న్యూఢిల్లీ: ముసాయిదా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానంలో ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) నిబంధనపై ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిబంధన వల్ల ఏటా దాదాపు రూ. 400 కోట్ల పెట్టుబడులు లాక్ అయిపోతాయని, వ్యాపారులు ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ముందుకు రాబోరని పేర్కొన్నాయి. అంతే గాకుండా సుమారు 1.8 లక్షల ఉద్యోగాలకు గండిపడుతుందని ఆయా సంస్థలు అభిప్రాయపడ్డాయి.
ఈ–కామర్స్ రంగంలోకి పెట్టుబడులు రావడం తగ్గి, వృద్ధి నిల్చిపోతుందని పేర్కొన్నాయి. టీసీఎస్ నిబంధన ప్రకారం ఈకామర్స్ సంస్థలు.. తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని మినహాయించుకుని పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది. నిత్యం ఒకదానితో మరొకటి తీవ్రంగా పోటీపడే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్.. టీసీఎస్ విషయంలో మాత్రం ఒక్కతాటిపైకి రావడం గమనార్హం.