భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు కష్టాలు..!
పెట్టుబడులపై భారీ నష్టాలు
• ఓలా, స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ 350 మిలియన్ డాలర్లు తగ్గుదల
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ సైట్ స్నాప్‌డీల్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహా భారత్‌కి చెందిన పలు సంస్థల్లో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ చేసిన పెట్టుబడులు గణనీయంగా కరిగిపోయాయి. డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో జాస్పర్ ఇన్ఫోటెక్, ఏఎన్‌ఐ టెక్నాలజీస్ వంటి సంస్థల్లో దాదాపు 350 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల విలువను తగ్గించినట్లు చేసినట్లు సాఫ్ట్‌బ్యాంక్ పేర్కొంది. స్నాప్‌డీల్‌కు జాస్పర్ ఇన్ఫోటెక్ మాతృసంస్థ కాగా, ఓలాను ఏఎన్‌ఐ టెక్నాలజీస్ నిర్వహిస్తోంది.
అయితే, పెట్టుబడుల విలువను తగ్గించడాన్ని.. ఆయా కంపెనీల పనితీరును ప్రతిబింబించడంగా పరిగణించరాదని సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి పేర్కొన్నారు. సాధారణంగా అకౌంటింగ్ విధానాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు తదితర అంశాల కారణంగా పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో పెట్టుబడుల వేల్యుయేషన్స్ మారుతుంటాయని వివరించారు. సాఫ్ట్‌బ్యాంక్ సారథ్యంలో 2014లో ఓలాలోకి 210 మిలియన్ డాలర్లు, స్నాప్‌డీల్‌లోకి 627 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత కూడా రెండు కంపెనీల్లో సాఫ్ట్‌బ్యాంక్ మరింత ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటిదాకా భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్ 2 బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు పెట్టింది. వచ్చే 5–10 సంవత్సరాల్లో పెట్టుబడులను 10 బిలియన్ డాలర్ల దాకా పెంచుకోనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది.
స్నాప్‌డీల్ ’షాపో’.. షట్‌డౌన్
చిన్న తరహా వ్యాపార సంస్థల మధ్య క్రయ, విక్రయ లావాదేవీలకు తోడ్పడే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం షాపోను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు స్నాప్‌డీల్ వెల్లడించింది. 2013లో స్నాప్‌డీల్ దీన్ని కొనుగోలు చేసింది. ఈ తరహా సర్వీసుల వ్యవస్థకు డిమాండ్ ఏర్పడటానికి మరికొన్నేళ్లు పట్టేసే అవకాశం ఉన్నందున తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్నాప్‌డీల్ పేర్కొంది.
ఓలా సీఎఫ్‌వో బన్సల్ ఔట్..
ఓలా టాప్ మేనేజ్‌మెంట్‌లో మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రఘువేశ్ సరూప్ రాజీనామా చేశారు. వీరు ఏడాది క్రితం ఓలాలో చేరారు. బన్సల్ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ కాగా, సరూప్ మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ఎండీ. బన్సల్ రాజీనామాతో ప్రస్తుత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పల్లవ్ సింగ్‌కు తాత్కాలిక సీఎఫ్‌వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.