ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కసారి రోడ్డు మీదకు రావడం ఆరంభం అయితే ఎలా ఉంటుందో చూశారుగా. దెబ్బకు దెయ్యం దిగివచ్చినట్లు ప్రభుత్వంలో కూడా కాస్త చలనం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించక తప్పలేదు. తెలుగుదేశంవారు హింసకు పాల్పడినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు.
ఇన్నాళ్లు చంద్రబాబు ఏమి వ్యాఖ్యానించేవారంటే.. వైఎస్సార్‌సీపీవారు దాడులు చేసినా ప్రతిదాఢులు చేయవద్దని చెప్పారే తప్ప టీడీపీవారు హింసాకాండకు దిగవద్దని బాబు ఒక్క మాట కూడా అనలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు నోరే విప్పలేదు. హోం మంత్రి అనిత ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, ఇతర నేరాలపై మాట్లాడుతూ తాను లాఠీ తీసుకుని వెళ్లాలా అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ రకంగా ఒక బాధ్యత లేకుండా సాగుతున్న పాలనకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెక్ పెట్టారని అనుకోవాలి.
వినుకొండ వద్ద జరిగిన రషీద్ దారుణ హత్య తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి స్వయంగా అక్కడకు వెళ్లడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. నెలనర్నరకు పైగా టీడీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినా, వందలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర కష్టాలపాలవుతున్నా, పార్టీపరంగా గట్టిగా సమాధానం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉండేది. జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే రంగంలో దిగాలని పలువురు కోరుకునే వారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి తొందరపడకుండా ఉండాలని భావించినట్లు ఉన్నారు. అవసరమైనప్పుడు స్టేట్‌మెంట్‌లు ఇస్తూ వచ్చారు.
ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాకముందే జనంలోకి వెళితే భిన్నమైన సంకేతం వెళుతుందని అనుకుని ఉండవచ్చు. కానీ పరిస్థితి రోజు, రోజుకు దిగజారి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పూర్తిగా భయాందోళనకు గురి అయ్యారు. 36 మంది హత్యలకు గురి అయ్యారు. వందల మందిపై హత్యాయత్నాలు జరిగాయి. వందల కొద్ది ఆస్తుల విధ్వంసాలు సాగాయి. రెండువేలమందికి పైగా ఇళ్ళు వదిలి వేరే ప్రాంతాలలో తలదాచుకోవలసి వచ్చింది. చివరికి మూడుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిపై దాడి జరిగిన తీరు, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటివద్ద కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన వైనం దారుణంగా ఉన్నాయి. వారిద్దరి కార్లను ధ్వంసం చేయడం, రెడ్డప్ప వాహనాన్ని దగ్ధం చేయడం, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా వీరిపైనే హత్యాయత్నం కేసు పెట్టడం శోచనీయంగా ఉంది.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక రోజులలో ఉన్నామా? అన్న అనుమానం వస్తుంది. దానికి తగ్గట్లుగా చంద్రబాబు, లోకేష్ వంటివారు హింసను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఏపీలో వ్రజలకు రక్షణలేకుండా పోయింది. ప్రతిపక్షం లేకుండా చేయాలని గత టరమ్‌లో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, ఈసారి కార్యకర్తలను భయపెట్టి వైఎస్సార్‌సీపీని దెబ్బతీయాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ యువ నేత రషీద్ జరిగిన హత్య సమాచారం తెలిసిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెంగుళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకుని మరుసటి రోజు వినుకొండకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనకు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. పదిహేను చోట్ల ఏదో కారణం చెప్పి ఆయన కాన్వాయిని పోలీసులు నిలువరించే యత్నం చేశారట. ఆయన వెంట పార్టీ ఇతర నేతలు ఎవరూ రాకూడదని ఆంక్షలు పెట్టారట. చివరికి ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పాతది, సరిగా పనిచేయనిది అని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెప్పాయి. తత్పలితంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేరొక వాహనం మారి ప్రయాణించవలసి వచ్చింది.
సాధారణంగా తాడేపల్లి నుంచి వినుకొండకు గంటన్నరలో చేరుకోవచ్చు. కానీ వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయా చోట్ల గుమికూడి సాదరంగా స్వాగతం చెబుతుండడంతో కాన్వాయి బాగా ఆలస్యం అయింది. వినుకొండ జనసంద్రమే అయింది. వంద కిలోమీటర్ల దూరం కూడా లేని వినుకొండకు చేరుకోవడానికి ఏడుగంటలకుపైగా పట్టింది. దీనితో వైఎస్సార్‌సీపీలో ఒక విశ్వాసం ఏర్పడింది. కష్టకాలంలో తమకు పార్టీ అండదండగా ఉంటుందన్న ధీమా వచ్చింది. అధికార తెలుగుదేశం కూటమికి చెందినవారు చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి వారు సిద్ధమవడానికి అవకాశం ఏర్పడింది.
రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎండగట్టారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నరకే ఎవరూ ఈ డిమాండ్ చేయరు. కానీ 36 మంది హత్యలకు గురి కావడం, వందలమందిపై హత్యాయత్నం చేయడం, వందల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్ తెగబడడంలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఒక హెచ్చరిక పంపడానికి ఈ డిమాండ్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. డిల్లీలో ధర్నా చేయాలని తలపెట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రిలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంధర్భంలో ఒక కీలకమైన సంగతి ఏమిటంటే తమతో కలిసివచ్చే ఇతర రాజకీయ పక్షాలను కూడా ధర్నాకు ఆహ్వానించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడం.
ఇంతకాలం వైఎస్సార్‌సీపీ ఒంటరియానం సాగించింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏకి సహకరించినా, అందులో భాగం కాలేదు. అలాగే కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో ఎన్‌డీఏని వ్యతిరేకించినా కాంగ్రెస్ కూటమిలో భాగం కాలేదు. బీజేపీనేమో తమ సొంత రాజకీయం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీతో సంబంధాలకు విఘాతం ఏర్పడింది. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలలో ఏవైనా ఈ ధర్నాకు వస్తే విశేషమే అవుతుంది.
అలాగే వైఎస్సార్‌సీపీని దగ్గర చేసుకుంటే ఉపయోగం ఉంటుందని భావించి కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు ఏవైనా డిల్లీలో జరిగే దర్నాకు హాజరైతే ప్రధాన వార్తే అవుతుంది. ఈ రెండు కూటమిలలో లేని పార్టీలవారు ఎందరు వస్తారో చూడాలి. ఎవరు వచ్చినా, రాకపోయినా ఈ ధర్నా జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఒక సూచన అవుతుంది. ధర్నాలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనుసరించవలసిన ప్రక్రియలే. దీనివల్ల దేశ వ్యాప్తంగా ఏపీలో జరుగుతున్న హింసాకాండ గురించి ప్రజలకు, రాజకీయవర్గాలకు తెలుస్తుంది. ఎంత మిత్రపక్షమైనా బీజేపీ కూడా టీడీపీకి హెచ్చరికలు పంపించే అవకాశం ఉంటుంది.
శాసనసభలో సైతం గవర్నర్ ప్రసంగ టైమ్‌లో కానీ, ఇతర సంధర్భాలలో కానీ ఈ అంశాన్ని లేవనెత్తుతామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజలలోకి ప్రభుత్వ పార్టీ హింసాకాండను ఎండగడితేనే టీడీపీలో కాస్త అయినా జంకు వస్తుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డుమీదకు రావడం వల్లే, ఆయనకు జనంలో ఉన్న విశేష ఆదరణ కనిపించడం వల్లే చంద్రబాబు సైతం కాస్త వెనక్కి తగ్గి మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఎన్ని విమర్శించినా, రషీద్ హత్య గురించి ఆయన మాట్లాడక తప్పలేదు. శాంతిభద్రతల సమస్యపై వివరణ ఇవ్వక తప్పలేదు. ఎవరు శాంతి భద్రతల సమస్య సృష్టించినా చర్యలు తీసుకోవాలని పోలీసులను మాటవరసకైనా కోరక తప్పలేదు. అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పవర్! గెలిచినా, ఓడినా.. సింహం, సింహమే!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
ఇదీ చదవండి: అరాచక పాలనపై రేపు వైఎస్సార్‌సీపీ ధర్నా.. ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment