గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, May 15 2017 12:01 AM | Last Updated on Mon, Oct 22 2018 5:27 PM

గతవారం బిజినెస్‌ - Sakshi

గతవారం బిజినెస్‌

సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులు ఆవిరి
జపాన్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌కు భారత్‌లో పెట్టుబడులు అంతగా కలిసి రావడం లేదు. క్యాబ్‌ ఆగ్రిగేటర్‌ ఓలా, ఈకామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌లో భారీగా పెట్టిన పెట్టుబడుల విలువ గణనీయంగా తరిగిపోతోంది. ఈ రెండింటిలో పెట్టిన పెట్టుబడుల విలువ ఏకంగా రూ.9 వేల కోట్ల మేర కరిగిపోయినట్లు సాఫ్ట్‌బ్యాంక్‌ వెల్లడించింది.

 గృహ రుణాలకు ఎస్‌బీఐ రేట్లు తగ్గాయ్‌
ఎస్‌బీఐ చౌక గృహ రుణ రేట్లను పావు శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్‌ కొత్తగా రుణం తీసుకునే మహిళా ఉద్యోగులకు సంబంధించి అతి తక్కువగా 8.35 శాతం వడ్డీరేటును అమలు చేయనుంది. కాగా ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి ఎఫ్‌పీఓ లేదా క్విప్‌ ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తోంది.

 ఆర్‌బీఐ వాచ్‌లిస్ట్‌లో ఐడీబీఐ బ్యాంక్‌
ఎన్‌పీఏలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు విషయంలో సత్వర దిద్దుబాటు చర్యలకు ఆర్‌బీఐ ఉపక్రమించింది. దీంతో కొత్త రుణాలు మంజూరు చేయడం, డివిడెండ్‌ పంపిణీ తదితర కార్యకలాపాలపై పరిమితులు అమల్లోకి రానున్నాయి. తమ సంస్థలో అధిక ఎన్‌పీఏలు, ఆస్తులపై రాబడులు ప్రతికూలంగా ఉండటం వంటి అంశాల కారణంగా ఆర్‌బీఐ మే 5న సత్వర దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు ఐడీబీఐ బ్యాంకు వెల్లడించింది.

ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఏప్రిల్‌ నెలలో రూ.9,429 కోట్లమేర పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపడం సహా ఫండ్‌ హౌస్‌లు మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తీసుకున్న పలు చర్యలు ఇన్వెస్ట్‌మెంట్ల పెరుగుదలకు కారణంగా ఉన్నాయి.

సత్యం కేసులో సెబీ ఉత్తర్వులు చెల్లవు: శాట్‌
సత్యం కంప్యూటర్స్‌ కేసుకు సంబంధించి దాని వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో సహా మరి కొందరికి వ్యతిరేకంగా సెబీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) తోసిపుచ్చింది. ‘‘సెబీ ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాటిని తోసిపుచ్చుతున్నాం. నాలుగు నెలల్లో తాజా ఉత్తర్వులివ్వాల్సిందిగా సెబీని ఆదేశిస్తున్నాం’’ అని శాట్‌ స్పష్టం చేసింది. కాగా రామలింగరాజు తదితరులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, మోసపూరిత కార్యకలాపాలకు దిగారని సెబీ ఇచ్చిన ఉత్తర్వులతో శాట్‌ కూడా ఏకీభవించింది.

ఐఐపీ, టోకు ధరల బేస్‌ ఇయర్‌ల మార్పు..
దేశ స్థూల ఆర్థిక గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. ఇందులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) లెక్కలు మార్చి నెలవి కాగా, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్‌) ద్రవ్యోల్బణం అంకెలు ఏప్రిల్‌కు సంబంధించినవి. ఐఐపీ, టోకు ద్రవ్యోల్బణాలకు సంబంధించి బేస్‌ ఇయర్‌ను మార్చడం గణాంకాల్లో ప్రత్యేకాంశం. ఇంతక్రితం ఈ రెండు సూచీలకు బేస్‌ ఇయర్‌గా 2004–05గా ఉండేది. ఈ బేస్‌ ఇయర్‌ తాజాగా 2011–12గా మారింది. రిటైల్‌ ద్రవ్యోల్బ ణానికి ఇప్పటికే 2011–12 బేస్‌ ఇయర్‌గా అమలవుతోంది.

డీల్స్‌..
రూ.1,600 కోట్లతో కొనుగోలు చేసిన లాయిడ్‌ కన్సూమర్‌ డ్యూరబుల్‌ బిజినెస్‌ డివిజన్‌ విలీన ప్రక్రియ పూర్తయినట్లు దేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హావెల్స్‌ ఇండియా ప్రకటించింది.

ఇంజినీరింగ్‌ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్‌.. ఇసెం డా ఇంజినీరింగ్‌ ఏబీ కంపెనీని కొనుగోలు చేయనుంది.

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్, ముంబైకి చెందిన ఈవెంట్స్, ప్రోపర్టీస్‌కు సంబంధించి టికెటింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ సంస్థ ఇన్‌సైడర్‌డాట్‌ఇన్‌లో మెజారిటీ వాటా కొనుగోలు కోసం 3 కోట్ల డాలర్లు (రూ.193 కోట్లు) వెచ్చించనుందని సమాచారం.

వీడియోకాన్‌ డీ2హెచ్‌ను విలీనం చేసుకోవడానికి డిష్‌ టీవీ కంపెనీకి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నుంచి ఆమోదం లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement