అలా కాదు.. ఇంకో మాట చెప్పండి!!
మరికాస్త వేల్యుయేషన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌తో స్నాప్‌డీల్ చర్చలు
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మరింత అధిక వేల్యుయేషన్ కట్టడంపై ఇరు సంస్థలు చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 1 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన ఫ్లిప్‌కార్ట్ ఆ తర్వాత అన్ని అంశాలు మదింపు చేసుకున్న తర్వాత దాన్ని 850 మిలియన్ డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీన్ని స్నాప్‌డీల్ బోర్డు తిరస్కరించింది. ముందుగా చెప్పిన 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌కు తగ్గట్లుగా అదనంగా 150–200 మిలియన్ డాలర్ల విలువ కోసం ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ డీల్ పూర్తయితే దేశీ ఈ–కామర్స్ విభాగంలో ఇదే అత్యంత భారీ ఒప్పందం కానుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో తీవ్ర పోటీలో స్నాప్‌డీల్ గణనీయంగా వెనుకబడిపోయింది. 2016 ఫిబ్రవరిలో 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో నిధులు సమీకరించిన స్నాప్‌డీల్ విలువ ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను రైటాఫ్ చేసేసి.. స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించేందుకు మిగతా ఇన్వెస్టర్ల మద్దతు సమీకరించింది.