ఫ్లిప్‌కార్ట్‌లో విలీనంతో స్నాప్‌డీల్ ఉద్యోగులకు పండుగే!
రూ.193 కోట్ల బొనాంజా ప్రకటించనున్న స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు!
న్యూఢిల్లీ: సాధారణంగా ఏదైనా కంపెనీని వేరొక కంపెనీకి అమ్మేస్తున్నారంటే.. అక్కడి ఉద్యోగుల్లో గుబులు, ఆందోళన అనేవి సహజమే. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో విలీనం అయ్యే అవకాశం ఉన్న ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ సిబ్బందికి మాత్రం పంట పండనుంది. ఈ డీల్ కనుక సాకారం అయితే, తమకు లభించనున్న పారితోషికం(పేఅవుట్)లో సగాన్ని(3 కోట్ల డాలర్లు–దాదాపు రూ.193 కోట్లు) తమ సిబ్బందికి పంచేయాలని కంపెనీ వ్యవస్థాపకులు(కునాల్ బహల్, రోహిత్ బన్సల్) నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ మేరకు తగిన చెల్లింపు స్కీమ్‌ను రూపొందించాల్సిందిగా స్నాప్‌డీల్ డైరెక్టర్ల బోర్డుకు వ్యవస్థాపకులు సూచించారని.. విలీన ఒప్పందం విషయంలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న భరోసా కల్పించేందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం స్నాప్‌డీల్‌లో 1,500–2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా. కాగా, గడిచిన ఏడాది కాలంలో కంపెనీని వీడిన కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా ఈ చెల్లింపు స్కీమ్‌తో ప్రయోజనం లభించనుంది. గతంలో వారికి ఇచ్చిన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్)కు అనుగుణంగా తగిన మొత్తాన్ని చెల్లించేలా చూడాలని వ్యవస్థాపకులు భావిసున్నారు.
స్నాప్‌డీల్‌లో మెజారిటీ వాటాదారు అయిన జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్.. ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం చేసేందుకు స్నాప్‌డీల్‌లోని మిగతా ఇన్వెస్టర్లందర్నీ ఇప్పటికే ఒప్పించింది. దీంతో అతిత్వరలోనే ఈ విలీన డీల్‌ను ప్రకటించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. విలీనానికి స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విలీన డీల్ ద్వారా వ్యవస్థాపకులకు 6 కోట్ల డాలర్ల నగదు మొత్తం లభిస్తుందని అంచనా. కాగా, ప్రస్తుతం స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు 30 శాతం వాటా ఉంది.
మిగతా ఇన్వెస్టర్లలో నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్‌కు 10 శాతం, కలారి క్యాపిటల్‌కు 8 శాతం చొప్పున వాటాలున్నాయి. అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో పాటు దేశీ అగ్రగామి ఫ్లిప్‌కార్ట్‌తో పోటీలో స్నాప్‌డీల్ వెనుకపడటమే కాకుండా.. ఇటీవల ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూడా కూరుకుపోయిన సంగతి తెలిసిందే. 2016 ఫిబ్రవరిలో దాదాపు 6.5 బిలియన్ డాలర్లమేర విలువ(వేల్యుయేషన్)ఉన్న స్నాప్‌డీల్‌కు... ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం డీల్‌లో కేవలం 1 బిలియన్ డాలర్ల మేర మాత్రమే విలువ దక్కుతుందని అంచనా వేస్తున్నారు.