హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంకులో ఇటీవల రూ.6.5 కోట్ల ఘరానా మోసం జరిగినట్లు వచ్చిన కథనాలపై బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. ఎన్‌ఆర్‌ఐ బ్యాంకు కస్టమర్ పరితోష్ ఉపాధ్యాయ్ ఖాతా వివరాలు ఉపయోగించి బ్యాంకు సిబ్బంది అనధికారికంగా పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈమేరకు బ్యాంకు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
‘పరితోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు యాక్సిస్ బ్యాంక్ అధికారులపై క్రిమినల్ అభియోగాలు నమోదైనట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సదరు లావాదేవీలన్నీ పరితోష్‌కి పూర్తిగా తెలిసే జరిగాయి. యాక్సిస్ బ్యాంక్ సిబ్బందిపై ఆయన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ విషయం సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా బ్యాంకు విచారణకు పూర్తి సహకారం అందిస్తుంది. బ్యాంకుపై గానీ, అధికారులపై గానీ తప్పుడు లేదా తమ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు బ్యాంకునకు పూర్తి హక్కులు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్ ఎల్లప్పుడూ తమ కస్టమర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోంది’ అని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: సహోద్యోగులతో పంచుకోకూడని అంశాలు..
అసలేం జరిగిందంటే..
ఆస్ట్రేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయ్‌కు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుంచి ప్రీమియం అకౌంట్ ఉంది. ఇటీవల అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్‌కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీశారు. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు స్టేట్‌మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించినట్లు ఉపాధ్యాయ్ తెలిపారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బేగంపేట యాక్సిస్ బ్యాంకులోని కొంతమంది సిబ్బంది తన పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారని ఉపాధ్యాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment