యాక్సిస్‌ బ్యాంకు చేతికి ఫ్రీచార్జ్‌ | Axis Bank to buy FreeCharge from Snapdeal for Rs 385 crore | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంకు చేతికి ఫ్రీచార్జ్‌

Published Fri, Jul 28 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

యాక్సిస్‌ బ్యాంకు చేతికి ఫ్రీచార్జ్‌

యాక్సిస్‌ బ్యాంకు చేతికి ఫ్రీచార్జ్‌

► రూ. 385 కోట్లకు విక్రయం
► 90 శాతం డిస్కౌంటుకు అమ్మేసిన స్నాప్‌డీల్‌  


ముంబై: నిధుల కొరతతో సతమతమవుతున్న ఈ కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ తాజాగా తమ గ్రూప్‌లో భాగమైన పేమెంట్‌ వాలెట్‌ సంస్థ ఫ్రీచార్జ్‌ను.. యాక్సిస్‌ బ్యాంకుకు విక్రయించేందుకు అంగీకరించింది. ఈ డీల్‌ విలువ రూ.385 కోట్లు. 2015లో ఫ్రీచార్జ్‌ను కొనేందుకు స్నాప్‌డీల్‌ వెచ్చించిన 400 మిలియన్‌ డాలర్లతో (సుమారు రూ.2,600 కోట్లు) పోలిస్తే ఇది సుమారు 90 శాతం తక్కువ. మార్కెట్‌ వర్గాల ప్రకారం ఇతర సంస్థలు ఫ్రీచార్జ్‌ కొనుగోలుకు 15–20 మిలియన్‌ డాలర్లు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది.

పోటీ వాలెట్‌ సంస్థ పేటీఎం సుమారు 10–20 మిలియన్‌ డాలర్లు ఆఫర్‌ చేయగా, ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా ఫ్రీచార్జ్‌ కొనుగోలుకు ఆఖర్లో పోటీకి దిగింది. టెక్నాలజీ ప్లాట్‌ఫాం, కస్టమర్ల సంఖ్య, బ్రాండ్, సమర్థత మొదలైన వాటి కారణంగా ఫ్రీచార్జ్‌పై తాము ఆసక్తి చూపినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో శిఖా శర్మ తెలిపారు. ఇలాంటి డీల్స్‌కి ప్రత్యేకంగా విలువ కట్టడం కష్టమన్నారు. మరోవైపు, ఈ ఒప్పందం ఇరు సంస్థలకు ప్రయోజనకరమేనని స్నాప్‌డీల్‌ సహ వ్యవస్థాపకుడు కునాల్‌ బెహల్‌ చెప్పారు. స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ కొనే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఫ్రీచార్జ్‌ను యాక్సిస్‌ బ్యాంకు కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫ్రీచార్జ్‌ .. యాక్సిస్‌ల కథ ఇదీ..
ఫ్రీచార్జ్‌కి 5.4 కోట్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్లున్నారు. వీరిలో 70% మంది 30 ఏళ్ల లోపు వారే. గతేడాది సుమారు రూ.80 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక యాక్సిస్‌ బ్యాంక్‌కు 2 కోట్ల సేవింగ్స్‌ అకౌంట్‌ ఖాతాదారులు.. బ్రోకరేజి, మ్యూచువల్‌ ఫండ్స్, ఇతరత్రా రుణగ్రహీతల రూపంలో మరో 30 లక్షల మంది యూజర్లున్నారు. యాక్సిస్‌కు ఇప్పటికే లైమ్‌ పేరిట ప్రీపెయిడ్‌ పేమెంట్‌ వాలెట్‌ ఉంది. ఇప్పుడు ఫ్రీచార్జ్‌ను కూడా కొనడంతో  ఈ రెండింటిని విలీనం చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చని బ్యాంకు సీఈవో శిఖా శర్మ తెలిపారు.

మూడోసారీ సీఈవోగా శిఖా శర్మే..
కొత్త ఎండీ, సీఈఓ పగ్గాలు చేపట్టే వారిపై ఊహాగానాలకు తెరదించుతూ మూడోసారి కూడా శిఖా శర్మే ఆ హోదాల్లో కొనసాగుతారని యాక్సిస్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. 2021 జూన్‌ దాకా ఆమె పదవీ కాలం ఉంటుంది. ‘ 2018 జూన్‌ 1 నుంచి మూడేళ్ల పాటు ఎండీ, సీఈవోగా శిఖా శర్మ పునర్నియామకాన్ని జులై 26న జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదించింది’ అని యాక్సిస్‌ తెలియజేసింది. యాక్సిస్‌ బ్యాంక్‌ శిఖా శర్మ వారసులను అన్వేషిస్తోందని, టాటా సన్స్‌ ఆమెకు భారీ ఆఫర్‌ ఇచ్చిందని వార్తలు రావడం తెలిసిందే. ఐసీఐసీఐలో 1980లో కెరియర్‌ ప్రారంభించిన శిఖా శర్మ.. 2009లో అయిదేళ్ల కాల వ్యవధికి యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవోగా చేరారు. రెండో దఫా కూడా ఆమె నియమితులయ్యారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement