ఎట్టకేలకు ఫ్లిప్‌కార్ట్-స్నాప్‌డీల్ బిగ్ డీల్
ఎట్టకేలకు ఫ్లిప్‌కార్ట్-స్నాప్‌డీల్ బిగ్ డీల్
Published Wed, Jul 26 2017 2:54 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ ఓకే చెప్పింది. గతవారం ఫ్లిప్‌కార్ట్ సవరించి ప్రతిపాదించిన 900 మిలియన్ డాలర్ల (రూ.5,850 కోట్లు) నుంచి 950 మిలియన్ డాలర్ల(రూ.6,175 కోట్లు) టేక్‌ఓవర్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ బోర్డు అంగీకరించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇక ఈ డీల్‌ను స్నాప్‌డీల్ షేర్ హోల్డర్స్ ఆమోదించాల్సి ఉందని సంబంధిత వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు. నిధుల కొరతతో కటకటలాడుతున్న స్నాప్‌డీల్‌ను కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ ముందు 1 బిలియన్ డాలర్ల దాకా ఇవ్వజూపినప్పటికీ.. మదింపు ప్రక్రియ అనంతరం 800-850 మిలియన్ డాలర్ల దాకా (సుమారు రూ. 5,500 కోట్లు) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, స్నాప్‌డీల్ దీన్ని తిరస్కరించడంతో అనంతరం ఫ్లిప్‌కార్ట్ తన ఆఫర్‌ను సవరించింది.
ఈ వారంలోనే స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ బోర్డు సభ్యులు సమావేశం కాబోతున్నారని, టర్మ్‌షీట్‌పై సంతకాలు చేసి, డీల్‌ను ఓకే చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు పార్ట్‌లలో డీల్‌ను పూర్తిచేయబోతున్నారని తెలుస్తోంది. తొలుత స్నాప్‌డీల్, తన ఇన్వెస్టర్లు నెక్సస్, కలారీ క్యాపిటల్ నుంచి సాఫ్ట్‌బ్యాంకు వాటాను కొనుగోలుచేస్తుంది. అనంతరం ఆ క్యాపిటల్‌ను సాఫ్ట్‌బ్యాంకు ఫ్లిప్‌కార్ట్‌లో పెడుతోంది. తుది దశలో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనం కాబోతున్నాయి. శుక్రవారం రోజు సమావేశమయ్యే ఫ్లిప్‌కార్ట్ బోర్డు సభ్యులు ఈ డీల్‌ను ఆమోదించబోతున్నారు. టర్మ్‌షీట్ మీద సంతకం చేసిన అనంతరం మూడు నెలల్లోపు ఈ డీల్ ప్రక్రియను ముగించాలని కంపెనీలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటి విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంకు 20 శాతం వాటాని కలిగి ఉంటుంది. ప్రాథమిక దశలో స్నాప్‌డీల్ బ్రాండు పేరును ఫ్లిప్‌కార్ట్ అలానే కొనసాగించనుంది.
Advertisement
Advertisement