ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనమైతే ఎవరికి లాభం?
న్యూఢిల్లీ: ఈ కామర్స్‌లో పోటీ పోటీగా దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు ఒకదానిలో ఒకటి విలీనం అవుతాయా? అదే జరిగితే ఎవరికి ఎక్కువ లాభం ? ఎవరికి తక్కువ లాభం ? రెండింటికి లాభమేనా? ఇప్పటికే భారత్‌లో ‘ఈ బే’ను కొనేసిన ఫ్లిప్‌కార్ట్ తనకంటె వెనకబడిన స్నాప్‌డీల్‌ను కొనేందుకు ముందుకు వస్తుందా? గత కొన్ని రోజులుగా ఈ రెండు సంస్థలు కలసిపోతున్నాయన్న వార్తలు వినిపిస్తుండడంతో మార్కెట్ వర్గాల్లో ఇలాంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత ఈ మార్కెట్ రంగంలో అమెరికా దిగ్గజ సంస్థ అమెజాన్ దూసుకుపోతున్న నేపథ్యంలో మార్కెట్‌లో సుస్థిర స్థానాన్ని సాధించుకోవాలంటే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు విలీనం కావాల్సిన అవసరం ఉంది. అమెజాన్‌ను ఎదుర్కోవాలంటే స్నాప్‌డీల్ మాతృసంస్థయిన జోసఫ్ ఇన్‌ఫోటెక్‌లో 35 శాతం వాటా కలిగిన జపాన్ సాఫ్ట్ బ్యాంక్ సహాయం ఫ్లిప్‌కార్ట్‌కు అవసరం. అధిక రెవెన్యూ కలిగిన ఫ్లిప్‌కార్ట్‌కు మార్కెట్‌లో స్నాప్‌డీల్ ప్రదర్శిస్తున్న దూకుడుతత్వం కూడా అవసరమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ మార్కెట్‌లో విపరీతమైన పోటీ నెలకొనడం వల్ల అనేక సంస్థలు ఎంత చమటోడ్చినా ఆశించిన లాభాలను అందుకోలేక పోతున్నాయి. పదేళ్ల క్రితం రంగప్రవేశం చేసిన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు ఇప్పటి వరకు లాభాలు చూపించలేకపోయాయి. ఈ రెండు సంస్థలు కలసిపోవడం వల్ల ఈ మార్కెట్‌లో వేడెక్కిన పోటీ వాతావరణం కొంత చల్లబడుతుందని అట్లాంటాలోని పెట్టుబడుల బ్యాంకైన ‘సన్‌ట్రస్ట్ రాబిన్సన్ హంప్రే’ విశ్లేషకులు చెబుతున్నారు. తమ అమ్మకాల మొత్తం విలువ (జీఎంవీ) 400 కోట్ల డాలర ్లకు (25,858 కోట్ల రూపాయలు) చేరుకుందని 2014–15 సంవత్సరంలోనే ఫ్లిప్‌కార్ట్ ప్రకటించగా, ఆ తర్వాత కొంతకాలానికి స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బహల్ ప్రకటించారు. అమ్మకాల మొత్తం వెలువ ఎక్కువగా ఉన్నంత మాత్రాన మార్కెట్‌లో సుస్థిరంగా నిలవగల పరిస్థితి ఉండదని, నిర్వహణ రెవెన్యూ ఎక్కువ ఉండడం వల్లనే నిలిదెక్కుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సంవత్సరానికి ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 1400 కోట్ల డాలర్ల పెట్టుబడులను సేకరించగా, బొత్తిగా పెట్టుబడులులేక స్నాప్‌డీల్ సంస్థ సతమతమవుతున్నది. ప్రజాదరణలోనూ, అంటే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్యలోనూ ప్లిప్‌కార్ట్ ఎంతో ముందుండగా, స్నాప్‌డీల్ వెనకబడి పోయింది. 2016 లెక్కల ప్రకారం అనుబంధ సంస్థలైన మింత్ర, జబాంగ్‌లను కలుపుకొని ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను దాదాపు నాలుగున్నర కోట్ల మంది ఖాతాదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ విషయంలో కూడా స్నాప్‌డీల్ వెనకబడే ఉన్నది. రెండు సంస్థల విలీనం వల్ల ఎక్కువ ప్రయోజనం స్నాప్‌డీల్‌కే ఉన్నప్పటికీ మార్కెట్ పోటీ పరిస్థితుల దృష్ట్యా రెండు సంస్థలు విలీనం అవడమే ఉత్తమమార్గమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.