సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్ మొదలైందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా ఆయన అభివర్ణించారు. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని చెప్పారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకమైనవన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికీ హానికలిగే అవకాశాలున్నాయన్నారు.
అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు రోజుకు 10 వేల కేసులొచ్చాయని, ఇప్పుడు కొద్దికాలంలోనే అత్యధిక స్థాయికి వెళ్లి రోజుకు 30 వేల కేసుల దాకా రికార్డయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే అంతే త్వరగా వైరస్ తీవ్రత తగ్గిపోయి కేసులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని, ఒమిక్రాన్‌తో వచ్చే 6 నెలల్లో కోవిడ్ నుంచి విముక్తి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
90% మందిలో లక్షణాల్లేకున్నా...
కరోనా వైరస్ కంటే కూడా దాని వల్ల ఏర్పడ్డ భయమే బాధితుల ప్రాణాలు పోయేందుకు కారణమైందని, ఫస్ట్‌వేవ్‌లో భయంతోనే చాలా మంది చనిపోయారని డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం సుమారు 90 శాతం మందిలో ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా, వారు ఇతరులకు వ్యాప్తి చేస్తారు కాబట్టి అందరూ కోవిడ్ జాగ్రత్తలన్నీ పాటించాలన్నారు. మిగతా 10 శాతం మందిలో లక్షణాలు కనిపించినా వారిలో స్వల్ప సంఖ్యలోనే సీరియస్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఒకవేళ కేసులు లక్షల్లో పెరిగితే ఒక శాతం మంది సీరియస్ అయినా ఆసుపత్రులు, వైద్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సరఫరా చేసే కిట్‌లతో నయం చేసుకోవచ్చన్నారు. జీహెచ్‌ఎంసీలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. పాజిటివ్ కేసులన్నిటినీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించలేమని, 25 సీటీ విలువ కంటే తక్కువగా ఉన్న వారి నమూనాలను ఈ పరీక్షలకు పంపిస్తామని ఒక ప్రశ్నకు శ్రీనివాసరావు బదులిచ్చారు. కొత్త వేరియెంట్ ఏదైనా నిషేధాజ్ఞలు, ఆంక్షలు, రాత్రి కర్ఫ్యూలు, సినిమా హాళ్ల మూసివేత అవసరం లేదని మరో ప్రశ్నకు జవాబిచ్చారు.
జనవరి తొలివారంలో టీనేజర్లకు టీకాలు షురూ...
వచ్చే నెల మొదటి వారంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకాలు ఇస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 60 ఏళ్లు పైబడ్డ వారు, ఇతర వర్గాల వారికి ‘ప్రికాషనరీ డోస్‌లు’ఇవ్వబోతున్నట్టు చెప్పారు. టీకాలకు సంబంధించి రాష్ట్రంలో తగిన నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఒక్కడోస్ కూడా తీసుకోని వారు, రెండో డోస్ జాప్యం చేసిన వారు వెంటనే టీకాలు తీసుకొని ముప్పు నుంచి తమను తాము కాపాడుకోవాలన్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, డెల్టా, ఒమిక్రాన్ పేర్లు ఏవైనా పాజిటివ్ కేసులు అన్నింటిని కోవిడ్‌గానే చూడాలని ఆయన స్పష్టం చేశారు. వేరియెంట్ ఏదైనా డయాగ్నిస్టిక్ టూల్స్, చికిత్సపరంగా ఎలాంటి మార్పులేదన్నారు.
ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన మందులు అందుబాటులోకి వచ్చాయని ఇప్పటికే మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్ అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌పై ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే దాని వినియోగానికి అనుమతి లభించొచ్చని ఆయన వివరించారు. మొత్తం 135 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, దేశంలో 19 శాతం పెరుగుదల నమోదైందన్నారు. ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ ఆరురెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారని, కొన్ని పరిశోధనల ప్రకారం 30 రెట్ల వరకు పెరగొచ్చునని అంటున్నారని తెలిపారు. 100% కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్న లబ్ధిదారుల శాతం, 67% రెండో డోస్ టీకా తీసుకున్న వారి శాతం, 0.6% ప్రస్తుతం తెలంగాణలో పాజిటివిటీ రేట్
లక్షల కేసులొచ్చినా..
► లక్షలాదిగా కేసులు పెరిగినా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యశాఖ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఆసుపత్రి పడకలు, తగినంత ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి.
ఇళ్లలోనే వేడుకలు నయం
► న్యూఇయర్, సంక్రాంతి నేపథ్యంలో కోవిడ్ తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. అందువల్ల కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుకలు జరుపుకుంటే మంచిది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు, పబ్బులు, పార్టీలకు వెళ్లే వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లోనూ మాస్క్...
► గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తున్నందున దాన్ని అడ్డుకొనేందుకు ప్రజలు ఇంటా, బయట మాస్క్‌లు ధరించాలి. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడరాదు. ఇళ్లలోనూ తలుపులు, కిటికిలు తెరిచి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment