
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ తిరస్కరించిన స్నాప్‌డీల్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్–స్నాప్‌డీల్‌ల మధ్య జరగాల్సిన డీల్ విఫలమయ్యింది. స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థి కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన 80–85 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 5,500 కోట్లు) ఆఫర్‌ను స్నాప్‌డీల్ బోర్డు తిరస్కరించింది. టేకోవర్ చేసేందుకు స్నాప్‌డీల్‌ను పరిశీలించే ప్రక్రియను ఇటీవల పూర్తిచేసిన ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన మొత్తానికి స్నాప్‌డీల్ అంగీకరించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కంపెనీ వాస్తవ విలువకంటే ఈ ఆఫర్ తక్కువని స్నాప్‌డీల్ బోర్డు భావించినట్లు ఆ వర్గాలు వివరించాయి. అయితే ఈ తొలి ఆఫర్ తిరస్కరణకు గురైనప్పటికీ, ఈ అంశమై చర్చలు కొనసాగుతున్నాయన్నది సమాచారం. ఈ అంశమై స్నాప్‌డీల్, సాఫ్ట్‌బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్‌లను సంప్రదించగా వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. స్నాప్‌డీల్‌లో ప్రధాన వాటాదారు అయిన సాఫ్ట్‌బ్యాంక్ ఈ డీల్ కోసం గత కొద్దినెలలుగా ప్రయత్నాలు జరుపుతోంది. స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు కూనల్ బెహెల్, రోహిత్ బన్సాల్‌లు కూడా బోర్డులో వున్నారు.
ఈ డీల్ జరిగితే ఇండియా ఈ–కామర్స్ రంగంలో అతిపెద్ద టేకోవర్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల పోటీతో కొద్ది నెలలుగా స్నాప్‌డీల్ వ్యాపారం తగ్గుతూ వస్తోంది. 2016 ఫిబ్రవరిలో స్నాప్‌డీల్‌ను 650 కోట్ల డాలర్లకు విలువకడుతూ పెట్టుబడులు రాగా, తాజా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ప్రకారం 100 కోట్ల డాలర్లలోపునకు విలువ తగ్గడం గమనార్హం.