, బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి డీఐఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు సంబంధించిన డీమ్యాట్ ఖాతా కలిగి ఉన్న వారు నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే బ్యాంకు శాఖకు వెళ్లి దీనికి దరఖాస్తు సమర్పించొచ్చు. రిజిస్టర్డ్ చిరునామాకు డీఐఎస్ బుక్లెట్ వస్తుంది. లేదా బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి తీసుకోవచ్చు. బదిలీ చేయాలనుకున్నప్పుడు డీఐఎస్ స్లిప్‌లో అన్ని వివరాలు నమోదు చేసి, సీఎంఆర్ కాపీ జతచేసి బ్రోకర్ ఆఫీసులో సమర్పించాలి. లేదంటే కార్యాలయానికి పంపించాలి. బ్యాంకులు అయితే కేవలం కొన్ని శాఖల్లోనే ఈ సేవలు లభిస్తాయి.
ఆన్లైన్లో షేర్ల బదిలీ
ఆన్లైన్లో షేర్ల బదిలీకి రెండు విధానాలున్నాయి. ఒకటి డీమ్యాట్ ఖాతా ద్వారా చేసుకోవచ్చు. అలాగే, సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా బదిలీ చేసుకోవచ్చు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సేవను అందిస్తున్నాయి. కానీ, భద్రత రీత్యా ఈ ప్రక్రియ కొంత ఆన్లైన్, కొంత ఆఫ్‌లైన్‌తో కూడుకుని ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ అన్నది కనీసం ఒక అకౌంట్ హోల్డర్ వ్యక్తిగతంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆమోదం పొందితే, ఏ డీమ్యాట్ ఖాతాకు అయినా ఆన్లైన్లోనే షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే గరిష్టంగా ఐదు ఖాతాల వరకు ఆన్లైన్లో, అది కూడా నిర్ణీత విలువ మేరకే బదిలీకి అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
సీడీఎస్‌ఎల్‌లో అకౌంట్ ఉండి, బదిలీ చేయాలనుకుంటున్న ఖాతా కూడా సీడీఎస్ఎల్ పరిధిలోనే ఉన్నట్టయితే బదిలీ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. ఇందుకోసం సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే, ఎన్ఎస్డీఎల్ పరిధిలోనే రెండు ఖాతాల మధ్య బదిలీకి ఎన్ఎస్డీఎల్ స్పీడ్–ఈ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సీడీఎస్ఎల్ పరిధిలో జాయింట్ అకౌంట్ ఉంటే, ఖాతాను నిర్వహించే వ్యక్తికి అనుకూలంగా మిగిలిన జాయింట్ అకౌంట్ హోల్డర్స్ నుంచి డిక్లరేషన్‌తో భౌతికంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ముగిసి, బ్రోకర్ నుంచి అమోదం లభించిన తర్వాత సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలో ఏ ఖాతాకు అయినా షేర్లను బదిలీ చేసుకోవడం సాధ్యపడుతుంది. సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలోని రెండు ఖాతాల మధ్య ఆన్లైన్లో షేర్ల బదిలీ చాలా సులభం. కాకపోతే సీడీఎస్ఎల్ – ఎన్ఎస్డీఎల్ పరిధిలోని ఖాతాల మధ్య బదిలీ చేసుకోవాలంటే ఓటీపీ వంటి అదనపు భద్రతా రక్షణలు అమల్లో ఉన్నాయి. మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అదనపు సమయం కూడా తీసుకుంటుంది.
సొంత ఖాతాల మధ్య..
తన పేరిటే మరో ఖాతాకు షేర్లను బదిలీ చేయాలనుకుంటే అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్. అంటే ఒక డీపీ వద్ద డీమ్యాట్ ఖాతాను మూసేసి, మరో డీపి వద్ద ఖాతా ప్రారంభించడం. అలాంటప్పుడు క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్ విధానం అనుసరించాలి. ముందుగా మరో బ్రోకర్ వద్ద ఖాతాను తెరవాలి. అప్పుడు మూసి వేయాలని అనుకుంటున్న బ్రోకర్‌కు దరఖాస్తు ఇవ్వాలి. దాంతో అందులో ఉన్న అన్ని సెక్యూరిటీలను అదే క్లయింట్ వేరొక ఖాతాకు బదిలీ చేసిన తర్వాత, క్లోజ్ చేస్తారు. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఒక బ్రోకర్ సేవలు నచ్చనప్పుడు, న్యూఏజ్ బ్రోకర్‌కు మారిపోవాలని అనుకున్నప్పుడు ఈ మార్గాన్ని అనుసరించొచ్చు. ఈ ప్రక్రియను భౌతికంగా చేసుకోవాల్సిందే. మరో విధానం పాక్షిక బదిలీ. అంటే అప్పటికే ఉన్న ఒక డీమ్యాట్ ఖాతాను కొనసాగిస్తూ, అందులోని షేర్లను మరో సొంత ఖాతాకు బదిలీ చేసుకోవడం ఈ విధానంలో ముఖ్యాంశం.
వ్యయాలు, పన్నులు
ఒక డీమ్యాట్ ఖాతాను మూసివేస్తూ, అందులోని షేర్లను అదే వ్యక్తికి సంబంధించి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే ఎలాంటి చార్జీల్లేవు. ఖాతా మూసివేయకుండా, వాటిని వేరొక ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే షేర్ల విలువలో నిర్ణీత శాతం లేదంటే రూ.15–25 (స్క్రిప్ వారీ) ఫ్లాట్ చార్జీ పడుతుంది. ఒకవేళ ఆఫ్ మార్కెట్ విక్రయం ద్వారా బదిలీ చేస్తున్నట్టు అయితే స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సి రావచ్చు. ఇలా షేర్లను బదిలీ చేస్తున్న వారు ధరసహా పలు వివరాలను నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మూలధన లాభాల పన్నును చెల్లించేందుకు ఈ వివరాలు ప్రామాణికం అవుతాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆఫ్ మార్కెట్ (స్టాక్ ఎక్సే్ఛంజ్లతో సంబంధం లేకుండా) లావాదేవీలపై ఏదైనా పన్ను వివాదం తలెత్తినప్పుడు ఈ రికార్డులు అవసరంపడతాయి.
ఒక వ్యక్తి ఒక డీపీ పరిధిలోని ఖాతా నుంచి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు షేర్లను బదిలీ చేసుకున్నప్పుడు కొందరు బ్రోకర్లు ఈ వివరాలను రికార్డు చేస్తున్నారు. అటువంటప్పుడు దీర్ఘకాల మూలధన లాభం, స్వల్పకాల మూలధన లాభం పన్ను వివరాలు సులభంగా పొందొచ్చు. కొందరు బ్రోకర్ల పరిధిలో ఈ వివరాలు నమోదవడంలేదు. కనుక ఎంత కాలం పాటు సదరు సెక్యూరిటీని కలిగి ఉన్నామనే వివరాల కోసం పాత ఖాతాకు సంబంధించి (కొనసా గిస్తున్నా లేదా మూసివేస్తున్నా కానీ) అకౌంట్ స్టేట్మెంట్ జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. జెరోదా వంటి కొందరు బ్రోకర్లు ఆఫ్‌లైన్‌లో బదిలీ ద్వారా డీమ్యాట్ ఖాతాలోకి కొత్తగా సెక్యూరిటీలు వచ్చి చేరినప్పుడు.. మాన్యువల్‌గా వాటిని కొనుగోలు చేసిన తేదీ, ధర వివరాలు నమోదు చేసే ఆప్షన్ ఇస్తున్నాయి. ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి షేర్లను బదిలీ చేస్తున్నట్టు అయితే ఆ లావాదేవీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకే కుటుంబం పరిధిలోని వేరొక సభ్యుడికి బదిలీ చేస్తే పన్ను లేదు. వేర్వేరు కుటుంబాల వారి మధ్య బదిలీ (ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలకు మించినప్పుడు) గిఫ్ట్ ట్యాక్స్ పడుతుంది.
సీడీఎస్ఎల్ పరిధిలో ఆన్లైన్ బదిలీకి...
► సీడీఎస్ఎల్ పరిధిలో డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ పేజీకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.
► డీపీ ఐడీ, క్లయింట్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ కొట్టాలి.
► అప్పుడు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని అక్కడ ఇవ్వాలి.
► యూజర్ నేమ్, టైప్ ఆఫ్ అకౌంట్ సెలక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
► ట్రస్టెడ్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలి.
► ట్రస్టెడ్ అకౌంట్ కింద 4 సీడీఎస్ఎల్ ఖాతాల వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చు.
► అకౌంట్ ఆఫ్ చాయిస్ కింద సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ బదిలీ విధానం
► బ్రోకర్ నుంచి డీఐఎస్ బుక్లెట్ తీసుకోవాలి.
► బదిలీ చేయాలనుకుంటే డీఐఎస్ స్లిప్పై అన్ని వివరాలు నమోదు చేయాలి.
► మీ నుంచి షేర్లను పొందే డీమ్యాట్ ఖాతాకు సంబంధించి క్లయింట్ మాస్టర్ రిపోర్ట్ (సీఎంఆర్) కాపీని తెప్పించుకోవాలి.
► అప్పుడు డీఐఎస్ స్లిప్‌తోపాటు, సీఎంఆర్ కాపీని బ్రోకర్‌కు సమర్పించాలి.
► బ్రోకర్ అన్ని వివరాలను వెరిఫై చేసి బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తారు.
► ఏ విధానంలో అయినా షేర్లు మీ ఖాతా నుంచి బదిలీ, జమ అయిన సమయంలో సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది.