మళ్లీ ఆన్‌లైన్‌ ‘థర్డ్‌’.. డిగ్రీ చదువులు | Resumed Online Classes Due To Omicron In Telangana | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆన్‌లైన్‌ ‘థర్డ్‌’.. డిగ్రీ చదువులు

Published Tue, Nov 30 2021 2:19 AM | Last Updated on Tue, Nov 30 2021 2:20 AM

Resumed Online Classes  Due To Omicron In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులకు కాలేజీలు మొదలవ్వబోతున్నాయి. ఇప్పటికే కొత్త విద్యార్థులకు పరిచయ కార్యక్రమా లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలబడేట్టు కన్పించడం లేదు. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ నీలినీడల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి తిరిగి ఆన్‌లైన్‌ బోధన ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం రాష్ట్రం లోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో సమావేశం నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ విద్యాబోధనే ఇందులో ప్రధాన ఎజెండా కావడం గమనార్హం. వీలైనంత ఎక్కువగా విద్యార్థులను, అధ్యాపకులను, కాలేజీల యాజమాన్యాలను సిద్ధం చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై స్పష్టత లేకున్నా ఆన్‌లైన్‌ బోధనను ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్‌లైన్‌కూ కాలేజీలు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు.

మార్గదర్శకాల రూపకల్పన
ప్రాథమిక విశ్లేషణల ప్రకారం అన్ని వర్సిటీలు ఆన్‌లైన్‌ బోధనకే ప్రాధాన్యమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో ఆన్‌లైన్‌ బోధనపై అనేక విమర్శలొచ్చిన నేపథ్యంలో ఈ విధానంలో ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. కాలేజీల్లో ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరవడటం వల్ల బోధన సరిగా జరగలేదని ఆరోపణలొచ్చాయి. కొన్నిచోట్ల అధ్యాపకులు సెల్‌ఫోన్‌ ద్వారా తరగతు లు బోధించారు. ఇందులో సబ్జెక్టు ప్రాధాన్యత కొరవడిందని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జూమ్‌ మీటింగ్‌ల ద్వారా కూడా బోధనకు అనేక సమస్యలు వచ్చాయి. చాలాచోట్ల ఫ్యాకల్టీలు సాంకేతికతకు అలవాటు కాలేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ బోధన కోసం మార్గదర్శకాలు రూపొందించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

ఆన్‌లైన్‌ సంభాషణ జరిగేలా..

గతంలో ఆన్‌లోన్‌ విద్యాబోధనపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని పకడ్బందీగా నిర్వహించడంపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ఆఫ్‌లైన్‌లో అయితే విద్యార్థులు, అధ్యాపకుల మధ్య నేరుగా సంభాషణ ఉంటుంది కాబట్టి విద్యార్థులు నేరుగా అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఇలాంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల రోజూ అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఆన్‌లైన్‌ సంభాషణ జరిగేలా చూడాలని భావిస్తోంది.

ఆన్‌లైన్‌ బోధనకు సంబంధించి ఉన్నత విద్యామండలి కొన్ని అంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో ముఖ్యమైంది.. ప్రతీ విద్యార్థి, అధ్యాపకుడి మధ్య ఆన్‌లైన్‌ సంభాషణ జరిగేలా చూడాలి. బోధన తొలి నాటి నుంచి కనీసం 15 నిమిషాలపాటు ఓ గ్రూపు ద్వారా విద్యార్థులతో అధ్యాపకులు మాట్లాడేలా చూడాలి.

కనిష్టంగా 10, గరిష్టంగా 40 శాతం వరకూ ఆన్‌లైన్‌ బోధన చేపట్టేలా కాలేజీలను ప్రోత్సహించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అ«ధ్యాపకులు బోధన చేసేందుకు అవసరమైన సదుపాయాలపై కాలేజీలు దృష్టి పెట్టేలా సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకునేలా వీసీలు చూడాలి. 

 నిజానికి రెండేళ్లుగా ఆన్‌లైన్‌ బోధనతో విసిగిపోయిన మెజారిటీ విద్యార్థులు ప్రత్యక్ష బోధన కోరుకుంటున్నారని ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఈనేపథ్యంలో మళ్లీ ఆన్‌లైన్‌ వైపు సంసిద్ధులను చేయడంపై వీసీలు దృష్టి పెట్టాలి.

ఆన్‌లైన్‌ అంతర్భాగమే
ఆన్‌లైన్‌ బోధన నేటి విద్యా విధానంలో అంతర్భాగమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రత్యక్ష బోధన సాధ్యం కాని పరిస్థితులు తలెత్తితే సమర్థవంతమైన ఆన్‌లైన్‌ బోధన వైపు అడుగులేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం. వీసీలతో సమావేశంలో దీన్నే ప్రధానాం శంగా చర్చిస్తాం. – ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement