సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో విముక్తికి మరికొంత కాలం వేచిచూడక తప్పేట్లు లేదు. తాజాగా గుజరాత్, మహారాష్ట్రలలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ బీఎఫ్.7 కేసుల వ్యాప్తితో కరోనా జాగ్రత్తలతో పాటు, కేసుల పర్యవేక్షణ, ‘జీనోమిక్ సర్వెలెన్స్’పెంచాలని అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. దీపావళి వేడుకలు ఘనంగా జరుపునేందుకు దేశప్రజలు సిద్ధం కావడం, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో అపమ్రత్తంగానే ఉండాలని సూచించింది.
బీఎఫ్.7 వేరియెంట్‌కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావంతో పాటు గతంలో కరోనా సోకడం వల్ల, వ్యాక్సిన్లతో ఏర్పడిన యాంటీబాడీస్‌ను తప్పించుకునే గుణం ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీని కారణంగా భారత్‌లో నాలుగో వేవ్ ఏర్పడుతుందా అన్న ఆందోళన వైద్య పరిశోధకులు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
‘‘కొత్త వేరియెంట్ పట్ల వచ్చే రెండువారాలు అప్రమత్తంగా ఉండాలి. ఇతర దేశాల్లో కేసుల్లో పెరుగుతున్నందున మనపైనా ప్రభావం ఉంటుంది’అని నేషనల్ టెక్నికల్ అడ్వెయిజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్మునైజేషన్ చైర్మన్ డా.ఎన్‌కే అరోరా స్పష్టంచేశారు. గత రెండున్నరేళ్లుగా కరోనా పేషెంట్లకు చికిత్సతో పాటు దానిలో మార్పులను గమనిస్తున్న చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా.హరికిషన్, క్రిటికల్‌కేర్ నిపుణులు డా. కిరణ్ మాదల తాజా పరిస్థితులపై ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు... వారి మాటల్లోనే..
మరో వేవ్‌గా మారే అవకాశాలు తక్కువే కానీ...
ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. ఐతే ఒమిక్రాన్ సోకాక, వ్యాక్సినేషన్ లేదా సహజసిద్ధంగా ఏర్పడిన రోగనిరోధకశక్తితో ప్రపంచంలోని 60 శాతానికి పైగా ప్రజల్లో రక్షణలు ఏర్పడ్డాయి. దేశంలో ఒమిక్రాన్ వేవ్ వచ్చి 7,8 నెలలు దాటినా కొత్త వేరియెంట్ ఏదీ రాలేదు. వ్యాక్సినేషన్ సగటుశాతం పెరగడమే దానికి కారణం కావొచ్చు. అందువల్ల కొత్త వేరియెంట్‌ను ఒమిక్రాన్ ఉపవర్గంగానే చూడాలి. వైరస్‌కు ఏర్పడే మ్యుటేషన్ల ప్రభావం చూపొచ్చునని అంటున్నారు. కానీ మనదగ్గర కోవిడ్ మూడుదశలు ముగిసినందున, ప్రజల ఇమ్యూనిటీ లెవల్స్‌ను బట్టి చూస్తే అది మరో వేవ్‌గా మారే అవకాశాలు తక్కువే. కరోనా ఉపద్రవంలో ఒమిక్రానే చివరి వేరియెంట్ కావొచ్చుననే ఆశాభావంతో పరిశోధకులున్నారు. ఐతే 70 ఏళ్లకు పైబడిన వారు వివిధ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
– డా. కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి
జాగ్రత్తగా ఉండాల్సిందే..
ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్‌గా గుర్తించారు. దీని తీవ్రత ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీని వేగవంతమైన వ్యాప్తి అనేది బెల్జియం, యూఎస్ కేసుల ఆధారంగా తెలుస్తోంది. జ్వరం, దగ్గు, గాలిపీల్చడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, జలుబు, తలనొప్పి, గొంతునొప్పి, రుచి కోల్పోవడం వంటివి దీని లక్షణాలు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే ఆక్సిజన్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. తీవ్రమైన లక్షణాలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. గుండె, శ్వాసకోశాలు, మూత్రపిండాలు, కాలేయం, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
– డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద
Comments
Please login to add a commentAdd a comment