వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనకు అనూహ్యంగా ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేర్వేరుగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని, మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై చర్చిస్తున్నారు. తాను కచ్చితంగా ప్రజలలో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్ కు భరోసా ఇచ్చేది అవుతుంది.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. ఒకసారి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జనంలో తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాయుత ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. కొద్ది మంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీవారి ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. వారి కోసం ఇప్పటికే జిల్లా వారీగా లీగల్ టీమ్ లు ఏర్పాటుచేశారు. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని కోరారు. తదుపరి తానే స్వయంగా వెళ్లి పరామర్శించబోతున్నారు.
ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి, టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా, మరణించినా చంద్రబాబు దానిని రాజకీయం చేసి, అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతుండేది. ఈ రకంగా ఐదేళ్లపాటు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతేనేం అధికారం సంపాదించారు. టీడీపీ వారు దానిని సద్వినియోగం పరచుకోవడం మాని వైఎస్సార్‌సీపీ వారిపై కక్ష సాధింపునకు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యధేచ్చగా హింసాకాండకు పాల్పడడానికి చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ప్రోత్సహం ఇవ్వడం దురదృష్టకరం.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పార్టీవారిలో విశ్వాసం పెంపొందిచడానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీకు భవిష్యత్తు ఉందని ఆయన చెబుతూ ఆత్మ స్థైర్యం కోల్పోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989-94, 2004-2014, 2019-2024 టరమ్ లలో అధికారంలో లేదు. ప్రతిపక్షంగానే ఉంది. అయినా పార్టీ నిలబడింది. తిరిగి పవర్ లోకి వచ్చింది. అబద్ధాలతో వచ్చిందా? లేక కొందరు అనుమానిస్తున్నట్లు ఈవీఎం మోసాలతో వచ్చిందా? అనేది వేరే విషయం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలపాటు అధికారంలో లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి.
అలాగే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా, నిత్యం ప్రజలతో మమేకమయి 2019లో ప్రభుత్వంలోకి వచ్చారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైఎస్సార్‌సీపీకి కూడా కొత్త కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్ కు కాస్త ధైర్యాన్ని ఇచ్చి ప్రజలలో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఉంటుంది. దానిని వినియోగించుకోగలగాలి.
ఈ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలను నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగా పేరొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ చాలా వరకు మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దానినే ఆయన ప్రస్తావించి మనపట్ల విశ్వసనీయత బతికే ఉందని అన్నారు. అర్హతే ప్రమాణికంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా స్కీములు అమలు చేసిన చరిత్ర తమది అయితే, కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో టీడీపీ వారు తెగబడి రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాదిరి స్కీముల అమలులో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.
అయితే అదే విశ్వసనీయత పాయింట్ ఆయనను దెబ్బతీసిందని చెప్పాలి. తన ప్రభుత్వం ఏడాదికి సుమారు డెబ్బైవేల కోట్ల రూపాయల మేర వివిధ స్కీములను అమలు చేస్తున్నందున అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్ లు నాలుగువేల రూపాయలు చేయలేమని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. దానిని జనం పాజిటివ్ గా తీసుకోలేదని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి ఓటు వేసినట్లు కనబడుతుంది. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. "విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా! లేక కష్టాలు ఎదుర్కుంటూ హూందాగా నిలబడి ముందడుగు వేద్దామా?" అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు.
తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మినా, వాటిని అమలు చేయడం కష్టం కనుక, 2014 టరమ్ లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం ఈసారి కూడా చతికిలపడుతుందని పలువురు భావిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిబ్బరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున చంద్రబాబు నాయుడు రకరకాల ప్రలోభాలు పెట్టడమో, లేక తప్పుడు కేసులు పెట్టించడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దానిని తట్టుకుని నిలబడాలని ఎమ్మెల్సీలను ఆయన కోరారు. దానికి ఎంతమంది కట్టుబడి ఉంటారన్నది కాలమే తేల్చుతుందని చెప్పాలి.
ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒక మాట చెప్పేవారు. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే, కేంద్రంలో ఏ కూటమికి తక్కువ సీట్లు వస్తే, దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడతానని అనేవారు. అప్పట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ప్లస్ పాయింట్. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దానిని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాగా ఎక్స్ పోజ్ చేశారు. మరో మాట కూడా అన్నారు.
ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదారత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆశించనవసరం లేదు.
1994లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఉమ్మడి ఏపీలో ఇరవైఆరు సీట్లే వచ్చాయి. దీని ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పట్లో కాంగ్రెస్ నేత పి. జనార్ధనరెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు ఆ హోదా ఇస్తారని అనుకోనవసరం లేదు. అయితే శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పార్టీలో పునరుత్తేజానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్‌సీపీకు భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment