ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మే 30న తన పదవీకాలం ఐదేళ్లు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నందుకు ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2014లో ఎన్నికయ్యాక ఐదేళ్లు పాలన చేసినట్లే అయినా, సాంకేతికంగా చూస్తే ఆయన ఎనిమిది రోజులు ముందుగానే పదవి కోల్పోయారు. ఎందుకంటే చంద్రబాబు 2014 జూన్ 8న పదవీ చేపట్టగా, ఎన్నికల్లో ఓడిపోయి 2019 మే 30 కంటే ముందే సీఎం పదవిని వదలిపెట్టవలసి వచ్చింది. కానీ వైస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలకు ఆ ఇబ్బంది రాలేదు.
చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీఆర్‌ను కూలదోసి సీఎంగా అధికారం చేపట్టారు. 1999 అక్టోబర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చినా, 2003లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి కారణంగా 2004 మే నెలలోనే పదవిని కోల్పోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మిగిలిన సీఎంల కన్నా విభిన్నమైన రాజకీయవేత్త అని చెప్పాలి. వైఎస్సార్‌సీపీను స్థాపించడం, ఆ తర్వాత ఆయన అనేక కష్ట, నష్టాలు ఎదుర్కోవడం అంతా ప్రజలు గమనించారు. అక్రమ కేసులలో ఆయన జైలులో ఉన్నప్పుడు, ఆయన కోసం రాజీనామా చేసిన వారి నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ సంచలనాత్మకమైన రీతిలో గెలుపొందడం కూడా విశేషమే.
2014 సాధారణ ఎన్నికలలో YSRCP అధికారంలోకి రాలేకపోయినా, గౌరవనీయ సంఖ్యలో విజయాలు సాధించింది. విపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలో పోరాట పటిమ తగ్గలేదు. తదుపరి సైతం అనేక పోరాటాలు చేయవలసి రావడం వంటి ఘట్టాల నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019లో చరిత్రాత్మకమైన రీతిలో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎవరికి సాధ్యం కానీ రీతిలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి 151 సీట్లతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలగడం ఒక రికార్డు. ఉమ్మడి ఏపీలో NTR, KCR, YS జగన్‌మోహన్ రెడ్డిలే సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. తెలుగు రాష్ట్రాలలో తండ్రులు ముఖ్యమంత్రులు అయ్యాక, వారి కుమారులు పలువురు రాజకీయాలలోకి వచ్చి మంత్రులు కాగలిగారు తప్ప, ముఖ్యమంత్రి అయింది మాత్రం YS జగన్‌మోహన్ రెడ్డి ఒక్కరే.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో 2009 లోనే ఎంపీగా గెలుపొందిన మాట నిజమే. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భవిష్యత్తు ఒకరకంగా చెప్పాలంటే గందరగోళంలో పడింది. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరించి అవకాశం ఇవ్వలేదు. అదే ఆయనకు ఛాలెంజ్‌గా మారింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, తనదైనా పంథాలో ముందుకు సాగారు, గెలిచినా, ఓడినా సొంత రాజకీయం సాగించారు. సోనియాగాంధీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నందున కేసులు పెడుతుందన్న భయంతో వైఎస్ సన్నిహితులు సైతం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెంట నడవడానికి భయపడినా, తాను మాత్రం తిరుగుబాటు వీరుడుగానే జనంలోకి వెళ్లి వారి హృదయాలను గెలుచుకున్నారు.
మామ ఎన్టీఆర్‌నే కుట్ర పూరితంగా సీఎం పదవిని లాగిపడేసిన వ్యక్తి చంద్రబాబు. ఎప్పుడు ఎవరితో అవసరమైతే వారితో పొత్తు పెట్టుకోగల వ్యక్తి, ఆచరణ సాద్యం కానీ హామీలు ఇచ్చే వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు వంటి నేతను ఢీకొట్టడం అంటే తేలిక కాదని చాలామంది భావిస్తారు. కుట్ర రాజకీయాలలో ఘనాపాటిగా పేరొందిన చంద్రబాబును ఓడించడం ద్వారా రాజకీయాలలో విశ్వసనీయతకు ప్రాధాన్యం ఉందని మొదటిసారిగా రుజువు చేసిన నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అనైతిక రాజకీయాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు తాను ఏమి చెప్పానో, అవి చేయాల్సిందే అనే పట్టుదలతో కృషి చేసిన ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు.
చంద్రబాబు 2014 లో తాను ఇచ్చిన మానిఫెస్టోని మాయం చేస్తే, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019లో తాను ప్రకటించిన మానిఫెస్టోని మంత్రులు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చి అమలు చేయాల్సిందేనని చెప్పి కొత్త సంస్కృతికి నాంది పలికారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేతంగా సంక్షేమ పథకాలు చేయలేదని చెప్పాలి. అంతేకాదు... తన టరమ్ పూర్తి అవుతున్న తరుణంలో మానిఫెస్టో కాపీలతో పాటు, ఏ కుటుంబానికి ఎంత మేలు చేసింది వివరిస్తూ ప్రతి ఇంటికి అభివృద్ది నివేదికలను తన ఎమ్మెల్యేల ద్వారా అందించి కొత్త ట్రెండ్ సృష్టించిన నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని చెప్పాలి. మనిషిని చూస్తే ఈయన నిజంగానే ఇన్ని చేశారా అనిపిస్తుంది. ఇంతమంది ఆయనపై కక్ష కడితే వారందరిని ఒంటి చేత్తో ఎదుర్కున్నారా? అనే భావన వస్తుంది. బక్కపలచగా ఉండి, సింపుల్ డ్రెస్‌లో కనిపించే ఈయన ఏపీలో ఇన్ని వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల ముందుకు పరిపాలనను తెచ్చి రాష్ట్రాన్ని సరికొత్తగా మార్చగలరని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.
ప్రభుత్వంలోని దాదాపు అన్నీ రంగాలలో తనదైన మార్కును వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చూపించగలిగారు. పేదలు vs పెత్తందార్లు అనే నినాదాన్ని చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యవస్థలను ఆయన తెచ్చారంటే అతిశయోక్తి కాదు. కరోనా సంక్షోభ సమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, వ్యాధి పాలిట పడిన వారికి అందించిన వైద్యసేవలు మొదలైనవి ప్రశంసనార్హం. ఆ టైమ్‌లో సైతం స్కీములను అమలు చేసి ఆదుకున్న నేతగా ప్రజల గుండెల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆశ్చర్యం కాదు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన రోల్ మోడల్ ప్రభుత్వాన్ని నడిపారు. దేశంలోనే ఎవరూ చేయని సరికొత్త ప్రయోగాలు చేశారని చెప్పాలి. అందులో అనేకం కీలకంగా ఉన్నాయి.
వలంటీర్ల వ్యవస్థను పెడతానని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రభుత్వంలోకి రాగానే వలంటీర్లను పెడుతుంటే వీరంతా ఏమి చేస్తారో అనే అభిప్రాయం ఉండేది. రెండున్నర లక్షల మంది స్వచ్చంద సైన్యాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తయారు చేశారన్న సంగతి ఆ తర్వాత కానీ జనానికి అర్దం కాలేదు. వలంటీర్లు ఇళ్లకు వచ్చి కుశల సమాచారం అడగడం కాదు.. వారి పరిపాలనకు సంబంధించిన అవసరాలను తీర్చే వ్యవస్థగా మారారు. ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు. ప్రభుత్వమే ప్రతి ఒక్కరి గడప వద్దకు వెళ్లి సేవలందించడం అని పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చి అమలు చేయడం అతి పెద్ద విజయం అనిపిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు అవసరమైన పనులన్ని జరిగిపోవడం కొత్త అనుభూతి. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్టు కావాలన్నా, వేరే ఏ పని ఉన్నా, మండల ఆఫీస్‌ల చుట్టూనో, ఆ పైన ఉండే అదికారుల చుట్టూనో తిరిగే పరిస్థితిని తప్పించి తమ ఇళ్లకే అవన్ని చేరే ఏర్పాటు చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిజంగా అభినందనీయుడు.
ఈ సచివాలయాల కోసం ఏకంగా లక్షన్నర ఉద్యోగాలను ఒకే ఏడాదిలో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. రైతులు ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం తమ చెప్పులను ఆయా షాపుల వద్ద, ప్రభుత్వ గౌడౌన్‌ల వద్ద క్యూలో పెట్టవలసి వచ్చేది. ఇప్పటికి తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదిలాబాద్‌లో జరిగిన రైతుల ఆందోళన ఇందుకు ఉదాహరణ. ఏపీలో ఆ ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేయగలిగారు. రైతులు తమ గ్రామంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలనుంచి అన్నీ సేవలు పొందగలుగుతున్నారు. అందువల్లే ఈ ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రైతు ఆందోళన చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు అమలు చేస్తామని చెబుతూ అంతా వచ్చి దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడు బారీ క్యూలు తెలంగాణ వ్యాప్తంగా కనిపించాయి. అదే ఏపీలో ఆ అవసరమే లేదు. వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అర్హత ఉంటే వారే నమోదు చేసుకుని స్కీమ్ అమలు చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే.
ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన మార్పులు ఒక విప్లవం అని చెప్పాలి. స్కూళ్లు బాగు చేయడం మొదలు, ఆంగ్ల మీడియం, వారికి మంచి ఆహారం, డ్రెస్, పుస్తకాలు మొదలైనవి స్కూల్ తెరిచిన మొదటి రోజుల్లోనే ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఆంగ్ల మీడియం, ఐబీ సిలబస్, టోఫెల్ మొదలైన వినూత్న మార్పులు జరిగింది ఏపీలో మాత్రమే. వైద్య రంగంలోకూడా గణనీయమైన మార్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను మార్చారు. ప్రజల వద్దకే డాక్టర్‌లను పంపించే విధానం తెచ్చారు. ఊళ్లలో ఆరోగ్య శిబిరాలు పెట్టారు. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంచారు. తను చెప్పిన సంక్షేమ స్కీములను యధాతధంగా అర్హులైన వారందరికి అమలు చేసి చూపించారు. ప్రాంతం చూడలేదు. కులం చూడలేదు. మతం చూడలేదు. పార్టీ చూడలేదు. ఇది చాలామందికి నమ్మశక్యం కానీ విషయమే.
అంతకుముందు టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల అవినీతి తతంగాలు చూసినవారికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ మార్పు ఆశ్చర్యాలను కలిగించింది. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం.. ఇలా ఒకటేమిటి సుమారు ముప్పైకి పైగా స్కీములను ఒక్క రూపాయి అవినీతి లేకుండా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా డిబిటి పద్దతి అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదే. పేదలకు 31లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక సంచలనం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విపక్ష టీడీపీ తొలుత వీటన్నిటిని విమర్శించినా, తదుపరి తామూ అమలు చేస్తామని చెప్పడమే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజన్‌ను తెలియచేస్తుంది. అభివృద్ది వైపు చూస్తే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేయడం అన్నిటికన్నా పెద్ద ప్రగతి అని వేరే చెప్పనవసరం లేదు.
తీర ప్రాంతంలో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిషరీస్ యూనివర్శిటీ, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, 700 కోట్లతో 800 గ్రామాలకు నీటి స్కీము, పదిహేడు మెడికల్ కాలేజీలు, పలు కొత్త పరిశ్రమలు, పార్మాహభ్, రెండున్నర లక్షల కోట్ల విలువైన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, నలభై వేల కోట్ల విలువైన సోలార్ పానెల్ పరిశ్రమ.. బద్వేలు వద్ద సెంచరీ ప్లైవుడ్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ.. ఇలా అనేకం టేక్ ఆఫ్ అయ్యాయి. విశాఖ నగరాన్ని ఒక సూపర్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టారు. ఆదాని డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ తదితర కంపెనీలు రావడం.. ఇలా ఒకటేమిటి వివిధ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకునేలా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇదేదో పొగడడానికి చెప్పడం లేదు. అలా అని విమర్శలు లేవని కాదు. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఒక్క మద్య నిషేధం హామీని అమలు చేయలేకపోయామని పార్టీనే అధికారికంగా చెప్పింది.
శాంతి భద్రతలు ఐదేళ్లుగా పూర్తి అదుపులో ఉన్నా, ప్రతిపక్షం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దారుణమైన అబద్దాలు ప్రచారం చేశాయి. వీటిని ఎదుర్కోవడం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు పెద్ద సవాల్ అయింది. ఒకేసారి వివిధ రంగాలలో సంస్కరణలు చేపట్టడం, ఆయా వర్గాలలోని పెత్తందార్లకు ఆగ్రహం తెప్పించింది. ఉదాహరణకు ప్రభుత్వ స్కూళ్లు బాగు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు నచ్చలేదు. ప్రభుత్వ సేవలన్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడం, తద్వారా తమ ప్రాధాన్యత తగ్గిందన్న భావన, ముడుపులు దక్కకుండా పోతున్నాయన్న ఆక్రోశం అందరిలో కాకపోయినా కొంతమంది ఉద్యోగులలో ఏర్పడిందని అంటారు. ప్రభుత్వ స్కూళ్లు బాగు చేసి టైమ్‌కు టీచర్లను రావాలని చెబితే వారిలో కొందరికి కోపం వచ్చిందని చెబుతారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు చేయాలని, ఇతరత్రా పేదలకు ధరలు అందుబాటులో ఉంచాలని, దానిని బట్టి టిక్కెట్ల రేట్లు నిర్ధారిస్తామని చెప్పడం బడా సినిమా పెట్టుబడిదారులకు నచ్చలేదు.
ఆస్పత్రులను బాగు చేసి, డాక్టర్‌లను పేదల ఇళ్లకు పంపడం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అంతగా ఇష్టం ఉండదు. భూముల రీసర్వే, ఈ స్టాంప్ విధానం, లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు తగ్గించడం, బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారికి అసంతృప్తి కలిగించింది. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు పచ్చి అబద్దాలను ప్రచారం చేశారు. ఆయా వ్యవస్థలను చంద్రబాబు బాగా ప్రభావితం చేస్తూ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అందులో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు బాగా తలనొప్పి తెప్పించారని చెప్పవచ్చు. మూడు రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి రానీవ్వకుండా విపక్షం వ్యవస్థల ద్వారా అడ్డుపడింది.
ఇన్ని జరిగినా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎప్పుడూ పెత్తందార్ల ప్రతినిధిగా ఉండడానికి ఇష్టపడలేదు. పాదయాత్రలో సామాన్యుల కష్టాలు ఎలా తెలుసుకున్నారో, ఆ విధంగానే పేదల ప్రతినిధిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలన సాగించారు. అదే శ్రీరామరక్ష అవుతుందని ఆయన నమ్మారు. అందుకే ధైర్యంగా తను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు. ఇలా చేసిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒక్కరే. ఎంత ఆత్మ విశ్వాసం లేకుంటే ఆయన ఆ మాట చెప్పగలుగుతారు! అదే ఆత్మ స్థైర్యంతో, ప్రత్యర్ధులు ఎంతగా వేధించినా తొణకకుండా, బెణకకుండా ఐదేళ్లు పూర్తి చేసుకుని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సగర్వంగా ప్రజల ముందు నిలబడ్డారు. అదే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భవిష్యత్తు విజయానికి సంకేతంగా కనిపిస్తుంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment