అమ్మకానికి ఫ్రీచార్జ్ రేసులో పేటీఎమ్ !
ముంబై: స్నాప్‌డీల్‌కు చెందిన మొబైల్ వాలెట్ ప్లాట్‌ఫార్మ్ ఫ్రీచార్జ్‌ను సాఫ్ట్‌బ్యాంక్ విక్రయించనున్నదని సమాచారం. దీనికి సంబంధించి కొన్ని సంస్థలతో సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు జరుపుతోందని డీల్ విలువ 15–20 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్నాప్‌డీల్‌ను మరో ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌కు సాఫ్ట్‌బ్యాంక్ విక్రయించనున్నదన్న వార్తల నేపథ్యంలో ఫ్రీచార్జ్ విక్రయ వార్తలు రావడం విశేషం. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆలీబాబా యాజమాన్యంలోని పేటీఎమ్ సంస్థ ప్రీచార్జ్ ను కొనుగోలు చేయొచ్చని సమాచారం.
రెండేళ్ల క్రితం ప్రీచార్జ్‌ను స్నాప్‌డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ 40 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కాలంలో నిధుల కోసం ఫ్రీచార్జ్ సంస్థ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పేపాల్, పేయూలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా కొన్ని నెలల క్రితం ప్రీచార్జ్‌ను కొనుగోలు చేయడానికి విజయ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎమ్ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్‌ను సంప్రదించిందని, అప్పుడు జాస్పర్ ఇన్ఫోటెక్ 50 కోట్ల డాలర్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఒక దశలో ప్రీచార్జ్ విలువను 90 కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. కాగా గత మూడు నెలల్లో స్నాప్‌డీల్, ప్రీచార్జ్‌లకు సంబంధించి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ప్రీచార్జ్ కోసం 15 కోట్ల డాలర్లనే పేటీఎమ్ ఆఫర్ చేస్తోందని సమాచారం.